ఉజ్బెకిస్తాన్ అమ్మాయిలను అక్రమంగా భారత్‌కు తరలించి బలవంతంగా సెక్స్‌వర్కర్లుగా మార్చేస్తున్నారు...

- రచయిత, దిల్‌నవాజ్ పాషా, దీపక్ జస్రోటియా
- హోదా, బీబీసీ ప్రతినిధులు, దిల్లీ
దక్షిణ దిల్లీలో రద్దీగా ఉన్న ఓ రోడ్డులో ఉజ్బెకిస్తాన్ షాపు దాటిన తర్వాత అఫ్రోజా గతంలో తనను బంధించిన ఫ్లాట్‌కు వెళ్లే దారులను గుర్తు చేసుకున్నారు.
ఉజ్బెకిస్తాన్‌లోని అందీజాన్‌కి చెందిన అఫ్రోజా 2022లో దిల్లీ వచ్చారు. మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు (హ్యూమన్ స్మగ్లర్లు) ఆమెను దుబాయ్, నేపాల్ మీదుగా దిల్లీకి తీసుకొచ్చారు.
ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వేర్వేరు ఫ్లాట్లు, హోటళ్లలో ఉంచి బలవంతంగా సెక్స్ వర్క్ చేయించారు.
'ఎంపవరింగ్ హ్యుమానిటీ' అనే స్వచ్ఛంద సంస్థ, దిల్లీ పోలీసుల చొరవతో 2022 ఆగస్టులో ఆమె సెక్స్‌వర్క్ కూపం నుంచి బయటపడ్డారు.
అప్పటి నుంచి ఎన్జీవో సంరక్షణలో ఉంటూ, ఉజ్బెకిస్తాన్ నుంచి దిల్లీకి తీసుకొచ్చిన ట్రాఫికర్స్‌పై ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.
ఆమెకు ఇంటి నంబర్లు గుర్తులేవు. దారితప్పి చాలా వీధులు తిరిగిన తర్వాత, చివరగా దిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని ఒక పెద్ద భవనం ముందు ఆగారు. ఆమెను తీసుకొచ్చిన మొదట్లో ఇక్కడే ఉంచారు.
ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఊపిరి తీసుకోవడం కూడా భారమైంది. కొద్దిసేపటి తర్వాత ఆమె కళ్లలో కోపం కనిపించింది. వేగంగా మెట్లు ఎక్కుతూ, తనను బంధించి, హింసించిన ఫ్లాట్ ముందు ఆమె నిల్చున్నారు.
''నన్ను ఇక్కడికి తీసుకొచ్చేప్పటికి ఐదుగురు అమ్మాయిలు ఈ ఫ్లాట్‌లో ఉన్నారు. ఉజ్బెకిస్తాన్ నుంచి దుబాయ్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేపాల్, ఆ తర్వాత రోడ్డు మార్గంలో దిల్లీకి తీసుకొచ్చారు. నేను బాగా అలసిపోవడంతో రెండు రోజులు విశ్రాంతి తీసుకోనిచ్చారు'' అని అఫ్రోజా చెప్పారు.
''ఆ తర్వాత నన్ను షాపింగ్‌కి తీసుకెళ్లారు. చిన్న చిన్న బట్టలు కొనిచ్చారు. రెండు రోజుల తర్వాత, సెక్స్ వర్క్ చేయమని బలవంతం చేశారు. నేను చేయనని చెప్పడంతో బాగా కొట్టారు'' అని ఆమె అన్నారు.

''దిల్లీ వచ్చిన తర్వాత కేవలం మొదటి రెండు రోజులు మాత్రమే ఖాళీగా ఉన్నా. ఆ తర్వాత కనీసం ఒక్క రోజు ప్రశాంతంగా కూర్చోవడానికి వీల్లేకుండా చేశారు. ఒక్కోసారి ఫ్లాట్‌లో ఉంచేవారు. ఒక్కోసారి హోటళ్లో ఉంచేవారు'' అని చెప్పారు.
ఉద్యోగాల ఆశచూపి మధ్య ఆసియా దేశాల నుంచి ప్రతి సంవత్సరం వందలాది మంది అమ్మాయిలను నేపాల్ మీదుగా భారత్‌కు తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా సెక్స్ వర్క్ చేయిస్తున్నారు.
మెడికల్ వీసా, టూరిస్ట్ వీసాల మీద కూడా చాలా మంది అమ్మాయిలను తీసుకొస్తున్నారు.
కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, అఫ్రోజాను సోషల్ మీడియా ద్వారా సంప్రదించిన ట్రాఫికర్లు దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఆమె తల్లి అనారోగ్యం గురించి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు.
