బర్రెలక్క: ఎన్నికల్లో ఓడినా ఆమె గెలిచింది ఏమిటి?

బీబీసీతో మాట్లాడుతున్న బర్రెలక్క
ఫొటో క్యాప్షన్, బీబీసీతో మాట్లాడుతున్న బర్రెలక్క

బర్రెలక్క (కర్నె శిరీష)- తెలంగాణ ఎన్నికల్లో ‘సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్’గా నిలిచిన నిరుద్యోగ అభ్యర్థి. కొల్లాపూర్‌ నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు సామాజిక మాధ్యమాలలో మద్దతు వెల్లువెత్తింది. ఆమె గెలవాలని సామాజిక మాధ్యమాలలో చాలా మంది కోరుకున్నారు.

అయితే ప్రస్తుత ఎన్నికల రణరంగంలో బర్రెలక్కలాంటి ఓ సామాన్య యువతి గెలవడం సాధ్యమేనా? రాజకీయాలంటే డబ్బుగా మారిపోయిన తరుణంలో కనీసం రోజు గడవడం కూడా కష్టమైన బర్రెలక్క ప్రజల దృష్టిని ఆకర్షించారు కానీ, ఎన్నికల రణరంగంలో పరాజితగానే నిలిచారు.

మరి బర్రెలక్క పోటీ ఎందుకంత సంచలనం అయింది? ఆమె పోటీని ఏ విధంగా చూడాలి? ఆమె ఓటమిని దేనికి ప్రతీకగా చూడాలి? బీఆర్ఎస్, కాంగ్రెస్ పేర్లు మాత్రమే వినిపించిన చోట బర్రెలక్క పేరు బలంగా ఎందుకు వినిపించింది?

బర్రెలక్క
ఫొటో క్యాప్షన్, బర్రెలక్క పోటీ తెలంగాణ సమాజంలో సంచలనమైంది

బర్రెలక్క ఓ ధిక్కార స్వరం

బర్రెలక్క పోటీ వర్తమాన రాజకీయాలపై విసిగిపోయిన ప్రజలకు ప్రతీకగా చూస్తున్నారు. మోసపోయిన నిరుద్యోగుల గొంతుకగా ఆమె ఎన్నికలలో పోటీ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన ప్రభుత్వంపై ఆమె ఓ సామూహిక నిరసన గళమయ్యారు. సాధారణ ప్రజల మధ్య ఆమె మరీ సాధారణ యువతి. ఆమెకు ఇల్లు లేదు. డబ్బు లేదు. పార్టీ లేదు. అన్నింటికీ మించి ఉద్యోగం లేదు. అనేక పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన సగటు నిరుద్యోగి.

డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు (గేదెలు) కాసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, కేస్‌లో చిక్కుకున్నయువతి ‘బర్రెలక్క’.

ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్ కావడంతో కర్నె శిరీష అనే ఆమె అసలు పేరు స్థానంలో బర్రెలక్క అనేది స్థిరపడిపోయింది.

ఆమె బర్రెల వీడియో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ పోలీసులు అప్పట్లో కేసు పెట్టారు. ప్రభుత్వం, అధికార పార్టీయే తనపై కేసు పెట్టించిందంటూ, ఆ కేసు కారణంగా తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఆమె కన్నీరు పెట్టడంతో సమాజంలో ఆమెకు చాలా మంది మద్దతుగా నిలిచారు.

సమాజంలో సాధారణ వ్యక్తులకు కూడా రాజకీయ అవకాశాలు దక్కాలని, వారు కూడా చైతన్యవంతులవ్వాలని కోరుకున్నవారందరూ బర్రెలక్కలో తమను తాము చూసుకున్నారు. అందుకే ఆమెకు తెలుగు సమాజం నుంచి మద్దతు పలికేవారు ఎక్కువయ్యారు.

నిజానికి కొల్లాపూర్‌లో కంటే ఆమెకు బయటి ప్రాంతాలలోనే ఎక్కువ మద్దతు కనిపించింది. ఈ విషయం ప్రస్తత కౌంటింగ్‌లోనూ ప్రతిఫలించింది.

కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ నుంచి బీరం హర్షవర్థనరెడ్డి లాంటి వారి మధ్య బర్రెలక్క గెలవకపోవచ్చు. కానీ ఆమె సమాజంలోని చైతన్యస్థాయికి ప్రతీకగా నిలవగలిగారు. ప్రభుత్వం తప్పు చేస్తే అడిగగలిగిన సామాన్యులు కూడా ఉంటారని చెప్పడానికి బర్రెలక్క ఓ ఉదాహరణగా నిలిచారని ఆమె మద్దతుదారులు గర్వంగా చెప్పుకొంటున్నారు.

బర్రెలక్క

ఫొటో సోర్స్, BARRELAKKA CREATIONS

ఫొటో క్యాప్షన్, ఉద్యోగం లేక బర్రెలు కాస్తున్నానంటూ తీసిన వీడియోనే శిరీషను బర్రెలక్కగా మార్చింది

సోషల్ మీడియా వర్సెస్ గ్రౌండ్ రియాల్టీ

సోషల్ మీడియాతో ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు నేరుగా జనంలోకి వస్తున్న బర్రెలక్కకు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఫాలోవర్లున్నారు.

యూట్యూబ్‌లో ఒకటిన్నర లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో మరో లక్ష మంది ఫాలోవర్లు ఉన్న ఆమె ఎన్నికలలో ఆ ఫాలోయింగ్ కలిసొస్తుందన్న ఆశ పెట్టుకున్నారు కానీ అది నెరవేరలేదు.

సామాజిక మాధ్యమాలలో లభించిన మద్దతు క్షేత్రస్థాయిలో ఆమెకు దక్కలేదు. కొల్లాపూర్‌లో ఆమెకు ఆశించిన ఫలితం లభించలేదు. దీంతో ఆమె ప్రభావం సోషల్ మీడియాకే ప్రభావితమైందని, లైకులు కొట్టేవారు, షేర్లు చేసేవారు ఓట్లు వేస్తారా అని వ్యంగాస్త్రాలు వేయడం మొదలైంది. అయితే బర్రెలక్క పోటీ మరో ప్రత్యామ్నాయం కోరుకునేవారందరికీ ఊపిరి పోసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలనే ఉద్దేశంతో వీరంతా ఈమెకు మద్దుతు పలికారంటారు.

బర్రెలక్క
ఫొటో క్యాప్షన్, తనకు పడిన ప్రతి ఓటు విలువైనదే అన్న బర్రెలక్క

ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తా: బర్రెలక్క

తన ఓటమి గురించి బర్రెలక్క మాట్లాడుతూ- తనకు వచ్చిన ప్రతి ఓటు విలువైనదేనన్నారు. తాను ఎవరికీ డబ్బు ఇవ్వకపోయినా ప్రజలు ఇష్టంతో, నిజాయతీతో ఓటు వేశారని చెప్పారు. వారందరికీ ధన్యవాదాలని చెప్పారు.

కంచె ఐలయ్య, జేడీ లక్ష్మీనారాయణ లాంటివారు తన తరపున ప్రచారం చేయడం సంతోషం కలిగించిందన్నారు.

‘‘నాకు 6,000 ఓట్లు వేశారు. ఒక్క రూపాయి డబ్బు పంచకుండా నిజాయతీగా నాకు ఓట్లేశారు. నేను గెలిచానని భావిస్తున్నా. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటా. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తా’’ అని బర్రెలక్క చెప్పారు.

కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు దాదాపు 30 వేల మెజారిటీతో గెలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)