యానిమల్ రన్ టైమ్ 3.21 గంటలు... సినిమా చరిత్రలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలేంటి, ఇప్పుడీ ట్రెండ్‌కు కారణమేంటి?

- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ దేవోల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
టీజర్ రిలీజ్ నుంచీ విపరీతమైన రక్తపాతం, శ్రుతి మించిన హింస తదితర కారణాలతో తరచూ ఈ సినిమా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా సినిమా నిడివిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగా నవంబరు 22న ఎక్స్ (ట్విటర్‌లో) ఒక ట్వీట్ చేశారు. ‘‘సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. రన్నింగ్ టైమ్ 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Sandeep Reddy Vanga
‘‘సినిమానా? లేక వెబ్ సిరీసా?’’
సినిమా నిడివి మూడు గంటలకుపైనే ఉండటంతో ‘ఇది సినిమానా లేక వెబ్ సిరీసా?’ కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం దర్శకుడి ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనమని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చర్చపై బెంగళూరులోని విలేకరుల సమావేశంలో రణ్‌బీర్ కపూర్ కూడా స్పందించారు. ‘‘సినిమా నిడివి అంత ఉంటానికి అహంకారం కారణమని కొందరు అంటున్నారు. అందులో నిజం లేదు. ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చేందుకు ఇంత నిడివి అవసరమని మేం భావించాం. నిజానికి మొదటి వెర్షన్ 3.49 గంటల సినిమా కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మేం గట్టిగా నమ్ముతున్నాం’’ అని చెప్పారు.
మరోవైపు రష్మిక, ‘‘ఈ సినిమాల్లో కొన్ని పాత్రలు చాలా సంక్లిష్టమైనవి. వీటిని లోతుగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
అయితే, మూడు గంటలు దాటినా ప్రేక్షకుల మనసు గెలిచిన సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, Telugu Full Movies
మూడు గంటలు దాటిన క్లాసిక్స్...
దాన వీర శూర కర్ణ..
పొడవైన సినిమాల జాబితా పేరు కొట్టగానే ఐఎండీబీలో మొదట కనిపిస్తున్న సినిమా ‘దాన వీర శూర కర్ణ’.
ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా 1977లో విడుదలైంది. దీని నిడివి 3.53 గంటలు.
మహాభారత కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఎల్‌వోసీ కార్గిల్..
2003లో సంజయ్ దత్, అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ఈ హిందీ సినిమా తెరకెక్కింది. దీని నిడివి 4 గంటల 15 నిమిషాలు. కార్గిల్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
మేరా నామ్ జోకర్
1970లో రాజ్ కుపూర్, మనోజ్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. దీని నిడివి 3 గంటల 44 నిమిషాలు.
జోకర్‌గా పనిచేసే ఓ వ్యక్తి చుట్టూ భావోద్వేగాలతో అల్లిన సినిమా ఇది.
లగాన్.. వన్స్ అపాన్ ఎ టైమ్
ఆమిర్ ఖాన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో లగాన్ ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా నిడివి 3 గంటల 44 నిమిషాలు.
బ్రిటిష్ పాలకులతో క్రికెట్ ఆడే ఒక చిన్న గ్రామం చుట్టూ నడిచే కథ ఇది.
నాడోడీ మన్నన్
1958లో ఎంజీ రామచంద్రన్ హీరోగా, దర్శకుడిగా తమిళ్‌లో తెరకెక్కిన సినిమా ఇదీ. దీని నిడివి 3 గంటల 40 నిమిషాలు.

ఫొటో సోర్స్, TWITTER @@SSRAJAMOULI
కొత్త సినిమాలివీ..
ఒకప్పటి క్లాసిక్ సినిమాలే కాదు. కొత్త సినిమాలు కూడా ఈ మధ్య మూడు గంటల మార్క్‌కు చేరువగా ఉంటున్నాయి. వీటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.
ఆదిపురుష్
ప్రభాష్ రాముడిగా ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. కృతి సనన్ దీనిలో సీత పాత్ర పోషించారు. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా నిడివి 2.59 గంటలు. అంటే మూడు గంటలకు ఒక్క నిమిషమే తక్కువే. అయితే, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్
జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ ప్రధాన పాత్రల్లో 2022 మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. దీనిలో నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి 3.02 గంటలు. 2022లో విమర్శకుల మన్ననలు పొందిన సినిమాల్లో ఇదీ ఒకటి.
పుష్ప.. ద రైస్
అల్లు అర్జున్ హీరోగా ‘తగ్గేదే లా’ అంటూ 2021 డిసెంబరులో ప్రేక్షకుల మందుకు వచ్చిందీ సినిమా. దీని నిడివి 2.59 గంటలు. అంటే మూడు గంటలకు ఒక్క నిమిషమే తక్కువ.
తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అర్జున్ రెడ్డి..
విజయ్ దేవరకొండ కెరియర్‌ను పట్టాలెక్కించిన సినిమా అంటే మొదట చెప్పేది అర్జున్ రెడ్డి పేరే.
2017 ఆగస్టులో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. అయితే, ఈ సినిమా నిడివి కూడా 3.02 గంటలు.
ప్రస్థానం..
శర్వానంద్ హీరోగా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ప్రస్థానం. ఈ సినిమాతోనే సందీప్ కిషన్ అరంగేట్రం చేశారు.
ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ సినిమా నిడివి 3.01 గంటలు.
ఎంఎస్ ధోనీ (3.05), నువ్వు నాకు నచ్చావ్ (3.00), శివాజీ (3.05), అల్లూరి సీతారామరాజు (3.07), అపరిచితుడు (3.01), గజిని (3.05), బృందావన కాలనీ (3.05), నిజం (3.07), పాండవ వనవాసం (3.18) మాయా బజార్ (3.04), లవకుశ (3.28), మిస్సమ్మ (3.01), పాతాళ భైరవి (3.15).. ఇలా చెప్పుకుంటూ పోతే మూడు గంటలు దాటిని సినిమాలు చాలానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Facebook/Sandeep Reddy Vanga
నెటిజన్లు ఏం అంటున్నారు?
యానిమల్ నిడివిపై నెటిజన్ అన్వర్ సోహోమ్ స్పందిస్తూ, ‘‘యానిమల్‌పై డైరెక్టర్ ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాయి. అంత సేపు కూర్చున్నందుకు మంచి అనుభూతి కలిగితే చాలు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కేశవ్ రామ్ మరో నెటిజన్, ‘‘పొన్నియిన్ సెల్వన్, బాహుబలి తరహాలో రెండు పార్ట్‌లు విడుదల చేయాల్సింది. సినిమా కాస్త ఆసక్తిని రేకెత్తించేటప్పటికీ రన్‌టైమ్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ఏ సర్టిఫికేట్ సినిమా’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Sandeep Reddy Vanga
రిస్క్ తీసుకుంటున్నారా?
ఎందుకు ఇంత పెద్ద సినిమాలు వస్తున్నాయనే అంశంపై సినీ విమర్శకుడు అన్వర్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఇదేమీ అంత కొత్త విషయం కాదు. మన ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమాల్లో చాలా 3.5 లేదా 4 గంటలు ఉండేవి. కానీ, ఆ తర్వాత కాలంలో తక్కువ నిడివిలో మెరుగ్గా చెప్పడమనే కాన్సెప్ట్ వచ్చింది. కరోనాకు ముందంతా సినిమాలు రెండు గంటలే ఉండేవి. ఆ తర్వాత 2.5 గంటలు స్టాండర్డ్ అయిపోయింది’’ అని ఆయన చెప్పారు.
‘‘ఇప్పుడు మరొక కాన్సెప్ట్ కూడా ఉంది. కొంచెం సినిమా పెద్దది అయితే, దాన్ని రెండు పార్ట్‌లు చేస్తున్నారు. యానిమల్ లాంటి సినిమాలు మాత్రం కాస్త పెద్ద నిడివితో వస్తున్నాయి. ఇదంతా డైరెక్టర్ స్టైల్, విజన్‌పై ఆధారపడి ఉంటాయి’’ అని ఆయన అన్నారు. ఇక్కడ సందీప్ రెడ్డి వంగా స్టైలే అలాంటిదని ఆయన అన్నారు.
నిజానికి ఇంత పెద్దపెద్ద సినిమాలు తీయడం రిస్కేనని అన్వర్ అన్నారు. ‘‘ఇది నిజంగా రిస్కే. సందీప్ రెడ్డి వంగా రిస్కే తీసుకున్నారు. కానీ, ఇటీవల ప్రేక్షకులు వెబ్‌సిరీస్‌లు చూడటం ఎక్కువైంది. ఆ వెబ్‌సిరీస్ స్టైల్‌లోనే ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు’’ అని చెప్పారు.
ఇవికూడా చదవండి:
- క్లియోపాత్రాకు ఇష్టమైన ఊదారంగు దుస్తులు వేసుకున్నందుకు స్నేహితుడిని చంపించిన రోమన్ చక్రవర్తి... బంగారం కన్నా ఖరీదైన ఆనాటి 'పర్పుల్ కలర్ కథేంటి?
- రింకూ సింగ్: నాడు బీసీసీఐ నిషేధించిన ఆటగాడే నేడు ‘నయా ఫినిషర్’ అయ్యాడా?
- తెలంగాణ ఎన్నికలు: ఆసక్తికర పోరు, మారుతున్న సన్నివేశాలు
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా..
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















