తెలంగాణ ఎన్నికలు: ఫలితాన్ని తేల్చేది ఇవే....

తెలంగాణ ఎన్నికలు
    • రచయిత, జీఎస్ రామ్మోహన్
    • హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు

సాధారణంగా ఎన్నికల్లో అభివృద్ధి లేదా సంక్షేమం ప్రధాన అజెండాగా ఉంటాయి. రెండింటి మధ్య పోటీ కూడా చూస్తాం.

చంద్రబాబు, వైఎస్ హయాంలో నగర ఆధారిత హైటెక్ అభివృద్ధి వర్సెస్ గ్రామీణ వ్యవసాయ సంక్షోభం లాంటి వైరుధ్యం ఉండేది. కానీ, ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో అజెండా ఏంటి?

ఒక నాయకుడు ఆయన కుటుంబం తాలూకు వ్యవహారశైలి ప్రత్యర్థులకు ప్రధాన ప్రచారాస్త్రంగా ఉండటం తెలంగాణలో చూస్తున్నాం.

అలాగే బీజేపీకి పెరిగిందనుకున్న ఓటు బ్యాంక్ తగ్గిపోయి అది కాంగ్రెస్ బలంగా మారడమనే పరిణామం కూడా నేటి తెలంగాణ ఎన్నికల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

తెలంగాణలో ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయిలో చక్రం తిప్పే కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల జాతీయ చానెళ్లతో మాట్లాడినపుడల్లా కొన్ని అంకెలు పదే పదే చెబుతున్నారు.

కొన్ని సెక్టార్లలో తాము సాధించిన ప్రగతిని అంకెలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మావవాభివృద్ధి సూచికలను, అక్షరాస్యత సూచికలను మాత్రం ఆయన ప్రస్తావించరు. ఆర్థికంగా ముందంజ వేసిన తెలంగాణ మానవాభివృద్ధి సూచికల్లో అడుగున ఉంది. అక్షరాస్యతలో వెనుకబడి ఉంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, FaceBook/Kcr

తెలంగాణ విద్యుత్ సరఫరా, సాగునీరు, తాగునీరు, తలసరి ఆదాయం వంటి అంశాల్లో ప్రగతి సాధించిన మాట వాస్తవం.

3 లక్షల 8 వేల రూపాయల తలసరి ఆదాయంతో ‘‘పర్ కాపిటా ఇన్‌కమ్’’ ప్రమాణాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలియజేస్తోంది. థ్యాంక్స్ టు హైదరాబాద్.

ఆధునిక అభివృద్ధికి ఒక ప్రధాన సూచికగా మారిన పర్ కాపిటా విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ అగ్రభాగాన ఉంది.

ఇక ఇంటింటికి తాగునీరు సరఫరాలోనూ ముందు వరుసలో ఉంది. కొత్త ప్రాంతాలకు సాగునీటి సరఫరాలోనూ ముందంజ వేసింది.

2014లో 68 లక్షల టన్నులున్న తెలంగాణ ధాన్యం ఉత్పత్తి, 2022 నాటికి మూడున్నర కోట్ల టన్నులకు చేరింది. గత ఖరీఫ్ సీజన్ ధాన్యం ప్రొక్యూర్మెంట్‌లో పంజాబ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర నివేదిక తెలియజేస్తుంది.

కులాల వారీగా చేపట్టిన పథకాల వల్ల చేపల పెంపకం, గొర్రెల పెంపకం, చేనేత, కల్లుగీత రంగాలు కూడా మంచి పురోగతిలో ఉన్నాయి.

సంక్షేమం సరేసరి... రైతు బంధుతో పాటు పెంచిన పెన్షన్లు, కల్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ పథకాలు బోలెడు. రైతుబంధు మోడల్‌గా కేంద్రమే పథకాన్ని తీసుకురావాల్సి వచ్చింది.

ఇన్ని సానుకూల అంశాలున్నా అధికార భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో ఎదురీదాల్సిన పరిస్థితిలో ఉంది.

