దియా మీర్జా: ‘కొందరు మగ అహంకారులే పర్యావరణానికి అతిపెద్ద సమస్య’

ఫొటో సోర్స్, Dia Mirza
- రచయిత, వందన
- హోదా, సీనియర్ న్యూస్ ఎడిటర్, ఆసియా
బాలీవుడ్ నటులు ఎక్కడికెళ్లినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. దియా మీర్జా కొన్నిసార్లు ఈ రకమైన ఆకర్షణను వాతావరణ మార్పుపై అవగాహన కల్పించడం కోసం వాడతారు. వాతావరణ మార్పులపై ప్రచారం చేయడం ఆమెకు నచ్చిన పని.
వాతావరణ మార్పులకు కారకులెవరు అన్నదాని గురించి బీబీసీ 100 విమెన్ ఇంటర్వ్యూలో దియా మీర్జా చర్చిస్తున్నప్పుడు తన హోటల్ గది బెల్ మోగింది.
దియా మీర్జా చిత్రం ఉన్న ఒక ఫోటోఫ్రేమ్‌ను ఆమెకు బహూకరించడానికి హోటల్ సిబ్బంది ఆమె గదికి వచ్చారు.
వారిచ్చిన బహుమతిని ఆమె మర్యాదపూర్వకంగా స్వీకరించారు దియా . వారు వెళ్లిపోగానే వాతావరణ మార్పు గురించి తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టారామె.
పర్యావరణానికి అతిపెద్ద ముప్పు ఎవరివల్ల పొంచి ఉంది అన్న పాయింట్ నుంచి మొదలు పెట్టారామె.
‘‘వాతావరణానికి అతి పెద్ద సమస్య ఏంటంటే మార్పును ఇష్టపడని కొందరు అహంకారులైన మగాళ్లు. చాలా పెద్ద కంపెనీలను పురుషులే నడుపుతున్నారు. వారు చేసే పనులు మన గ్రహానికి నష్టం కలిగిస్తూ, ప్రజల చావుకు కారణమవుతున్నాయని వారికి కూడా తెలుసు. కానీ, వాళ్లు మార్పును ఇష్టపడకపోవడానికి ఎలాంటి కారణం కనిపించదు’’ అని దియా మీర్జా అన్నారు.

ఫొటో సోర్స్, Dia Mirza
ఈ ఏడాది బీబీసీ 100 విమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో దియా మీర్జా కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావంతమైన, స్ఫూర్తిగా నిలిచే మహిళలతో బీబీసీ ఈ జాబితాను రూపొందిస్తుంది.
మా మధ్య జరిగిన చర్చలో ఎక్కువభాగం వాతావరణ మార్పుకు సంబంధించి లింగ సమానత్వంపైనే నడిచింది. సినీ నటిగా తన అనుభవాల గురించి కూడా ఆమె మాట్లాడారు.
దియా మీర్జా 2000లో మిస్ ఏసియా పసిఫిక్ బ్యూటీ పెజెంట్ అవార్డును గెలుచుకున్నప్పడు ఆమె వయస్సు 19 ఏళ్లు.
ఆ వెంటనే ఆమె మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించారు. అందంగా ఉన్నప్పటికీ మోడల్‌గా మారడానికి కావాల్సిన ఎత్తు లేవని తనతో అనేవారని దియా మీర్జా చెప్పారు.
‘‘నా గురించి ఏమీ తెలియని వారు కూడా నేనేం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయిస్తున్నప్పుడు కలిగినంత బాధ, ఎత్తు లేననే మాటకు కలగలేదు. ఆ మాటలు నాపై పెద్దగా ప్రభావం చూపలేదు’’ అని ఆమె చెప్పారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది

ఫొటో సోర్స్, Dia Mirza
కెరీర్ అంతటా స్త్రీ వివక్ష (సెక్సిజం)ను అనుభవించానని ఆమె అన్నారు.
