కెనడాలో నిజ్జర్ హత్య గురించి అమెరికాకు ముందే అంతా తెలుసా? ఇది ప్రధాని మోదీ వద్ద బైడెన్ ప్రస్తావించారా?

హర్‌దీప్ సింగ్ నిజ్జర్

ఫొటో సోర్స్, SIKH PA

ఫొటో క్యాప్షన్, హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌పై కెనడా అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు
    • రచయిత, హోలీ హండోరిచ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఉత్తర అమెరికాలో నలుగురికిపైగా సిక్కు వేర్పాటువాదులను చంపేసేందుకు కుట్ర పన్నాడని ఒక భారతీయుడిపై అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపణలు మోపారు.

ఈ ఏడాది మొదట్లో ఒక కెనడా పౌరుడి హత్యతో ఈ కేసుకు అధికారులు ముడిపెట్టారు. దీంతో అసలు ఆ కెనడా పౌరుడి హత్యకు ముందు అమెరికా ఏజెంట్లకు ఏం తెలుసనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

జూన్ 18న నిఖిల్ గుప్తా తన కారులో వెళ్తుండగా ఒక వీడియోను చూశాడు. కెనడాలో హత్యకు గురైన ఒక సిక్కు వేర్పాటువాది దృశ్యాలు దీనిలో ఉన్నాయి.

ఆ వీడియోను వేరే హత్య కోసం నియమించుకున్నట్లుగా ఆరోపిస్తున్న ఒక ‘హిట్‌మ్యాన్’కు గుప్తా పంపించారు. ఆ మరుసటి రోజు ఫోన్‌లో మాట్లాడుతూ ఆ కెనడా వ్యక్తి కూడా తమ లిస్టులో ఉన్నాడని, కానీ వేరెవరో ఆ హత్య చేశారని హిట్‌మ్యాన్‌తో గుప్తా చెప్పారు.

‘‘మనం లక్ష్యంగా చేసుకోవాల్సిన వారు చాలా మందే ఉన్నారు. ఇకపై మనం ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేదు’’ అని కూడా గుప్తా అన్నారు.

అమెరికాలో ప్రాసిక్యూటర్లు దాఖలుచేసిన అభియోగపత్రంలో ఈ వివరాలు ఉన్నాయి.

న్యూయార్క్‌లో అమెరికా-కెనడా పౌరసత్వాలున్న ఓ వ్యక్తిని హత్య చేసేందుకు గుప్తా ప్రయత్నించారని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఆ ప్రతంలో పేర్కొంది. ఈ కుట్ర ఓ భారత ప్రభుత్వ ఉద్యోగి ఆధ్వర్యంలో కొనసాగిందని వివరించింది.

అయితే, ఇంతకీ ఎవరి హత్యకు కుట్ర పన్నారో ప్రాసిక్యూటర్లు పేర్కొనలేదు. కానీ, అమెరికా మీడియా మాత్రం ఆయన పేరు గుర్‌పత్వంత్ సింగ్ పన్నూగా పేర్కొంది. ఆయనకు అమెరికా, కెనడాల పౌరసత్వముంది. అమెరికాకు చెందిన ఒక సిక్కు వేర్పాటువాద సంస్థలో ఆయన సభ్యుడు కూడా.

ఆ కుట్రను అమెరికా అధికారులు అడ్డుకున్నారు. అయితే, దీని కోసం న్యూయార్క్‌లోని ఆ హిట్‌మ్యాన్‌కు 1,00,000 డాలర్లు (రూ.83 లక్షలు) చెల్లించేందుకు గుప్తా అంగీకరించారు. అయితే, ఆ హిట్‌మ్యాన్ ఒక అండర్‌కవర్ ఏజెంట్.

15 పేజీల ఆ అభియోగపత్రంలో బ్రిటిష్ కొలంబియాలో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన కొత్త వివరాలు కూడా ఉన్నాయి. కెనడాలో జరిగిన ఈ హత్య గురించి ముందే ఎవరికి, ఎప్పుడు తెలుసు అనే ప్రశ్నలు నేడు ఉత్పన్నం అవుతున్నాయి.

