ఇజ్రాయెల్-హమాస్: బందీల విడుదల తరువాత గాజా సిటీ ఆక్రమణకు మళ్ళీ దాడులు మొదలవుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ న్యూస్
గాజా సిటీలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు బహుశా చివరి దశలకు వచ్చేశాయి. హమాస్ బందీలుగా తీసుకెళ్లిన వారిలో కొందరిని విడిపించేందుకు ప్రస్తుతం అమలులోనున్న కాల్పుల విరమణ ఒప్పందంతో ఇజ్రాయెల్ సైన్యం దాడులు నాలుగు నుంచి తొమ్మిది రోజులు వరకూ వాయిదా పడే అవకాశముంది.
అయితే, హమాస్ ఎంత మంది బందీలను వదిలిపెట్టబోతోందనే దానిపై ఈ కాల్పుల విరమణ ఆధారపడి ఉంటుంది.
ఇది ముగిసిన వెంటనే, గాజా సిటీని నియంత్రణలోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ యుద్ధం మళ్లీ మొదలవుతుంది. ఇది మరొక వారం నుంచి పది రోజుల వరకూ కొనసాగే అవకాశముంది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంకేతాలు ఇస్తున్నట్లుగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దృష్టి మళ్లితే ఏం జరుగుతుంది?
హమాస్ ఎక్కడున్నా, వారిని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రతిన చేసింది. హమాస్ అగ్ర నాయకులు యాయా సిన్వర్, మహమ్మద్ దీఫ్ వేల మంది ఫైటర్లతో కలిసి ప్రస్తుతం దక్షిణ గాజాలో ఉన్నట్లు భావిస్తున్నారు. వీరి దగ్గరే పెద్దయెత్తున ఇజ్రాయెల్ బందీలు కూడా ఉండొచ్చు.
ఉత్తర గాజాలో చేసినట్లే దక్షిణ గాజాలోనూ ఇజ్రాయెల్ భీకర విధ్వంసం సృష్టిస్తే, అమెరికాతోపాటు పశ్చిమ దేశాలపై మరింత ఒత్తిడి పెరుగుతుందా?

ఫొటో సోర్స్, REUTERS
ప్రస్తుతం గాజాలోని 22 లక్షల మందిలో చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దక్షిణ గాజాకు వెళ్లారు. దీంతో అక్కడ మరో విధ్వంసాన్ని ఇజ్రాయెల్ సృష్టించబోతోందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఇప్పటికే అల్-మవాసి అనే ప్రాంతంలోని ఇసుక మైదానాల్లో తాత్కాలిక గుడారాల్లో వేల మంది పాలస్తీనా ప్రజలు గడుపుతున్న దృశ్యాలు మీడియాలో కనిపిస్తున్నాయి.
అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత, గాజాలో 17 లక్షల మంది తమ ఇళ్లను వదిలి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రస్తుతం వీరిలో చాలా మంది కిక్కిరిసిన తాత్కాలిక గుడారాల్లో జీవిస్తున్నారు.
పరిస్థితులు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. వేల మంది పాఠశాలలు, ఆసుపత్రులతోపాటు తాత్కాలిక గుడారాల్లో తల దాచుకుంటున్నారని వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
శీతాకాలం వర్షాలతో ముంచుకొస్తున్న వరదలు పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయి.
కొన్ని వారాల నుంచి ఇజ్రాయెల్ అధికారులు ఒక పరిష్కారం గురించి మాట్లాడుతున్నారు. ఈజిప్టు సరిహద్దుల్లోని మధ్యధరా తీరానికి సమీపంలోని అల్-మవాసి ప్రాంతానికి పౌరులను తరలించాలని, అక్కడ సురక్షితంగా ఉండొచ్చని వారు సూచనలు చేస్తున్నారు.
గత వారం ఇక్కడకు సమీపంలోని ఖాన్ యూనిస్‌పై కొన్ని కరపత్రాలను ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచింది. ఇక్కడ వైమానిక దాడులు జరుగబోతున్నాయని అందరూ పశ్చిమాన, సముద్రం వైపు వెళ్లాలని వీటిలో సూచించారు.
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి అవిచాయ్ అడ్రే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీ ఆప్తులను కోల్పోకుండా ఉండాలంటే అందరూ కలిసి అల్-మవాసి వైపు వెళ్లండి’’ అని సూచించారు.