కాంగ్రెస్ నుంచి చాలా గట్టి సవాలును ఎదుర్కొంటోంది. నిరంతర ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు వంటి వాటి వల్ల ఒనగూరే ప్రయోజనాన్ని గత ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్ పొందిందని, అవే అస్త్రాలు ఈ ఎన్నికల్లో అంత బలంగా పనిచేయకపోవచ్చేనేది వినిపించే ఒక వాదన.

కేసీఆర్

ఫొటో సోర్స్, FaceBook/Kcr

వ్యతిరేకతకు కారణాలు...

పదేళ్ల తర్వాత పాలన మీద ఎంతో కొంత వ్యతిరేకత రావడం, కొత్త దనం కోసం ఆరాటపడే వాళ్లుండటం ఒక పార్శ్వం మాత్రమే. దానికంటే ప్రధానమైనది కుటుంబ పాలన.

ప్రత్యర్థుల భాషలో చెప్పాలంటే అహంకార వైఖరి. అదీ ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధానంగా ఎదుర్కొంటున్న ఛాలెంజ్.

దానికి తోడు యువతలోని కొన్ని సెక్షన్లలో పేరుకుపోయిన నిస్పృహ, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పరిణమించింది.

నీళ్లు- నిధులు- నియామకాలు అనే మూడు అంశాలే తారకమంత్రంగా తెలంగాణ ఉద్యమం జరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.

కంటికి కనిపించి నేరుగా ఎన్నికల్లో ఉపయోగపడగలిగిన అంశాలపై పెట్టిన శ్రద్ధ, ఉపాధి మీద పెట్టలేదనేది ఎక్కువగా వినిపించే విమర్శ.

ఉదాహరణకు ఈ పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగ నిమాయకం కూడా తెలంగాణలో జరగలేదు. 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసిన రాష్ట్రంలో ఒక్క గ్రూప్-1 నియామకం కూడా లేకపోవడం విచిత్రంగా కనిపించే అంశం.

తెలంగాణలో విశ్వవిద్యాలయాలన్నీ మూడింట ఒక వంతు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఉన్నత విద్య మీద ఫోకస్ లేదనేది విద్యావేత్తలనుంచి వినిపించే మాట.

కర్నె శిరీష

ఫొటో సోర్స్, FB/PRINCESSSIRIBARRELAKKA

బర్రెలక్క- నిరసన స్వరాలకు ప్రతీక

ఇక్కడ కర్నె శిరీష అనే దళిత అమ్మాయి గురించి చెప్పుకోవాలి. ఆమె కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్న నిరసన స్వరాలకు ప్రతీక అయిన తీరు గురించి మాట్లాడుకోవాలి.

హైదరాబాద్‌లో కష్టపడి గ్రూప్స్ పరీక్షల కోసం చదివి అవి నిరంతరం వాయిదా పడుతూ ఉండటం వల్ల విసిగిపోయి సొంతూరుకొచ్చి కొన్ని బర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న అమ్మాయి తన గుండె మంటను వెళ్లగక్కుతూ ఒక వీడియో చేశారు.

అది వైరల్ అయ్యింది. ఆమె బర్రెలక్కగా పాపులర్ అయ్యారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆమె మీద కేసులు పెట్టారు.

ఆమె ఇపుడు కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా పోటీచేస్తున్నారు. ప్రభుత్వం మీద నిరసన ఉన్న అన్ని శిబిరాలకు ఇపుడామె వేదికగా మారారు.

ఎక్కడెక్కడినుంచో మద్దతు పలికేవారు తండోపతండాలుగా తమంత తాముగా వస్తున్నారు. కంచె అయిలయ్య లాంటి సామాజికవేత్తలతో పాటు జె. లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులు తమంత తాముగా వచ్చి మద్దతు ప్రకటించారు.

చివరకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాది కృష్ణారావు కూడా లక్షరూపాయలు సాయంగా ప్రకటించారు.

