ఉత్తరకాశీ: సొరంగం లోపల పరిస్థితిపై కార్మికులు ఏం చెప్పారు... 24 గంటల్లో లోపల పరిస్థితి ఎలా మారింది?

సిల్క్యారా టన్నెల్

ఫొటో సోర్స్, PHOTO BY SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకురావడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

దీపావళి రోజు సొరంగం ముఖద్వారం కుప్పకూలడంతో ఈ 41 మంది లోపలే ఇరుక్కుపోయారు. మొత్తానికి 17 రోజుల తర్వాత వీరు బయటకువచ్చారు. దీంతో వీరి ఇళ్లలో దీపావళి తరహా వాతావరణం నెలకొంది.

సొరంగం లోపల చిక్కుకున్న 41 మందిలో 15 మంది జార్ఖండ్‌కు చెందినవారు, ఎనిమిది మంది ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు, బిహార్, ఒడిశాలకు చెందినవారు ఐదుగురు చొప్పున ఉన్నారు. మరో ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు కాగా.. అస్సాం, ఉత్తరాఖండ్‌కు చెందిన వారు ఇద్దరేసి, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందినవారు ఒకరు ఉన్నారు.

సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చిన వీరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అవసరమైన ఆరోగ్య చెకప్‌లు నిర్వహించి, ఏదైనా చికిత్స అవసరమైతే అందిస్తారు. అనంతరం వీరిని ఇంటికి పంపిస్తారు.

సుబోధ్ కుమార్ వర్మ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సుబోధ్ కుమార్ వర్మ

బయటకు వచ్చిన కార్మికులు సొరంగం లోపల తాము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో, ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మీడియాకు చెబుతున్నారు.

సొరంగం ముఖద్వారం కుప్పకూలిన మొదటి 24 గంటలు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది జార్ఖండ్‌కు చెందిన సుబోధ్ కుమార్ వర్మ చెప్పారు.

‘‘మొదట 24 గంటలూ గాలి కూడా సరిగా అందలేదు. ఆహారం కూడా లేదు. తర్వాత ఆ కంపెనీ మాకు జీడిపప్పు, ఎండుద్రాక్షలను పంపించింది. పది రోజుల తర్వాతే మాకు అన్నం, రొట్టె, పప్పు అందాయి’’ అని ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన చెప్పారు.

‘‘ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎలాంటి సమస్యలూ లేవు. దీనంతటికీ మీ ప్రార్ధనలు, కఠోర శ్రమే కారణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి వల్లే మేం బయటకు వచ్చాం. లేకపోతే, లోపల ఏమైపోయేవారిమో దేవుడికే తెలియాలి’’ అని ఆయన అన్నారు.

సిల్క్యారా టన్నెల్

ఫొటో సోర్స్, ANI

బయటకు సురక్షితంగా వచ్చిన వారిలో జార్ఖండ్‌కు చెందిన విశ్వజీత్ కుమార్ కూడా ఒకరు. ఆయన కంప్రెషర్ మిషన్‌ను నడిపిస్తుంటారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి, మళ్లీ బయటి ప్రపంచాన్ని చూగడలమని ఆయన మొదట్నుంచీ నమ్మకంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.

‘‘నేను చాలా సంతోషంగా, సురక్షితంగా ఉన్నాను. నాతోపాటు కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మేమంతా ఆసుపత్రిలో ఉన్నాం. ఆ రోజు సొరంగం ముఖద్వారానికి సమీపంలో పైకప్పు కూలిపోయింది. మేమంతా అవతలివైపు ఉండిపోయాం. లోపల రెండున్నర కిలోమీరట్ల పొడవైన సొరంగం అంతా ఖాళీనే. అసలు ఏం చేయాలో తెలియక, లోపల అటూఇటూ తిరిగేవాళ్లం’’ అని ఆయన అన్నారు.

లోపల ఇరుక్కున్న తొలి గంటలు చాలా కష్టంతో గడిచాయని విశ్వజీత్ కూడా చెప్పారు. ‘‘మొదట్లో చాలా భయంగా ఉండేది. అయితే, ఆహారం, నీరు అందడంతోపాటు మా కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో కాస్త నమ్మకం వచ్చింది. త్వరలోనే బయటి ప్రపంచాన్ని చూడగలమనే విశ్వాసం కూడా పెరిగింది’’ అని ఆయన అన్నారు.

