భార్యాభర్తల గొడవతో జర్మనీ నుంచి బ్యాంకాక్‌కు వెళ్ళాల్సిన విమానాన్ని దిల్లీలో దింపారు... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Reuters
భార్యాభర్తల గొడవ కారణంగా మ్యూనిక్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన లుఫ్తాన్సా ఫ్లైట్‌ను దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం(ఐజీఐ)లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
లుఫ్తాన్సా నెంబర్ ఎల్‌హెచ్772 విమానం బుధవారం ఉదయం 10.26 గంటలకు దిల్లీలో దిగినట్లు అధికారులు తెలిపారు.
''విమానంలో ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని క్యాబిన్ క్రూ (విమానం సిబ్బంది) చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది భార్యాభర్తల మధ్య గొడవ''గా చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
''భార్యాభర్తల మధ్య గొడవకు కారణాలు తెలియనప్పటికీ, వారిద్ధరి గొడవ వల్ల విమానాన్ని దిల్లీకి డైవర్ట్ చేశారు'' అని దిల్లీ ఎయిర్‌పోర్ట్ ఏవియేషన్ సెక్యూరిటీ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన విమానాన్ని దిల్లీలో ల్యాండ్ చేసిన తర్వాత, అనుచితంగా ప్రవర్తించిన జర్మన్ ప్రయాణికుడిని కిందకి దించేసినట్లు లుఫ్తాన్సా విమానయాన సంస్థ తన ప్రకటనలో తెలిపింది.
ఆ ప్రయాణికుడు క్షమాపణ చెప్పినట్లు లుఫ్తాన్సా తెలిపింది.
ప్రయాణికుల, విమాన సిబ్బంది సేఫ్టీ, సెక్యూరిటీ తమకు అత్యంత ప్రాధాన్యమని విమానయాన సంస్థ చెప్పింది.
ఈ ప్రయాణికుడి విషయంలో జర్మనీ రాయబార కార్యాలయంతో విమానయాన సంస్థ సంప్రదింపులు జరుపుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు చెప్పారు.
‘‘భారత్‌లోని దర్యాప్తు సంస్థలకు ఈయన్ను అప్పగించాలా లేక క్షమాపణను పరిగణనలోకి తీసుకుని, ఆయనను తిరిగి జర్మనీకి పంపించాలా అన్నది ఇంకా నిర్ణయించలేదు’’ అని డీజీసీఏ అధికారులు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో ల్యాండింగ్ కుదరక.. దిల్లీలో దిగింది
మొదట పాకిస్తాన్‌లోని ఒక విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి కోరినప్పటికీ, ల్యాండింగ్‌కు అక్కడ సాధ్యం కాలేదు.
ఆ తర్వాత విమానం దిల్లీలో ల్యాండ్ అయింది. అనుచితంగా ప్రవర్తించిన భర్తను విమానం నుంచి కిందకు దించేసి విమానాశ్రయ భద్రతా సిబ్బందికి అప్పగించారు.
విమానంలో గొడవపడిన వారిలో భార్య థాయ్ దేశస్తురాలు కాగా, భర్త జర్మన్ వ్యక్తి.
తన భర్త ప్రవర్తన గురించి తొలుత భార్య విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసిందని అధికారులు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఆయన తనని బెదిరిస్తున్నారని, సిబ్బంది ఆయనకు నచ్చజెప్పాలని కోరింది.
‘‘ఆహారాన్ని విసిరివేసి, లైటర్‌తో బ్లాంకెట్‌కు నిప్పంటించాలని ప్రయత్నించారు. భార్యపై గట్టిగట్టిగా అరిచారు. విమాన సిబ్బంది జారీ చేసిన మార్గదర్శకాలను ఆయన అనుసరించలేదు’’ అని అధికారులు తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
విమానాలను ఎప్పుడెప్పుడు డైవర్ట్ చేస్తుంటారు?
నిర్దేశిత సమయంలో గమ్యస్థానానికి వెళ్లాల్సిన విమానాలు పలు కారణాల చేత వేరే విమానశ్రయాలకు మళ్లింపు చేయడం, దింపడం జరుగుతుంటాయి.
వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడం, విమానంలో మెకానికల్ సమస్యలు తలెత్తినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు విమానాలను మళ్లింపు చేస్తుంటారు.
జాతీయ విపత్తులు, అకస్మాత్తుగా తలెత్తిన సైనిక ఘర్షణలు వంటి ఇతర సమయాల్లో కూడా విమానాలను డైవర్ట్ చేస్తారు.
విమానాల మళ్లింపు వల్ల ప్రయాణికులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. వారి ప్రయాణ ప్రణాళికలు కూడా మారుతూ ఉంటాయి.
ఇటీవల దిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒకే రోజు 16 విమానాలు దారి మళ్లింపు జరిగింది. వాటిలో 10 జైపూర్‌కు, 3 లక్నోకు, 2 అమృత్‌సర్‌కు, ఒకటి అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు.
ఇవి కూడా చదవండి:
- క్లియోపాత్రాకు ఇష్టమైన ఊదారంగు దుస్తులు వేసుకున్నందుకు స్నేహితుడిని చంపించిన రోమన్ చక్రవర్తి... బంగారం కన్నా ఖరీదైన ఆనాటి 'పర్పుల్ కలర్ కథేంటి?
- రింకూ సింగ్: నాడు బీసీసీఐ నిషేధించిన ఆటగాడే నేడు ‘నయా ఫినిషర్’ అయ్యాడా?
- తెలంగాణ ఎన్నికలు: ఆసక్తికర పోరు, మారుతున్న సన్నివేశాలు
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా..
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














