బందీల విడుదల: హమాస్ దాడిలో చనిపోయాడనుకున్న బాయ్‌ఫ్రెండ్‌ను ప్రాణాలతో టీవీలో చూసి ఉద్వేగానికి లోనైన థాయ్ మహిళ

- రచయిత, తన్యరట్ డొక్సోనె
- హోదా, బీబీసీ న్యూస్
అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడిలో తన బాయ్‌ఫ్రెండ్ చనిపోయాడనుకున్న మహిళ ఆయన బతికే ఉన్నారని తెలియడంతో తాము త్వరలో ఒక్కటవ్వబోతున్నామని ఆనందంతో చెప్పారు.
గాజా నుంచి శుక్రవారం విడుదల చేసిన 10 మంది థాయ్ బందీల్లో తన బాయ్‌ఫ్రెండ్ విచెయ్ కాలపత్ కూడా ఉన్నట్లు టీవీలో చూశానని కిట్టియా థాంగ్‌సెంగ్ బీబీసీతో చెప్పారు.
హమాస్ దాడుల్లో చనిపోయిన థాయ్ పౌరుల్లో విచెయ్ కూడా ఉన్నారని ఆమె మొదట అనుకున్నారు.
బందీలుగా ఉన్న విదేశీయుల్లో తన బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నట్లు కేవలం ఐదు రోజుల ముందు కచ్చితమైన సమాచారం వచ్చినట్లు ఆమె చెప్పారు.
అక్టోబర్ 7 దాడి జరిగిన రెండు రోజుల తర్వాత కిట్టియాకు విషాదకర వార్త తెలిసింది. చనిపోయిన 30 మంది థాయ్ పౌరుల్లో మూడేళ్లుగా ప్రేమిస్తున్న తన బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నట్లు ఆమె భావించారు.
పని కోసం ఇజ్రాయెల్ వెళ్లిన తన బాయ్‌ఫ్రెండ్ తిరిగి వచ్చిన తర్వాత వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, చనిపోయాడనుకుని బాధతో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
అయితే, అధికారికంగా విడుదల చేసిన చనిపోయిన వారి జాబితాలో విచెయ్ పేరు లేదు.
మరేదైనా సమాచారం తెలుస్తుందేమోనని వేయికళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో, గాజాలో బందీలుగా ఉన్న 26 మంది థాయ్ పౌరులలో తన బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నట్లు కిట్టియాకు గత వారం తెలిసింది.
బందీలను బోర్డర్ దగ్గరి నుంచి ఇజ్రాయెల్ ఆస్పత్రికి తరలిస్తున్న కారులో ప్రాణాలతో ఆయనను చూసిన అనంతరం ఆమె బీబీసీతో మాట్లాడారు.

''నాకు చాలా సంతోషంగా ఉంది. విడుదలయ్యే వారిలో ఆయన ఉంటారని అనుకోలేదు. మానసికంగా ఏదైనా ఇబ్బంది తలెత్తి ఉంటే ముందు దాని నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత థాయ్‌లాండ్‌కు రావొచ్చు'' అని కిట్టియా చెప్పారు.
''ఆయన కోసం నేను వేచి ఉండగలను. ఇప్పటికే చాలా కాలం నుంచి వేచివున్నా. ఇంకొంతకాలం కూడా ఉండగలను'' అన్నారు కిట్టియా.
ఈ దాడులతో దాదాపు 30 వేల మంది థాయ్ పౌరులు ఇబ్బందులకు గురయ్యారు. వారు ప్రధానంగా వ్యవసాయ రంగంలో పనిచేసేందుకు ఇజ్రాయెల్ వెళ్లారు.
శుక్రవారం విడుదలైన వారిలో తమ వారు ఉన్నారో లేదో తెలుసుకునేందుకు బందీల కుటుంబాలు ఉత్కంఠతో ఎదురుచూశాయి.