‘‘పైనుంచి కొండ చరియలు విరిగినప్పుడు, బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయిందని అర్థమైంది. అయితే, మమ్మల్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉండేవి. మొదట ఆహారం, నీళ్లు ఇచ్చారు. తర్వాత ఆక్సిజన్ మాస్కులు కూడా ఇచ్చారు. మమ్మల్ని రక్షించేందుకు బయట నుంచి మెషీన్లను కూడా తీసుకొచ్చామని చెప్పారు’’ అని ఆయన అన్నారు.

మరోవైపు కుటుంబంతో మాట్లాడటం వల్ల తమలో నమ్మకం పెరిగిందని ఆయన చెప్పారు. ‘‘మా కోసం లోపలకు ఒక మైక్ పంపించారు. దీని ద్వారా మేం కుటుంబంతోపాటు బయట ఉండేవారితోనూ తరచూ మాట్లాడేవాళ్లం’’ అని ఆయన అన్నారు.

గబ్బర్ సింగ్ నేగీ

ఫొటో సోర్స్, PMO

ఫొటో క్యాప్షన్, గబ్బర్ సింగ్ నేగీ (బ్లూ జాకెట్ వేసుకున్న వ్యక్తి)

గబ్బర్ సింగ్ నేగీ నాయకత్వం...

సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత, వార్తల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు గబ్బర్ సింగ్ నేగీ. ఆయన ఈ ప్రాజెక్టుకు టన్నల్ ఫార్‌మన్‌గా పనిచేసేవారు.

సొరంగ ముఖద్వారం కూలినప్పుడు, 40 మంది కార్మికులతోపాటు ఆయన కూడా లోపల ఇరుక్కుపోయారు. అయితే, తాము ఎప్పుడూ బతుకుపై ఆశ కోల్పోకుండా గర్బర్ సింగ్ తమలో ధైర్యం నింపేవారని ఇతర కార్మికులు చెప్పారు.

లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడేటప్పుడు గబ్బర్ సింగ్‌ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుసుకున్నారు. గబ్బర్ సింగ్‌ను ఆయన ప్రశంసించారు.

‘‘మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాలి. సరైన సమయంలో నాయకత్వాన్ని మీరు అందించారు. కఠినమైన పరిస్థితుల్లో ఒక గ్రామవాసి తమ బృందానికి ఎలా నేతృత్వం వహించారో మీపై యూనివర్సిటీలు అధ్యయనం కూడా చేపట్టాలి’’ అని ప్రధాని అన్నారు.

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గర్బర్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. లోపల కార్మికులంతా తనకు మద్దతు తెలిపినందుకు సంతోషం వ్యక్తంచేశారు.

లోపల తాము ఎలా ఉన్నామోనని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్‌లతోపాటు తమ కంపెనీ కూడా తరచూ అడిగేదని గర్బర్ సింగ్ చెప్పారు. ‘‘లోపల మేం కుటుంబంలా గడిపాం. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటూ, నేను చెప్పే మాటలు విన్న సహోద్యోగులకూ ధన్యవాదాలు చెప్పాలి’’ అని ఆయన అన్నారు.

జార్ఖండ్

ఫొటో సోర్స్, RAVI PRAKASH

జార్ఖండ్‌లో సంబరాలు...

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను విడిపించే ఆపరేషన్ విజయవంతం కావడంతో సాధారణ ప్రజలు సంబరాలు చేసుకున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. మరోవైపు దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన కార్మికుల కుటుంబాలు కూడా సంతోషం వ్యక్తంచేశాయి.

లోపల చిక్కుకున్న 41 మందిలో 15 మంది జార్ఖండ్‌కు చెందినవారే. వీరిలో ముగ్గురి కుటుంబాలు జీవించే ఖీరాబేడా గ్రామంలో 17 రోజుల తర్వాత పండుగ వాతావరణం కనిపించింది.