సిక్కు వేర్పాటువాద ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

ట్రూడో వాదనకు బలం చేకూరుస్తోందా?

భారత్‌ భూభాగంలో స్వతంత్ర సిక్కు దేశం ఏర్పాటు కోసం తరచూ గళమెత్తే 45 ఏళ్ల నిజ్జర్ హత్య కెనడాలో ప్రకంపనలు సృష్టించింది.

ఈ హత్యతో భారత్‌కు సంబంధముందని చెప్పే ‘విశ్వసనీయమైన ఆధారాలు’ తమ దగ్గర ఉన్నాయని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చెప్పారు.

ట్రూడో ఆరోపణల్లో నిజం లేదని భారత్ కొట్టిపారేసింది. రెండు దేశాల మధ్య దూరాన్ని ఈ పరిణామాలు మరింత పెంచాయి.

తను చేసే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని కెనడా ప్రధానిపై ఒత్తిడి కూడా పెరిగింది.

గత బుధవారం ట్రూడో మాట్లాడుతూ- కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణించాలని అమెరికాలో తాజాగా దాఖలుచేసిన అభియోగపత్రం నొక్కి చెబుతోందన్నారు.

నిపుణులు కూడా ట్రూడో చెప్పే వాదనకు తాజా అభియోగపత్రం బలం చేకూరుస్తోందని అంటున్నారు.

‘‘ట్రూడో చెప్పిన దానికంటే చాలా వివరాలు ప్రస్తుతం మన ముందు ఉన్నాయి’’ అని ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ స్టెఫనీ కార్విన్ అన్నారు.

‘‘వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే, కెనడాలో ముగ్గురితోపాటు నలుగురిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇక్కడ నిజ్జర్ హత్యను మనం విడిగా చూడకూడదు’’ అని ఆమె అన్నారు.

ట్రూడో ఆరోపణలు చేసేటప్పుడు, అమెరికా అధికారులు ఆందోళన మాత్రమే వ్యక్తంచేశారు. కానీ, ట్రూడోకు నేరుగా మద్దతు పలకలేదు, అలానే భారత్‌ వైపూ నిలబడలేదు.

అయితే, భారత్‌లో జీ20 సదస్సు తర్వాత ట్రూడో బహిరంగంగా వ్యాఖ్యలు చేసేందుకు కొన్ని వారాల ముందే అమెరికా అధికారుల దగ్గర దీనిపై సమాచారముందని ప్రస్తుతం మనకు తెలుస్తోంది. ఈ విషయంపై జీ20 సదస్సు సమయంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎదుట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తంచేసినట్లు సీనియర్ అమెరికా అధికారి ధ్రువీకరించారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

‘అమెరికా ఏజెంటే హిట్‌మ్యాన్‌గా...’

గుప్తాపై ఇంటర్నేషనల్ నార్కోటిక్స్, వెపన్స్ ట్రాఫికింగ్‌ ఆరోపణలు కూడా ఉన్నాయని అమెరికా అధికారులు చెప్పారు. తాజా కుట్ర కోసం 2023 మేలో భారత్ ప్రభుత్వ అధికారి అతడిని నియమించుకున్నట్లు ఆరోపించారు.

నిజ్జర్‌తో పన్నూకు కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతు పలికే ‘సిక్స్ ఫర్ జస్టిస్’కు జనరల్ కౌన్సిల్‌గా పన్నూ పనిచేస్తున్నారు.

1980ల్లో భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తానీ ఉద్యమం పతాక స్థాయిలో ఉండేది. ఆ సమయంలో కొన్ని హింసాత్మక ఘటనలు, హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. భారత సైనిక బలగాల ప్రత్యేక ఆపరేషన్‌తో ఆ ఉద్యమం తీవ్రత తగ్గింది. అయితే, అప్పుడప్పుడు మళ్లీ ప్రత్యేక దేశం ఆరోపణలను కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు చేస్తున్నాయి. కొన్ని పశ్చిమ దేశాల్లోనూ ఈ డిమాండ్లు వినిపిస్తున్నాయి.