''దుబాయ్‌లో ఉద్యోగం ఇస్తామనడంతో సరేనన్నా. దిల్లీ వచ్చే వరకూ నాతో ఇలాంటి పని చేయిస్తారని అస్సలు తెలియదు. కొద్దిగా అనుమానం వచ్చి ఉన్నా అసలు ఇక్కడకు వచ్చేదాన్ని కాదు'' అని అఫ్రోజా అన్నారు.
హ్యూమన్ ట్రాఫికర్లు, దోపిడీదారులు, బ్రోకర్ల నెట్‌వర్క్ ద్వారా అఫ్రోజా వంటి అమ్మాయిలను నిరంతరం కస్టమర్లకు సరఫరా చేస్తూ అక్రమ సెక్స్ వర్క్ దందాను నిరాటంకంగా కొనసాగుతోంది.
“అక్రమంగా దేశంలోకి ప్రవేశించినా, వీసా గడువు ముగిసినా వాళ్లు ఇంకా భారత్‌లో ఎలా ఉంటున్నా పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయనేదే పెద్ద ప్రశ్న'' అని హ్యూమన్ ట్రాఫికింగ్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న హేమంత్ శర్మ అన్నారు.
''మధ్య ఆసియా నుంచి తీసుకొస్తున్న అమ్మాయిలకు ఇక్కడి భాష తెలియదు. ఇక్కడ వాళ్లకి తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరు. అదే పెద్ద సమస్య'' అన్నారాయన.

అక్రమ రవాణాకు బలైపోయిన బాధిత మహిళలతో మాట్లాడినప్పుడు, తమ పాస్‌పోర్టులు తీసేసుకుని, జైలుకి పంపిస్తామని బెదిరించినట్లు వారు బీబీసీతో చెప్పారు.
2022 ఆగస్టులో దిల్లీ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంతో అఫ్రోజాను భారత్‌కు తీసుకొచ్చిన అజీజా శేర్ పరారయ్యారు. ఆమెకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి.
దిల్లీ పోలీసులు సుదీర్ఘంగా గాలించి తుర్కిమెనిస్తాన్‌కి చెందిన అజీజా శేర్, అఫ్తానిస్తాన్‌కి చెందిన ఆమె భర్త షెర్గెట్ అఫ్గాన్‌ను గోవాలో అరెస్టు చేశారు. అజీజా వద్ద భారత ధ్రువపత్రాలతో పాటు, వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
''అజీజా ఓ క్రిమినల్. ఆమెను అరెస్టు చేసేందుకు దిల్లీ పోలీసులు ఏడాది పాటు గాలించారు. టెక్నాలజీతో నిఘా, విశ్వసనీయవర్గాల సమాచారంతో వాళ్లు గోవాలో ఉన్నట్లు తెలిసింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వాళ్లని అరెస్టు చేశాం'' అని ఈస్ట్ దిల్లీ డీసీపీ అమృతా గులుగోత్ చెప్పారు.
ఈ కేసులో మయూర్ విహార్ అసిస్టెంట్ ఎస్‌హెచ్‌వో ప్రమోద్ కుమార్, అతని బృందం దాదాపు 200 ఫోన్ నంబర్లను ట్రేస్ చేసి, అజీజా శేర్‌ను పట్టుకోగలిగారు. తమ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఈ హ్యూమన్ ట్రాఫికర్లను అదుపులోకి తీసుకున్నారు.
అజీజా చేతిలో బలైపోయింది ఒక్క అఫ్రోజా మాత్రమే కాదు. అజీజా చెర నుంచి ఇంకా చాలా మంది అమ్మాయిలను రక్షించగలిగారు.
వారిలో తెహ్మీనా ఒకరు. జాబ్ పేరుతో ఆశపెట్టి తెహ్మీనాను 2020లో దిల్లీకి రప్పించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బలవంతంగా సెక్స్ వర్క్‌లోకి నెట్టేశారు.

దిల్లీ పోలీసుల విచారణలో తెహ్మీనా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో తెహ్మీనాను దారుణంగా కొడుతున్నారు. అది 2022 ఆగస్టుకి ముందు జరిగిన ఘటన. పోలీసు దర్యాప్తులో బయటపడింది.
ఆ వీడియో నిజమేనని నిర్ధారించారు తెహ్మీనా. ''అజీజా చేతిలో చిక్కుకుపోయాను. ఒకసారి ఒక మంచి కస్టమర్ వస్తే తనను ఎలాగైనా ఈ రొంపి నుంచి బయటపడేయాలని వేడుకున్నా.''
