పాప చనిపోయిందని ఖననం చేశారు, కానీ తవ్వి చూస్తే ప్రాణంతో ఉంది. ఆ తర్వాత..

వీడియో క్యాప్షన్, పాప చనిపోయిందని ఖననం చేశారు, కానీ తవ్వి చూస్తే ప్రాణంతో ఉంది

జమ్మూకశ్మీర్లోని బనీహాల్‌లో 21 ఏళ్ల షైరా బానుకు మే 22న నొప్పులు వచ్చాయి. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడామె ఆడపిల్లకు జన్మనిచ్చారు.

తర్వాత కాసేపటికి నవజాత శిశువు చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాంతో పాప తండ్రి బషారత్ అహ్మద్.. తన బిడ్డ చనిపోయిందనుకుని పాపను ఖననం చేశారు.

కానీ, కొంతసేపటి తర్వాత పాపను మళ్లీ గుంతలోంచి బయటకు తీసినపుడు ఆమె సజీవంగా ఉన్నట్టు షబారత్ గుర్తించారు.

‘‘నేను తీస్తున్నప్పుడు కప్పిన గుడ్డ తొలగింది. పాప ముఖమంతా మట్టి అంటుకుని ఉంది. నేను కంగారుపడ్డా. ముఖమంతా కనిపిస్తోందే అనుకున్నా. శుభ్రం చేసి చూస్తే పాపకు శ్వాస కూడా ఆడుతోంది. నోట్లో మట్టి శుభ్రం చేస్తుంటే పాప శబ్దాలు చేయడం కూడా మొదలైంది. తర్వాత మేం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చాం. పాప ప్రాణాలతో ఉండటం వాళ్లు కూడా చూశారు’’ అని షబారత్ చెప్పారు.

నిజానికి నవజాత శిశువును ఖననం చేసిన ప్రాంతం స్మశానం కాదు. అది ఒక నిర్మానుష్య ప్రాంతం.

దాంతో అక్కడికి దగ్గర్లో ఉంటున్న ఇర్షాద్ అహ్మద్.. బషారత్‌కు ఫోన్ చేసి పాప శవాన్ని అక్కడి నుంచి తీసి వేరే చోట ఖననం చేయాలని చెప్పారు.

దాంతో వెనక్కు వచ్చిన బషారత్ నవజాత శిశువును గుంతలోంచి బయటికి తీశారు. అప్పుడే పాప ప్రాణాలతో ఉండడం గమనించారు.

‘‘నేను ఇంట్లో భోజనం చేస్తున్నా. ఆయన కవర్లోచుట్టి ఏమో తీసుకొచ్చారు. మా వాళ్లను ఏవో పనిముట్లు అడిగాడు. ఇచ్చాం. తర్వాత తను ఏం చేశాడని నేను మా వాళ్లను అడిగా. ఏదో పూడ్చి పెట్టాడని చెప్పారు.. నా దగ్గర ఆయన ఫోన్ నంబర్ లేదు. తర్వాత తెలుసుకుని ఫోన్ చేశాను. ఏం పూడ్చావని అడిగాను. తన కూతురు శవాన్ని అని అన్నాడు. దాంతో అది వేరే వాళ్ల స్థలమని, నా ఇల్లు ఇక్కడే ఉంది కదా ఎందుకు పూడ్చావని అడిగాను. కుక్కలు బయటకు లాక్కెళ్తే కాలనీలో గొడవ అవుతుందని చెప్పా. దాన్ని తీసుకెళ్లి స్మశానంలో పూడ్చమని చెప్పా. తర్వాత ఆయన వచ్చి బయటకు తీశాడు. పాప బతికే ఉందని చెప్పాడు’’ అని స్థానికుడైన ఇర్షాద్ అహ్మద్ తెలిపారు.

ఆ తర్వాత పాపను శ్రీనగర్‌లోని జీబీ పంత్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ రెండ్రోజుల తర్వాత పాప చనిపోయింది.

ఈ మొత్తం ఘటన తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి బ్లాక్ ఆఫీసర్ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పత్రి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోలీసు కేసు కూడా నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది. కేసు నమోదు చేశామని బనీహాల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మునీర్ ఆహ్మద్ చెప్పారు.

బషారత్, షైరాలకు బిడ్డ బతికుందనే ఆనందం కొన్ని గంటల్లోనే మళ్లీ విషాదంగా మారింది. దీనికి కారణమైన వారికి ఎప్పుడు శిక్ష పడుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)