ప్రపంచంలోనే అతి ‘దీన ఏనుగు’ చివరకు ఎలా కన్ను మూసిందంటే....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయెల్ గ్వింటో
- హోదా, బీబీసీ న్యూస్
‘దీన ఏనుగు’ అంటూ పర్యావరణ కార్యకర్తలు పిలుచుకునే మాలి అనే ఏనుగు మరణించింది.
ఫిలిప్పీన్స్‌లోని మనీలా జూలో నివసించిన ఈ ఏనుగు, దాదాపు తన జీవితమంతా ఒంటరిగానే గడిపింది.
నాలుగు దశాబ్దాలుగా మనీలా జూలో స్టార్‌గా అందరి ఆదరణ పొందిన మాలి కి నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు.
అయితే, మాలి ఇలా ఒంటరిగా జీవించడం పట్ల జంతుహక్కుల కార్యకర్తలు, ప్రేమికులు చాలాకాలంగా అభ్యంతరాలు తెలుపుతూనే ఉన్నారు.
వారిలో సంగీత కళాకారులు సర్ పాల్ మెక్‌కార్టెనీ ఒకరు. ఆయన మాలి ని ఏనుగుల సంరక్షణ కేంద్రానికి పంపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం మనీలా మేయర్ హనీ లాకూనా ఒక ఫేస్‌బుక్ వీడియో ద్వారా మాలి మృతి గురించి సందేశం విడుదల చేశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలన్ని మాలితో ముడిపడి ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
గత శుక్రవారం, మాలి తన తొండాన్ని గోడకు రుద్దుతూ కనిపించిందని, అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పడానికి అది సంకేతమని జూ ప్రధాన వెటర్నరీ వైద్యులు డా.పాట్రిక్ పెనా-డోమింగో చెప్పారు.
మంగళవారం ఉదయం మాలి నేలపై పడుకుని భారంగా శ్వాసతీసుకుంటూ కనిపించింది. వైద్యం చేసినప్పటికీ మధ్యాహ్నానికి మృతి చెందింది.
పోస్టుమార్టంలో మాలి శరీరంలోని భాగాలకు క్యాన్సర్ సోకిందని, దమనుల్లో బ్లాకేజ్ ఏర్పడిన విషయాన్ని గుర్తించామని వైద్యులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక నుంచి..
మాలి పూర్తిపేరు విశ్వ మాలి. 1981లో మాలిని శ్రీలంక ప్రభుత్వం ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు మార్కోస్‌కు బహుమతిగా పంపింది. అప్పుడు మాలి వయసు 11 ఏళ్లు. ఫిలిప్పీన్స్‌లోని మనీలా జూకు వచ్చే సమయానికి అక్కడ శివ అనే మరో ఏనుగు కూడా ఉండేది. 1977లో జూకు తీసుకువచ్చిన శివ అనారోగ్యంతో 1990లో చనిపోయింది. అప్పటి నుంచి మాలి అదే జూ లో ఒంటరిగా ఉంటోంది.
కోవిడ్ సమయంలో కూడా అన్ని ప్రదేశాలను మూసివేసినా, మనీలా జూ మాత్రం పిల్లలకు విడిది స్థలంగా మారింది. జూలో మాలి ప్రధాన ఆకర్షణగా అలరించింది.
జంతు హక్కుల కార్యకర్తలు మాత్రం మనీలా జూలో పరిస్థితులు సరిగా లేవని, మాలికి సరైన వైద్యం అందించే సదుపాయాలు, సంరక్షుకులు లేరని విమర్శించారు. బందీగా జీవించడం కన్నా, స్వేచ్ఛను కల్పించాలని ఎప్పటినుంచో అంటున్నారు.
అయితే జూ అధికారులు మాత్రం ఆ ఏనుగుకు అటవీ జీవితం ఎలా ఉంటుందో తెలీదని, జూ లో ఉంచడమే ఉత్తమమని చెప్పారు.
ఇదిలా ఉంటే, 2012లో సర్ పాల్ మెక్‌కార్టనీ ఫిలిప్పీన్స్ అధ్యక్షులు మూడో బెనిగ్నో అక్వినోకు రాసిన లేఖలో మాలికి స్వేచ్ఛను కల్పించాల్సిందిగా కోరారు.
“మనీలా జూలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మాలిని బదిలీ చేయాలని వినిపిస్తున్న వారితో నేను కూడా గొంతుకలుపుతున్నాను. మీకు నా రిక్వెస్ట్‌ను పంపుతున్నాను” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
రాక్‌బ్యాండ్ మాజీ సభ్యుడు, సంగీత కళాకారుడు మొరిస్సి కూడా మాలి జీవితంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇదే అప్పీల్ చేశారు. అయినప్పటికీ, మనీలా జూ నుంచి మాలిని బయటకు తీసుకురాలేదు.
సోషల్ మీడియాలో నివాళులు
“ప్రపంచలోని దీన ఏనుగుల్లో ఒకటైన మాలి చనిపోయింది. మాలి ఆత్మకు శాంతి చేకూరాలి” అని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) స్పందించింది.
ఎక్స్ వేదికగా ఫిలిప్పీన్స్‌కు చెందిన పలువురు మాలికి నివాళులు అర్పిస్తున్నారు. మాలితో తమ చిన్ననాటి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని, జూ సందర్శనలో మాలి తమను అలరించిందని గుర్తుచేసుకుంటున్నారు.
“11 ఏళ్ల క్రితం నా జీవితంలో తొలిసారిగా నేను మాలిని చూశాను. ఒంటరిగా నడుస్తున్న తీరు చూస్తే నా గుండె పగిలినట్లు అనిపించింది. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న మాలిని చూసి బాధ కలిగింది” అని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
“మాలి వార్త బాధాకరం. ఫిలిప్పీన్స్‌లోని ప్రముఖ ఏనుగు మరణించింది. ఇక జూలలో ఏనుగులు లేనట్లే” అని మరో యూజర్ రాశారు.
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మనీలా మేయర్ హనీ లాకూనా మాట్లాడుతూ, మరో ఏనుగును ఇవ్వాల్సిందిగా తాము శ్రీలంక ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు.
మాలితో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న సంరక్షుకులు మాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అయితే, మాలిని శాంక్చురీకి బదిలీ చేసే అంశాన్ని తామెప్పుడూ పరిశీలించలేదని చెప్పారు.
“మాలి ఒంటరిగా కనిపించొచ్చు కానీ, మాలి వెనుక మేం ఉన్నాం” అని హనీ అన్నారు.
“మనీలా జూకు వచ్చేవారందరినీ ప్రేమతో ఆహ్వానించేంది. మాలి మా జీవితాల్లో భాగమైపోయింది” అని ఆమె గద్గద స్వరంతో అన్నారు.
ఇవి కూడా చదవండి..
- నేపాల్: లక్షమంది టీచర్లు వీధుల్లోకి ఎందుకు వచ్చారు... వారి ఆగ్రహానికి కారణమేంటి?
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- హిట్లర్‌కు సన్నిహితులైన గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














