ఎవరీ సామ్ ఆల్ట్‌మాన్... ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ రంగంలో ఆయన పాత్ర ఏంటి?

సామ్ ఆల్ట్‌మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 8 ఏళ్ళ వయసులోనే ప్రోగ్రామింగ్ నేర్చుకున్న ఆల్ట్‌మాన్

సాంకేతికరంగంలో సంచలనం సృష్టించిన చాట్‌బాట్ చాట్ జీపీటిని నిర్వహించే ఓపెన్‌ఏఐలో ఇటీవలి సంక్షోభ పరిణామాలను సాంకేతిక ప్రపంచం ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూసినట్లు చూస్తోంది.

అయితే, ఈ సంక్షోభంలో మెరిసిపోతూ హీరోలా కనిపిస్తున్న వ్యక్తి సామ్ ఆల్ట్‌మాన్. నవంబరు 17 ఓపెన్ ఏఐ సహవ్యవస్థాపకుడైన ఆల్ట్‌మాన్‌ను తొలగించారు. ఈ నిర్ణయాన్ని ఆశ్చర్యకరం, హఠాత్పరిణామం, నాటకీయం అని చాలామంది వర్ణించారు.

ఆల్ట్‌మాన్ పై విశ్వాసం కోల్పోయినందువలనే ఆయనను తొలగించినట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘ ఆయన సమాచారాన్ని ఇవ్వడంలో నిజాయితీగా వ్యవహరించడం లేదు. తన సామర్థ్యాలకు అనుగుణంగా బాధ్యతలను నిర్వహించడం లేదు’’ అని పేర్కొంది.

ఆల్ట్‌మాన్ తొలగింపుతో ఓపెన్ ఏఐలో సంక్షోభ వారాంతం అనంతరం ఉద్యోగులందరూ సామూహిక రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ కంపెనీలో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆల్ట్‌మాన్‌ను తమ సంస్థలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

కానీ 48 గంటలు గడిచాక సామ్ ఆల్ట్‌మాన్ సీఈఓగా తిరిగి రావడానికి అంగీకరిస్తున్నట్టు ఓపెన్ ఏఐ ప్రకటించింది. దీంతోపాటు ఈయనను తొలగించిన బోర్డును ప్రక్షాళన చేయడానికి కూడా అంగీకారం కుదిరినట్టు తెలిపింది.

38 ఏళ్ళ అమెరికన్ ప్రోగ్రామర్ సామ్‌ ఆల్ట్‌మాన్ ఎవరు. కృత్రిమ మేథ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఇతని అడుగులను చూసి సాంకేతిక ప్రపంచం ఎందుకు విస్తుపోతోంది?

సామ్ ఆల్ట్‌మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2005లో సామ్ ఆల్ట్‌మాన్ కొందరు స్నేహితులతో కలిసి లూప్ట్ యాప్‌ను రూపొందించారు

తొలి అడుగులు...

సామ్యూల్ హెచ్. ఆల్ట్‌మాన్ అమెరికాలోని మిస్సోరిలో పెరిగారు. ఆపిల్ మొట్టమొదటి కంప్యూటర్ మెకింతోష్ నుంచి ఈయన ఓ పోగ్రామ్ నేర్చుకున్నారు. అప్పడు తన వయసు 8 ఏళ్ళని ది న్యూయార్కర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో కంప్యూటర్ తన లైంగికత విషయంలో ఎంత సహాయకారిగా మారిందో చెప్పారు. తన కౌమార దశలో కంప్యూటర్ ద్వారా జరిపిన సంభాషణలు, గ్రూపు డిస్కషన్లకు థాంక్స్ కూడా చెప్పారు.

16 ఏళ్ళ వయసులో తానో స్వలింగ సంపర్కుడినని ఆల్ట్‌మాన్ తల్లిదండ్రులకు తెలిపారు. తరువాత ఆయనీ విషయాన్ని తాను చదివిన పాఠశాలలో బహిరంగంగా చెప్పారు.

సీఈఓల ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ తమ డిగ్రీలు పూర్తి చేయకుండా హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలా డ్రాపౌట్ అయ్యారో అదే తరహాలో సామ్ ఆల్ట్‌మాన్ కూడా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వెళ్ళి మధ్యలోనే మానుకున్నారు.