‘‘నేను సినిమాల్లో పనిచేయడం ప్రారంభించినప్పుడు చాలా కొద్ది మంది మహిళలే ఈ రంగంలో ఉండేవారు. అప్పుడు సినిమా సెట్లలో పితృస్వామ్యం నడిచేది. నా సహనటుల్లో పురుషులు సెట్‌కు ఆలస్యంగా వచ్చినా, వృత్తి విషయాల్లో సరిగా మసలుకోలేకపోయినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, ఒక హీరోయిన్ అలాంటి పనులు చేస్తే వెంటనే ఆమెను ‘అన్‌ఫ్రొఫెషనల్’ అనేవారు. వ్యానిటీ వ్యాన్ సైజు కూడా చిన్నగా ఉండేది. బయట ప్రాంతాల్లో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు మహిళా నటులకు టాయ్‌లెట్లు కూడా ఉండకపోయేవి. ప్రైవసీ అనేది లేదు’’ అని ఆమె వివరించారు.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న భారత సినిమాలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మహిళల్లో చాలా తక్కువమందే అందుకోవడం గురించి ప్రశ్నించినప్పుడు దియామీర్జా బదులిచ్చారు.
భారతీయ సినిమాలో ఒక ఐకాన్‌లాంటి వహీదా రెహ్మాన్‌కు చాలా ఆలస్యంగా ఆ అవార్డును ఇచ్చారని దియా మీర్జా అన్నారు.
‘‘ఇక్కడొక వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేటికీ సినిమా రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనేది తెలుసుకోవాలి. దర్శకత్వం, నిర్మాణం, రచన ఇలా ఏ విభాగంలోనైనా మహిళలు తక్కువగా ఉన్నారు. మహిళా ప్రాతినిధ్యం పెరగనంతవరకు పరిస్థితులు మెరుగు కావు’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Dia Mirza
గతంలో చేదు అనుభవాలు ఉన్నప్పటికీ, భవిష్యత్ గురించి ఆమె సానుకూలంగా ఉన్నారు. పరిస్థితులు మెరుగవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు.
‘‘భారతీయ సినిమాలో ఒక దశ ఉండేది. ఆ సమయంలో ఒక వయస్సుకు చేరుకున్నాక మహిళలకు ప్రధాన పాత్రలు ఇచ్చేవారు కాదు. కానీ, పురుషులకు ఇలాంటి నియమం ఏదీ లేదు. ఈ మధ్యే ‘ధక్ ధక్’ అనే సినిమా విడుదలైంది. అందులో వేర్వేరు వయస్సులకు చెందిన నలుగురు మహిళలు మోటార్‌బైక్ రైడింగ్ చేస్తారు. ఇలాంటి కథను చెప్పడానికి సినిమా పరిశ్రమకు 110 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఇలాంటి సినిమాలో నటించడానికి నేను 23 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది’’ అని దియా మీర్జా అన్నారు.
మాజీ బ్యూటీ పెజెంట్ విజేతగా దియా మీర్జా నేటి యువతులకు ఒక సలహా ఇచ్చారు.
‘‘మీకు నచ్చని, సౌకర్యంగా లేని పనులు చేయకండి. మిస్ ఏషియా పసిఫిక్ పోటీల్లో టూ పీస్ స్విమ్ సూట్ ధరించడానికి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు అది సౌకర్యంగా అనిపించలేదు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/DiaMirza
సినిమా రంగమే కాకుండా ఇతర రంగాల్లో కూడా లింగ సమానత్వం సాధించాలని ఆమె కోరుతున్నారు.
2021లో భారతీయ సంప్రదాయ రీతిలో ఆమె పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి విభిన్నంగా నిలిచింది. అందరిలా కాకుండా ఒక మహిళా పూజారి ఆమె పెళ్లి చేశారు.
‘‘నా స్నేహితురాలి పెళ్లిలో మహిళా పూజారిని చూశాను. నా పెళ్లిలో కూడా మహిళలే ఉండాలని అనుకున్నా. మహిళా పూజారిని నియమించుకోవడం భారత్‌లో పెద్ద ఎత్తున ఆన్‌లైన్ చర్చకు తావిచ్చింది. పూజారితో సహా కొన్ని నిర్ధిష్ట పనుల్లో మహిళలను ఎందుకు అనుమతించడం లేదనే చర్చ జరిగింది’’ అని దియా మీర్జా చెప్పారు.
పూజారి విషయంలోనే కాదు పెళ్లిలో కన్యాదానం ఆచారాన్ని కూడా ఆమె పక్కనబెట్టారు.
‘‘పెళ్లిలో ఇచ్చేయడానికి నా కూతుళ్లేమీ వస్తువులు కాదు అని మా తాతగారు చెబుతుండేవారు. అది చాలా మంచి ఆలోచన. నా పెళ్లిలో కూడా కన్యాదానం చేయబోనని మా అమ్మ చెప్పారు’’ అని దియా తెలిపారు.
