నీలి రంగు ఎల్ఈడీ కాంతితో ధగధగలాడిన స్డేడియం.. అక్కడ మ్యాచ్ చూసే అనుభవమే వేరు

అమెరికాలో 1,07,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న అతి పెద్ద మిషిగన్ స్టేడియం

ఫొటో సోర్స్, MICHIGAN PHOTOGRAPHY

ఫొటో క్యాప్షన్, అమెరికాలో 1,07,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న అతి పెద్ద మిషిగన్ స్టేడియం
    • రచయిత, క్రిస్ బరన్యూక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలో అతి పెద్ద స్టేడియం, లక్ష మందికి పైగా ఫుట్‌బాల్ అభిమానుల సందడి. మైదానం మొత్తం నీలి కాంతిలో తడిసిపోయింది. స్టాండ్‌లలో ఉన్న అభిమానులు తమ ఫోన్‌లను పట్టుకుని, పాలపుంతలో నక్షత్రాల సమూహాన్ని భూమిపైనే సృష్టించారు.

“ఇది మా టీమ్. ఇది మిషిగన్.” ప్రేక్షకుల హర్షద్వానాలు, అరుపులు కేకల మధ్య అక్కడున్న పెద్ద స్క్రీన్ మీద ఓ వీడియో ప్రత్యక్షమైంది.

సెప్టెంబరు 16న మిషిగన్ స్టేడియంలో ప్రారంభించిన కొత్త విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌తో ఉత్సాహం మరింత పెరిగింది. రకరకాల రంగుల్లో వచ్చిపోయే వెలుగుల మెరుపులు, సంగీతానికి అనుగుణంగా మారిపోయే విద్యుత్ కాంతులతో ఈ స్టేడియం వెలుగులీనింది.

యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ జట్టు రంగులు పసుపు పచ్చ, నీలం. దీనికి అనుగుణంగా లైట్‌షోను డిజైన్ చేశారు.

“ఇది మైదానంలో కూర్చుని మ్యాచ్ చూడటంపై వంద శాతం ప్రభావం చూపిస్తుంది” అని జేక్ స్టాకర్ చెప్పారు.

“మరో ఉత్సాహభరిత అంశం ఏంటంటే, మీరు ఇంట్లో సోఫాలో కూర్చుని ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాల్సిన అవసరం లేదు. ఆ అనుభవం ఇక్కడ అమోఘంగా లభిస్తుంది” అని అన్నారు.

కారణం, ఇతర స్టేడియంలకు భిన్నంగా మిషిగన్ స్టేడియంలో అత్యాధునిక లైట్ ఎమిటింగ్ డయోడ్స్ (ఎల్ఈడీ) లైట్స్‌షో ఉంది.

నీలి రంగు ఎల్ఈడీ కాంతిని పుట్టించడం చాలా కష్టం.

ఫొటో సోర్స్, DEJAN NASTESKI

ఫొటో క్యాప్షన్, నీలి రంగు ఎల్ఈడీ కాంతిని పుట్టించడం చాలా కష్టం.

ప్రపంచంలోనే ఇది మూడో అతి పెద్ద స్టేడియం. దీన్ని నీలి రంగు ఎల్ఈడీల వెలుగులతో దేదీప్యమానం చేయడంతో టెక్నాలజీ మాయ ఏంటో అనుభవంలోకి వచ్చింది. నీలి కాంతిని వెదజల్లే కాంతిమంతమైన ఎల్ఈడీలను 1990లలో కనుక్కున్నారు. ఈ సాంకేతికతను కనుక్కున్న శాస్త్రవేత్తలకు తర్వాతి కాలంలో నోబెల్ బహుమతి వచ్చింది.

ఎల్ఈడీలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే చౌకగా, ఇంకా ఎక్కువ విద్యుత్‌ ఆదా చేసేవని పరిశోధకులు చెబుతున్నారు. వీధి దీపాలతో మొదలు పెడితే వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్ల వరకూ ప్రతీ దాన్ని అవి విప్లవాత్మకంగా మార్చేశాయి.

