మార్లిన్ సావంత్: గేమ్ షోల గుట్టు విప్పిన ‘అత్యంత తెలివైన’ మహిళ ఈమె...

ఫొటో సోర్స్, GETTY IMAGES
మీరో టెలివిజన్ గేమ్ షోలో ఉన్నట్టుగా ఊహించుకోండి. మీకో బ్రాండ్ న్యూ కారును గెలుచుకునే అవకాశం ఉంది. కానీ మీరీ కారును గెలవాలంటే మూడు తలుపుల ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈ మూడింటిలో ఒక డోరు వెనుక కారు ఉంది. సో.. ఆ కారు ఏ తలుపు వెనుక ఉందో ఆ డోరును మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.
అయితే మిగిలిన రెండు తలుపుల వెనుక కూడా బహుమతి ఉంటుంది. కాకపోతే మీరందుకునే బహుమతి కారు కాదు.
మీరు ఒకవేళ మూడు తలుపుల్లోనూ మధ్య తలుపును ఎంచుకున్నారనుకోండి... ఈ కార్యక్రమాన్ని మరింత సస్సెన్స్ థ్రిల్లర్‌లా మార్చేసేందుకు ఆ తలుపు వెనుక ఏముందనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నిస్తారు. ఏ తలుపు వెనుక కారు ఉందో యాంకర్‌కు తెలుసు.
యాంకర్ ఈ ప్రశ్న వేయగానే మీరు ఆలోచనలో పడతారు. దీంతో యాంకర్ మీరింకా రెండో తలుపునే ఓపెన్ చేయాలనుకుంటున్నారా? లేక మొదటి తలుపును ఎంపిక చేసుకుంటారా అని అడుగుతారు.
మీరు మీ సెకండ్ డోర్ ఎంపికకే కట్టుబడి ఉంటే మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. అంటే రెండో తలుపు వెనుక కారు గెలుచుకోవడానికి 50 శాతం అవకాశం ఉందంటే, మీరు వేరే బహుమతితో ఇంటికి వెళ్ళడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది.
కానీ మార్లిన్ వాస్ సావంత్ లా చేస్తే మీరు గెలిచే అవకాశం 66 శాతానికి పెరుగుతుంది. గెలవడానికి ఉన్న అవకాశాలన్నీ ఎంత తేలికైనవో, అంత కష్టమైనవి కూడా.

ఫొటో సోర్స్, Getty Images
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
‘ఆస్క్ మార్లిన్’ పేరుతో మార్లిన్ మాక్ వాస్ సావంత్ ఓ అమెరికన్ మేగజైన్‌లో ఓ కాలమ్ నిర్వహించేవారు. ఇందులో వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. అలాగే అనేక విషయాలపై తమ భావాలను పంచుకునేవారు.
మార్లిన్ నవలలు, ఆత్మకథలు రాశారు. ఇన్వెస్ట్‌మెంట్ రంగంలోనూ పనిచేశారు. ఆమె ఇంటెలిజెన్స్ కోషియంట్(ఐక్యూ) 228గా ఉంది. ఇది సాధారణ సగటుకు రెండింతలు ఎక్కువ.
ఈమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. 1985 నుంచి 1989 దాకా ‘అత్యంత తెలివితేటలు కలిగిన మహిళ’గా ఆమె గుర్తింపు పొందారు. అలాగే ఆమె ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి కూడా.
మార్లిన్ తల్లిదండ్రులు యూరోప్ నుంచి వలస వచ్చారు. మధ్య అమెరికాలోని మిస్సోరిలో సెయింట్ లూయిస్ పట్టణంలో మార్చి 8, 1946న మార్లిన్ జన్మించారు. తల్లిదండ్రుల పేర్లను ఇంటిపేరుగా పెట్టుకోవాలని ఆమె చెపుతారు. ఇందులో భాగంగా ఆమె తన తల్లిపేరు సావంత్ ను తన పేరు చివర తగిలించారు. సావంత్ అనే పదానికి ఫ్రెంచ్ భాషలో ‘‘ తెలివైన వ్యక్తి ’’ అని అర్థం.
మార్లిన్ పాఠశాలలో ఉండగానే సైన్స్, లెక్కలలో పట్టు సాధించారు. ఈమె పదేళ్ళ వయసులో స్టాన్‌ఫోర్డ్‌లో బైనెట్ హాఫిన్స్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన ఐక్యూ టెస్ట్‌లో 228 మార్కులు సాధించారు. అప్పటి నుంచి ఆమెను ఓ ’ గిఫ్టెడ్ చైల్డ్’గా చూశారు.
