వరల్డ్ కప్ ఫైనల్: ‘భారత్ ఓడిపోయిందని’ సంబరాలు చేసుకున్న కశ్మీరీ విద్యార్థులపై యూఏపీఏ ఎందుకు ప్రయోగించారు?

యూఏపీఏ చట్టం

ఫొటో సోర్స్, IMRAN ALI

ఫొటో క్యాప్షన్, అరెస్టయిన ఏడుగురు విద్యార్థుల తరపు లాయర్ షఫీఖ్ అహ్మద్
    • రచయిత, మజీద్ జహంగీర్
    • హోదా, గందేర్బల్ నుంచి, బీబీసీ హిందీ కోసం

నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి, ఆస్ట్రేలియా విజయంపై సంబరాలు చేసుకున్న ఏడుగురు కశ్మీరీ విద్యార్థులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది.

నవంబర్ 20వ తేదీన అరెస్టైన ఏడుగురు విద్యార్థులు ప్రస్తుతం పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. వారంతా గందేర్బల్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు.

విద్యార్థులపై ఈ చట్టం ప్రయోగించడం చర్చనీయాంశమైంది.

అయితే, ఉగ్రవాదులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రయోగించాల్సిన కఠిన చట్టాన్ని జర్నలిస్టులు, విద్యార్థులు, రాజకీయ-సామాజిక కార్యకర్తలపై ప్రయోగించడంపై గతంలోనూ విమర్శలు వచ్చాయి.

ప్రస్తుత కేసు విషయంపై బీబీసీతో ఐజీ మాట్లాడుతూ, కశ్మీరేతర విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడుగురు విద్యార్థులు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ, కశ్మీరేతర విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

గందేర్బల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, IMRAN ALI

ఫొటో క్యాప్షన్, గందేర్బల్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంతం

అరెస్టుపై విద్యార్థుల కుటుంబాలు ఏమంటున్నాయి?

అరెస్టైన వారిలోని ఒక విద్యార్థి సోదరుడు బీబీసీతో మాట్లాడుతూ, “ఈ ఘటన జరిగినప్పుడు నా సోదరుడు హాస్టల్‌లోని తన గదిలో ఉన్నాడు. ఈ ఘటనకు ముందు వారంతా వారి వారి గదుల్లో ఉన్నారని, ఒకరు మ్యాచ్ చూస్తున్నారని, మరొకరు చదువుకుంటున్నారని, మరొకరు వేరే ఏదో పనిలో ఉన్నారని, జరిగిన ఘటన గురించి తనకేమీ తెలీదని చెప్పాడు“ అన్నారు.

మరో విద్యార్థి కుటుంబ సభ్యుడు బీబీసీతో మాట్లాడుతూ “ఇది ఎలా జరిగిందో మా వాడికి తెలీదు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా అతడిని క్షమించి, అతడి భవిష్యత్తును కాపాడండి“ అని అభ్యర్థించారు.

అరెస్టయిన విద్యార్థుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.

మరొక విద్యార్థి కుటుంబం బీబీసీతో మాట్లాడుతూ, “ఒకవేళ మా పిల్లలు తప్పు చేసినప్పటికీ, యూఏపీఏ లాంటి కఠిన చట్టాలు వారిపై నమోదు చేస్తే, వారి భవిష్యత్తు నాశనం అవుతుంది“ అని ఆవేదన వ్యక్తంచేసింది.

అరెస్టయిన విద్యార్థుల తరఫు న్యాయవాది షాఫిఖ్ అహ్మద్ భట్‌ మాట్లాడుతూ, “న్యాయస్థానం పోలీసులను నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. మేం కూడా పోలీసు నివేదిక ప్రతిని ఇంకా అందుకోలేదు“ అన్నారు.

అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్

ఫొటో సోర్స్, IMRAN ALI

ఫొటో క్యాప్షన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్

అసలేం జరిగింది?

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత్‌కు మద్దతు పలికి కశ్మీరేతర విద్యార్థులతో ఘర్షణకు దిగినట్లు అరెస్టయిన విద్యార్థులపై ఆరోపణలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ తరువాత ఘర్షణకు కారణమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

వీరంతా గందేర్బల్‌లోని షెర్-ఇ-కశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్నారు.

నవంబర్ 20వ తేదీన ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.

యూఏపీఏ సెక్షన్ 13 ప్రకారం వీరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విధి కుమార్ బిర్ది ఈ కేసు విషయంపై బీబీసీతో మాట్లాడుతూ, “యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి ఈ ఏడుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో వీరు ఫైనల్ మ్యాచ్ తరువాత నినాదాలు చేస్తూ, అతడిపై బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నాం“ అని చెప్పారు.