''నాకు సాయం చేయాలని ఆయన అజీజా శేర్‌తో మాట్లాడారు. ఆ తర్వాత నన్ను దారుణంగా కొట్టారు. అది వీడియో తీశారు. ఆ వీడియోను అమ్మాయిలందరికీ చూపించి భయపెట్టారు'' అని ఆమె చెప్పారు.
ప్రస్తుతం తెహ్మీనాపై ఫారినర్స్ యాక్ట్ (వీసా లేకుండానే భారత్‌లో అక్రమంగా ఉండడం) కింద కేసు నమోదైంది. ఆ కేసు ప్రస్తుతం గురుగ్రామ్ కోర్టులో నడుస్తోంది. తనను భారత్‌కు తీసుకొచ్చిన బ్రోకరే తనపై ఈ కేసు పెట్టాడని, దీంతో ఇండియాలోనే ఇరుక్కుపోయినట్లు ఆమె చెప్పారు.
అజీజా అరెస్టుతో తెహ్మీనాకు కొంత ఉపశమనం కలిగింది. అంతకుముందు ఆమె దినదినగండంగా గడిపేది.
''దానిని ఎప్పుడు తలుచుకున్నా భయమేస్తుంది. ఎప్పుడూ భయంభయంగా ఉండేదాన్ని. నన్ను కొడుతున్న వీడియో వైరల్ చేశారు. ఇంకా అప్పు ఉన్నానని చెప్పేవారు'' అని తెహ్మీనా అన్నారు.
సెక్స్ వర్క్ కారణంగా తెహ్మీనా ఆరోగ్యం పాడైంది. ఆమె గర్భాశయానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఒక్కదాన్నే వదిలేశారని, పూర్తిగా కోలుకోకముందే బలవంతంగా సెక్స్ వర్క్ చేయించారని తెహ్మీనా వాపోయారు.
తెహ్మీనా, అఫ్రోజా వంటి అమ్మాయిలను రోజుకి ఆరు నుంచి తొమ్మిది మంది కస్టమర్ల వద్దకు పంపించేవారు.

పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్న స్మగ్లర్లు, బ్రోకర్ల డైరీలను బీబీసీ పరిశీలించింది. అందులో అమ్మాయిలతో చేయించే సెక్స్ వర్క్, లక్షల సంపాదనకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి.
అందులో తమకు వాటా కూడా ఇచ్చేవారు కాదని, అప్పు ఉన్నామని చెబుతూ తమ వద్ద డబ్బులు వసూలు చేసేవారని బాధిత అమ్మాయిలు చెప్పారు.
అఫ్రోజా కూడా అలాంటి ఆరోపణలే చేశారు. ''మా అమ్మకు ఆరోగ్యం బాగోదు. నాకు డబ్బు చాలా అవసరం. కానీ నాకు రూపాయి కూడా ఇచ్చేవారు కాదు. నేను ఆమె వద్ద 9 నెలలు ఉన్నా. అయినా నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇంకా నువ్వే అప్పు ఉన్నావని చెప్పేవాళ్లు'' అని ఆమె అన్నారు.
అఫ్రోజా 2022 ఆగస్టులో ఎలాగో తప్పించుకుని సాయం కోసం ఉజ్బెకిస్తాన్ ఎంబసీ వద్దకు వెళ్లింది. అంతలోనే ఆమె తలకు తుపాకీ గురిపపెట్టి ఎంబసీ దగ్గరి నుంచి తీసుకొచ్చేశారు. ఈ ఘటనపై చాణక్యపురి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తన ఒంటిపై బ్లేడుతో కోసిన, సిగరెట్లతో కాల్చిన గుర్తులను అఫ్రోజా చూపించారు. ''ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఇలా హింసించేవారు'' అని ఆమె అన్నారు.
అఫ్రోజా ఇక్కడకు వచ్చేప్పటికే తెహ్మీనా వారి చెరలో చిక్కుకుపోయి ఉన్నారు.
''ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వేర్వేరు ప్రదేశాలకు చెందిన అమ్మాయిలకు ఫోన్లు చేస్తుంటారు. వాళ్లను నమ్మొద్దని నేను అఫ్రోజా లాంటి వారికి చెప్పాలనుకున్నా కుదిరేది కాదు. అందుకు అవకాశం ఉండేది కాదు. మాలాంటి పాత అమ్మాయిలను కొత్తగా వచ్చేవారికి దూరంగా ఉంచేవారు'' అని తెహ్మీనా చెప్పారు.
