కైలాస: 'నిత్యానంద దేశం'తో ఒప్పందం కుదుర్చుకున్న పరాగ్వే అధికారిపై వేటు, అసలేం జరిగిందంటే...

కైలాసతో పరాగ్వే అధికారి ఒప్పందం

ఫొటో సోర్స్, INSTAGRAM/@SRINITHYANANDA

ఫొటో క్యాప్షన్, కైలాస ప్రతినిధులతో పరాగ్వే అధికారి ఆర్నాల్డో చమోరో ఒప్పందం కుదుర్చుకున్నారు.
    • రచయిత, .
    • హోదా, బీబీసీ ముండో

కొత్త దేశంగా చెప్పుకుంటున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)తో ఒప్పంద పత్రంపై సంతకం చేసినందుకు ఒక సీనియర్ అధికారిని పరాగ్వే ప్రభుత్వం తొలగించింది.

పరాగ్వే ప్రభుత్వం యూఎస్‌కేతో దౌత్య సంబంధాలను పరిగణించాలనే ఒప్పందంపై పరాగ్వే వ్యవసాయ, పశు మంత్రిత్వ శాఖ సిబ్బంది ముఖ్య అధికారి ఆర్నాల్డో చమోరో ఇటీవలె సంతకం చేశారు.

దీనిపై విమర్శలు రావడంతో చమోరోను అక్కడి ప్రభుత్వం బుధవారం తొలగించింది.

ఐక్యరాజ్యసమితితో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలలో 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస'ను సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా పరిగణించాలనే ప్రతిపాదనకు పరాగ్వే మద్దతు ఇవ్వాలని కూడా చమోరో తెలిపారు.

"200 కోట్ల హిందువులు, సమస్త మానవాళి, అన్ని జీవుల మతపరమైన, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి స్థాపించిన జ్ఞానోదయ హిందూ నాగరికత దేశమే కైలాస" అని అక్టోబర్ 16న ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

పరాగ్వేలో కైలాస ప్రతినిధులు

ఫొటో సోర్స్, INSTAGRAM/@SRINITHYANANDA

పరాగ్వే ఏమంటోంది?

ఒప్పందంపై విమర్శలు రావంతో ఈ కైలాస దేశం ఎక్కడుందో తనకు తెలియదని అక్కడి స్థానిక రేడియో ఏబీసీ కార్డినాల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చమోరో తెలిపారు.

చమోరోను తొలగించడానికి కొన్ని గంటలముందు ఆయన మాట్లాడుతూ, "వాళ్లు పరాగ్వేకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చామన్నారు, వ్యవసాయానికి సాయం చేసే ప్రాజెక్టులను తీసుకొచ్చారు, మేం వారి మాటలను విన్నాం, అంతే" అని చెప్పారు.

"అంటే, రేపు నేను బనానాలండియా యజమానిని మీ దగ్గరికి తీసుకువస్తే, మీరు ఒప్పందంపై సంతకం చేస్తారు, వారిని మంత్రి రిసీవ్ చేసుకుంటారు" అని రేడియో జర్నలిస్ట్ చమోరోను అడగగా ఆయన చాలాసేపు మౌనంగానే ఉన్నారు.

ఈ ఒప్పందం తర్వాత, "దీనిని అధికారిక ఒప్పందంగా పరిగణించలేం. చట్టపరమైన విధానాలు అనుసరించలేదు, కాబట్టి ఇది చెల్లదు'' అని పరాగ్వే వ్యవసాయ, పశుసంవర్థక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి చమోరోకి ఎలాంటి అధికారం కూడా లేదని తెలిపింది.

ఐక్యరాజ్యసమితిలో కైలాస ప్రతినిధి

ఫొటో సోర్స్, SCREENSHOT/UNITED NATIONS

ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్య సమితిలో కైలాస తరఫున ఒక మహిళా ప్రతినిధి పాల్గొన్నారు.

ఐక్యరాజ్యసమితిలో అకస్మాత్ ఎంట్రీ

2023 ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కైలాసా అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. దాని ప్రతినిధులు రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది.

రెండు సమావేశాల్లో ఈ కల్పిత దేశం ప్రతినిధులు చేసిన ప్రకటనలను పరిగణనలోకి తీసుకోరాదని ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి కూడా పెరిగింది.

కాగా, ఐక్యరాజ్యసమితిలోకి కైలాస రావడం ఇండియా కూడా గుర్తించలేదు, కానీ, మీడియా ఈ విషయాన్ని కవర్ చేయడంతో ఆ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీ (సీఈడీఏడబ్ల్యూ) ‘‘నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలలో మహిళల ప్రాతినిధ్యం’’ అనే అంశంపై ఫిబ్రవరి 22న సమావేశం అయింది.

రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 24న) ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (సీఈఎస్‌సీఆర్) ‘సుస్థిరాభివృద్ధి’ సమావేశం నిర్వహించింది. ఈ రెండింటిలోనూ కైలాస ప్రతినిధులు పాల్గొన్నారు.

'నేను కైలాస శాశ్వత ప్రతినిధిని'

యూఎన్ వెబ్‌సైట్‌లో ‘‘ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (సీఈఎస్‌సీఆర్)’’ చర్చకు సంబంధించిన వీడియో ఒకటి ఉంది.

