సిక్కింలో ఆనకట్ట తెగేంత వరద ఎందుకు వచ్చింది? మంచు సరస్సుల్లో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో విధ్వంసక వరదలు ప్రమాదకర గ్లేసియల్ లేక్స్‌ను మొదట్లోనే గుర్తించే హెచ్చరిక వ్యవస్థల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని నిపుణులు అంటున్నారు.
గత వారం ఈ వరదల్లో తొమ్మిది మంది సైనికులు సహా దాదాపు 70 మంది మరణించారు. మరో వంద మంది ఆచూకీ గల్లంతైంది. హిమాలయాల్లోని సౌత్ లోనక్ గ్లేసియల్ లేక్ కట్ట తెగిపోవడంతో ఈ వరదలు ముంచెత్తాయి.
భారీ వర్షాలు, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం లాంటి కారణాలతో ఒక్కోసారి హిమనీ నదాల నుంచి నీరందే సరస్సులు ఇలా కట్టలు తెగి ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి.
వీటిని మొదట్లోనే గుర్తించగలిగితే సకాలంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించొచ్చు. ఆనకట్టల గేట్లను కూడా పైకి ఎత్తొచ్చు. ఫలితంగా విధ్వంసం తీవ్రత కొంతవరకూ తగ్గుతుంది.
సిక్కిం విపత్తు తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) స్పందించింది. గత సెప్టెంబరులోనే ముందుగానే ఇలాంటి వరదలపై హెచ్చరించేందుకు ఎక్కువ ముప్పున్న రెండు సరస్సులపై అధ్యయనం చేపట్టామని సంస్థ తెలిపింది.
ఎన్‌డీఎంఏ సర్వే చేపట్టిన సరస్సుల్లో సౌత్ లోనక్ సరస్సు కూడా ఉంది. ఇక్కడ ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థల కోసం పనులు జరుగుతున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.
అయితే, ఆ అధ్యయానికి కొన్ని వారాల్లోనే ఇంత విధ్వంసకర వరదలు రావడంతో అసలు ఇప్పటివరకూ ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’లు ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌత్ లోనక్ సరస్సు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని ఉప్పొంగి ప్రవహించడానికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. కొందరేమో భారీ వర్షాల వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. మరికొందరేమో అసలు అంత వాన పడనేలేదని చెబుతున్నారు.
మొత్తంగా బండరాళ్లు, చిన్నచిన్న రాళ్లు, మట్టితో సరస్సు చుట్టూ సహజంగా ఏర్పడిన కట్ట తెగిపోవడంతోనే వరదలు ఉప్పొంగాయని ఎక్కువ మంది చెబుతున్నారు. కొందరైతే భూకంపం కూడా దీనికి కారణం అయ్యుండొచ్చని అంటున్నారు.
సౌత్ లోనక్ వల్ల భారీ వరదలు వచ్చే ముప్పుందని కొన్ని అధ్యయనాలు ఇదివరకు కూడా హెచ్చరించాయి.
గత మూడు దశాబ్దాల్లో ఈ సరస్సు విస్తీర్ణం 2.5 రెట్లు పెరిగింది. దీనికి నీరందిస్తున్న హిమనీనదం వేగంగా కరిగిపోవడమే దీనికి కారణం. 2016లో ఈ సరస్సు కట్ట తెగిపోకుండా చూసేందుకు కొంత నీటిని కూడా అధికారులు ఇక్కడి నుంచి పంపించారు. కానీ, ఇప్పటికీ ఇక్కడ ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ అందుబాటులో లేదు.
ఈ వరదల వల్ల తీస్తా నదిపై చంగ్‌తాంగ్ ఆనకట్ట కొట్టుకుపోయింది. ఈ ఆనకట్ట గేట్లను తెరవాలని తమకు ఆదేశం వచ్చిందని, కానీ, అప్పటికే వరద ప్రవాహం ఆనకట్టను తాకిందని ఇక్కడ పనిచేస్తున్న ప్రజలు స్థానిక మీడియాతో చెప్పారు.
భూమి వేడెక్కడం వల్ల హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని, ఫలితంగా హిమాలయాల్లోని కొన్ని సరస్సుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
దీని వల్ల కొత్త సరస్సులు కూడా ఏర్పడుతున్నాయి. కొన్ని చిన్నచిన్న సరస్సులు కలిసి ఒక పెద్ద సరస్సుగా ఏర్పడుతున్నాయి. ఒక్కోసారి ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడం, కొండ చరియలు విరిగిపడటం, బంగరాళ్లు పడిపోవడంతో వీటి వల్ల భారీ వరదలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలోనున్న 56 సరస్సుల్లో ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రచించినట్లు ఎన్‌డీఎంఏ తెలిపింది.
అయితే, ప్రస్తుతం ఇలాంటి ప్రమాదకర సరస్సుల సంఖ్య 200కు పెరిగిందని హిమాలయాల్లో ముప్పులపై అధ్యయనం చేపడుతున్న ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ సంస్థ చెప్పింది. అంటే లోనక్ సరస్సు తరహాలో ఈ సరస్సులు కూడా ఎప్పుడైనా కట్టలు తెంచుకోవచ్చు.
ఒక్క సిక్కింలోనే చిన్నవి, పెద్దవి కలిపితే 700 వరకూ గ్లేసియల్ లేక్స్ ఉన్నాయి. వీటిలో 20 ప్రమాదం అంచున ఉన్నాయి.