నిజ్జర్ తరహాలోనే పన్నూను కూడా భారత్ ప్రభుత్వం ‘టెర్రరిస్టు’గా ప్రకటించింది. అయితే, తమపై చేసే ఆరోపణలను వీరిద్దరూ ఖండించారు.

తాజా అభియోగపత్రంలోని వివరాల ప్రకారం, కొన్ని వారాలపాటు పన్నూ కదలికలను గుప్తా ట్రాక్ చేశారు. భారత్ ప్రభుత్వంలో ‘సీనియర్ ఫీల్డ్ అఫీసర్’గా పరిచయం చేసుకున్న ఓ అధికారి నుంచి గుప్తాకు దీనిపై ఆదేశాలు అందేవి.

ఈ కుట్రను భగ్నం చేసేందుకు అమెరికా ఏజెంటే హిట్‌మ్యాన్‌గా జోక్యం చేసుకున్నట్లు అభియోగపత్రంలో పేర్కొంది.

ఆ కుట్ర ముందుకు వెళ్లేటప్పుడు, పన్నూ తర్వాత హత్య చేయాల్సిన మరికొందరి పేర్లను కూడా ఆ హిట్‌మ్యాన్‌కు గుప్తా వెల్లడించారు. ‘‘చాలా పనుంది. చాలా మందిని మనం హత్య చేయాలి’’ అని జూన్‌లో ఒక ఫోన్ కాల్‌లో గుప్తా చెప్పినట్లు అభియోపగ్రతంలో పేర్కొన్నారు.

ఆ హత్యల్లో కొన్నింటి కోసం అమెరికా సరిహద్దులను కూడా దాటాల్సి ఉంటుంది. జూన్ 12న కెనడాలో మనకు ఒక పెద్ద టార్గెట్ ఉందని గుప్తా చెప్పినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

దీనికి ఆరు రోజుల తర్వాత జూన్ 18న నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలోని ఒక గురుద్వారా ఎదుట ఇద్దరు గన్‌మెన్లు కాల్చి చంపారు.

గురు పత్వంత్ సింగ్ పన్ను

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకే తాజా కుట్ర జరిగినట్లు అమెరికా మీడియా చెబుతోంది

స్పందించేందుకు నిరాకరించిన కెనడా దర్యాప్తు సంస్థలు

కెనడా నేషనల్ పోలీస్ ఫోర్స్, ద రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రస్తుతం నిజ్జర్ హత్యపై దర్యాప్తు చేపడుతున్నాయి. ఈ రెండు సంస్థలూ ప్రస్తుత అభియోగపత్రంపై స్పందించేందుకు నిరాకరించాయి.

ప్రస్తుత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుప్తాకు ఆ హత్యలో నేరుగా ప్రమేయం ఉందని అమెరికా ప్రాసిక్యూటర్లు చెప్పలేదు. అయితే, హత్యకు ముందు, ఆ తర్వాత దీని గురించి ఆయన హిట్‌మ్యాన్‌తో మాట్లాడారని అంటున్నారు.

నేరుగా తనే వెళ్లి ఆ హత్య చేస్తానని భారత్‌లోని ఆ అధికారికి గుప్తా చెప్పినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. మరోవైపు అమెరికాలోని హిట్‌మ్యాన్‌తోనూ ఆయన మాట్లాడారని, కెనడాలో ఒక ప్రముఖుడిని హత్య చేయాలని, ఆ ప్రముఖుడు నిజ్జర్ అని కూడా చెప్పారు.

‘‘ఇది అసలు బాలేదు. నేను నీకు వీడియో పంపించాను. కానీ, వేరెవరో ఆ హత్య చేశారు’’ అని గుప్తా చెప్పినట్లు అభియోగపత్రంలో అన్నారు.