ఒక పేద దళిత అమ్మాయి ఒంటరి పోరాటంలో మేమూ భాగమవుతాం అంటూ ఎక్కడెక్కడినుంచో జనం అక్కడికి తరలి వెళుతున్నారు.

తెలంగాణలో ఉన్న నిరుద్యోగ స్వరాలకు, ప్రభుత్వ ఆధిపత్య అసహన వైఖరికి అంటే బీఆర్‌ఎస్ ఎదుర్కొంటున్న రెండు ప్రధాన ఛాలెంజ్‌లకు ఇవాళ బర్రెలక్క అని పేరుపడిన శిరీష ప్రతీకగా మారారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, INCKARNATACKA/FACEBOOK

బీజేపీ బలహీనతను సొమ్ము చేసుకున్న కాంగ్రెస్

అదనంగా పనిచేస్తున్న అంశం ఒకనాడు బీజేపీ చుట్టూ పోలరైజ్ అయిన శిబిరాలు ఇవాళ కాంగ్రెస్ వైపు మళ్లడం.

బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నపుడు హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల్లో గట్టిపోటీతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపుతో బీజేపీ ఊపులో ఉన్నట్టు కనిపించేది.

సంజయ్ కేసీఆర్ మీద ఆయన కుటుంబం మీద చెలరేగిపోయి మాట్లాడేవారు. ఆయనను మార్చి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఈ లోగా కల్వకుంట్ల కవిత మీద కేంద్ర సంస్థల విచారణ మందగించడం ఇవన్నీ కొత్త కథనాలకు తెరతీశాయి.

బీఆర్‌ఎస్ బీజేపీ లోపాయికారీగా కుమ్మక్కయ్యాయనే వాదనను కాంగ్రెస్ ముందుకు తెచ్చింది. అది వేగంగా జనంలోకి వెళ్లిపోయింది. బీజేపీ బలాన్ని కుంగదీసింది.

వాస్తవానికి అగ్రెసివ్ యూత్‌ను ఆకర్షించడానికి పొరుగు రాష్ట్రం నుంచి శివాజీని, సోఫిస్టికేటెడ్ సాఫ్ట్ యూత్‌ను ఆకర్షించడానికి బెంగాల్ నుంచి వివేకానందను తీసుకుని విపరీతంగా రెండు విగ్రహాలు ఊరూరా పెట్టి విస్తరించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

బీజేపీకి అప్పట్లో బలంగా కనిపించిన జనం, ఐడియాలజీ వల్ల పోగయిన జనం అనుకోనక్కరలేదు. లాయల్ క్యాడర్‌ను మినహాయిస్తే మిగిలిన ఊపులో ఎక్కువ భాగం బీఆర్‌ఎస్ వ్యతిరేక జనం.

కేసీఆర్ మీదా లేదా ఆయన కుటుంబపాలన మీద గుర్రుగా ఉన్నజనం. ఎవరు దూకుడుగా కేసీఆర్‌ను ఢీకొంటే వారివైపు మళ్లే జనం.

అందువల్లే బీఆర్‌ఎస్‌కు ప్రధాన చాలెంజర్ బీజేపీ కాదు అనిపించగానే గతంలో బండి సంజయ్ మాట్లాడినంత దూకుడుగా మాట్లాడే రేవంత్ రెడ్డిలో మరో నాయకుడిని వారు చూసుకున్నారు. అటునుంచి ఇటు మళ్లారు. ఇది కాంగ్రెస్‌కు అందివచ్చిన అంశం.

బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ వైపు లెఫ్ట్ లిబరల్స్

బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాలంలో తెలంగాణలోని వోకల్ సెక్షన్స్‌లో ప్రధాన భాగం అయిష్టంగానైనా బీఆర్‌ఎస్ వైపు ఉండేది.

భావజాలరీత్యా బీజేపీ వ్యతిరేకత అనేది ప్రధాన అంశం కావడం వల్ల లెఫ్ట్ లిబరల్స్ తప్పనిసరై అలాంటి వైఖరి తీసుకునేవి.