కానీ ఈ గుర్తింపు ఆమె జీవితాన్ని పెద్దగా మార్చలేదు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఆమె తన తల్లిదండ్రులకు షాప్ నిర్వహణలో సాయపడేవారు. పుస్తకాలు చదవడం ఆమెకు మహా ఇష్టం.
అమెరికాలోని ప్రసిద్ధ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ని కూడా అభ్యసించారు. మధ్యలో కొంతకాలంలో ఆమె తన తల్లిదండ్రుల వ్యాపారాన్ని చూసుకోవడానికి చదువుకు విరామం కూడా ఇచ్చారు.
రచయిత కావాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి 1970 నుంచి డబ్బు సంపాదించడం ప్రారంభించారు. వార్తా పత్రికలలోనూ, ప్రసిద్ధ ఇంటెలిజెన్స్ క్విజ్‌లలో పాల్గొనేవారు. ఆమె న్యూయార్క్‌కు వెళ్ళాక అక్కడ డేవిడ్ లెటర్‌మాన్స్ స్టార్ టాక్‌షోలో కనిపించారు. మేథస్సు అంటే ఏమిటి అని ఈ షోలో ఆమెను పదేపదే ప్రశ్నించారు.
ఈ షోలో ఫ్రాంక్లిన్‌కు సమాదానమిస్తూ ‘‘ మేథస్సు అనేది మీ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి మీకుండే సాధారణ సామర్థ్యం’ అని, ఐక్యూ అనేది మీకున్న జ్ఞానాన్ని మీరెంతవరకు ఉపయోగించగలుగుతున్నారని లెక్కగట్టేది’ అని చెప్పారు.
తరువాత ఆమె ‘‘ఆస్క్ మార్లిన్’’ అనే పేరుతో ఓ టాక్ షో ప్రారంభించారు.
1989లో ఓ షోలో ఆమె కారు గెలవడానికి ఏ తలుపు తెరవాలని ప్రశ్నించారు. ఆమె చెప్పిన సమాధానం విని గణితశాస్త్రవేత్తలను, సైన్స్ శాస్త్రవేత్తలను నివ్వెరపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త విషయమేమీ కాదు
ఈ విషయంపై మెర్లిన్ సావంత్ తన కాలమ్‌లో ఇదేమీ కొత్త విషయం కాదని రాశారు. దీనికి కొన్ని దశాబ్దాలకు ముందర అమెరికన్ టాక్ షో ‘లెట్స్ మేక్ ఏ డీల్’ లో కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఇటువంటి ప్రశ్నలన్నీ ఆ కార్యక్రమ ప్రయోక్త మాంటీ హాల్ పేరుతో ప్రసిద్ధి పొందాయి.
1975లో అమెరికన్ స్టాటిషియన్ జర్నల్‌లో స్టీవ్ సెల్విన్ అనే పరిశోధకుడు ఇటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అయితే మెర్లిన్ సావంత్, స్టీవ్ సెల్విన్ జవాబుల్లోని ‘తార్కికత’ ఒకటేకావడం సంచలనం సృష్టించింది.
‘‘నేను చెప్పిన లాజిక్ సరైనది. ఎందుకంటే మీరు మొదటి డోర్ ఎంపిక చేసుకున్నారనుకోండి మీకు మూడింట ఒక వంతు గెలిచే అవకాశం ఉంటుంది. అదే మీరు రెండో తలుపును ఎంచుకుంటే మూడింట రెండువంతులు గెలిచే అవకాశం ఉంటుంది. మీరు ఒకటో నెంబరు తలుపును ఎంచుకున్నారు. కానీ యాంకర్ కు ఆ తలుపు వెనుక ఏముందో తెలుసు. పైగా ఆమె మీరు ఈ బహుమానం గెలుచుకోకుండా చూస్తుంటారు. మిగతా రెండు తలుపుల్లో సరైనదానిని మీరు ఎంచుకోకుండా చేయడమే యాంకర్ ఉద్దేశం. మిమ్మల్ని తికమక పెట్టడం ద్వారా మీరు మనసు మార్చుకోవాలని చూడటమే యాంకర్ ఉద్దేశం.
