మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్: ఈ మూడు రాష్ట్రాలనూ బీజేపీ ఎలా గెల్చుకోగలిగింది?

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలలో బీజేపీ గెలుపు దేనికి సంకేతం?

మరో 6 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న వేళ ఉత్తరాదిన బీజేపీని గెలిపించిన స్థానిక పరిస్థితులు ఏమిటి? ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపునకు కారణాలేమిటో చూద్దాం.

ఛత్తీస్‌గఢ్:

90 స్థానాలున్న చిన్న రాష్ట్రం. తాజా ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాలు, కాంగ్రెస్ 35 స్థానాలు ఇతరులు 1 సీటు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 2018లో ఇక్కడ 68 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 15 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతరులు ఏడుస్థానాలు గెలిచారు.

నవంబరు 30వ తేదీన విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలన్నీ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. కాంగ్రెస్ గరిష్ఠంగా56 స్థానాలు గెలుస్తుందని, బీజేపీ గరిష్ఠంగా 48 సీట్లు గెలుస్తుందని వేసిన అంచనాలను ప్రజలు తలకిందులు చేశారు. బీజేపీకి అధికారం అప్పగించారు.

చత్తీస్‌గడ్ సీఎం

ఫొటో సోర్స్, ALOK PUTUL

ఫొటో క్యాప్షన్, భూపేష్ భగేల్ : ఈ ఓటమికి కారణమేంటి?

బీజేపీ బాటలో కాంగ్రెస్

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బాట పట్టింది. హిందుత్వ అజెండాను భుజాన వేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌ సంస్కృతిని కాపాడుతున్నానంటూ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ రామవాదాన్ని ముందుకు తెచ్చారు. 2018 ఎన్నికల ముందు నర్వా, గర్వా,ఘర్వా, బారీ అనే నినాదం ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వమే ఆవుపేడను కొనుగోలుచేసింది.

తరువాత కాలంలో గోమూత్రాన్ని కూడా కొనుగోలు చేసింది. కానీ దీనివలన ఛత్తీస్‌గఢ్‌లోని అసలైన సమస్యలను పరిష్కరించలేకపోయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రామరథ యాత్రకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ప్రాథమికంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అజెండా అయిన రామ్ వాన్ గమన్ పథ్ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా మారింది. రాముడి తల్లి కౌశల్య పేరు మీద నిర్మించిన ఆలయాన్ని సుందరీకరణకు, ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఏ అవకాశాన్ని వదులుకోలేదు. వివిధ చోట్ల రాముడి భారీ విగ్రహాల ప్రతిష్ఠాపన ప్రభుత్వ ప్రాధాన్యంగా కనిపించింది.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదివాసీల విశ్వాస చిహ్నాలను హిందూ దేవతలతో అనుసంధానం చేస్తూనే, మరోవైపు గిరిజనుల వ్యతిరేకత ఉన్నప్పటికీ అంతర్జాతీయ రామాయణ మహోత్సవం, గ్రామాల్లో మానస పోటీలు వంటి కార్యక్రమాలు కొనసాగాయి.

భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసిన హిందుత్వ రంగాన్ని, బీజేపీ కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, ALOK PUTUL

ఫొటో క్యాప్షన్, రమణ్ సింగ్

నిజాయితీలేని ప్రయత్నమా?

ఛత్తీస్‌గఢ్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కమ్యూనికేషన్స్ చీఫ్ కనిరామ్ నందీశ్వర్ బీబీసీతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం హిందుత్వ సమస్యలను స్పృశించడానికి ప్రయత్నించింది, కానీ అందులో నిజాయితీ లేదు. దీని నెపంతో బుజ్జగింపులు జరిగాయి. అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా మత మార్పిడి సంఘటనలు పెరిగాయి’’ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుశీల్ ఆనంద్ శుక్లా ఈ వాదనతో ఏకీభవించలేదు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, “మాకు హిందుత్వం ఎప్పుడూ ఓట్ల సమస్య కాదు. అది ఛత్తీస్‌గఢ్ సంస్కృతిని కాపాడే ప్రక్రియ. ప్రజాభివృద్ధే లక్ష్యంగా ఐదేళ్లు నిరంతరం శ్రమించాం. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రజల కోసం అనేక ముఖ్యమైన ప్రకటనలు చేసింది, కానీ బీజేపీ అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి గెలిచింది అని చెప్పారు.

మొత్తం మీద ఛత్తీస్‌గఢ్‌లో ప్రజల ఆలోచనలు పసిగట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ వైఫల్యాన్ని బీజేపీ సొమ్ము చేసుకుంది.

