వెస్ట్‌‌ బ్యాంక్: ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి వెళ్లి వచ్చిన 12 ఏళ్ల బాలుడి కథ ఇది...

వెస్ట్ బ్యాంక్
ఫొటో క్యాప్షన్, తల్లి ఫాలెస్తీన్ నిఖ్లేతో కరీమ్
    • రచయిత, ముహనాద్ టుటుంజీ
    • హోదా, బీబీసీ న్యూస్

పాలస్తీనాకు చెందిన ఆరుగురు పిల్లల తల్లి ‘ఫాలెస్తీన్ నిఖ్లే’ సొమ్మసిల్లి పడిపోయారు.

మేం వారి ఇంట్లో ఉన్నప్పుడే ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఇజ్రాయెల్ సైన్యం నిర్బంధంలోనున్న ఆమె 12 ఏళ్ల కుమారుడు ఫోన్ చేశాడు.

ఆమె మొఖం కన్నీళ్లతో తడిచిపోయింది. ఆమె చేతులు, కాళ్లు ఒక్కసారిగా బిగిసుకుపోయినట్లుగా అయిపోయాయి.

ఒక నిమిషం కంటే తక్కువ సేపు మాత్రమే ఆమె కొడుకుని మాట్లాడేందుకు అనుమతించారు.

వెస్ట్‌ బ్యాంక్
ఫొటో క్యాప్షన్, స్నేహితులతో మాట్లాడుతున్న కరీమ్

‘‘హలో కరీమ్, నిన్ను ఏం చేస్తున్నారు?’’ అని ఆమె ప్రశ్నించారు.

‘‘ఇంకా ఏమీలేదమ్మా, నేను ఇంటెరాగేషన్ రూమ్‌లోనే ఉన్నాను’’ అను కరీమ్ సమాధానం ఇచ్చాడు.

‘’12 ఏళ్ల బాలుడిని ఇంకా వారు ప్రశ్నిస్తున్నారా?’’ అని ఆ సంభాషణ వింటున్న అధికారిని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.

‘‘చట్టప్రకారం ఇది తప్పనిసని, తప్పనిసరి’’ అని ఆయన సమాధానం ఇచ్చారు.

‘‘అతడి పక్కన ఎవరైనా ఉన్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు.

‘‘నేను అతడితోనే ఉన్నాను’’ అని ఆ అధికారి సమాధానం ఇచ్చారు.

‘‘మీరు 18 ఏళ్ల వయసున్న వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు అతడి వెంటన అతడి తండ్రి, లేదా న్యాయవాదిని వచ్చేందుకు అనుమతిస్తారు. కానీ, 12 ఏళ్ల బాలుడిని ఎవరూ తోడులేకుండా ఎలా అరెస్టు చేస్తారు?’’ అని ఆమె ప్రశ్నించారు.

‘‘అతడు బానే ఉన్నాడు, ఏమైనా ఉంటే మేమే చెబుతాం’’ అని ఆ అధికారి సమాధానం ఇచ్చాడు.

‘‘అతడిని ఎప్పుడు విడిచిపెడతారు’’ అని ఆమె ప్రశ్నించారు.

అయితే, ఆ మాట విన్న తర్వాత ఆ అధికారి ఫోన్ పెట్టేశారు.

జాలాజోన్ శరణార్ధి శిబిరాలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘240 మంది పాలస్తీనా ప్రజలకు నిర్బంధం’’

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన మొదటి వారంలోనే వెస్ట్ బ్యాంక్‌లో కరీమ్‌ను ఇజ్రాయెల్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కాల్పుల విరమణ సమయంలోనే వెస్ట్ బ్యాంక్‌లో 240 మంది పాలస్తీనా వాసులను అరెస్టు చేశారని స్థానిక స్వచ్ఛంద సంస్థ ‘పాలస్తీనియన్ ప్రిజనర్స్ క్లబ్’ తెలిపింది. ఈ నంబరును ఇజ్రాయెల్ అధికారులు తోసిపుచ్చలేదు.