సావంత్ సమాధానం చూశాకా, దీనికి ప్రతిస్పందనగా అనేక ఉత్తరాలు వచ్చి పడ్డాయి. 1991లో న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన ఓ వ్యాసంలో సావంత్‌కు పదివేల ఉత్తరాలు వచ్చాయని రాశారు. ఈ లెటర్లు రాసినవారిలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టరేట్ పొందినవారు, వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు.
‘ఇదంతా నాన్సెన్స్’ అని వర్జినీయాలోని జార్జి మాసన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ సాష్ చెప్పారు. ఓ కళాశాల ప్రొఫెసర్‌గా ప్రజలలో కళాశాల విద్యపట్ల అవగాహన లేకపోవడంపై కలత చెందుతున్నాను. దయచేసి మీ తప్పును ఒప్పుకోండి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోండి అని రాశారు.
ఇలాంటి విమర్శలు సరైనవి కావని చెప్పడానికే మెర్లిన్ సావంత్ ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేది.
జార్జిటౌన్ యూనివర్సిటీ లెక్కల ప్రొఫెసర్ ఈ.రేబోబో అయితే ‘‘ మీ వాదన శుద్ధతప్పు. ఇది తప్పు అని నిరూపించడానికి మీకెంత మంది గణిత శాస్త్రజ్ఞులు కావాలి’ అని రాశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆమె సమాధానం సరైనదే
నిజానికి మెర్లిన్ సావంత్ చెప్పిన సమాధానం సరైనదే. ఈ ప్రశ్న ఎప్పుడు సరైనది అవుతుందంటే ఒక తలుపు వెనుక ఏ బహుమతి ఉందో యాంకర్ వెల్లడించి, మిగిలిన రెండు తలుపులలో ఒకదానిని ఎంచుకోవడానికి మీకు అవకాశం ఇస్తే, అప్పుడు సావంత్ చెప్పిన రీజనింగ్ సరైనది అవుతుంది.
యాంకర్ ఓ తలుపు వెనుక ఏమున్నదో చెప్పాకా, మీరు మీ ఎంపికను మార్చుకున్నారనుకోండి మీరు గెలిచే అవకాశం 66 శాతానికి పెరుగుతుంది . ఒక తలుపు వెనుక ఏముందో అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మీ గెలుపు అవకాశం 50 శాతం ఉంటుందని చెప్పడం తప్పవుతుంది.
కేవలం ఏ తలుపును ఎంచుకోవాలనే నిర్ణయాన్ని మార్చుకోవడం వలన మీరు కారును గెలచుకోలేరు. కేవలం మీరు గెలవగలిగే అవకాశం మాత్రమే పెరుగుతుంది.
ఇది అనేక సందర్భాలలో నిరూపితమైంది కూడా. కొన్నేళ్ళ కిందట ఓ ప్రయోగంలో బీబీసీ భాగస్వామి అయింది. ఈసందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయ విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు.
పోటీదారులలోని 30మంది విద్యార్థులలో మనసు మార్చుకున్న 18 మంది కారును గెలుచుకున్నారు. అంటే దీనర్థం గెలిచే అవకాశం 60శాతం ఉందని. కానీ మిగిలిన గ్రూపులోని విద్యార్థులలో తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారో, వారిలో 11 మంది మాత్రమే కారును బహుమతిగా గెలచుకోగలిగారు. అంటే వీరి గెలుపు అవకాశం 36 శాతం మాత్రమే.
సావంత్‌ను విమర్శించినవారందరూ ఆమెకు క్షమాపణలు చెప్పలేదు కానీ, ప్రొఫెసర్ సాక్స్ మాత్రం క్షమాపణలు కోరారు. తానుచేసిన పనికి సిగ్గుపడుతున్నానని అన్నారు.
ఇవికూడా చదవండి :
- ఆంధ్రప్రదేశ్: ఇప్పటం గ్రామం ఇప్పుడెలా ఉంది, కూల్చేసిన చోట ఏం చేశారు?
- కైలాస: 'నిత్యానంద దేశం'తో ఒప్పందం కుదుర్చుకున్న పరాగ్వే అధికారిపై వేటు, అసలేం జరిగిందంటే...
- గాజా, యుక్రెయిన్ కాకుండా ఈ భూమ్మీద ఇంకెన్ని యుద్ధాలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
- తెలంగాణలో పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది? పల్లెలు, పట్టణాల మధ్య అంత తేడాకు కారణమేంటి?
- ప్రపంచంలోనే అతి ‘దీన ఏనుగు’ చివరకు ఎలా కన్ను మూసిందంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














