నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల పెళ్ళి రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికోలస్ యాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- నుంచి, కఠ్మాండూ, సింగపూర్
నేపాల్ తొలిసారి ఒక స్వలింగ సంపర్కుల జంట వివాహాన్ని అధికారికంగా నమోదు చేసింది. దీన్ని ఎల్‌జీబీటీ హక్కుల అతిపెద్ద విజయంగా కార్యకర్తలు కొనియాడుతున్నారు.
వెస్ట్రన్ లమ్‌జంగ్ జిల్లాకు చెందిన అధికారులు బుధవారం 35 ఏళ్ల మాయా గురుంగ్, 27 ఏళ్ల సురేంద్ర పాండేల వివాహాన్ని అధికారికంగా నమోదు చేశారు.
స్వలింగ సంపర్కుల జంటలకు వివాహాలను నమోదు చేసుకునే అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు చేసింది.
ఈ ఉత్తర్వులు జారీ చేసిన ఐదు నెలల తర్వాత తొలి స్వలింగ సంపర్కుల జంట వివాహాన్ని నేపాల్ రిజిస్టర్ చేసి, మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసింది.
ఆసియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పిస్తోన్న ఏకైక దేశం తైవాన్.

ఫొటో సోర్స్, MADHAV DULAL/BBC
ఈ రిజిస్ట్రేషన్ తమకు మాత్రమే కాకుండా.. సెక్సువల్ మైనార్టీలకు ఇది అతిపెద్ద రోజని మాయా గురుంగ్ బీబీసీకి చెప్పారు.
‘‘హక్కుల కోసం పోరాటం అంత తేలికైన విషయం కాదు. కానీ, మేం చేశాం. భవిష్యత్ తరాల వారు వివాహాలను నమోదు చేసుకోవడం ఇక సులభతరం కానుంది’’ అని తెలిపారు.
ఈ రిజిస్ట్రేషన్ తమకు ఎన్నో విషయాల్లో అవకాశాలను కల్పిస్తుందన్నారు.
మాయా గురుంగ్, సురేంద్ర పాండేలు జాయింట్ బ్యాంకు అకౌంట్‌ను తెరవాలనుకుంటున్నారు.
కొనుగోలు చేసిన భూమిని ఇద్దరి పేర్లపై నమోదు చేయాలనుకుంటున్నారు. అంతేకాక, వారి అతిపెద్ద కోరిక ఏంటంటే.. బిడ్డను దత్తత తీసుకోవడం.
ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వారు బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నామని అంతకుముందు చెప్పారు.
పదేళ్లుగా మాయా గురుంగ్, సురేంద్ర పాండేలు కలిసి జీవిస్తున్నారు.
వీరిద్దరూ 2017లో ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని వారు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, MAYA GURUNG
గురుంగ్ ట్రాన్స్‌జెండర్ మహిళ. అధికారిక పత్రాలలో ఆమె తన జెండార్‌ను మార్చుకోలేదు. సురేంద్ర పాండే ఒక స్వలింగ సంపర్క పురుషుడు.
ప్రస్తుతం వీరిద్దరూ అధికారికంగా వివాహం నమోదు చేసుకున్న తొలి నేపాలీ స్వలింగ జంటగా మారారు.
చట్టాన్ని మార్చే వరకు స్వలింగ సంపర్కుల వివాహాలను రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వీరి పెళ్లిని నమోదు చేసేందుకు ఖాఠ్మాండులోని జిల్లా కోర్టు జూలై 13న నిరాకరించింది.
సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని, కింది కోర్టులు ఆ మధ్యంతర ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని కఠ్మాండూ జిల్లా కోర్టు పేర్కొంది.
‘‘సుప్రీంకోర్టు ఆదేశాలు, సంబంధిత ప్రభుత్వ అధికారుల మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఈ జంటకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చాం’’ అని దోర్ది రూరల్ మున్సిపాలిటీకి చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమ్ రాజ్ కఫ్లే చెప్పారు.
సెక్సువల్, జెండర్ మైనార్టీల గెలుపులో ఇది చారిత్రాత్మక ఘట్టమని ఎల్‌జీబీటీ హక్కుల ప్రముఖ కార్యకర్త సునిల్ బాబు చెప్పారు.
ఇతర జంటల మాదిరిగానే ఇక నుంచి తాము కూడా పెళ్లిళ్లను నమోదు చేసుకోగలమని అన్నారు. ఇతర హక్కులు పొందేందుకు తాము మరింత పోరాడాల్సి ఉందన్నారు.

ఫొటో సోర్స్, SHREEJANA SHRESTHA / BBC
మాయా గురుంగ్ 2015లో తొలిసారి సురేంద్ర పాండేను కలిశారు. మాయా సోదరి రెస్టారెంట్ సమీపంలోని నవాల్‌పరాసి ప్రాంతంలో వీరు తొలిసారి కలిశారు.
సురేంద్ర పాండే ఎప్పుడూ పురుషులకే ఆకర్షితుడయ్యేవారు. కానీ, మాయా గురుంగ్‌ను చూసిన వెంటనే తనతో ప్రేమలో పడ్డారు సురేంద్ర పాండే.
సురేంద్ర తల్లితండ్రులు చనిపోవడంతో ఆరేళ్ల వయసు నుంచి తన పెద్దక్క వద్దే ఆయన పెరిగారు. మాయా గురుంగ్‌తో సంబంధం ఏర్పడిన తరువాత ఆయన తన పెద్దక్కకు విషయం చెప్పేశారు.
‘మొదట మా అక్క అంగీకరించలేదు. నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆమె చాలా ఆందోళన చెందింది. కానీ, నేను భిన్నమైన వ్యక్తినని క్రమంగా ఆమె గుర్తించడం ప్రారంభించారు’ అన్నారు సురేంద్ర.
రెండేళ్లు డేటింగ్ చేసిన తరువాత ఈ జంట 2017లో కఠ్మాండూలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాల వారు, కొందరు మిత్రులు ఆ వేడుకకు హాజరయ్యారు.
పెళ్లి తరువాత వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ‘మేం ఇద్దరూ ఇంటి పనంతా కలిసి చేసుకుంటాం. మాయా వండే చికెన్ కూర అంటే నాకు ఇష్టం’ అన్నారు సురేంద్ర.
అందరు జంటల్లాగే తాము కూడా అప్పుడప్పుడు గొడవలు పడుతుంటామని, కానీ వెంటనే కలిసిపోతామని మాయా, సురేంద్రలు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యానిమల్ రన్ టైమ్ 3.21 గంటలు... సినిమా చరిత్రలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలేంటి, ఇప్పుడీ ట్రెండ్‌కు కారణమేంటి?
- హెన్రీ కిసింజర్ (1923-2023): అమెరికా విదేశాంగ విధానంపై చెరగని ముద్ర వేసిన నేత
- దియా మీర్జా: ‘కొందరు మగ అహంకారులే పర్యావరణానికి అతిపెద్ద సమస్య’
- నవయుగ: హిమాచల్‌లో ప్రమాదం జరిగిన సొరంగాన్ని నిర్మిస్తోన్న ఈ హైదరాబాద్ కంపెనీపై వివాదాలేంటి?
- ఆంధ్రప్రదేశ్: ఇప్పటం గ్రామం ఇప్పుడెలా ఉంది, కూల్చేసిన చోట ఏం చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