హమాస్‌తో కాల్పుల విమరణ ఒప్పందంలో భాగంగా విడుదల చేసిన పాలస్తీనా ఖైదీల కంటే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

వెస్ట్ బ్యాంక్
ఫొటో క్యాప్షన్, కరీమ్ నలుగురు సోదరులను ఇజ్రాయెల్ సైనికులు ఖైదు చేశారు

కరీమ్ కుటుంబానికి ఇజ్రాయెల్ అధికారులతో తరచూ గొడవలు జరిగేవి.

17 నుంచి 25 ఏళ్ల వయసున్న అతడి నలుగురు సోదరులను ఇప్పటికే జైల్లో వేశారు. వీరిలో ముగ్గురిపై కనీసం అభియోగాలు కూడా మోపలేదు. ఒకరిని మాత్రం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను 15 నెలల జైలు శిక్ష విధించారు.

అయితే, ఇంత చిన్న పిల్లాడిని కూడా అరెస్టు చేస్తారని ఈ కుటుంబం ఎప్పుడూ ఊహించలేదు.

రమల్లాకు ఉత్తరాన ఉండే జాలాజోన్ శరణార్థి శిబిరాల సమూహంలోని తమ ఇంట్లోకి ఆ రోజు ఉదయం ఆరు గంటలకు డజన్ల మంది ఇజ్రాయెల్ సైనికులు చొరబడ్డారని కరీమ్ బంధువు సలాం ఘవాన్మే చెప్పారు.

ఆ రోజు వీరి ఇంటికి పొరుగున ఉండే వ్యక్తి రెండో ఫ్లోర్ కిటికీ నుంచి ఫోన్‌లో నాటి దృశ్యాలను రికార్డు చేశారు. వీటిలో సాయుధ సైనికులు ఇంట్లోకి వెళ్తూ కనిపించారు.

కార్లో మెషీన్ గన్

ఒక పాలస్తీన్ వర్క్‌షాప్‌లో తయారుచేసిన ఒక మెషీన్ గన్‌తో కరీమ్ ఆడుతూ కనిపిస్తున్న ఒక వీడియో వల్లే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తన సోదరుడి స్నేహితుడికి ఓ ఆలివ్ చెట్టు కింద ఒక బ్యాగ్ దొరికిందని, దానిలోనే ఆ గన్ను ఉందని, దానితో తాము ఆడుకున్నామని, ఆ తర్వాత దాన్ని పోలీసులకు అప్పగించామని కరీమ్ చెబుతున్నాడు.

ఆ రైడ్ జరిగేటప్పుడు కరీమ్ తన తండ్రి ఇంట్లో ఉన్నారు. వెంటనే అతడిని అప్పగించాలని అతడి తండ్రికి ఆ రోజు ఫోన్ చేశారు.

దగ్గర్లోనీ ఇజ్రాయెల్ స్థావరంలోని నిర్బంధ కేంద్రానికి కరీమ్‌ను ఆయన తండ్రే తీసుకెళ్లారు. ప్రశ్నించిన తర్వాత అతడిని విడిచిపెడతారని ఆయన భావించారు. కానీ, ఎలాంటి ఆరోపణలు లేకుండానే కరీమ్‌ను ఖైదు చేశారు.

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, EPA

ఆ శరణార్థి శిబిరాల్లో..

జాలాజోన్ గ్రామంలో ఇజ్రాయెల్ అరెస్టు చేయని లేదా నిర్బంధంలోకి తీసుకోని యువకులు లేదా పెద్దవారు కనిపించడం చాలా అరుదు.

కొంచెం ముందుకు వెళ్తే, ఈ శిబిరాల సమూహానికి చివర్లో కొత్తగా నిర్మించిన ఒక ఇంట్లోకి 18 ఏళ్ల ఇహామ్ నహాలా అడుగుపెడుతూ కనిపించారు.

అతడికి స్వాగతం పలికేందుకు ఇరుగుపొరుగువారు కూడా వచ్చారు.