మిషిగన్ స్టేడియంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన ఎల్ఈడీలతో రకరకాల రంగుల్ని సృష్టిస్తారని సీనియర్ రీసర్చ్ ఇంజనీర్ బ్రాడ్ స్లెష్‌మాన్ చెప్పారు. ఈ మూడు రంగులతో అనేక రంగుల విద్యుత్ కాంతుల్ని సృష్టించవచ్చు.

"మిషిగన్‌లో మనం చూస్తున్న రంగులు కళా ప్రదర్శనలకు, చివరకు హైస్కూల్ స్థాయిలోనూ ఉపయోగించే పరిస్థితి రావచ్చు అని స్లెష్‌మాన్ అన్నారు.

అమెరికాలోని పట్టణాలు, నగరాల్లో ప్రధాన ఈవెంట్లు, ప్రత్యేక సందర్భాల్లో ల్యాండ్ మార్క్ లాంటి వాటికి, చివరకు వాటర్ టవర్‌లకు కూడా ఎల్ఈడీ లైటింగ్ అమర్చుతున్నారు. రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి పింక్ కలర్ లైట్లను వెలిగిస్తున్నారు.

గత నెలలో ప్రారంభించిన లాస్ వెగస్‌ గోళంలోఎల్ఈడీలను అద్భుతంగా ఉపయోగించారు. లక్షల సంఖ్యలో అమర్చిన ఎల్ఈడీలు మీరు ఊహించగలిగే ఏదైనా దృశ్యాన్ని సృష్టించగలవు అలాగే బయటి భాగాన్ని మార్చేయగలవు, లోపలున్న అనేక స్క్రీన్లపై వెలుగులు నింపగలవు.

ఈ ఏడాది ప్రారంభించిన లాస్‌వెగస్ స్పియర్‌ను వెలుగులతో నింపిన లక్షల కొద్ది ఎల్ఈడీలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ప్రారంభించిన లాస్‌వెగస్ స్పియర్‌ను వెలుగులతో నింపిన లక్షల కొద్ది ఎల్ఈడీలు

1970, 80లలో ఎల్ఈడీలు అంతగా ఉపయోగం లేనివని, పనికి రానివని తోసేశారు. “చిన్నగా ఉండే ఈ బొమ్మ లైట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే అభిప్రాయం అప్పట్లో ఇఉండేది” అని క్రీ ఎల్ఈడీ లైట్ల సంస్థలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ పాల్ షెడిట్ అన్నారు.

అయితే, ఇంజనీర్లు మరింత కాంతిని వెదజల్లే ఫోటాన్లు, ఎల్ఈడీలను ఉత్పత్తి చేసినప్పుడు ఆ అభిప్రాయం మారిపోయింది. ఎల్ఈడీ పరికరంలోని ఎలక్ట్రాన్లలోని కణాలను ప్రతికూల దిశలో చార్జ్ చేసినప్పుడు అందులో అధిక శక్తి స్థితి తక్కువ స్థితికి పడిపోయినప్పుడు ఎల్ఈడీలు కాంతిని ప్రసారం చేస్తాయి.

ఈ ప్రక్రియ కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. రకరకాల పదార్థాలను ఉపయోగించి ఎల్ఈడీ నుంచి విడుదలయ్యే కాంతి తరంగ ధైర్ఘ్యం, రంగును సర్దుబాటు చెయ్యవచ్చు.

అయితే, ఈ రంగుల్లో నీలం రంగును విడుదల చెయ్యడం కొంత కష్టం. ఎందుకంటే ఆ రంగును ఉత్పత్తి చెయ్యడానికి అవసరమైన కీలక పదార్ధం గాలియం నైట్రైడ్, దీన్ని లోపరహితంగా తయారు చేయడం కష్టం.

కానీ, నీలం శక్తిమంతమైన, ఎక్కువ శక్తి ఉన్న రంగు. అందుకే టీవీ డిస్‌ప్లేలలోని అన్ని ఇతర రంగులకు ఆధారంగా నీలి రంగు ఎల్ఈడీలను ఉపయోగించవచ్చు, ఉదాహరణకు ప్రతి పిక్సెల్‌లో మూడు నీలి రంగు ఎల్ఈడీలు ఉంటాయి. అయితే, వీటిలో రెంటిని ఫిల్టర్ చేస్తారు లేదా ఎరుపు, ఆకుపచ్చను ఉత్పత్తి చేసేలా సరి చేస్తారు.

