సిక్కు నాయకుడి హత్యకు భారతీయుడి కుట్ర: అమెరికా అధికారుల ఆరోపణ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిల్ మెక్‌కాజ్‌లాండ్
- హోదా, బీబీసీ న్యూస్, న్యూయార్క్
సిక్కులకు ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తున్న ఒక అమెరికా పౌరుడిని న్యూయార్క్‌లో హత్యచేసే కుట్రను అడ్డుకున్నట్లు అమెరికా వెల్లడించింది.
ఈ కేసుకు సంబంధించి భారత పౌరుడు నిఖిల్ గుప్తాపై ఆరోపణలు మోపారు. ఆరోపణ పత్రంలో అతడికి ఒక భారత ప్రభుత్వ ఉద్యోగి ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపించారు.
లక్ష డాలర్ల(రూ.83.32 లక్షలు)తో నిఖిల్ గుప్తా ఓ హిట్‌మ్యాన్‌ను ఈ హత్య కోసం నియమించుకున్నట్లు అమెరికా వెల్లడించింది.
ఈ హిట్ మ్యాన్ కూడా అండర్ కవర్ ఫెడరల్ ఏజెంట్ అని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
52 ఏళ్ల నిఖిల్ గుప్తా ప్రస్తుతం జైలులో ఉన్నారు. అతడిపై మోపిన నేరారోపణ రుజువైతే 20 ఏళ్లవరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంది. మరోవైపు ఈ హత్యకు కుట్ర భారత్ నుంచే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, ఇంతకీ హత్యాయత్నం ఏ వ్యక్తి మీద జరిగిందన్నది కోర్టు పత్రాల్లో పేర్కొనలేదు. అయితే, అమెరికా మీడియా మాత్రం అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న సిక్కు వేర్పాటువాది అయిన గురుపట్వంత్ సింగ్ పన్నూ పైనే హత్యాయత్నం జరిగినట్లుగా చెప్తోంది.
ఈ విషయంలో అమెరికా వ్యక్తంచేసిన భద్రతాపరమైన ఆందోళనలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఇదివరకే భారత ప్రభుత్వం వెల్లడించింది.
ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరాన్ని తాజా అభియోగం నొక్కి చెప్తోందని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు.
అభియోగపత్రం దాఖలు చేసిన వెంటనే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల స్థాయిలో లేవనెత్తినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ విషయంలో భారత అధికారులు ‘విస్మయం, ఆందోళన’ వ్యక్తం చేసినట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, US DEPARTMENT OF JUSTICE

ఫొటో సోర్స్, Getty Images
పన్నూ ఏమన్నారు?
ఈ కుట్రపై బీబీసీతో గురు పట్వంత్ సింగ్ పన్నూ మాట్లాడుతూ, “ సీమాంతర ఉగ్రవాద పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందా?” అని ప్రశ్నించారు.
“నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన వారు రా ఏజెంట్లు లేదా ఇంకెవరైనా సరే, చట్టం నుంచి తప్పించుకోలేరు” అన్నారు.
భారత్‌లో సిక్కుల జనాభా 2 శాతం వరకూ ఉంటుంది. అయితే, కొన్ని సిక్కు సంస్థలు తమకు ప్రత్యేక దేశం కావాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.
1980లలో పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమం తార స్థాయికి చేరుకుంది, అయితే, కాలక్రమేణ అది తగ్గిపోయింది. ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు ఉద్యమానికి దూరంగా ఉంటున్నాయి.
అయితే, పశ్చిమ దేశాలలతోపాటు భారత్‌లోనూ ఇలా వినిపించే డిమాండ్లపై భారత్ గట్టిగానే స్పందిస్తూ వస్తోంది.
అరోపణ పత్రంలో ఏముంది?
‘‘సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌ను తరచూ చేసే భారత మూలాలున్న ఒక అమెరికా పౌరుడిని న్యూయార్క్ సిటీలో హత్య చేసేందుకు ఆ నిందితుడు భారత్‌లోని వ్యక్తులతో చేతులు కలిపాడు’’ అని అమెరికా అటర్నీ డామియన్ విలియమ్స్ చెప్పారు.
‘‘అమెరికా గడ్డపై అమెరికా పౌరులను ఇలా హత్యచేసే కుట్రలను మేం అసలు సహించం’’ అని ఆయన అన్నారు.
మే నెలలో నిఖిల్ గుప్తా, భారత ప్రభుత్వ అధికారిని దిల్లీలో కలుసుకున్నారని, ఈ హత్య గురించి వారిద్దరూ చర్చించారని ఆరోపణ పత్రంలో రాశారు.
“మనం లక్ష్యాలను చేధిస్తాం” అన్న మెసేజ్‌ను ఆ అధికారికి పంపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
నిఖిల్ గుప్తా క్లయింట్‌లా నటిస్తూ టార్గెట్‌ను కలుసుకుని, అతడిని అనువైన ప్రాంతానికి తీసుకొచ్చి, హత్య చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపణ పత్రంలో ఉంది.
అందులో..ఈ హత్యకోసం అతడు న్యూయార్క్‌లో ఒక హిట్‌మ్యాన్‌ను కలవాలని అనుకున్నాడు. బదులుగా, అండర్ కవర్‌లో ఉన్న లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఒకరు లక్ష డాలర్ల కోసం ఈ హత్య చేసేందుకు అంగీకరించాడు.
ముందుగా 15 వేల డాలర్లు అసోసియేట్ ద్వారా జూన్ 9న గుప్తా అతడికి చెల్లించాడని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయని ఆరోపణ పత్రంలో ప్రస్తావించారు.
తరువాతి నెలలో చెక్ రిపబ్లిక్‌లో అతడిని అరెస్ట్ చేశారు. అక్కడే అమెరికాకు అప్పగించేందుకు ఎదురుచూస్తున్నారు.
గురు పట్వంత్ సింగ్ పన్నూ సిక్కుల వేర్పాటు అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు సహచరుడు. ఈ ఏడాది జూన్‌లో వాంకోవర్ శివారులోని సిక్కు దేవాలయం వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
నిజ్జర్ హత్య జరిగిన కొద్దిసేపటికి, నిఖిల్ గుప్తా మొబైల్‌కు భారత అధికారి నుంచి వీడియో క్లిప్ వచ్చింది. అందులో వాహనంలో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఉంది.
అనంతరం, ఆ అధికారి నిఖిల్ గుప్తాకు టార్గెట్ చిరునామాను పంపినట్లు ఆరోపణ పత్రంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ వాఖీ మహిళా గొర్రెల కాపరుల ప్రత్యేకత ఏంటి... వీరు ఎందుకు కనిపించకుండా పోతున్నారు?
- హిమాలయాల వద్ద సొరంగాల నిర్మాణం ప్రమాదకరమా... సిల్క్యారా చెపుతున్న పాఠమేంటి?
- టన్నెల్ ప్రమాదం: సొరంగంలో తన తోటి వారికి గబ్బర్ సింగ్ ఎలా ధైర్యం చెప్పారు, ఆయన గురించి ప్రధాని ఏమన్నారు
- తెలంగాణ ఎన్నికలు: పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎందరు, యువ ఓటర్ల సంఖ్య ఎంత... మీరు తెలుసుకోవాల్సిన 9 ఆసక్తికర అంశాలు
- క్లియోపాత్రాకు ఇష్టమైన ఊదారంగు దుస్తులు వేసుకున్నందుకు స్నేహితుడిని చంపించిన రోమన్ చక్రవర్తి... బంగారం కన్నా ఖరీదైన ఆనాటి 'పర్పుల్ కలర్ కథేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