రాజస్థాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ, వసుంధ రాజే

రాజస్థాన్‌‌: సంప్రదాయాన్ని నిలబెట్టుకుంది

రాజస్థాన్ : 200 అసెంబ్లీ సీట్లున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా సాగుతుందనుకున్నారు కానీ బీజేపీ 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఇతరులు 15 సీట్లు గెలచుకున్నారు.

రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి అధికారం దక్కే సంప్రదాయం లేదు.

ఈసారి బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ కేంద్రంగా ప్రచారం చేయగా, కాంగ్రెస్ పార్టీకి స్థానిక నాయకులే ప్రచారం చేశారు. అశోక్ గహ్లోత్ సర్దార్ పురా నుంచి గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు.

రాజస్థాన్‌లో మహిళా భద్రత ఒక ముఖ్యమైన అంశంగా మారింది. మహిళలపై జరుగుతున్న నేరాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతర నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు.

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను కూడా వివాదాలు చుట్టుముట్టాయి పేపర్ లీక్ సమస్య కూడా చాలా వరకు పెరిగింది.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి అరెస్టులు కూడా చేశారు.ఉదయపూర్‌లో లా అండ్ ఆర్డర్ , కన్హయ్యాలాల్ హత్య అంశాన్ని బిజెపి లేవనెత్తింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తారు. తమ పార్టీని ఎన్నుకుంటే అవినీతిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.

అదే సమయంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి కేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పుచేతల్లో నడుస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది.

అశోక్ గహ్లోత్ , చిరంజీవి యోజన పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు, కానీ నిర్ణయాత్మక ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యారు.

రాజస్థాన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అశోక్ గహ్లోత్, రాహుల్ గాంధీ , సచిన్ పైలట్

గహ్లోత్‌కు పార్టీ మద్దతు లభించలేదా?

సీనియర్ జర్నలిస్ట్ నారాయణ్ బరేత్ మాట్లాడుతూ గహ్లోత్ మంచి పథకాలతో ముందుకు వచ్చారని, అయితే బ్లాక్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు బిజెపి చూపిన సంస్థాగత మద్దతు గహ్లోత్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి లభించలేదని చెప్పారు.

మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను పట్టించుకోకుండా వారికే సీట్లు ఇవ్వడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమైంది.

2020లో ఈ ఎమ్మెల్యేలందరూ తనకు మద్దతుగా నిలిచారనే కృతజ్ఞతతో సీట్లు ఇవ్వడమే కాంగ్రెస్‌కు నష్టం చేసింది.

, "అశోక్ గహ్లోత్ అనేక సంక్షేమ విధానాలను తీసుకువచ్చారు, అయితే, సచిన్ పైలట్ అశోక్ గెహ్లాట్ మధ్య వైరం కాంగ్రెస్ ఓటమికి కారణమైంది."అని సీనియర్ జర్నలిస్ట్ రాజన్ మహన్ విశ్లేషించారు.

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. వారిద్దరూ కలిసి ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్ మరింత ప్రయోజనం పొంది ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నమాట.

అదే సమయంలో రాజస్థాన్‌లో బీజేపీ విజయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి ఆపాదిస్తున్నారు. ఈసారి ఐదు రాష్ట్రాలలోనూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం చెప్పకుండానే ఎన్నికలలో గెలిచింది.

సీనియర్ జర్నలిస్ట్ కుంజన్ ఆచార్య మాట్లాడుతూ.. 2018లో బీజేపీ వసుంధర రాజే ను ముందుకు తెచ్చిందని, అయితే ఈసారి మోదీ నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ కమలదళం అనే మాట మాత్రమే వాడారన్నారు. సమావేశాల్లో మోదీ లేదా సీపీ జోషి మాత్రమే కనిపించారు కానీ జోషి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి ప్రజలు మోడీపై విశ్వాసం ఉంచారని చెప్పారు.

శివరాజ్ సింగ్ చౌహాన్

ఫొటో సోర్స్, ANI

మధ్యప్రదేశ్ లో ‘మామ’ జాలం?

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అందరి దృష్టి ఎక్కువగా ఆకర్షించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది.

ఇక్కడ బీజేపీ 163 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలు గెలుచుకోగా, ఇతరులకు ఒక స్థానం దక్కింది.

నిజానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తప్పిస్తారనే ఊహాగానాలు ఎన్నికల ముందుకు జోరుగా సాగాయి.

ఇందుకు ఉదాహరణగా బీజేపీ విడుదల చేసిన మొదటి మూడు అభ్యర్థుల జాబితాలో శివరాజ్ పేరు లేకపోవడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.

ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పక్కనపెడుతున్నారని భావించారు. కానీ నాలుగో విడత జాబితాలో ఆయన పేరు కనిపించింది.

అయితే ప్రధాని నరేంద్ర మోదీ, గ్రామీణ, ఆదివాసీల ప్రాంతాలలో ప్రచారం నిర్వహించిన తీరు చూస్తే ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రంగా కాకుండా, ప్రధాని మోదీ కేంద్రంగా బీజేపీ ఎన్నికల్లో పోరాడుతోందనే సందేశం ఇచ్చినట్టయింది.

శివరాజ్ సింగ్ చౌహాన్ తన నియోజకవర్గం బుద్ని నుంచి లక్ష ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. తనతోపాటు పార్టీనీ గెలిపించారు.

2018 ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 109 స్థానాలు గెలిచింది.

కానీ 20 నెలలకే కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. తరువాత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది.

ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీకి గట్టి పోటి ఇస్తుందని భావించారు. కానీ, బీజేపీ భారీ విజయం సాధించింది.

రాజకీయ విశ్లేషకురాలు మనీషా ప్రియం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకిదో గట్టి విజయమన్నారు. ఇది బలమైన గెలుపే కాదు, ప్రత్యేకమైనది కూడా ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యతిరేకంగా అనేక విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉందనుకున్నారు. అలాగే కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన తీరుపైన కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని భావించారు.

ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉంటుందని భావించింది. కమల్‌నాథ్ ను దింపేసిన తీరు కూడా తమకు కలిసివస్తుందని ఆశించింది.

కానీ ఫలితం భిన్నంగా వచ్చింది. బీజేపీ భారీ విజయాన్ని దక్కించుకుంది అని మనీషా ప్రియం చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో ఈసారి అసెంబ్లీ బరిలో బీజేపీ అనేకమంది కేంద్రమంత్రులను, ఎంపీలను పోటీ చేయించింది. ఈ వ్యూహం ద్వారా బీజేపీ ఈసారి లాభపడిందా?

ఈ ప్రశ్నకు భోపాల్‌లో సంధ్యా ప్రకాశ్ న్యూస్ పేపర్ సంపాదకుడు సంజయ్ సక్సేనా మాట్లాడుతూ తొలుత వీరిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే గెలుస్తారనే భావన ఉండేది.

వీరిలో కొందరు మాత్రమే తమ సీట్లతో మాత్రమే ఇతర ప్రాంతాలలోనూ ప్రచారం చేశారు. చాలామంది తాము పోటీచేస్తున్న స్థానాలకే పరిమితమయ్యారు.

అందువల్లే వీరిందరినీ రంగంలోకి దించడం ద్వారా బీజేపీ ఎంతవరకు లాభపడిందనేది చెప్పలేం. కానీ వీరిలో చాలామంది గెలవడం బీజేపీకి సానుకూల అంశంగా మారింది.

భోపాల్‌లోని బీబీసీ కరస్పాండెంట్ సాల్మన్ రవి మాట్లాడుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ దీర్ఘకాలం నుంచి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయనపై ప్రజలకు మొహం మొత్తిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలియడంతో బీజేపీ మరోసారి ముఖ్యమంత్రి ఎవరు అనేదానికి సమాధానం చెప్పకుండా దాటవేసిందని చెప్పారు.

మహారాష్ట్రలో జ్యోతిరాదిత్య సింధియా రెండో మాస్ లీడర్‌గా ఉన్నారనుకన్నా ఆయన ప్రభావం గ్వాలియర్, చంబల్‌కు పరిమితం అయింది.దీంతో సింధియా విషయంలో బీజేపీ సందిగ్థంలోనే ఉంది.

కమల్ నాథ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమల్‌నాథ్

కాంగ్రెస్ చేసిన తప్పేంటి?

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల పంపిణీలోనే తప్పటడుగులు వేసిందని రాజకీయ విశ్లేషకురాలు మనీషా ప్రియం చెప్పారు. ‘‘వారు తప్పులు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే టిక్కెట్లు ఇచ్చిందో, వారు గెలవరని ప్రజలు గట్టిగా నమ్మారు. దీంతోపాటు కమల్‌నాథ్‌, దిగ్విజయ్ సింగ్ పైనే పార్టీ ఎక్కువగా ఆదారపడటం కూడా నష్టం చేసిందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అతివిశ్వాసమే ఆ పార్టీ కొంపముచిందని మరో విశ్లేషకుడు సంజయ్ సక్సేనా చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని ఉదాసీనంగా ఉండటమే ఆ పార్టీ ఓటమికి కారణమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ దానిని అందిపుచ్చుకోలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)