నవయుగ: హిమాచల్‌లో ప్రమాదం జరిగిన సొరంగాన్ని నిర్మిస్తోన్న ఈ హైదరాబాద్ కంపెనీపై వివాదాలేంటి?

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజులకు సురక్షితంగా బయటపడ్డారు.
ధరాసు నుంచి యమునోత్రి వరకు వేస్తున్న రహదారిలో భాగమైన సిల్క్యారా-బార్కోట్ సొరంగంలోని కొంత భాగం నవంబర్ 12వ తేదీ ఉదయాన కూలిపోయింది.
కూలిపోయిన భాగానికి అవతలి వైపు ఉన్న 41 మంది కార్మికులు రెండు వారాలకు పైగా సొరంగంలోనే ఇరుక్కుపోయారు.
నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా-బార్కోట్ సొరంగం నిర్మాణం గురించి, ఆ నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీ గురించి, భద్రతా నిబంధనలను పట్టించుకోకపోవడం గురించి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) ప్రకారం, 134వ నంబర్ జాతీయ రహదారి పరిధిలోకి వచ్చే ఈ సొరంగం పనులను నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చేస్తోంది.

ఫొటో సోర్స్, ANI
నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నేపథ్యం
హైదరాబాద్‌కు చెందిన నవయుగ గ్రూప్ సంస్థలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఒక భాగం. ఈ కంపెనీ నౌకాశ్రయాలు, రహదారుల నిర్మాణం, విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులపై పనిచేస్తుంది.
సిల్క్యారా సొరంగంలో తప్పించుకునేందుకు ఎలాంటి మార్గాలు (ఎస్కేప్ ప్యాసేజ్) లేవని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఒకటిన్నర కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన సొరంగంలో అత్యవసర నిష్క్రమణ మార్గాలు ఉండాలి అని రాయిటర్స్ వెల్లడించింది.
రోడ్డు లేదా రైలు మార్గాలకు కలిసే పొడవైన సొరంగాల వద్ద చిన్న సొరంగాలు ఉంటాయి. వీటిని ఎస్కేప్ ప్యాసేజ్ లేదా సురక్షిత నిష్క్రమణ మార్గాలుగా పిలుస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి, వారికి సహాయం అందించడానికి వీలుగా ఈ చిన్న సొరంగాలను ఏర్పాటు చేస్తారు.
ఈ కారణంగానే భారతీయ రైల్వే శాఖ, 111 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్- శ్రీనగర్ -బారాముల్లా రైలు లింక్ నిర్మాణ క్రమంలో 12.89 కిలోమీటర్ల పొడవైన ఎస్కేప్ టన్నెల్ (చిన్న సొరంగం)ను సిద్ధం చేసింది.
ప్రమాదం జరిగిన తర్వాత ఏర్పాటైన దర్యాప్తు బృందంలోని సభ్యుడు అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదని చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా-బార్కోట్ సొరంగం నిర్మాణంతో పాటు 0.33 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్ రోడ్, 'ఎస్కేప్' టన్నెల్ నిర్మాణం గురించి కూడా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, ANI
నిపుణులు ఏం అంటున్నారు?
ప్రమాదానికి కారణాలు, భవిష్యత్‌లో ఇలాంటివి నివారించడానికి ఏం చేయాలో శోధించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలోని ఒక నిపుణుడితో వార్తా ఏజెన్సీ మాట్లాడింది.
సహాయక కార్యక్రమాలు ముగిసిన తర్వాత నిర్మాణంలోని లోపాలపై సమగ్ర విచారణ జరుపుతామని కమిటీ సభ్యుడు తెలిపారు.
నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 29 సొరంగాలను ఆడిట్ చేయాలని భారత ప్రభుత్వం కోరింది.
2018లో సిల్క్యారా-బార్కోట్ సొరంగం నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 111.69 కోట్లు అని వెల్లడించింది. నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తారని తెలిపింది.
అయితే, ఈ ప్రాజెక్టు 2024 మధ్య నాటికి పూర్తవుతుందని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ చెబుతోంది.
హిందువులకు పవిత్ర క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ నిర్మించే చార్‌ధామ్ మహామార్గ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న 889 కి.మీ పొడవైన చార్‌ధామ్ హైవే ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 12 వేల కోట్లు.