అయితే, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి పక్కనే 20 లక్షల మందిని ఆశ్రయం పొందాలని సూచించడం ఎంతవరకూ సమంజసం? అసలు అల్-మవాసిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, ANADOLU
మ్యాప్‌ను పరిశీలిస్తే, పొలాలు, చెట్ల మధ్య ఇళ్లు ఉన్నట్లుగా అల్-మవాసి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ చెబుతున్న ఈ ప్రాంతం వెడల్పు 2.5 కి.మీ., పొడవు 4 కి.మీ.లు.
‘‘ఇది అందంగా, అక్కడక్కడా చెట్లతో కనిపించే ప్రాంతం. అయితే, అంత మందికి ఇది ఆశ్రయం ఇవ్వలేదు’’ అని పాలస్తీనా వ్యవహారాలపై ఇజ్రాయెల్‌కు సలహాదారుడిగా పనిచేసిన డాక్టర్ మైఖెల్ మిల్‌స్టెయిన్ అన్నారు.
పరిస్థితులు ఇంకా దారుణంగా మారబోతున్నాయని సహాయక సంస్థలు కూడా చెబుతున్నాయి.
‘‘అది చాలా చిన్న ప్రదేశం’’ అని యూఎన్ఆర్‌డబ్ల్యూఏ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియెట్ టౌమా అన్నారు. ‘‘అక్కడ మీకు ఏమీ దొరకవు. ఎటు చూసిన ఇసుక దిబ్బలు, పామ్ చెట్లే కనిపిస్తాయి’’ అని ఆమె చెప్పారు.
లక్షల మంది నిరాశ్రయులను ఎలాంటి మౌలిక సదుపాయాలులేని ప్రాంతాలకు తరలించడంతో ఐక్యరాజ్యసమితి లాంటి సహాయక సంస్థలకు పెద్దయెత్తున సవాళ్లు ఎదురవుతాయి. ఇక్కడ అత్యవసర గుడారాలు ఏర్పాటు చేయడం కూడా కష్టం అవుతుంది.
గాజాలో ఇప్పటికే శరణార్థుల గుడారాలతో ఎనిమిది భారీ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి కొన్ని దశాబ్దాల కాలంలో కిక్కిరిసిన పట్టణాలుగా మారాయి. ఇక్కడ ఇలాంటి మరో శరణార్థి కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు ఐక్యరాజ్యసమితి కూడా సిద్ధంగా లేదు.
రఫా క్రాసింగ్ నుంచి పది కి.మీ.ల దూరంలోని అల్-మవాసికి సహాయక సామగ్రి అందేలా చూసుకునే బాధ్యత సహాయక సంస్థలదేనని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. అయితే, ఇది ఎలా సాధ్యం అవుతుందో వారు చెప్పడం లేదు.
మరికొన్ని సురక్షితమైన ప్రాంతాలు ఏర్పాటుచేసేందుకు ఇజ్రాయెల్‌తో అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నారు. బహుశా గాజాకు దక్షిణాన ఉండే ‘దహనియా’ ప్రాంతాన్నికూడా వారు పరిశీలిస్తూ ఉండొచ్చు.
శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన బందీల విడుదల ఒప్పందం ప్రకారం, గాజాలోకి రోజూ 200 ట్రక్కుల సహాయ సామగ్రిని ఇజ్రాయెల్ అనుమతించాలి.
అయితే, 18 ఐరాస విభాగాలు, స్వచ్ఛంద సంస్థల నవంబరు 16న విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రణాళికలను తోసిపుచ్చాయి.
‘‘అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయం లేకుంగా గాజాలో ప్రకటిస్తున్న ఇలాంటి ‘సురక్షిత’ ప్రాంతాల ఏర్పాటులో మేం పాలుపంచుకోం’’ అని ఆ ప్రకటనలో సహాయక సంస్థలు స్పష్టంచేశాయి.
ఇక్కడ హమాస్, పాలస్తీనా అథారిటీ సహా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు.
అల్-మవాసి పేరును నేరుగా ప్రస్తావించకుండా ఇజ్రాయెల్ ప్రతిపాదనలతో చాలా మంది ప్రాణాలకు ముప్పు పొంచివుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
దీనిపై సంతకం చేసిన వారిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ కూడా ఒకరు. ఇజ్రాయెల్ ప్రతిపాదనను విపత్తుకు సంకేతంగా ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
‘‘అంత మంది ప్రజలను సరైన మౌలిక సదుపాయాలు, సేవలు లేని చిన్న ప్రాంతంలో కిక్కిరిసేలా చేయడంతో అనారోగ్య ముప్పులు విపరీతంగా పెరుగుతాయి’’ అని టెడ్రోస్ చెప్పారు.