రాజేంద్ర బేదియా, అనిల్ బేదియా, సుఖ్‌రామ్ బేదియా ఈ గ్రామానికి చెందినవారే కావడంతో, వీరు బయటకు వచ్చిన వెంటనే అక్కడి గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వీరు ఎప్పుడు గ్రామానికి వస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

మంగళవారం రాత్రి 8 గంటలకు సొరంగం నుంచి సురక్షితంగా వీరు బయటకు వచ్చారని తెలిసిన వెంటనే గ్రామస్థులు బాణసంచా కాల్చినట్లు బీబీసీ ప్రతినిధి రవి ప్రకాశ్ తెలిపారు. బాణసంచా కాల్చిన తర్వాత, వీరు మిఠాయిలు కూడా పంచుకున్నారు.

ఈ ముగ్గురు యువకులు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని వీరి కుటుంబాలు దేవుడిని వేడుకున్నాయి. వీరు బయటకు వచ్చారని తెలిసిన వెంటనే, ప్రత్యేక పూజలకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు.

వీరు పదో తరగతి పూర్తిచేసిన పాఠశాలలోనూ పండుగ వాతావరణం నెలకొంది. అక్కడ పిల్లలు డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

మన్‌జీత్

ఫొటో సోర్స్, UTTARAKHAND GOVERNMENT

ఫొటో క్యాప్షన్, మన్‌జీత్ తలపై ముద్దు పెట్టిన అతడి తండ్రి

ఇప్పటికే ఒక కుమారుడిని కోల్పోయిన తల్లి

ఉత్తర్ ప్రదేశ్ లఖీమ్‌పుర్ ఖీరీ జిల్లాలోని భైరమ్‌పుర్ గ్రామానికి చెందిన మన్‌జీత్ కూడా సొరంగంలో చిక్కుకుపోయిన వారిలో ఉన్నారు.

మన్‌జీత్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ 17 రోజులు చాలా బాధపడ్డాం. ప్రతి రోజూ ఏడ్చేవాళ్లం. రేపు తప్పకుండా అతడు బయటకు వస్తాడని ఎదురుచూసేవాళ్లం. అలానే 17 రోజులు గడిచాయి. నేడు మేం దీపావళి జరుపుకుంటున్నాం. మా అబ్బాయి సురక్షితంగా బయటకు వచ్చాడు. ఇకపై అలాంటి ప్రమాదకరమైన పనులకు మేం తనను పంపించం’’ అని ఆమె చెప్పారు.

దుధ్వా టైగర్ రిజర్వ్‌కు పక్కనే ఉండే భైరమ్‌పుర్ గ్రామంలోని మన్‌జీత్ ఇంటి దగ్గర ఇరుగుపొరుగువారు, జర్నలిస్టులతో కోలాహలమైన వాతావరణం నెలకొందని బీబీసీ ప్రతినిధి ప్రశాంత్ పాండే చెప్పారు.

మన్‌జీత్ ఇంటిలో ఆయన అమ్మా, నాన్నతోపాటు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉంటారు. మన్‌జీత్ సొరంగం లోపల ఇరుక్కున్నాడని వార్త తెలిసిన వెంటనే, ఇంటిలో నగలను అమ్మేసి, అతడి తండ్రి సిల్క్యారాకు చేరుకున్నారు.

మన్‌జీత్ బయటకు వచ్చిన వెంటనే, ఆయన తండ్రి అతడి నుదుటిపై ముద్దుపెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఏడాది క్రితం ముంబయిలో పనిచేస్తుండగా విద్యుదాఘాతమై మన్‌జీత్ అన్నయ్య దీపు మరణించారు. ‘‘మేం పెద్ద కొడుకుని కోల్పోయాం. అందుకే చిన్న కొడుకు కోసం ఇంత అవేదన పడుతున్నాం. గత 17 రోజులు 17 ఏళ్లలా గడిచాయి’’ అని మన్‌జీత్ తల్లి చెప్పారు.

రామ్ ప్రసాద్ తండ్రి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రామ్ ప్రసాద్ తండ్రి

‘సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’

సొరంగంలో చిక్కుకున్న వారిలో శ్రావస్తికి చెందిన రామ్ మిలన్ కూడా ఒకరు. ఆయన కుమారుడు సందీప్ కుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘మేం చాలా సంతోషంగా ఉన్నాం. మా నాన్నను తీసుకువచ్చేందుకు మా బంధువులు ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న అందరికీ మేం ధన్యవాదాలు చెబుతున్నాం’’ అని ఆయన అన్నారు.