ఇలా యువతులతో బలవంతంగా సెక్స్ వర్క్ చేయిస్తున్న ప్రదేశాలను బీబీసీ సందర్శించింది. పోలీసుల ఆపరేషన్ తర్వాత సెక్స్ వర్క్ కార్యకలాపాలు కాస్త తగ్గినప్పటికీ, ఇంకా కొనసాగుతున్నాయి.
"హ్యూమన్ ట్రాఫికర్స్ అరెస్టుతో ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను ఇండియాకు తీసుకొచ్చి వారి పాస్‌పోర్టులను లాక్కుని బలవంతంగా సెక్స్ వర్క్‌లోకి దించుతున్న నెట్‌వర్క్ లింక్ కచ్చితంగా తెగిపోతుంది'' అని డీసీపీ అమృత అన్నారు.
విదేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి సెక్స్ వర్క్‌లోకి దించడంపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారామె.

అదే సమయంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నియంత్రించడంలో ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయని స్వచ్చంధ సంస్థలు చెబుతున్నాయి.
''అందులో మొదటిది భారత్‌లోకి అమ్మాయిలను తీసుకొస్తున్న నేపాల్ బోర్డర్. ఈ యువతులు అసలు వీసా లేకుండానే దిల్లీకి రాగలుగుతున్నారు'' అని హేమంత్ శర్మ అన్నారు.
''ఆ తర్వాత దిల్లీలో పాటు ఇతర పెద్ద నగరాలకు పంపించి సెక్స్ వర్క్ చేయిస్తున్నారు. అయితే, ఇదంతా పోలీసులకు తెలియకుండా ఎలా జరుగుతుందనేదే పెద్ద ప్రశ్న'' అన్నారాయన.
''రెండోది బాధితులకు పునరావాసం. గతంలో ఫారినర్స్ యాక్ట్ కింద అమ్మాయిలకు బెయిల్ ఇచ్చేవారు. వాళ్లని డిటెన్షన్ సెంటర్‌కు పంపేవాళ్లు కాదు. అలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉండాలి? ఎలా బతకాలి? చట్టపరమైన సమస్యలన్నీ తొలగిపోయే వరకూ వారి ఖర్చులు ఎవరు భరిస్తారు? వంటి అవసరాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది'' అన్నారు హేమంత్ శర్మ.
తెహ్మీనాకు తమ దేశం వెళ్లిపోవాలని ఉన్నప్పటికీ ఆమెపై కేసు గురుగ్రామ్ కోర్టులో విచారణలో ఉంది. తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసు పెట్టారని ఆమె అన్నారు.
అలాగే, హ్యూమన్ ట్రాఫికర్స్ కేసులో అఫ్రోజా సాక్షిగా ఉన్నారు.
వాస్తవానికి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు బలైన యువతుల్లో ఎక్కువ మంది ఫారినర్స్ యాక్ట్ కింద కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మానవ అక్రమ రవాణాలో బాధితులుగా ఉన్న అలాంటి వారు దేశం విడిచి వెళ్లేలా చట్టాల్లో వెసులుబాటు లేదు. ఫారినర్స్ యాక్ట కింద నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నందు వల్ల కేసు ముగిసే వరకు వారు దేశం విడిచి వెళ్లిపోయేందుకు అనుమతులు లేవు. చట్టపరంగా వారు ఇండియా దాటి వెళ్లలేరు. దీంతో బాధితులు అయినప్పటికీ చివరి వాంగ్మూలం ఇచ్చే వరకూ దేశం విడిచి వెళ్లేందుకు చట్టాలు అనుమతించడం లేదు.
అయితే, బాధితులు కోరుకున్నప్పుడు తమ దేశానికి వెళ్లొచ్చన్నారు ఇదే తరహా కేసులు వాదిస్తున్న లాయర్ జుబేర్ హష్మీ.
''ఈ కేసుల్లో బాధితులు తమ దేశానికి తిరిగి వెళ్లకూడదని కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. వారిని ఎవరూ ఆపడం లేదు'' అని హష్మీ అన్నారు.
ఇలా మధ్య ఆసియా నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా అవుతున్న అమ్మాయిల సంఖ్య గురించి నిర్దిష్టమైన గణాంకాలు లేవు. అయితే, ఆ సంఖ్య కచ్చితంగా వేల సంఖ్యలో ఉంటుందని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
(ఈ కథనంలో బాధితులను గోప్యంగా ఉంచడానికి వారి పేర్లను మార్చాం)
ఇవి కూడా చదవండి:
- నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల పెళ్ళి రిజిస్ట్రేషన్
- LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్... ఈ పదాలకు అర్థం ఏంటి?
- పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- ఇలా పోపట్: 50 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నా, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ ఈమె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