ఫొటో సోర్స్, REUTERS
ఇలా ప్రమాదకరమైనవిగా గుర్తించిన సరస్సుల్లో లోనక్ కూడా ఒకటని సిక్కిం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ధీరెన్ శ్రేష్ఠ ధ్రువీకరించారు. మరి ఇక్కడ ఎందుకు ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేయలేదు? దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీచేశారు లాంటి బీబీసీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు.
ఈ ప్రశ్నలకు ఎన్‌డీఎంఏతోపాటు సెంట్రల్ వాటర్ కమిషన్ లేదా కేంద్ర జల వనరుల శాఖ కూడా స్పందించలేదు.
సౌత్ లోనక్ సరస్సులో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు ఎన్‌డీఎంఏ, స్విట్జర్లాండ్‌తో కలిసి పనిచేస్తోంది. అసలు ఇక్కడ పనులు ఎందుకు చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయనే ప్రశ్నకు స్విట్జర్లాండ్ దౌత్య కార్యాలయం కూడా స్పందించలేదు.
‘‘ముందస్తు హెచ్చరికల వ్యవస్థ లేకపోవడానికి ఇక్కడ అధికారులే కారణం. మరోవైపు ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆలస్యం కావడానికి ఒక కారణం’’ అని సిక్కిం యూనివర్సిటీలోని గ్లేసియాలజీ విద్యార్థి రాజీవ్ రజక్ చెప్పారు.
హిమాలయ నదులపై ఆనకట్టలు కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు సామాజిక ఉద్యమకారులు దీనిపై మాట్లాడుతూ.. ‘‘రక్షణ వ్యూహాల్లో ఈ సరస్సు చాలా సున్నితమైనది. అందుకే ఇక్కడ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేయడం ఆలస్యం అవుతూ ఉండొచ్చు’’ అని అన్నారు.
‘‘ ఈ సరస్సు టిబెట్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ సైనికేతర పనులు చేయడానికి కాస్త సమయం పడుతుంది’’ అని అని ఒక ఉద్యమకారుడు చెప్పారు. ఆయన తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.
అయితే, ఉష్ణోగ్రతలు పెరగడంతో హిమాలయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని, ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉంటుందని గ్లేసియాలజిస్టులు చెబుతున్నారు.
‘‘సమయం మించిపోతోంది’’ అని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంవీడీ)లో సీనియర్ క్రయోస్పియర్ స్పెషలిస్టు మిరియమ్ జాక్సన్ చెప్పారు.
‘‘ఈ సరస్సులను ఎప్పటికప్పుడు గమనించడం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థల ఏర్పాటు చేయడం, స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, అక్కడ ఏర్పాటుచేసిన పరికరాలన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయో లేదో చూడటం.. లాంటి వాటిపై దృష్టిపెట్టాలి’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, PRO DEFENCE GUWAHATI
అయితే, గ్లేసియల్ లేక్స్‌ను ప్రమాదకరంగా మార్చే అంశాలు నానాటికీ పెరుగుతున్నాయి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయి.
మొదట్లో వేగంగా కరిగే హిమనీనదాలతో నిండే సరస్సులో ఎక్కువ ముప్పుగా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు చాలా మారాయి. కొండచరియలు విరిగిపడటం, రాళ్లు పడిపోవడంతోనూ చాలా ముప్పులు వస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరగడంతో గతంలో మంచు మాత్రమే కురిసే ఎత్తైన ప్రాంతాల్లో నేడు వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా ఇక్కడి నేల స్థిరత్వాన్ని కోల్పోతోంది. హిమాలయాలతోపాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి.
శతాబ్దాలుగా గడ్డకట్టి ఉన్న ప్రాంతాల్లో కూడా భూమి వేడెక్కడంతో నీరు విడుదలవుతోంది. ఫలితంగా ఇక్కడ ‘స్లోప్ ఫెయిల్యూర్(వర్షం లేదా ఇతర కారణాలతో స్లోప్ ఒక్కసారిగా కూప్పకూలడంతో)’ వల్ల గ్లేసియల్ లేక్స్‌లో వరదలు రావచ్చు.
‘‘సౌత్ లోనక్ లేక్ స్లోప్‌లోనూ ఇలాంటి మార్పులే వచ్చినట్లు ఆధారాలు చెబుతున్నాయి’’ అని ఐసీఐఎంవోడీ రీసర్చర్ జాకబ్ స్టెయినర్ చెప్పారు.
‘‘ప్రస్తుతం స్లోప్ ఫెయిల్యూర్స్‌పై ఉపగ్రహ చిత్రాల సాయంతో శాస్త్రవేత్తలు దృష్టి పెడుతున్నారు. వీటిలో ఎన్నింటిలో మార్పులు వచ్చాయో గమనిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
ఈ పర్యవేక్షణలన్నీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఉంటేనే మెరుగ్గా పనిచేస్తాయి. లేదంటే సౌత్ లోనక్ సరస్సు తరహా వరదలు పునరావృతం అవుతూనే ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- స్పై డెత్స్: మజ్జోరే సరస్సు పడవ మునకలో గూఢచారుల మరణాలపై అనేక సందేహాలు
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