కొంతమంది స్నేహితులతో కలిసి ఆల్ట్‌మాన్, ఒకరితో ఒకరు లొకేషన్ షేర్ చేసుకోవడానికి వీలుగా లూప్ట్ అనే యాప్‌ను తొలిసారిగా ఆవిష్కరించారు. ఇది 2005 నాటి మాట. అప్పటికి వాట్సాప్ తెలియదు. ఫేస్‌బుక్ కూడా మొగ్గతొడుగుతున్న కాలమది.

లూప్ట్ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఆల్ట్‌మాన్ బిజినెస్‌ మ్యాన్ కావడానికి ఇదొక స్ప్రింగ్ బోర్డులా ఉపయోగపడి, సాంకేతిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయనకు ద్వారాలు తెరిచింది.

లూప్ట్‌ను మొదట్లో ప్రోత్సహించిన వాటిల్లో వై కాంబినేటర్ (వైసీ) ఒకటి. ఈ సంస్థ ఎయిర్‌బిఎన్‌బి, డ్రాప్ బాక్స్ లాంటి స్టార్టప్ ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టిన సంస్థ.

ఆల్ట్‌మాన్ తన మొదటి ప్రాజెక్ట్‌ను 333 కోట్లకు (40 అమెరికన్ మిలియన్ డాలర్లు ) విక్రయించారు. ఈ సొమ్మును ఆయన వైసీ కింద అనేక ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వచ్చింది. 2014 నుంచి 2019 వరకు ఆయన వైసీ అధ్యక్షుడిగానూ ఉన్నారు.

ఎలాన్ మస్క్‌తో కలిసి ఆల్ట్‌మాన్ ఓపెన్ ఏఐ ప్రారంభించారు కానీ, తరువాత ఎలాన్ మస్క్ ఈ కంపెనీ నుంచి తప్పుకున్నారు.

సామ్ ఆల్ట్‌మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మస్క్‌తో కలిసి ఆల్ట్‌మాన్ ఓపెన్ ఏఐ‌ను ప్రారంభించారు

'ఏఐని బానిసగా చేసుకోవాలి, లేదంటే మనమే దానికి బానిసలం అవుతాం'

మానవాళికంతటికి మేలు చేయడమే కృత్రిమ మేధ లక్ష్యమని ఓపెన్ ఏఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే కృత్రిమ మేధ మానవాళికి ప్రాణాంతకమైన ఆయుధంగా మారొచ్చని ఆల్ట్‌మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

2016లో ది న్యూయార్కర్‌కు టాడ్ ఫ్రెండ్ రాసిన ఓ సుదీర్ఘ నివేదికలో భవిష్యత్తు దృష్ట్యా ఏఐతో మానవ మేధస్సు విలీనం గురించి ఆల్ట్‌మాన్ మాట్లాడారని తెలిపారు. ‘‘మనం కృత్రిమ మేథను బానిసగా చేసుకోవాలి లేదంటే అదే మనల్ని బానిసలను చేస్తుంది’’ అని చెప్పారు.

ఎలాన్ మస్క్ 2018లో ఓపెన్ ఏఐ నుంచి తప్పుకున్నప్పటికీ న్యూరాలింక్ అనే ఆలోచన గురించి పంచుకున్నారు. ఇది మన మెదడును కంప్యూటర్‌కు అనుసంధానించడంపై చేసిన ఆలోచన. దీని ద్వారా మాత్రమే మానవాళి కృత్రిమ మేధతో అనుసంధానం కాగలుగుతుందని మస్క్ విశ్వసించారు.

ఇటువంటి దూరదృష్టి కారణంగానే మస్క్, ఆల్ట్‌మాన్ కృత్రిమ మేధలో భాగస్వాములు కావడానికి దారి తీసింది. చాట్ జీపీటితోపాటు డాల్ – ఈ అనే మరో కృత్రిమ మేధ సాధనాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ రెండో ఆవిష్కరణ చిత్రాల సహాయంతో పనిచేస్తుంది.