అయితే, ఇలాంటి పరిస్థితికి హమాస్ నేతలే కారణమని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. తాము దాడి చేయకూడదని భావించిన ప్రాంతాల్లో అల్-మవాసి కూడా ఒకటని వారు వివరించారు.
‘‘పరిస్థితులు దారుణంగా మారుతాయి. కానీ, వారు బతికే ఉంటారు’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ అన్నారు.
ఇజ్రాయెల్ దీన్ని వేరొక మార్గంలేని సైనిక చర్యగా భావిస్తోంది. గాజా సిటీలో హమాస్ పాతుకుపోయినట్లే, ఖాన్ యూనిస్, రఫాలోనూ సంస్థ ఫైటర్లు పెద్దయెత్తున ఉన్నట్లు చెబుతోంది. దాడికి ముందుగా పౌరులను అక్కడి నుంచి పంపించడమే తమ ముందున్న మానవతా మార్గమని అంటోంది.
‘‘అల్-మవాసిలో వర్షంలో గాజా ప్రజలు తడవడాన్ని ఇజ్రాయెల్ పౌరులు కూడా చూడలేరు. కానీ, ఇక్కడ వేరే మార్గం ఎక్కడుంది? వారిని ముట్టుకోకుండా హమాస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం ఎలా సాధ్యం?’’ అని విశ్రాంత మేజర్ జనరల్ యకోవ్ అమిడ్రోర్ అన్నారు.
మరికొన్ని వారాలు లేదా నెలలపాటు కిక్కిరిసిన ప్రాంతాల్లో శీతాకాల పరిస్థితుల్లో ప్రజలు జీవించాల్సిన రావడంతో ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది.
‘‘దక్షిణ గాజాలో మరో కొత్త ఆపరేషన్ మొదలుపెట్టడం, పెద్దయెత్తన ప్రజలకు ఆశ్రయం లేకుండా చేయడంతో ఇజ్రాయెల్‌పైనున్న సానుభూతి తగ్గే అవకాశముంది’’ అని పశ్చిమ దేశానికి చెందిన ఒక అధికారి నాతో చెప్పారు.
‘‘పశ్చిమ దేశాలు ఇంకెంత కాలం సహనంతో అన్నీ చూస్తూ ఊరుకుంటాయనేదే ప్రశ్న’’ అని ఆయన అన్నారు.
మరోవైపు అంతర్జాతీయ మద్దతు నెమ్మదిగా తగ్గుతుందని నెతన్యాహు ప్రభుత్వానికి కూడా తెలుసు. అలానే ప్రస్తుత తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత మళ్లీ దాడులు మొదలుపెట్టినప్పుడు పశ్చిమ దేశాలు మరింత ఒత్తిడి చేస్తాయని ఇజ్రాయెల్ అధికారులు కూడా అంటున్నారు.
2021 నుంచి 2023 మధ్య ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ ఇయాల్ హులాటా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సంధి ముగిసిన తర్వాత వచ్చే ఒత్తిడి ఇజ్రాయెల్‌ను అడ్డుకోలేదు’’ అని అన్నారు.
‘‘నెతన్యాహు ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడికి తలొగ్గకూడదని నేను అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు కూడా నాయకుల నుంచి అదే కోరుకుంటున్నారు’’ అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఒకవైపు శీతాకాలం ముంచుకొస్తుంటే తర్వాత దశకు ఇజ్రాయెల్ సిద్ధం అవుతోంది. ఇక్కడి పౌరులను ఎలా కాపాడుకోవాలో తేల్చుకోలేని స్థితిలో మరింత వేదనను అనుభవించేందుకు గాజా సిద్ధం అవుతోంది. బహుశా పరిస్థితులు ఇప్పటి కంటే మరింత దయనీయంగా మారవచ్చు.
ఇవి కూడా చదవండి
- రైతుబంధు పథకానికి, ఎన్నికల సంఘానికి ఏమిటీ సంబంధం? ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏం చేయచ్చు, ఏం చేయకూడదు...
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