కశ్మీరేతర విద్యార్థి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, “మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత్‌కు మద్దతు ఇచ్చినందుకు నన్ను బెదిరించారు. నిశ్శబ్దంగా ఉండమని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేశారు. ఈ నినాదాలతో నాతోపాటు కశ్మీరేతర విద్యార్థులమంతా భయభ్రాంతులకు గురయ్యాం“ అని పేర్కొన్నాడు.

యూఏపీఏ చట్టం కింద కేసు ఎందుకు నమోదైంది?

విద్యార్థులపై యూఏపీఏ కింద కేసు నమోదు చేయడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో గందేర్బల్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

అందులో, “యూఏపీఏ సెక్షన్ 13 ప్రకారం వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడం, ప్రచారం చేసినట్లుగా పరిగణించి ఈ కేసు నమోదు చేశాం. నిజానికి, ఉగ్రవాద ప్రణాళికేం కాదు, తక్కువ తీవ్రత కలిగిన చర్య కింద పరిగణించి, వీరిపై కేసు నమోదు చేశాం” అని ప్రకటనలో తెలిపారు.

భారత్‌కు మద్దతు తెలిపే వారిని భయభ్రాంతులకు గురిచేసే వారిపై యూఏపీఏ సెక్షన్ 13 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.

గందేర్బల్ జిల్లాలోని షుహామాలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి బీబీసీ బృందం వెళ్లగా, ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఈ అంశంపై మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారు.

ఈ యూనివర్సిటీలో సుమారు 50 మంది కశ్మీరేతర విద్యార్థులు ఉన్నారు.

తన వివరాలను గోప్యంగా ఉంచాలనే నిబంధనపై కశ్మీరీ సీనియర్ విద్యార్థి ఒకరు బీబీసీతో మాట్లాడారు.

ఆ రోజు భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితంపై ఒక విద్యార్థి ఆస్ట్రేలియా విజయంపై సంబరాలు చేసుకోగా, మిగిలినవారు భారత్ ఓటమి పట్ల బాధపడ్డారని, దీనిపై ఇద్దరి మధ్య వివాదం మొదలైందని చెప్పారు. ఈ కారణంగా ఉద్రిక్తతలు పెరిగి ఉండొచ్చని చెప్పారు.

“కేవలం క్రికెట్ మ్యాచ్‌తో ఒకరి విధేయతను నిర్ధరించలేం. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినప్పటికీ, వారిపై యూఏపీఏ లాంటి కఠిన చట్టాలను ప్రయోగించాలని లేదు. కేవలం ఒక్క మ్యాచ్ విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించకూడదు. ఇక్కడ, కశ్మీరీ, కశ్మీరేతర విద్యార్థులమంతా కలిసిమెలిసి ఉంటాం. అంతా కలిసి అన్ని పండుగలను జరుపుకుంటాం” అని చెప్పారు.

తన వివరాలను గోప్యంగా ఉంచాలనే నిబంధనపై మరో విద్యార్థి మాట్లాడుతూ, “మ్యాచ్ అయిపోయాక, కొంత మంది విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత పెద్దగా శబ్దాలు వినిపించాయి. ఆ తరువాత విషయం ఎక్కడివరకు వెళ్లిందో నాకు తెలీదు” అని చెప్పారు.

గందేర్బల్‌లోని షెర్-ఇ-కశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, IMRAN ALI

యూనివర్సిటీ అధికారులు ఏమన్నారు?

తన వివరాలను గోప్యంగా ఉంచాలనే నిబంధనపైనే యూనివర్సిటీ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడేందుకు ముందుకు వచ్చారు.

“వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున ఈ ఘటన జరిగింది. మ్యాచ్ పూర్తయిన తరువాత కశ్మీరీ, కశ్మీరేతర విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కశ్మీరీ విద్యార్థులు అలజడి సృష్టించారు. ఆ ఘటనకు సంబంధించి రికార్డయిన వీడియో పోలీసులకు అందింది. ఆ తరువాతే పోలీసులు చర్యలు తీసుకున్నారు” అని చెప్పారు.

యూనివర్సిటీ డీన్, ప్రొఫెసర్ మహ్మద్ తుఫైల్ బందే‌ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.

గత నాలుగేళ్లగా కశ్మీర్‌లో వందల మంది యూఏపీఏ కింద అరెస్టయ్యారు.