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడొచ్చు. కానీ, మొత్తంగా పార్టీల అఫిలియేషన్స్‌తో సంబంధం లేని లెఫ్ట్ సెక్షన్స్ ఇప్పటికీ వోకల్‌గా ఉన్నాయి.

వారిలో అధికులు ఇపుడు కాంగ్రెస్ మద్ధతుదారులుగా మారిపోయారు.

పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్ అయితే బీఆర్‌ఎస్ వైపు ఉంటారు గానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అయినపుడు కాదు. కాంగ్రెస్‌తో వారికి అంతగా భావజాల వైరం లేదు.

హరీశ్ రావు, కేటీఆర్

కుటుంబ పాలన - అవినీతి

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత అంతటి ప్రాముఖ్యం కేటీఆర్‌కు ఉంది. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి కుమారుడికి సీఎం పీఠం అప్పగించే తరుణం కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారనేది దగ్గరిగా వారిని పరిశీలించేవారు చెప్పేమాట.

ఆ ఇద్దరి తర్వాత స్థానంలో కేసీఆర్ అల్లుడు హరీశ్ రావు ఉంటారు. వాస్తవానికి ఒకనాడు పార్టీలో కేసీఆర్ తర్వాత అపారమైన ఇమేజ్ ఉన్న నాయకుడాయన. కొంతకాలంగా ఆ స్థానాన్ని కేటీఆర్ భర్తీ చేస్తూ వచ్చారు.

అదే దశలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఉంటారు. వీరికి తోడు కేసీఆర్ దగ్గర బంధువు సంతోష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

అతను కేసీఆర్‌కు అంటిపెట్టుకుని ఉండి మంచీచెడ్డా చూసుకుంటూ ఉంటారు. ఇట్లా పార్టీలో సర్వం కుటుంబమయం అనే విమర్శ బలంగా ఉంది.

దానికితోడు ఎవ్వరికీ అందుబాటులో ఉండని కేసీఆర్ తీరు, మాట తీరు ఇవ్వన్నీ వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి.

కనీసం ఎమ్మెల్యేలకు కూడా రోజుల తరబడి అపాయింట్ ఇవ్వని వైనం, సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఫామ్ హౌస్‌లో ఎక్కువ కాలం గడుపుతారనే విమర్శ ఇవ్వన్నీ వ్యతిరేకతను పెంచాయి.

వీటన్నింటికి తోడు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల డిజైన్ మీదే కాక వాటిని ఒకట్రెండు సంస్థలకే కట్టబెట్టారనే విమర్శ ప్రత్యర్థుల నుంచి బలంగా ఉంది.

కేసీఆర్ మానసపుత్రిక అని చెప్పే అత్యంత భారీ ప్రాజెక్టు కాళేశ్వరం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KCR

రాచరికాన్ని తలపించే ఆధునిక పాలకుడు

కేసీఆర్ వ్యవహారశైలి ఇతర పాలకులకు భిన్నమైనది. ఆధునిక ప్రజాస్వామ్య పాలకుడిగా కంటే రాజరికపు పాలన తరహాలో ప్రతీ నిర్ణయం ప్రతీ అంశం తన చుట్టూ తిరిగేలా చేసుకునే పాలకుడాయన.

వెయ్యి కోట్ల ప్రభుత్వం ధనం ఖర్చు చేసి ఆంధ్రలో తిరుపతికి పోటీనా అన్నట్టు యాదాద్రి ఆలయాన్ని భారీ స్థాయిలో పునర్నిర్మించారు. తెలంగాణ వచ్చినందుకు కానుకలు అంటూ తిరుపతి వెంకటేశ్వరుడికి, బెజవాడ దుర్గమ్మకు ప్రభుత్వ ఖజానానుంచి ఆభరణాలు సమర్పించారు.

