తెలంగాణ ఎన్నికలు: గల్ఫ్‌ కార్మికుల కష్టాలు తీరాయా... వలసలు తగ్గాయా?

తెలంగాణ వలసలు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తరచూ వినిపించిన మాటలు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి.

తెలంగాణకు ఉపాధి మార్గాలు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయిలు మాత్రమే అనే మాటలు ఉద్యమ నాయకునిగా ఉన్న సమయంలో కేసీఆర్ తన ప్రసంగాల్లో తరచూ అంటూ ఉండేవారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే గల్ఫ్ దేశాలకు వలసలు తగ్గుతాయని నాడు కేసీఆర్ చెబుతూ ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు, మరిన్ని పరిశ్రమల రాకతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని గల్ఫ్ దేశాల నుంచి వలస కార్మికులు వెనక్కి వస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడి నుంచి వలసలు తగ్గుతున్నాయని కూడా అంటోంది.

తెలంగాణలో వలసలు రాజకీయాంశంగా కూడా ఉంది. స్థానికంగా ఉపాధి కల్పిస్తాం, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల సమయంలో పార్టీలు హామీలు ఇస్తుంటాయి.

తెలంగాణ వలసలు

వలసలు తగ్గాయా?

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2015లో 36,006, 2016లో 24,652 , 2017లో 8,819 మంది తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. 2021లో ఈ సంఖ్య 4,375కు తగ్గింది. మళ్లీ 2022 అక్టోబరు నాటికి 9,576 మందికి పెరిగింది.

మొత్తం మీద ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2015తో పోలిస్తే గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వలసలు తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది భారత ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోరని ఏజెంట్లు చెబుతున్నారు. కాబట్టి అధికారిక గణాంకాలు తక్కువగా ఉంటాయన్నది వారి వాదన.

మరొక వైపు నైపుణ్యాలు పెద్దగా లేని యువత ఉపాధి కోసం ఇప్పటికీ గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు.

జగిత్యాల జిల్లా ‘చల్ గల్’‌కు చెందిన యెన్నం శ్రవణ్ కుమార్(21) ఇటీవలే ఖతర్ దేశానికి తొలిసారి వలస వెళ్లారు. వెళ్లేముందు జగిత్యాల బస్టాండ్‌లో ఉన్న శ్రవణ్‌తో బీబీసీ మాట్లాడింది.

‘నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. మాకు భూమి లేదు. నాన్న కిరాయి ఆటో నడుపుతున్నారు. కుటుంబానికి సహాయంగా ఉండాలని ఖతర్ వెళ్తున్నా. ఇక్కడ కూలీ పనిలో సంపాదన తక్కువ. అదే ఆ దేశంలో సంపాదన ఎక్కువ. ఇక్కడికంటే మెరుగైన జీతం, జీవితం ఉంటుందని ఆశిస్తున్నా’’ అని శ్రవణ్ అన్నారు.

ఇక్కడి నుంచి వలసలు మాత్రం తగ్గడం లేదని ఏజెంట్లు చెబుతున్నారు.

‘తెలంగాణ నుంచి వలసలు తగ్గకపోగా పెరిగాయి. గత ఏడాది 700 మంది యువకులను పంపాను. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 500 మంది మా ద్వారా వెళ్లారు’ అని గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపే ఏజెంట్ సత్యం రావు బీబీసీకి చెప్పారు. ఆయన మూడు దశాబ్దాలుగా ‘‘హోప్ ప్లేస్మెంట్ రిసోర్స్’’ అనే సంస్థను నడుపుతున్నారు.

అనేక కారణాల వల్ల తెలంగాణ నుంచి యువత గల్ఫ్ దేశాలకు పోతోందని సత్యం రావు చెబుతున్నారు.

‘గతంతో పోలిస్తే గల్ఫ్ దేశాల కరెన్సీ మారకం విలువ పెరిగింది. 2010లో ఒక దిర్హమ్ మారకపు విలుపు 12 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అది సుమారు 23 రూపాయలకు చేరింది. అక్కడ జీతాలు కూడా పెరిగాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే ఖర్చు కూడా తగ్గింది. 50 వేల రూపాయల లోపు ఖర్చుతో వెళ్లిపోవచ్చు. రెండు నెలలు పని చేస్తే పెట్టిన ఖర్చు వెనక్కి వస్తుంది. వీడియో కాల్స్ వల్ల కుటుంబంతో రోజూ మాట్లాడే సౌలభ్యం కూడా వచ్చింది. హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు రోజూ 10-12 వరకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో ప్రయాణిస్తున్న వారిలో సగం మంది గల్ఫ్ కు వెళ్తున్న యువతే ఉంటున్నారు’ అని సత్యం రావు తెలిపారు.