ఈ చట్టం కింద కేసు నమోదైతే 90 రోజుల్లోగా న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాలి. కొన్ని సందర్భాల్లో ఈ గడువును 180 రోజులకు పెంచేందుకు న్యాయస్థానం అనుమతినివ్వొచ్చు.

చట్ట విరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై యూఏపీఏ కింద చర్యలు తీసుకోవచ్చు.

ఇందులో ఉన్న కొన్ని సెక్షన్లలో నిందితులు ఏ తప్పు చేయలేదని తేలేంతవరకు బెయిల్‌ కూడా మంజూరు చేయని విధంగా కఠిన నిబంధనలు ఉన్నాయి.

జమ్మూ కశ్మీర్ హైకోర్టు సీనియర్ లాయర్, సామాజిక కార్యకర్త అయిన రియాజ్ ఖవర్ మాట్లాడుతూ, ఈ చట్టం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి కేవలం కశ్మీర్‌లోనే కాదు దేశవ్యాప్తంగా దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో ఉన్న అతిపెద్ద ఇబ్బందేంటంటే, నిందితులు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఇది తరచూ సాధ్యం కాదు” అన్నారు.

పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్టీ

ఫొటో సోర్స్, AFP

రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

కశ్మీర్‌లోని పలు రాజకీయపార్టీలు ఈ అంశంపై స్పందించాయి.

పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఐ(ఎం) నాయకులు, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ తరిగమి సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్)లో క్రికెట్ మ్యాచ్‌లో ఓ జట్టు విజయాన్ని వేడుక చేసుకున్నందుకు గాను యూఏపీఏ ప్రయోగించడం విస్మయానికి గురిచేసిందని స్పందించారు.

2016లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. శ్రీనగర్‌లోని ఎన్ఐటీలో వెస్టిండీస్, భారత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. కొంత మంది విద్యార్థులు భారత్ ఓటమిని వేడుక చేసుకోవడంతో అక్కడ కశ్మీరీ, కశ్మీరేతర విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. ఆ సమయంలో విద్యాసంస్థను కశ్మీర్ నుంచి తరలించాలని కశ్మీరేతర విద్యార్థులు డిమాండ్ చేశారు.

2021లో టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపుపై సంబరాలు చేసుకున్నారని శ్రీనగర్ మెడికల్ కాలేజీ స్టాఫ్, విద్యార్థులపై యూఏపీఏ కింద కేసు నమోదైంది.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ముఖ్యంగా కశ్మీర్‌లో ఇలాంటి ఉద్రికత్తలు ఏర్పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మ్యాచ్ జరిగిన ప్రతిసారి, ప్రజలు రోడ్లపై గుమిగూడొద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వస్తోంది.

యూఏపీఏ చట్టం

ఫొటో సోర్స్, Getty Images

యూఏపీఏ అంటే ఏంటి?

భారతదేశంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించే ఉద్దేశంతో 1967లో యూఏపీఏని తీసుకువచ్చారు.

దీని ప్రకారం, వ్యక్తి లేదా సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని ప్రభుత్వం గుర్తిస్తే, వారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తుంది. అంటే, ఎలాంటి విచారణ లేకుండానే ఎవరినైనా ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు.

యూఏపీఏలో చేసిన ఆరో సవరణలో చేర్చిన కొన్ని నిబంధనలపై అభ్యంతరం తెలుపుతూ అడ్వకేట్ సజల్ అవస్తి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

అందులో యూఏపీఏ సెక్షన్ 35, 36ల ప్రకారం ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు, నిర్దేశిత విధానాలు పాటించకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు. అన్న నిబంధనలపై పిల్‌లో ప్రస్తావించారు.

యూఏపీఏ సెక్షన్‌ 15 ప్రకారం, భయాందోళన వ్యాప్తి చేయడానికి, భారతదేశంలో లేదా విదేశాలలో లేదా ప్రజలలో ఏ వర్గంలోనైనా భయాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశపు ఐక్యత, సమగ్రత, వ్యక్తిగత భద్రత, ఆర్థిక భద్రత, సార్వభౌమత్వాన్ని హాని చేసే ప్రమాదకరమైన చర్యలను 'ఉగ్రవాద చర్యలు'గా పరిగణిస్తారు.

బాంబు పేలుళ్ల నుంచి నకిలీ నోట్ల చెలామణీ వరకు ప్రతీది ఇందులో నిర్వచించారు.

ఉగ్రవాది, ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇవ్వడానికి బదులుగా యూఏపీఏ సెక్షన్ 15లో వేటిని ‘ఉగ్రవాద చర్య’ల కింద పరిగణిస్తారో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)