‘‘ ఇటువంటి వ్యవస్థలను సమాజంలోకి ఓ క్రమపద్ధతిలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ఉంది’’ అని ఆల్ట్‌మాన్, సిలీకాన్ వ్యాలీలోనూ, సాంకేతిక ప్రపంచంలోని పరిణామాలను తెలియజేసే స్ట్రిక్టిలీ వీసీతో ఈ ఏడాది మొదట్లో చెప్పారు.

‘‘ ఇలా చేయడం ద్వారా మాత్రమే ప్రజలను, సంస్థలను, నిర్ణయాత్మక శక్తులకు వీటిని అలవాటు చేయగలం. దీని పరిమాణాలను ఆలోచించాలి, సాంకేతికను ఆస్వాదించాలి, అదేం చేయగలుగుతుంది, ఏం చేయలేదనే విషయాన్ని ఈ సూపర్ పవర్‌ఫుల్ వ్యవస్థకు వదిలేయకుండా చూడాలి’’ అని చెప్పారు.

చాట్ జీపీటీ, డాల్ – ఈ , విద్యావేత్తల సహా అనేక రంగాలను విమర్శలను ఎదుర్కొన్నాయి.

‘‘ చాట్ జీపీటికి పరిమితులున్నాయి’ అని ఆల్ట్‌మాన్ గత ఏడాది డిసెంబరులో ఎక్స్‌లో పోస్టు చేశారు. కొన్ని విషయాలలో తప్పుదోవ పట్టిస్తుందని, ఇప్పుడేదైనా ముఖ్యమైన విషయంపై చాట్ జీపీటీని విశ్వసించడం తప్పే అవుతుందని చెప్పారు. చాట్ జీపీటీ ప్రశ్నల స్వీకరణ, సమాధానాల విషయంలో పక్షపాతంపై ఆయన మాట్లాడుతూ చాట్ జీపీటి సామర్థ్యలోని లోపాలు మాకు తెలుసు. దానిని మెరుగుపరిచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఇది పైకి కనిపించేంత తేలికైన విషయం కాదు. దీనిని సాధించడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పారు.

ఆల్ట్‌మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏఐ ప్రమాదాలు, ప్రయోజనాలపై జరిగిన సదస్సులో ప్రపంచనేతలతో కలిసి పాల్గొన్న ఆల్ట్‌మాన్

తాజా సవాళ్ళు ఏంటి...

సామ్ ‌ఆల్ట్‌మాన్ సాంకేతిక ప్రపంచంలో విజయవంతమైన ఎగ్జిక్యూటివ్ మాత్రమే కాదు, కృత్రిమ మేధ గురించి మాట్లడేటప్పుడు ఆల్ట్‌మాన్ పేరు చాలామంది ప్రపంచ నాయకులకు ఓ ఉదాహరణగా మారింది.

కొన్నివారాలకిందట కృత్రిమ మేధలోని ప్రయోజనాలు, ప్రమాదాల గురించిన సదస్సులో ఆయన ప్రపంచస్థాయి సాంకేతిక పరిశ్రమ అధిపతులతో కలిసి పాల్గొన్నారు.

ఆల్ట్‌మాన్ తన కెరీర్‌లో బలమైన పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను ఆకర్షించారు. తాను వై కాంబినేటర్ లో అనేక ప్రాజెక్ట్‌లను ఆమోదించినప్పుడు వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఎంతోమంది పెద్దపెద్ద పెట్టుబడిదారులు ముందుకు వచ్చేవారు.

ఆల్ట్‌మాన్ నికర ఆస్తులు ఎంతో తెలియదు కానీ, ప్రపంచంలోని కొంతమంది బిలియనీర్ల జాబితాలో ఆయన కూడా ఉన్నారని పలు అంచనాలు ఉన్నాయి. లాభాపేక్ష లేని ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఓపెన్ ఏఐ ప్రస్తుతం హైబ్రిడ్ పరిమిత లాభ కంపెనీగా మారింది.

ఈ అక్టోబరు కంపెనీ విలువను 80 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. తాజా పరిణామాల అనంతరం సామ్ ఆల్ట్‌మాన్ మరిత బలంగా తిరిగి వస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏదేమైనప్పటికీ సామ్ ఆల్ట్‌మాన్ కు ఎదురైన సవాలు పెద్దది. దీనిని ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)