తెలంగాణ వలసలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఇక్కడ నీళ్లు ఉన్నాయని గల్ఫ్ పోవడం లేదు’’

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వల్ల నీటి లభ్యత పెరిగి గల్ఫ్ దేశాల నుంచి కార్మికులు వెనక్కి వస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గల్ఫ్ దేశాల నుంచి తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చిన వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెంకటేశ్ గౌడ్(45) ఒకరు. కోనరావు పేట మండలం బావుసాయిపేట్‌కు చెందిన ఆయన, 12 ఏళ్లు దుబయ్‌లో పనిచేసి మూడేళ్ల కిందట తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయం చేస్తున్నారు.

‘’అప్పట్లో వర్షాలు సరిగా లేక దుబయ్ వెళ్లాను. 2008 నుంచి 2020 వరకు నిర్మాణ రంగంలో కూలీగా పనిచేశాను. అప్పుడు వర్షాలు లేక ఈదులు (ఈత చెట్లు), తాళ్లు (తాటి చెట్లు) ఎండిపోయాయి. ఇప్పుడు మూలవాగు , నిమ్మపల్లి చెరువుల్లో నీరు ఉంది. వాగు ఒడ్డున వేసిన బోరు బావి కింద వ్యవసాయం చేస్తున్నా. తిరిగి గల్ఫ్‌కు వెళ్లాలని అనుకోవట్లేదు’’ అని వెంకటేశ్ గౌడ్ అన్నారు.

కానీ, గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చి స్థానికంగా ఉపాధి చూసుకుంటున్న వారు చాలా తక్కువ శాతం (5శాతం లోపు) అని, అందులో చాలా కాలం అక్కడ పనిచేసి వయసు మళ్లిన దశలో తిరిగి వస్తున్నారని సత్యం రావు అభిప్రాయపడ్డారు.

వినోద్ కుమార్
ఫొటో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్

‘గతంతో పోలిస్తే వలసలు తగ్గాయి’

గతంతో పోలిస్తే తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు తగ్గాయని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, బీబీసీతో అన్నారు. స్థానికంగా పరిస్థితులు మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరగడమే అందుకు కారణమని ఆయన అంటున్నారు.

‘‘తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, సాగు నీరు అందుబాటులోకి రావడంతో గల్ఫ్ దేశాలకు వలసల శాతం తగ్గింది. మేం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఆ విషయం అర్థం అవుతోంది. గతంలో ముంబయి, భీవండీ ప్రాంతాలకు వలస పోయిన చేనేత కార్మికులు కూడా ఇప్పుడు తిరిగి వస్తున్నారు.

గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు చెందిన సుమారు30 లక్షల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ అభివృద్ధి ద్వారా వలసల సమస్యను నిర్మూలించొచ్చు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని మరింత వేగవంతం చేసి వలసలు నియంత్రించాలన్నది మా ప్రభుత్వ ఆలోచన’’ అని వినోద్ కుమార్ తెలిపారు.

బొంబాయి, భీవండీల నుంచి కార్మికులు తిరిగి వస్తున్నారన్న తెలంగాణ ప్రభుత్వ వాదన గురించి చేనేత రంగ కార్మికులు, కార్మిక సంఘాలతో బీబీసీ మాట్లాడింది. సిరిసిల్లకు చెందిన కొండ ప్రతాప్‌కు 12 మరమగ్గాలు ఉన్నాయి. ఆయన సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షునిగా ఉన్నారు.

‘‘బతుకమ్మ చీరల ఆర్డర్‌తో 4 నెలలు మాత్రమే పని దొరుకుతోంది. ఆ తర్వాత పని లేక కార్మికులు తిరిగి వెళ్లిపోతున్నారు. మిగతా రోజుల్లో మాలాంటి చిన్న ఆసాములకు పని ఉండటం లేదు. ప్రభుత్వం దీని మీద మరింత దృష్టి పెట్టాలి’’ అని ప్రతాప్ కోరారు.

స్వయం ఉపాధికి పెట్టుబడి లేకపోవడం కూడా ఒక సమస్యగా ఉందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

‘‘కార్మికులు 8 నెలలు పనికోసం ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తోంది. అధికారిక రికార్డుల్లో చేనేత సంఘాలకే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినట్టు ఉంటుంది. కానీ నూలు, రంగుల కొనుగోలుకు పెట్టుబడి లేక వారంతా పెద్ద యజమానుల కిందే పనిచేస్తున్నారు’’ అని సీఐటీయూ అనుబంధ పవర్ లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ అన్నారు.