ఫొటో సోర్స్, ANI
నవయుగ ఇంజినీరింగ్ ఏమేం పనులు చేసింది?
సిల్క్యారా టన్నెల్ ప్రాజెక్ట్ ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, ట్రాన్స్‌ఫర్ బాధ్యతను నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ తీసుకుంది.
ఒడిశాలోని ఆస్థ్రాంగా, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం ఓడరేవులను నిర్మించడంతోపాటు ముంబయి-పుణే ఎక్స్‌ప్రెస్ వే, బ్రహ్మపుత్రపై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణ పనులను చేస్తున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.
నవయుగ వెబ్‌సైట్ ప్రకారం, భారత్‌లోని పొడవైన ఖాజీగుండ్-బనిహాల్ హైవే ప్రాజెక్ట్‌లోనూ ఈ కంపెనీ పని చేస్తోంది.
నీటిపారుదల ప్రాజెక్టులు, సముద్ర మౌలిక సదుపాయాల కల్పన, జలవిద్యుత్, థర్మల్ పవర్ ప్రాజెక్టుల రంగంలోనూ నవయుగ కంపెనీ ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జలవిద్యుత్ ప్లాంట్, పశ్చిమ బెంగాల్‌లోని 500 మెగావాట్ల ఫరక్కా థర్మల్ ప్రాజెక్ట్‌ను నవయుగ కంపెనీ చేపట్టింది.
థానేలో స్మృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదం జరిగిన మూడు నెలల తర్వాత ఈ ఉత్తరకాశీ ప్రమాదం సంభవించింది. ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదంలో 20 మంది చనిపోయారు. క్రేన్ మీద పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణ నష్టానికి కారణం కావడం, గాయపరచడం, ఇతరుల భద్రతకు హాని కలిగించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఈ కంపెనీ అధికారులపై కేసు నమోదు చేశారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు చేస్తోన్న రెండు కంపెనీల్లో నవయుగ ఇంజనీరింగ్ ఒకటి. రెండో కంపెనీ పేరు వీఎస్‌ఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
నవయుగ కంపెనీ చేపట్టిన అనేక కాంట్రాక్టుల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ ప్రాజెక్టులను రద్దు చేసింది .
కంపెనీ ముందు అనేక సవాళ్లు
ఈ ప్రాజెక్టులు రద్దు కావడం నవయుగ కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రముఖ వార్తా పత్రిక ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. బ్యాంకుల నుంచి ఈ కంపెనీ వందల కోట్ల రుణాలు తీసుకుందని ఎకనమిక్ టైమ్స్ రాసింది.
ఉత్తరకాశీ ఘటన తర్వాత సోషల్ మీడియాలో అదానీ గ్రూప్‌పై కూడా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నవయుగ ఇంజనీరింగ్‌లో అదానీ గ్రూప్‌కు వాటా ఉందని పేర్కొన్నారు.
ఆ తర్వాత, ఉత్తరకాశీ టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ కలిసి మరో ప్రాజెక్టు మీద పనిచేస్తున్నాయి.
ఈ విషయాలన్నింటిపై స్పందించాల్సిందిగా హైదరాబాద్‌లోని నవయుగ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కంపెనీ ప్రతినిధికి ఈ-మెయిల్ కూడా పంపించింది.
వారివైపు నుంచి సమాధానం రాగానే ఈ కథనంలో దాన్ని చేర్చుతాం.
ఇవి కూడా చదవండి:
- క్లియోపాత్రాకు ఇష్టమైన ఊదారంగు దుస్తులు వేసుకున్నందుకు స్నేహితుడిని చంపించిన రోమన్ చక్రవర్తి... బంగారం కన్నా ఖరీదైన ఆనాటి 'పర్పుల్ కలర్ కథేంటి?
- రింకూ సింగ్: నాడు బీసీసీఐ నిషేధించిన ఆటగాడే నేడు ‘నయా ఫినిషర్’ అయ్యాడా?
- తెలంగాణ ఎన్నికలు: ఆసక్తికర పోరు, మారుతున్న సన్నివేశాలు
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా..
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