అందులో.. హాజరైనవారి నుంచి ప్రశ్నలను ఆహ్వానించగా ఒక మహిళ తనను తాను ‘విజయప్రియ నిత్యానంద’గా పరిచయం చేసుకున్నారు.

ఐరాసలో యూఎస్‌కే శాశ్వత రాయబారినని, హిందువుల కోసం ఏర్పాటుచేసిన తొట్టతొలి సార్వభౌమ దేశమే ఈ యూఎస్‌కే అని ఆమె అన్నారు.

‘‘హిందూత్వకు అత్యున్నత అధిపతి’’ అయిన నిత్యానంద ఈ దేశాన్ని ఏర్పాటుచేశారని విజయప్రియ తెలిపారు.

యూఎస్‌కే పౌరులందరికీ ఆహారం, ఆశ్రయం, వైద్యం వంటి అవసరాలన్నీ కల్పిస్తున్నందున సుస్థిరాభివృద్ధిలో తమ దేశం విజయవంతమైనందని ఆమె అన్నారు.

‘నిత్యానంద, కైలాస ప్రజలను పీడించడాన్ని’ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఇవి సాధారణ చర్చలని, వీటిలో ఆసక్తి గలవారు ఎవరైనా పాల్గొనవచ్చని యూఎన్ హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మీడియా ఆఫీసర్ వివియన్ క్వాక్ ప్రకటించారు.

సీడీడీఏడబ్ల్యూ, సీఈఎస్‌సీఆర్‌ల మీడియా వ్యవహారాలు క్వాక్ చూస్తారు.

ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. సొంత దేశంగా గుర్తింపు లేని పాలస్తీనా వంటి ప్రాంతాల నుంచి మెజారిటీ దేశాల ఆమోదం మేరకు కొంతమందిని యూఎన్ ఆహ్వానిస్తుంది.

అయితే ఈ కైలాస ప్రతినిధుల ఎంట్రీ ఐక్యరాజ్యసమితి‌ని ఇరుకున పెట్టింది.

నిత్యానంద

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిత్యానందపై అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి.

ఎవరీ నిత్యానంద?

పరమహంస నిత్యానంద లేదా నిత్యానంద అని కూడా పిలుచుకునే నిత్యానంద పరమశివం వయస్సు 45 ఏళ్ళు.

ఆయన 2003లో హిందూ ధ్యానం, విద్యనందించే ప్రాంతంగా చెప్పుకొంటూ ఒక ఆశ్రమాన్ని బెంగుళూరు సమీపంలో ఉన్న బిడాదీలో స్థాపించారు.

కొంతకాలం తర్వాత, లైఫ్ బ్లిస్ ఫౌండేషన్ పేరుతో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక శాఖనూ ప్రారంభించారు.

అయితే, నిత్యానంద అత్యాచారం చేశారని ఆయన శిష్యురాలు ఒకరు 2010లో ఆరోపించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు, కొద్దిరోజులకే బెయిల్ వచ్చింది.

2018లో ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. దీంతో నిత్యానంద 2019లో భారత్ నుంచి పారిపోయారు.

నిత్యానంద

ఫొటో సోర్స్, INSTAGRAM/@SRINITHYANANDA

ఫొటో క్యాప్షన్, నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి, దానికి కైలాస అని పేరు పెడుతూ, దాన్ని ఒక దేశంగానూ ప్రకటించుకున్నారు.

'కైలాస దీవి'

భారత్ నుంచి వెళ్లిపోవడానికి కొద్దిరోజుల ముందు ఆయనపై మరో కేసు నమోదైంది.

చిన్నారులను అపహరించి గుజరాత్‌లోని ఆశ్రమంలో నిర్బంధించారని ఆయనపై కేసు నమోదైంది. అయితే, నిత్యానంద ఎక్కడకు పారిపోయారనేది చాలాకాలం తెలియలేదు.

అనంతరం అదే ఏడాది నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దానికి కైలాస అని పేరు పెడుతూ, దాన్ని ఒక దేశంగానూ ప్రకటించుకున్నారు. దీనికి హిమాలయాల్లోని కైలాసమే స్ఫూర్తిగా చెప్పుకున్నారు.

నిత్యానంద సొంత దేశం ప్రకటనపై ఈక్వెడార్ కూడా స్పందించింది. "నిత్యానందకు ఈక్వెడార్ ఆశ్రయం కల్పించలేదు, ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు" అని తెలిపింది.

ఇదే క్రమంలో తమ దీవికి జెండా, రాజ్యాంగం, సెంట్రల్ బ్యాంక్, పాస్‌పోర్ట్, జాతీయ చిహ్నం కూడా ఉన్నాయని కైలాస ప్రకటించుకుంది.

కాగా, 2019 నుంచి నిత్యానంద బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.

అయితే, ఆయన కైలాసలో పాల్గొంటున్నట్లుగా చెప్తున్న కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో పోస్టు అవుతూనే ఉన్నాయి.

గత సంవత్సరం హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో నిర్వహించిన దీపావళి సంబరాలలో నిత్యానంద బ్రిటన్ ప్రతినిధి పాల్గొన్నట్లు ‘ది గార్డియన్’ తన కథనంలో రాసింది.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యుల ఆహ్వానం మేరకు ఆ ప్రతినిధి వచ్చినట్లు గార్డియన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)