థాయ్‌లాండ్‌లో పెళ్లికూతురు సహా నలుగురిని కాల్చి చంపిన పెళ్లికొడుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీంగ్ & థాన్యారత్ డోక్సోన్
- హోదా, సింగపూర్, బ్యాంకాక్
థాయ్‌లాండ్‌లో ఓ పెళ్లికొడుకు పెళ్లికూతురిని, ఆమె తల్లిని, పెళ్లికూతురు సోదరిని, కాల్చిచంపి, తానూ కాల్చుకుని చనిపోయినట్టు పోలీసులు బీబీసికి తెలిపారు.
పారా అథ్లెట్ అయిన 29 ఏళ్ళ చతురంగ్ సుక్‌సుక్, 44 ఏళ్ళ కాంచన పచున్‌త్యుక్ నవంబరు 25 శనివారం ఈశాన్య థాయ్‌లాండ్‌లో వివాహం చేసుకున్నారు.
అయితే చతురంగ్ వివాహ వేడుక నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయి తుపాకీతో తిరిగొచ్చి తన భార్యను, 62 ఏళ్ల ఆమె తల్లిని, పెళ్లికూతురి 38 ఏళ్ల సోదరిని కాల్చిచంపారు.
గురితప్పిన బుల్లెట్లు ఇద్దరు అతిథులకు కూడా తగలడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, వారిలో ఒకరు మరణించారు.
‘‘ఆ సమయంలో చతురంగ్ మత్తులో ఉన్నాడు’’ అని పోలీసులు బీబీసీకి తెలిపారు. కానీ ఆయన ఇదంతా ఎందుకు చేశారనేది అస్పష్టంగానే ఉంది. కిందటేడాదే ఆయన చట్టబద్ధంగా తుపాకీ, తూటాలు కొన్నారని పోలీసులు చెప్పారు.
పెళ్ళివేడుకలో వధూవరులిద్దరూ గొడవ పడినట్టు పార్టీకి వచ్చిన అతిథులు పోలీసులకు తెలిపారంటూ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
చతురంగ్ తనకు, పెళ్లికూతురుకు మధ్య ఉన్న వయోభేదంపైనా అభద్రతకు లోనయ్యారనే కథనాలూ వచ్చాయి. కానీ పోలీసులు ఇదంతా ఊహాగానమంటూ కొట్టిపారేశారు. తమకు స్పష్టమైన ఆధారాలు లభించాయని, త్వరలోనే కేసును ముగిస్తామని చెప్పారు.
చతురంగ్, కంచన్ పెళ్లికి మూడేళ్ల ముందు నుంచే సహజీవనం చేస్తున్నట్టు థాయ్ మీడియా తెలిపింది.
కిందటి సంవత్సరం ఇండోనేసియాలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్‌లో చతురంగ్ వెండిపతకాన్ని సాధించారు. థాయ్‌లాండ్‌లో డిసెంబరులో జరుగనున్న ప్రపంచ ఎబిలిటి స్పోర్ట్ గేమ్స్‌కు ఆయన ఎంపికవుతారని భావిస్తున్నారు.
థాయ్‌లాండ్ సరిహద్దు వద్ద గస్తీ కాసే పారామిలటరీ దళంలో పనిచేస్తున్నప్పుడు చతురంగ్ ఒక కాలు పోగొట్టుకున్నారు.
థాయ్‌లాండ్‌లో తుపాకీని కలిగి ఉండటం సర్వసాధారణ విషయం. అయితే ఇలా సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు. కిందటి నెలలో బ్యాంకాక్‌లోని విలాసవంతమైన మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
2022 అక్టోబరు లో థాయ్‌లాండ్ ఈశాన్య ప్రాంతంలో ఓ మాజీ పోలీసు 37 మంది పిల్లలను తుపాకీతోనూ, కత్తితోనూ దాడిచేసి చంపాడు.
ఇవికూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- సామూహిక సెక్స్, విచ్చలవిడి శృంగారం, మత్తు పదార్థాలు, విలాసవంతమైన విందు.. ప్రాచీన చక్రవర్తులు శ్రుతిమించి సుఖపడేవారా?
- షియా, సున్నీలు ఎవరు... ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య ఈ విభేదాలు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
- రాజస్థాన్ రాజకుటుంబాలు బీజేపీకి ఎందుకు దగ్గరవుతున్నాయి?
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఈ మహిళా అభ్యర్థుల ప్రత్యేకతలేంటి?