అక్టోబర్ 7వ తేదీ ఉదయం తాను చివరిసారి మాట్లాడినప్పుడు తన 26 ఏళ్ల కొడుకు నత్తపోన్ ఆన్‌కేవ్ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్తున్నానని చెప్పాడని థాంగ్‌కూన్ ఆన్‌కేవ్ చెప్పారు.
''విడుదలైన వారిలో నా కొడుకు కూడా ఉండాలని కోరుకుంటున్నా. నెల రోజుల నుంచి అదే బాధ'' అని ఆమె అన్నారు.
''నా కొడుకుతో పాటు థాయ్‌కి చెందిన ఇతర బందీలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. థాయ్ పౌరులను విడిపించేందుకు చర్చలు జరిపిన అధికారులందరికీ కృతజ్ఞతలు'' అన్నారామె.
''సమాచారం తెలుసుకోవడానికి నేను స్థానిక ప్రతినిధిని సంప్రదించాలి. బందీలుగా తీసుకెళ్లినప్పటి నుంచి భయంభయంగా ఉన్నాను'' అని అనుచా అంగ్‌కేవ్ భార్య, 28 ఏళ్ల వనిడా మార్సా అన్నారు.
''వాళ్లలో నా భర్త కూడా ఉంటే, నాకు చాలా సంతోషం'' అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మొదట 12 మంది థాయ్ బందీలను విడుదల చేసినట్లు థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి శ్రెట్ట తవిసిన్ చెప్పారు. కానీ, ఆ తర్వాత పది మందినే విడుదల చేసినట్లు ఇజ్రాయెల్-హమాస్‌కు మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి తెలిపారు.
థాయ్ జాతీయుల విడుదల నాలుగు రోజుల కాల్పుల విరమణలో భాగంగా గాజా నుంచి 50 మంది ఇజ్రాయెలీ బందీలను విడిపించేందుకు జరిగిన ఒప్పందానికి కాస్త భిన్నంగా ఉంది.
మొదటగా విడుదలైన బందీల్లో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. వారంతా మహిళలు, చిన్నారులే. వారితో పాటు ఫిలిప్పీన్స్ జాతీయుడు ఒకరు ఉన్నారు.
ఒప్పందంలో భాగంగా పాలస్తీనాకు చెందిన 39 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.
విడుదలైన బందీలు ఇజ్రాయెల్‌లో ఆస్పత్రికి తరలించిన తర్వాత 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, వారిని సంప్రదించేందుకు కుటుంబ సభ్యులకు కూడా రెండు రోజులు వీలుపడదని థాయ్‌లాండ్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
''విడుదలైన థాయ్ జాతీయులకు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు. వారిని త్వరగా థాయ్‌లాండ్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తుంది'' అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పాలస్తీనాకు చెందిన 39 మంది ఖైదీలను ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదల చేశారు. వారు రాళ్లు రువ్వడం నుంచి హత్యాయత్నం వరకూ అనేక నేరాల్లో నిందితులుగా ఉన్నారు.
ఒప్పందంలో భాగంగా విడుదలైన ఖైదీల్లో 24 మంది మహిళలు, 15 మంది టీనేజ్ బాలురు ఉన్నారు. వారిని ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బీటునియా చెక్‌పాయింట్ మీదుగా తీసుకెళ్లి విడుదల చేశారు.
ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 300 మంది మహిళలు, మైనర్ల నుంచి వారిని ఎంపిక చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటు వేసింది?
- సోవియట్ యుద్ధ విమానం మిగ్-21ను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ ఎలా దొంగిలించింది?
- రష్యా ఇచ్చిన ఏ బలంతో అమెరికాపై హిజ్బుల్లా కన్నెర్ర చేసింది? ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో హిజ్బుల్లా చేరుతుందా?
- ఇజ్రాయెల్- గాజా: ఆ వాట్సాప్ గ్రూప్ మూగబోయింది, ఎందుకంటే అందులో ఉన్నవారంతా చనిపోయారు
- గాజాపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తుందా, అరబ్ దేశాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














