సునీల్ కనుగోలు: తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక పనిచేసిన ఈ వ్యూహకర్త ఎవరు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సునీల్ కనుగోలు.. ఇప్పుడీ పేరు కాంగ్రెస్ పార్టీలో బాగా వినిపిస్తోంది.
మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక సునీల్ వ్యూహాలు బాగా పనిచేశాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక కూడా సునీల్ వ్యూహాలు ఉన్నాయన్నది అంతటా వినిపిస్తున్న మాట.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కష్టపడి పనిచేయడంతోపాటు సునీల్ వ్యూహాలూ కలిసొచ్చాయంటున్నారు.
సునీల్ కనుగోలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
సునీల్ కనుగోలుకు రేవంత్ రెడ్డి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆయన తెలంగాణలో తన వ్యూహాలను చక్కగా అమలు చేయగలిగారని సీనియర్ జర్నలిస్ట్ మెరుగుమాల నాంచారయ్య బీబీసీతో చెప్పారు.
సునీల్ బళ్ళారిలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. అమెరికాలో ఎంబీఏ చేశారు. అక్కడే ఓ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు.
అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ (ఏబీఎం) కు సహవ్యవస్థాపకుడిగా ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రయాణం మొదలుపెట్టారు.
ఈ సంస్థ భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నికల వ్యూహాలు రూపొందించింది.
2014లో నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తీసుకువచ్చిన సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ)లో సునీల్ భాగస్వామిగా ఉన్నారు.
అయితే 2022లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నం చేశాక, సునీల్ కనుగోలు కూడా అదే పార్టీలో చేరడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.
బీజేపీతో తన అనుబంధానికి భిన్నంగా సునీల్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చేరువై రచించిన వ్యూహాలు గతంలో ఏబీఎం, సీఏజీ ప్రచారం చేసిన వాటికి ప్రతిరూపంగా కనిపించాయి.
2022లో కాంగ్రెస్ పార్టీ కీలక ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యాక సోనియాగాంధీ ఈయనను 2024 లోక్‌సభ పోల్స్ టాస్క్ ఫోర్స్ సభ్యునిగా నియమించారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగోలు విభిన్నమైన ఆలోచనలు, చక్కని ఇన్ పుట్స్ ఉన్నాయని చెబుతారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో వ్యూహకర్తగా సునీల్ తన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు.
ముఖ్యంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం సీటు కోసం ఉన్న పోటీ పార్టీపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడటంతో ఆయన విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Telangana Congress
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బొమ్మైపై 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చడంలో సునీల్ సఫలమయ్యారు
‘పేసీఎం’ పేరుతో సామాన్యుల వరకు ఈ ప్రచారాన్ని తీసుకువెళ్ళారు. అలాగే అమూల్ వర్సెస్ నందినీ డెయిరీ వ్యవహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టడంతో సునీల్ వ్యూహాలు బలంగా పనిచేశాయి. అన్నింకంటే ముఖ్యంగా సామాన్యుడిని మెప్పించేలా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలో సునీల్ బృందం పాత్ర ఉంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ తదితర ప్రజాకర్షక పథకాల వెనుక సునీల్ ఉన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సునీల్ కనుగోలును తన సలహాదారుగా నియమించుకుని కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. కర్ణాటక విధాన సౌధలోని మూడో ఫ్లోర్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రాంగణంలోనే ఈయనకూ కార్యాలయాన్ని కేటాయించారు. అయితే ఆయన ఆ పోస్టు తీసుకోలేదు.
తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాల ఎన్నికల వ్యూహాల బాధ్యత ఉండటంతో వాటిపైనే ఆయన దృష్టిసారించారు.
ఇక తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు వ్యూహాలను అమలు చేయడంలో సునీల్ పాత్ర కీలకంగా మారింది. కర్ణాటక తరహాలోనే కాంగ్రెస్ పార్టీ హామీలను ఇవ్వడానికి కారణం సునీల్ వ్యూహమేనని చెబుతారు.
‘‘తెలంగాణ, కర్ణాటకలకు సాంస్కృతికంగానూ దగ్గర పోలికలు ఉన్నాయి. ఒకనాడు కల్యాణ కర్ణాటక హైదరాబాద్‌లో భాగంగానే ఉండేది. ఈ దగ్గరితనం కూడా సునీల్ కనుగోలు వ్యూహాలకు పనికొచ్చి ఉంటుంది. చెన్నైలో ఎక్కువ కాలం ఉండటం కూడా ఆయనకు మొత్తంగా దక్షిణాది రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడి ఉండవచ్చు’’ అని నాంచారయ్య అభిప్రాయపడ్డారు.
సునీల్‌కు తెలుగు నేపథ్యం ఉందని, తెలంగాణను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అది కూడా ఉపయోగపడి ఉంటుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, FACEBOOK
తెలంగాణలో కర్ణాటక సీన్ రిపీట్
తెలంగాణలో రూ.500లకే గ్యాస్ సిలెండర్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 , ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతుభరోసా కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచడం, కౌలు రైతులకూ ఈ పథకం వర్తింపజేయడం, వ్యవసాయ కార్మికులకు రూ.12వేలు, వరిపంటకు ఏడాదికి రూ. 500 బోనస్, గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి రూ. 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్ళు, యువ వికాసం, చేయూత పథకాలతో కాంగ్రెస్ పార్టీ సామాన్యల మనసు గెలుచుకునేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్ పాత్ర ఉందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్న మాట.
అలాగే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బీజేపీతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేసి, మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేయడంలోనూ సునీల్ పాత్ర ఉందని చెపుతారు.
కానీ, తెలంగాణలో మాదిరిగా చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఆయన వ్యూహాలు పని చేసినట్టు కనిపించడం లేదు.
వివాదాలు
సునీల్ కనుగోలుపై వివాదాలు కూడా ఉన్నాయి. 2022 డిసెంబరులో తెలంగాణ పోలీసులు ఈయన కార్యాలయం మైండ్ షేర్ ఎనలిటిక్స్ పై దాడిచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించే రీతిలో సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారంటూ కేసు నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయ ప్రతీకార చర్య అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- కేటీఆర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: మెజార్టీ రాకపోతే బీజేపీ సపోర్ట్ తీసుకుంటారా?
- రేవంత్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: ‘కాంగ్రెస్‌లో అంతమంది సీఎం అభ్యర్థులున్నారంటే కారణం అదే’
- కైలాస: 'నిత్యానంద దేశం'తో ఒప్పందం కుదుర్చుకున్న పరాగ్వే అధికారిపై వేటు, అసలేం జరిగిందంటే...
- అమెరికాలో తీవ్ర నేరాల కింద అరెస్టైన సత్తారు వెంకటేశ్‌రెడ్డికి, వైసీపీకి సంబంధం ఏంటి, టీడీపీ ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