మరో కార్మికుడు సంతోష్ కుమార్‌ది కూడా శ్రావస్తినే. అతడి బంధువు శమిత దేవీ మాట్లాడుతూ.. శ్రావస్తికి చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారని చెప్పారు. తన కుమారుడితో మాట్లాడానని సంతోష్ తల్లి కూడా చెప్పారు. అతడు ఎప్పుడు ఇంటికి వస్తాడోనని ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలిపారు.

‘‘మేం చాలా సంతోషంగా ఉన్నాం. మేం నేడు దీపావళి జరుపుకుంటున్నాం. ఈ గ్రామం మొత్తం ఇప్పుడు దీపావళి జరుపుకుంటోంది’’ అని ఆమె అన్నారు.

ఒడిశా మయూర్‌బంజ్‌కు చెందిన ధీరెన్ నాయక్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అలానే అస్సాంకు చెందిన రామ్ ప్రసాద్ నర్జరీ కుటుంబం కూడా సంతోషం వ్యక్తంచేసింది.

‘‘మా అబ్బాయితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. వారు బయటకు వచ్చేందుకు సాయం చేసిన అందరికీ ధన్యావాదాలు’’ అని రామ్ ప్రసాద్ తండ్రి మీడియాతో చెప్పారు.

గుడి ముందు ప్రార్థన చేస్తున్న డిక్స్

ఫొటో సోర్స్, PHOTO BY ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గుడి ముందు ప్రార్థన చేస్తున్న డిక్స్

‘ఇది అద్భుతం’

శిథిలాల నుంచి మార్గం ఏర్పాటుచేసిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మన్మోహన్ సింగ్ రావత్ సొరంగం లోపలికి వెళ్లి, అక్కడున్న కార్మికులను కలిశారు.

‘‘నేను లోపలకు వెళ్లిన వెంటనే, కార్మికుల ముఖంపై సంతోషం కనిపించింది. త్వరలోనే అందరినీ బయటకు తీసుకెళ్తామని వారిలో నమ్మకం పెరిగింది’’ అని ఆయన చెప్పారు.

ఈ ఆపరేషన్‌కు కన్సల్టంట్‌గా పనిచేసిన ఇంటర్నేషనల్ టన్నలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా తనకు గర్వకారణమని అన్నారు.

‘‘నేను కూడా ఒక తండ్రినే. అందుకే లోపల చిక్కుకున్న పిల్లలను ఎలాగైనా వారి ఇంటికి పంపించాలని అనుకున్నాను. క్రిస్మస్‌కు ముందే ఈ పిల్లలు ఇళ్లకు చేరుకుంటారని నేను ముందే చెప్పాను. ఈ సారి క్రిస్మస్ చాలా త్వరగా వచ్చేసింది’’ అని ఆయన అన్నారు.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడే సొరంగానికి పక్కనున్న ఓ గుడి దగ్గర ఆర్నాల్డ్ డిక్స్ ప్రార్థన చేస్తూ కనిపించారు.

ఈ విషయంపై ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను నా కోసం దేవుడిని ఏమీ అడగలేదు. లోపలున్న 41 మంది కోసమే ప్రార్థన చేశాను. లోపలున్న ఎవరికీ ఏమీ కాకూడదు’’ అని ఆయన అన్నారు.

‘‘మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఏం చేయాలనే దానిపై మాకు స్పష్టత ఉంది. మాకు అద్భుతమైన టీమ్ ఉంది. ఇక్కడ కూడా అత్యుత్తమ ఇంజినీర్లు ఉన్నారు. వీరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఇప్పుడు మళ్లీ గుడికి వెళ్లాలి. ఎందుకంటే ధన్యవాదాలు చెప్పాలి. మేం ఇక్కడ అద్భుతాన్ని చూశాం’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఫ్రాన్సిస్ జుబేర్ అనే ఒక స్కీయర్ స్కీయింగ్ చేస్తున్నప్పుడు అతడికి ఒక దృశ్యం కనిపించింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)