బాలీవుడ్ రిపోర్టర్‌గా నేను దియా మీర్జా కెరీర్‌ను చూశాను. ఆమె చేసే సినిమా, గ్లామర్ వంటి అంశాలపై ప్రజలు దృష్టి సారిస్తారు. కానీ, ఒక పర్యావరణ కార్యకర్తగా ఆమె అంకితభావాన్ని పెద్దగా గుర్తించరు.
దక్షిణ భారతదేశంలో పుట్టి పెరిగిన దియా మీర్జా... సినిమాల్లో, మోడలింగ్ కెరీర్‌లో 20 ఏళ్లు పూర్తిచేసుకున్నప్పటికీ వాతావరణ కార్యకర్తగా మారడంలో ఆశ్చర్యం లేదు.
దియా మీర్జా 2017లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

ఫొటో సోర్స్, Instagram/DiaMirza
ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తరచుగా తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో ఒక తరం వాడిన దుస్తులను మరో తరం వారు వాడటానికి సిగ్గుపడకపోయేవారని, ఏళ్ల తరబడి వస్తువులను ఉపయోగించేవారని ఆమె అన్నారు.
ఆ ఆచారాలను తాను ఇంట్లో పాటిస్తున్నానని చెప్పారు. ఉదాహరణకు ఆమె కొడుకు రెండో పుట్టినరోజు వేడుకలను ప్లాస్టిక్ లేకుండా, ఏదీ వృథా కాకుండా ప్లాన్ చేశారు. అలంకరణలో వాడిన వస్తువులను భవిష్యత్ పార్టీల కోసం మళ్లీ భద్రపరిచారు.
హోటల్ వారు అందించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను తిరస్కరించిన దియా మీర్జా దానికి బదులుగా మెటల్ వాటర్ బాటిల్‌ను వాడతారు.
‘‘నేనే ఆచరించకుండా, ఇతరులకు ఎలా సలహాలు ఇవ్వగలను. అలవాట్లు మార్చుకోండి అని యువతకు చెప్పడానికి నాకు ఏ హక్కు ఉంది? పర్యావరణానికి జరిగిన నష్టం గురించి మాట్లాడినప్పుడల్లా చాలా నిరాశగా అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అన్నిచోట్లా జరుగుతున్న పరిణామాల పట్ల నాకు నిరుత్సాహంగా ఉంది. కానీ, యువత నుంచి, వారి ఆవిష్కరణలు, పరిష్కారాలు, ముఖ్యంగా వారి సహానుభూతి, ప్రేమ నుంచి స్ఫూర్తి, నమ్మకాన్ని పొందుతున్నా’’ అని ఆమె అన్నారు.
ఇంటర్వ్యూ ముగియగానే తన కోసం ఎదురుచూస్తున్న తన కొడుకుని కలుసుకోవడానికి దియా ఉత్సుకతతో ఉన్నారు. నేను చివరగా ఒక ప్రశ్న అడిగాను.
ఒక నటిగా, పర్యావరణ కార్యకర్తగా, ఐక్యరాజ్యసమితి అంబాసిడర్‌గా పోషించిన అన్ని పాత్రల్లో మీకు ఏది నచ్చుతుంది? అని అడిగినప్పుడు తల్లిగా ఉండటం అన్నింటికంటే నాకు బాగా నచ్చుతుందని వెంటనే ఆమె సమాధానం చెప్పారు.
తల్లిగా భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంటుందని ఆమె అన్నారు.
అదనపు రిపోర్టింగ్: అమేలియా బటర్లీ
ఇవి కూడా చదవండి:
- క్లియోపాత్రాకు ఇష్టమైన ఊదారంగు దుస్తులు వేసుకున్నందుకు స్నేహితుడిని చంపించిన రోమన్ చక్రవర్తి... బంగారం కన్నా ఖరీదైన ఆనాటి 'పర్పుల్ కలర్ కథేంటి?
- రింకూ సింగ్: నాడు బీసీసీఐ నిషేధించిన ఆటగాడే నేడు ‘నయా ఫినిషర్’ అయ్యాడా?
- తెలంగాణ ఎన్నికలు: ఆసక్తికర పోరు, మారుతున్న సన్నివేశాలు
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా..
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














