హెన్రీ కిసింజర్ (1923-2023): అమెరికా విదేశాంగ విధానంపై చెరగని ముద్ర వేసిన నేత

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ దౌత్యవేత్త, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ (100) కన్నుమూశారు.
అమెరికా విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేసిన దౌత్యవేత్తగా హెన్రీ కిసింజర్ పేరొందారు.
రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్‌ల హయాంలో విదేశాంగ విధానాలపై ఆయన వేసిన ముద్ర చాలా బలమైనది.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కిసింజర్ తన విధానాలతో అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపారు.
ఆయన నవంబర్ 29వ తేదీన కనెక్టికట్‌లోని తన నివాసంలో మరణించినట్లుగా కిసింజర్ అసోసియేట్స్ ప్రకటించారు. అయితే, ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు.
1923లో జర్మనీలో జన్మించిన కెసింజర్, 1938లో నాజీల పాలన సమయంలో అమెరికాకు వలస వెళ్లారు.
1943లో కిసింజర్ అమెరికా పౌరసత్వం పొందిన అనంతరం, అమెరికా సైన్యంలో మూడేళ్లు పనిచేశారు. ఆ తరువాత కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో చేరారు.
బ్యాచిలర్, మాస్టర్, పీహెచ్‌డీ విద్యను పూర్తి చేసిన హెన్రీ, హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపై బోధనలు కూడా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాకు వచ్చిన సమయంలో టీనేజర్ అయిన హెన్రీకి ఇంగ్లీష్ భాషపై అంత పట్టు లేదు. కానీ, విద్యార్థి దశ నుంచి ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించే స్థాయికి తన భాష, విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించారు.
1969లో రిచర్డ్ నిక్సన్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ పదవి మూలంగా అమెరికా విదేశాంగ విధానంపై ఆయన లోతైన విశ్లేషణ, పరిశీలన జరిపేందుకు వీలు కలిగింది.
జాతీయ భద్రతా సలహాదారుగా, అమెరికా సెక్రటరీగా ఏకకాలంలో రెండు బాధ్యతలు నిర్వర్తించిన ఒకే ఒక వ్యక్తి కిసింజర్. అమెరికా విదేశాంగ విధానంపై ఆయనకున్న పట్టు మరెవరికీ లేదు.
రిచర్డ్ నిక్సన్ తరువాత గెరాల్డ్ ఫోర్డ్ ప్రభుత్వంలోనూ పనిచేసిన హెన్రీ చైనాతో దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడంలో కృషి చేశారు.
1973లో యోమ్ కిప్పుర్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, యుద్ధానికి ముగింపు పలకడంలో సాయం చేశారు.
ప్యారిస్ శాంతి ఒప్పందం విషయంలో కీలకపాత్ర వహించి, వియత్నాం యుద్ధానికి ముగింపు పలకడంలోనూ కీలకంగా వ్యవహరించారు.
అయితే, మానవహక్కులను పక్కకుపెట్టి, సోవియట్‌తో శత్రుత్వాన్ని పెంచేలా వ్యవహరించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు.
చిలీలోని అగస్టో పినోచెట్ పాలనతో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అణిచివేత పాలనకు మద్దతు తెలిపేలా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
1973లో ఉత్తర వియత్నాంకు చెందిన లీ డ్యుక్ థొ, హెన్రీలను సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతికి ఎంపికచేశారు. అయితే, లీ డ్యుక్ థొ ఈ పురస్కారాన్ని తిరస్కరించారు.
ఈ అవార్డుపై కూడా వివాదం రాజుకున్న నేపథ్యంలో, ఇద్దరు నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యులు ఈ వివాదం వల్ల రాజీనామా చేశారు.
1977లో అమెరికా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన హెన్రీ, ప్రజా వ్యవహారాలపై వ్యాఖ్యాతగా కొనసాగారు.
అమెరికా అధ్యక్షులు, విధాన రూపకర్తలు విదేశాంగ విధానపరమైన అంశాలపై తరచూ ఆయన్ను సంప్రదించేవారు. భద్రత, విదేశాంగ విధాన ఫోరంలలో పాల్గొన్నారు. ఇవేకాకుండా 21 పుస్తకాలు రాశారు.
కిసింజర్ ఈ ఏడాది మే నెలలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ, చివరి దశలోనూ ఆయన చురుగ్గా ఉన్నారు. ఈ ఏడాది జులైలో చైనా అధ్యక్షుడిని కలిసేందుకు బీజింగ్ వెళ్లారు.
వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలిలో కిసింజర్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన విన్‌స్టన్ లార్డ్ ఆయన మృతిపట్ల స్పందించారు.
“ప్రపంచం అవిశ్రాంత శాంతి యోధుడిని కోల్పోయింది” అని అన్నారు.
రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో, “జాతీయ ప్రయోజనాలను చేకూర్చే గొప్ప వ్యక్తిని అమెరికా కోల్పోయింది. హెన్రీ ఏడు దశాబ్దాలకు పైబడిన తన ప్రస్థానంలో ప్రపంచంలో అమెరికా పాత్రను కీలకంగా మార్చడంలో ఎంతో కృషి చేశారు. సంక్షోభ సమయాల్లో జాతీయ సమైక్యతను పరిరక్షించారు, దార్శనికులుగా పుస్తకాలను రాయడమే కాక, ప్రపంచ నేతలకు సలహాలు అందిస్తూ, జాతీయ, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపర్చడంలో భాగమయ్యారు” అన్నారు.
ఇవి కూడా చదవండి..
- నవయుగ: హిమాచల్‌లో ప్రమాదం జరిగిన సొరంగాన్ని నిర్మిస్తోన్న ఈ హైదరాబాద్ కంపెనీపై వివాదాలేంటి?
- జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?
- విడాకులకూ పెళ్లంత ఘనంగా మేళతాళాలతో వేడుక, ఈ తండ్రి ఎందుకిలా చేశారంటే....
- ఇజ్రాయెల్: శిథిలాల కింద కాళ్లకు లోహపు వైర్లతో నగ్నంగా మహిళ శవం.. మరో చోట 20 మంది పిల్లలను బంధించి దహనం చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