తెలుపు రంగు వెదజల్లే ఎల్ఈడీలకు కూడా నీలి రంగు ఎల్ఈడీలే అధారం.

అయినప్పటికీ కొత్త ఎల్ఈడీ సాంకేతికత మరి కొన్ని మార్పుల కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఇది మరింత ప్రభావవంతంగా తయారు అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చౌకగా లభించే ప్రకాశవంతమైన నీలి రంగు ఎల్ఈడీల మీద పరిశోధన చేస్తున్న డాన్ కాంగ్రివ్.

ఫొటో సోర్స్, CONGREVE

ఫొటో క్యాప్షన్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చౌకగా లభించే ప్రకాశవంతమైన నీలి రంగు ఎల్ఈడీల మీద పరిశోధన చేస్తున్న డాన్ కాంగ్రివ్.

డాన్ కాంగ్రివ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని సైంటిస్టులు కాల్షియం టైటానియం ఆక్సైడ్ స్ఫటికాలతో తయారు చేసిన ఎల్ఈడీలపై పని చేస్తున్నారు. కాల్షియం టైటానియం ఆక్సైడ్ చౌక, వీటిని తయారు చెయ్యడం సులభం. వాటిని ఎలాగైనా మార్చుకోవచ్చని కాంగ్రివ్ చెప్పారు. ”మీరు కోరుకున్న రంగుతో పాటు లైటు వెదజల్లే కాంతి ఉపరితలం మీద కలిసేలా వాటిని ఉపయోగించవచ్చు” అని ఆయన అన్నారు.

కాల్షియం టైటానియం ఆక్సైడ్ ఎల్ఈడీలను స్థిరంగా ఉంచడం కష్టం. అవి విరిగిపోతూనే ఉంటాయి.

"మేము వాటిని మడత పెడతాం, పొడవు పెంచుతాం. అవి త్వరగా పగిలిపోతాయి" అని కాంగ్రివ్ చెప్పారు. ఈ సమస్యను అధిగమిస్తామని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఈ ప్రయోగాల్లో పాల్గొంటున్న ఆయన సహచరులు గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ ఎల్ఈడీల స్థిరత్వాన్ని మెరుగుపరిచారు.

ఇవి పగిలిపోకుండా, స్థిరంగా ఉండే స్థాయికి చేరితే, పెరోవ్‌స్కైట్ ఎల్ఈడీలను అనేక పరికరాలలో ఉపయోగించవచ్చని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని మెటీరియల్ ఫిజిసిస్ట్ జాన్ బకెరిడ్జ్ చెప్పారు.

అమెరికా బయటకు వస్తే, జపాన్‌పరిశోధకులు ఇటీవల నీల రంగు ఎల్ఈడీలతో ముందుకొచ్చారు, ఇది కేవలం ఒక చిన్న ఏఏ బ్యాటరీతో 1.47 వోల్ట్‌ల విద్యుత్ కాంతిని సరఫరా చెయ్యగలదు. సాధారణంగా మీకు కనీసం 4 వోల్ట్‌లు అవసరం. "ఇది ఇంజినీరింగ్ ఫీట్‌గా బాగుంది" అని కాంగ్రివ్ చెప్పారు.

జపాన్ వాళ్లు కనుక్కున్న నీలి రంగు ఎల్ఈడీలో ఫోటాన్లను ఉత్తేజిత పరిచేందుకు ఫిజిక్స్ సూత్రాలను ఉపయోగించారు. సంప్రదాయ ఎల్ఈడీలో విద్యుత్ ప్రసరించినప్పుడు లోపలి వస్తువులు కాంతిని వెదజల్లడానికి కొంత సమయం తీసుకుంటాయి. జపాన్ బృందం ఈ సమయాన్ని తగ్గించింది. విద్యుత్ ప్రసరించగానే కాంతిని వెదజల్లేలా లోపలి పరికరాల్లో మార్పులు చేసింది. తాము చేసిన ప్రయోగాల గురించి సెప్టెంబర్‌లో ఓ పేపర్‌ను ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)