ఎలాంటి అభియోగాలూ మోపకుండానే 14 నెలలపాటు ఇహామ్‌ను ఖైదు చేశారు. దీన్ని ఇక్కడ ‘అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్’గా పిలుస్తారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ విడిచిపెట్టిన వారిలో అతడు కూడా ఒకరు.

శాంతి, భద్రతలకు విఘాతం కలిగించినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ పత్రాల్లో పేర్కొన్నారు.

ఇప్పుడు తన కాలేజీ విద్యను పూర్తిచేసి, కుటుంబానికి చెందిన స్టీల్ వ్యాపారంలో అడుగుపెట్టాలని ఇహాన్ భావిస్తున్నాడు. అయితే, మళ్లీ తనను అదుపులోకి తీసుకుంటారనే భయం అతడిని వెంటాడుతూనే ఉంది.

‘‘అర్ధరాత్రి వరకూ మేలుకొని ఉండనని, ఇజ్రాయెల్ సైనికులు కనిపిస్తే, తల దించుకొని వెళ్లిపోతానని మా అమ్మకు ప్రమాణం చేశాను’’ అని అతడు చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్-వెస్ట్ బ్యాంక్.. చరిత్ర ఇదీ

హమాస్ ఖైదీల విడుదల

రమల్లాలో ఖైదీల వివరాలను చూసే పాలస్తీనా అథారిటీ మంత్రి ఖడోరా ఫేర్స్ ఖైదీల రికార్డులను పరిశీలిస్తూ కనిపించారు. అతడి డెస్కుకు ఎదురుగా పెద్ద టీవీ కనిపిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన చర్చల వార్తలు దానిలో వస్తున్నాయి.

ప్రపంచంలోని ఇతర మంత్రులతో పోలిస్తే ఆయన పని చాలా భిన్నమైనది. జైళ్లను పర్యవేక్షించడం, సంస్కరించడానికి బదులుగా వీలైనంత మందిని ఇజ్రాయెల్ సైనిక బలగాల జైళ్ల నుంచి విడిపించేందుకు ఆయన పనిచేస్తున్నారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో ఎవరిని బయటకు విడిచిపెట్టాలో సూచించేందుకు హమాస్‌తో ఆయన నేరుగా మాట్లాడుతున్నారు.

మిలింటెట్లను, సీనియర్ హమాస్ ఫైటర్లను, హత్య కేసుల్లో శిక్షలు పడిన వారిని కూడా బయటకు విడిచిపించేందుకు చేసే ప్రయత్నాలను మీరు ఎలా సమర్థించుకోగలరని మేం ఆయన్ను ప్రశ్నించాం.

‘‘మీరు ఇక్కడి పరిస్థితులను నేరుగా చూడండి. వీరు ఖైదీలు కాదు, స్వాతంత్ర సమర యోధులు. శాంతి చర్చలకు వీరిని విడిచిపెట్టడం తప్పనిసరి’’ అని ఫేర్స్ చెప్పారు.

ఫేర్స్ చెప్పే మాటలతో పాలస్తీనాలో దాదాపు అంతా ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. ఖైదీలను తీసుకొస్తున్న రెడ్ క్రాస్ బస్సులకు రమల్లాలో పెద్దయెత్తున ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారు. ఇదొక కవాతులా జరుగుతోంది. కొందరు నినాదాలు చేస్తుంటే, మరికొందరు హమాస్ జెండాలు ఎగురవేస్తున్నారు.

అయితే, ఇజ్రాయెల్ మాత్రం ఈ ఖైదీలను టెర్రరిస్టులుగా చూస్తోంది. అక్టోబరు 7నాటి హమాస్ దాడి వీరితో పొంచివున్న ముప్పుకు నిదర్శనంగా చెబుతోంది.

ఇజ్రాయెల్ అధికారులు తాజాగా జరిగిన మరో దాడిని ఉదాహరణగా చూపిస్తున్నారు. జెరూసలేంలో గురువారం ఉదయం ఆ దాడి జరిగింది. దీనిలో ముగ్గురు చనిపోగా, 16 మంది గాయపడ్డారు. ఇక్కడ యూదులు జీవించే పరిసరాల్లో ఇద్దరు సోదరులు కాల్పులు జరిపారు.

ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు.

‘‘ఆ ఇద్దరూ హమాస్ ప్రతినిధులే’’ అని ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మంత్రి ఇతమార్ బెన్ వీర్ చెప్పారు.

‘‘ఇక్కడ వారు రెండు స్వరాలతో మాట్లాడుతున్నారు. వీటిలో ఒకటి కాల్పుల విరమణ, రెండోది ఉగ్రవాద దాడులు’’ అని ఆయన అన్నారు.

వెస్ట్ బ్యాంక్
ఫొటో క్యాప్షన్, తనకు ఇజ్రాయెల్ అధికారులు కొట్టారని కరీం చెప్పాడు

ఇంటికి కరీమ్

మళ్లీ జాలాజోన్‌కు వస్తే, కరీమ్ ఇంటికి చేరుకున్నాడు. అయితే, అతడి కుటుంబం ఇంకా షాక్‌లోనే ఉంది.

మేం మాట్లాడేటప్పుడు అతడి మెడ, కుడి కాలిపై ఎర్రని మచ్చలను చూపించాడు. తనతో చాలా దురుసుగా ప్రవర్తించారని, కొట్టారని కూడా అతడు చెప్పాడు.

‘‘నాకు భయం వేస్తోంది. నేను పెద్దయిన తర్వాత, మా అన్నయ్యల్లానే నన్ను కూడా చాలాకాలం జైలులో పెడతారేమోనని భయమేస్తోంది’’ అని అతడు అన్నాడు.

పోలీసుల నిర్బంధంలోనున్న ఏడు గంటల్లో తనకు సెక్యూరిటీ కెమెరాల వీడియోలు చూపించారని కరీమ్ చెప్పాడు. దీనిలో ఇజ్రాయెల్ చేతిలో హత్యకు గురైన పాలస్తీనా పిల్లల దృశ్యాలు ఉన్నాయని వివరించారు.

ఎప్పుడైనా రాళ్లు రువ్వితే తనకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారని అతడు చెప్పాడు.

జరిమానాగా తమ నుంచి 2,000 ఇజ్రాయెలీ షెకెల్స్ (రూ.30,000) కట్టించుకున్నారని అతడి కుటుంబం తెలిపింది.

ఆ కుటుంబానికి జరిమానా విధించారా? అని అడిగినప్పుడు, ‘‘సరైన వివరాలు లేకపోవడంతో మీకు సమాధానం ఇవ్వలేకపోతున్నాం’’ అని ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు.

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా, ఇజ్రాయెల్
ఫొటో క్యాప్షన్, కరీంలాంటి పిల్లలు వీధుల్లో ఆడుకోవడమే తప్పా అని కరీం బంధువు అస్లాం ప్రశ్నించారు

అతడి నుంచి ఏం కోరుకుంటున్నారు?

‘‘జో బైడెన్, బెంజమిన్ నెతన్యాహు.. మీరు 12 ఏళ్ల బాలుడి నుంచి ఏం కోరుకుంటున్నారు’’ అని కరీమ్ బంధువు సలాం ప్రశ్నించారు.

‘’12 ఏళ్ల బాలుడి కోసం సైనికులు ఇంటికి వచ్చారు. తన నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు తను ఏం చేశాడు? వీధుల్లో ఆడుకోవడమే తప్పా? అతడికి తల్లి అవసరముంది’’ అని ఆయన అన్నారు.

సెప్టెంబరు 1 నాటికి తమ నిర్బంధంలో 156 మంది పాలస్తీనా మైనర్లు ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. వీరిలో 23 మంది అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్‌లో ఉన్నారు.

కరీమ్‌ను విడిచిపెట్టారు. కానీ, ఇక్కడి ప్రజలు ఎప్పుడు అరెస్టవుతామనే భయంతో జీవిస్తున్నారు.

అదనపు రిపోర్టింగ్: డేనియేల్ విటెన్‌బర్గ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)