‘‘నిజ్జర్ హత్య తర్వాత గుప్తాకు కాస్త కోపం వచ్చింది. ఇక పన్నూ విషయంలో అసలు ఆలస్యం చేయకూడదని ఆయన అమెరికా ఏజెంట్‌తో అన్నారు. ఇది పూర్తయిన తర్వాత మరో మూడు హత్యలు కూడా చేయాలి. ఈ మూడు కెనడాలోనే అని కూడా చెప్పారు’’ అని అభియోగపత్రంలో చెప్పారు.

ఖలిస్తానీ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

కొత్త ప్రశ్నలు

తాజా అభియోగపత్రం తర్వాత కెనడా పౌరులకు పొంచివున్న ముప్పులపై కొత్త ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

హత్యకు ముందు కూడా నిజ్జర్‌ను కెనడా భద్రతా సంస్థలు హెచ్చరించాయి. అయితే, ఈ ముప్పులపై కెనడాకు అమెరికా సమాచారం ఇచ్చిందా, లేదా అనే విషయంలో స్పష్టత లేదు.

‘‘ఎఫ్‌బీఐకి అందుబాటులో ఉన్న ఈ నిఘా సమాచారం కెనడాకు తెలియకుండా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే కెనడా, అమెరికా భద్రతా సంస్థల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి’’ అని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ సీనియర్ ఫెలో వెస్లీ వార్క్ అన్నారు.

పన్నూ హత్య కుట్రను అమెరికా అడ్డుకున్నప్పుడు, నిజ్జర్ హత్యను కెనడా ఎందుకు అడ్డుకోలేకపోయింది?

‘‘ఇది పూర్తిగా భద్రతా సంస్థల వైఫల్యమని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది’’ అని వార్క్ అన్నారు.

‘‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. అక్కడ హత్యకు ఒకేసారి రెండు, మూడు సంస్థలు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఒకరిని అడ్డుకుంటే మరొకరు ఈ హత్య చేసి ఉండొచ్చు’’ అని ఆయన చెప్పారు.

అయితే, తాజా కుట్ర విషయంలో భారత ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్లినట్లు వైట్‌హౌస్ స్పష్టంచేసింది. ఈ విషయంలో భారత్ అధికారులు విస్మయం, ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది.

అమెరికా ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చిన తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్లు భారత్ వెల్లడించింది.

ఇటు అమెరికా, అటు భారత్, తమ దౌత్య సంబంధాలపై ఈ కుట్ర ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నాయని ఇంటర్నేషనల్ అఫైర్స్ నిపుణురాలు కార్విన్ అన్నారు.

‘‘ఈ విషయాన్ని వీలైనంత సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు వాషింగ్టన్ నుంచి దిల్లీకి చాలా ఫోన్‌కాల్స్ వచ్చి ఉండొచ్చు’’ అని ఆమె చెప్పారు.

దౌత్యపరమైన ఒడిదొడుకులను పక్కన పెడితే, తాజా అభియోగపత్రం కెనడాలో సిక్కులు ఎప్పటినుంచో చెబుతున్న వాదనకు బలం చేకూరుస్తోందని బ్రిటిష్ కొలంబియాలోని రేడియో హోస్ట్, సిక్కు జర్నలిస్టు గుర్‌ప్రీత్ సింగ్ అన్నారు.

‘‘మేం ఎప్పటినుంచో ఇదే చెబుతున్నాం. ఇక్కడ అసమ్మతి గళం వినిపించే వారిని భారత ప్రభుత్వం అణచివేస్తోందని చెబుతున్నాం. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య దీనికి ఉదాహరణ’’ అని ఆయన అన్నారు.

(అదనపు రిపోర్టింగ్: నాదీన్ యూసఫ్)

వీడియో క్యాప్షన్, భావితరాలకు అవగాహన కల్పించేందుకే అంటున్న చరిత్రకారుడు పీటర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)