ఉన్నది కూల్చి తన వాస్తు కన్సల్టెంట్ల సలహాతో నిర్మించుకున్న కొత్త సెక్రెటేరియట్ ఏర్పడే దాకా పాత సెక్రెటేరియెట్‌లో ఒక్క రోజు కూడా అడుగుపెట్టని పాలకుడాయన. అంత ముచ్చటపడి కట్టించిన కొత్త సెక్రటేరియెట్‌కు అయినా ఎన్నిసార్లు వచ్చారనే ప్రశ్న కూడా ఉంది.

ఫామ్ హౌస్ సీఎం అనే ట్యాగ్ ప్రత్యర్థులు పదే పదే ఎద్దేవా చేయడానికి చివరకు ప్రధాని కూడా అదే అస్త్రాన్ని వేదికల మీద వాడడానికి తావిచ్చింది.

పాత సెక్రటేరియెట్‌ను కూలగొట్టి కళ్లు మిరుమిట్లు గొలిపే కొత్త సెక్రెటేరియట్ కట్టినా పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినా దాని ఎదురుగా నిజంగా కళ్లు చెదిరే అమరవీరుల స్మారకం కట్టినా ఏం చేసినా అది నలుగురూ మాట్లాడుకునే స్థాయిలో చేయడం కేసీఆర్ శైలిలో కనిపిస్తుంది.

తొలి దశ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేకుండా ఆయన పాలన సాగించారు. కులాల వారీ భవంతులు, పథకాలు, చివరకు గురుకులాలు కూడా మంజూరు చేసిన పాతకాలపు ‘ధర్మ పాలకుడు’.

ఒక్కముక్కలో చెప్పుకుంటే, ప్రతిదీ ఒక్క మనిషి చుట్టూ లేదా ఆయన కుటుంబం చుట్టూ తిరిగే రాజకీయాలు, విధానాల వల్ల జనంలోని కొన్ని వర్గాలలో ఏర్పడిన నిరసన తాలూకు వేడిని ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎదుర్కొంటోంది.

అయితే, కాళేశ్వరం నీళ్లు, ఉచిత విద్యుత్, పెరిగిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కించకపోతాయా అనే ఆశలో బీఆర్‌ఎస్ ఉంది. కుటుంబపాలన, అవినీతి, నిరుద్యోగం అస్త్రాలనే ప్రత్యర్థి పార్టీలు ఎక్కువ నమ్ముకున్నాయి.

అసదుద్దీన్

ఫొటో సోర్స్, @AIMIM_NATIONAL

ఎంఐఎం ఒక తురుపు ముక్క

తెలంగాణలో మొత్తం సీట్లు 119. మెజారిటీకి అవసరమైనవి 60 సీట్లు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దాదాపు 46.8 శాతం ఓట్లతో 88 సీట్లు గెలిచింది.

కాంగ్రెస్ 28.4 శాతం ఓట్లతో గెలిచింది కేవలం 19 సీట్లే. అంటే ఈసారి బీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే కాంగ్రెస్ పోల్ వాల్ట్ చేయాల్సిందే.

అయితే, జనం మూడ్ మారినపుడు ఏమైనా జరగొచ్చనేది వారి ఆశ. కాంగ్రెస్ బలపడిందనే వాదన అయితే బలంగా ప్రచారంలో ఉంది. వారి స్ట్రాటజిస్టులు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు. ఇక్కడో చిన్న మెలిక ఉంది.

ఎన్నికలు జరక్కుండానే కేసీఆర్ కిట్టీలో ఆరేడు సీట్లు ఉన్నట్టు ఒక లెక్క ఉంది. అది ఎంఐఎం రూపంలో.

హైదరాబాద్ పాతబస్తీలోని సీట్లలో ఆరేడు సీట్లు ఎంఐఎం గెలవడం ఆనవాయితీ. బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం గట్టి మిత్ర పక్షంగా ఉంది.

పోటాపోటీగా ఉన్నప్పుడు ఆ ఆరేడు సీట్లు కీలకం కావచ్చనేది మరో అంచనా. కాబట్టి ఏమైనా జరగొచ్చు. అందుకే, ఇది అత్యంత ఆసక్తికరమైన పోరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)