తెలంగాణ వలసలు

‘‘హామీలు నెరవేర్చలేదు’’

తెలంగాణ నుంచి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. ఆ కార్మికులు వారి కుటుంబాలు కలుపుకుంటే తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో వారు ప్రభావం చూపగల స్థాయిలో ఉన్నారు.

‘‘21 నియోజకవర్గాల్లో గల్ఫ్ కుటుంబాల ప్రభావం ఉంది. ఎన్నికల్లో కోరుట్ల, వేములవాడ, బాల్కొండ, జగిత్యాల, సిరిసిల్ల స్థానాల నుంచి కూడా మా అభ్యర్థులు పోటీలో ఉంటారు’’ అని గల్ఫ్ సంఘాల ఐక్య వేదికకు చెందిన చెన్నమనేని శ్రీనివాసరావు తెలిపారు. గల్ఫ్‌లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.

కేరళ రాష్ట్రం తరహా గల్ఫ్ సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలని దానికోసం తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కేరళలో మాదిరిగా ముందస్తు నైపుణ్య శిక్షణ, గల్ఫ్ నుంచి వచ్చిన వారికి విస్తృత స్థాయిలో పునరావాసం, గల్ఫ్ రిక్రూటింగ్ ఏజన్సీల నియంత్రణ, కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ-వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలు కోరుతున్నాయి.

తెలంగాణ వలసలు
ఫొటో క్యాప్షన్, కోరుట్ల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న గల్ఫ్ తెలుగు ఐక్య సంఘాల కు చెందిన శ్రీనివాస్ రావు

గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు నైపుణ్య శిక్షణ, మోసాలను తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2014 లో ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM)ను ఏర్పాటు చేసింది. ‘టామ్ కామ్’ చట్టబద్ధ మార్గాల్లో ఉపాధి కోసం విదేశాలకు పంపే రిక్రూటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది.

అయితే, టామ్ కామ్ ఏర్పాటు లక్ష్యం పూర్తిగా నెరవేరలేదని, గల్ఫ్ కంపెనీలు తమ పాత క్లయింటులైన ప్రైవేట్ ఏజన్సీల ద్వారానే ఎక్కువగా కార్మికులను తీసుకుంటున్నాయని గల్ఫ్ సంఘాల అంటున్నాయి.

గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తే చాలా వరకు ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని శ్రీనివాస్ రావు చెబుతున్నారు.

తెలంగాణ వలసలు
ఫొటో క్యాప్షన్, ఏజెంట్ చేతిలో మోసపోయి అక్రమంగా బార్డర్ దాటే క్రమంలో అరెస్ట్ అయి మలేసియాలో జైలు శిక్ష అనుభవిస్తోన్న యువకులు

‘‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వాణిజ్య సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తూ వలస కార్మికులను విస్మరిస్తున్నాయి. చిన్న నేరాలకే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. వారికి సరైన న్యాయ సహాయం అందడం లేదు. చనిపోయిన వారి శవాలు సరైన సమయానికి రావడం లేదు. ఏజెంట్ వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా డమ్మీ కంపెనీల మోసాలు అరికట్టవచ్చు. గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేస్తే ఈ బాధ్యతలను చూసుకుంటుంది’’ అని ఆయన అన్నారు.

‘‘మెరుగైన గల్ఫ్ పాలసీ రూపొందిస్తామన్న బీఆర్ఎస్ పార్టీ మాట తప్పింది. టామ్ కామ్ సంస్థ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదు. గతంలో జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించి ఎన్ఆర్ఐ హెల్ప్ సెంటర్లు మూసివేశారు. తెలంగాణలో గల్ఫ్ వలసలు, మోసపోయే వారి సంఖ్య పెరిగింది. తెలంగాణకు చెందిన సుమారు 5వేల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణించారు. వారందరికి పరిహారం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద గల్ఫ్ వలసల వివరాలు లేవని అంటోంది. అయితే, గతంలో నిర్వహించిన ‘తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే’ లో భాగంగా విదేశాల్లో ఉంటున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఆ డేటా సహాయంతో మెరుగైన విధానాలను రూపొందించవచచ్చు’’ అని గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద పోరాడే చాంద్ పాషా బీబీసీతో అన్నారు.

అయితే తాము సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తున్నామని వినోద్ కుమార్ అంటున్నారు.

‘‘గల్ఫ్ దేశాల చట్టాలు చాలా కఠినమైనవి. అక్కడి జైళ్లలో మగ్గుతున్న వారికి సహకారం అందిస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపుతోంది. కేరళ రాష్ట్ర తరహా విధానాల అమలుకు అధ్యయనం చేస్తున్నాం’’ అని బి.వినోద్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)