తెలంగాణలో పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది? పల్లెలు, పట్టణాల మధ్య అంత తేడాకు కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2018తో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గడంపై చర్చ జరుగుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో 71.34 శాతం పోలింగ్ నమోదైంది. భారత ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ టర్నవుట్ యాప్‌లో ఇది కనిపిస్తోంది.
అత్యధికంగా మునుగోడులో దాదాపు 91.89 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాఖుత్‌పురా నియోజకవర్గంలో దాదాపు 39.64 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ వివరాలు అప్‌డేట్ అవుతుండటంతో తుది గణాంకాలు వచ్చేసరికి స్వల్ప వ్యత్యాసం కనిపించవచ్చు.
ఈ సారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు రావాలని భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ), ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు పెద్దయెత్తున ప్రచారం చేశాయి. అయినప్పటికీ ఓటింగ్ శాతం తక్కువగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది.
2018 ఎన్నికల సమయంలో 2,80,75,912 మంది ఓటర్లు ఉండగా, 2,04,70,767 మంది ఓటు వేశారు. అంటే 73.74 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
2018తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గడం ఫలితాలను ఎలా ప్రభావితం చేయనుందనే చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, UGC
79 నియోజకవర్గాల్లో 70 శాతానికిపైగా పోలింగ్
తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ జరిగింది.
పదమూడు చోట్ల మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 106 నియోజకవర్గాల్లో జరిగింది.
సాయంత్రం ఐదు గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వాళ్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) వికాస్ రాజ్ చెప్పారు.
‘‘దాదాపు ప్రతి నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9, 10 వరకు పోలింగ్ జరిగింది. అందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించాం. నియోజకవర్గాల నుంచి ఓటింగ్ శాతంపై మరింత సమాచారం రావాల్సి ఉంది. దీనివల్ల పోలింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించవచ్చు’’ అని ఆయన తెలిపారు.
79 నియోజకవర్గాల్లో 70 శాతానికిపైగా పోలింగ్ జరిగినట్లు వివరించారు.

సీఈవో వికాస్ రాజ్ ఏమన్నారు?
తెలంగాణలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు.
పోలింగ్ రోజున హైదరాబాద్ నుంచి జిల్లాలకు పెద్దసంఖ్యలో ఓటర్లు సొంతూళ్లకు తరలివెళ్లారు.
బస్సులు, రైళ్లు, ఇతర రవాణా వాహనాలు కిటకిటలాడుతూ కనిపించాయి.
హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లడంతో నగరంలో ఓటింగ్ శాతం తగ్గిందనే వాదన వినిపిస్తోంది. ఈ ప్రభావం మొత్తం పోలింగ్ శాతంపై పడిందని అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు పెద్దసంఖ్యలో చైతన్య కార్యక్రమాలను ఈసీ చేపట్టింది. అయినప్పటికీ తక్కువగానే పోలింగ్ నమోదైంది.
‘‘పోలింగ్ శాతం తక్కువగా నమోదవ్వడానికి కారణాలను విశ్లేషించాల్సి ఉంది. ఈ విషయంపై వెంటనే స్పందించలేం. విశ్లేషణ జరిగాక పోలింగ్ శాతం ఎందుకు తగ్గిందో తెలుసుకుని దాని ఆధారంగా చెబుతాం’’ అని వికాస్ రాజ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధ్యతారాహిత్యం అనలేం: సుబ్బరంగయ్య
పోలింగ్ శాతం తగ్గడాన్ని బాధ్యతారాహిత్యమని చెప్పడానికి లేదన్నారు లెట్స్ ఓట్ ఫౌండేషన్ కన్వీనర్ కె.సుబ్బరంగయ్య.
‘‘హైదరాబాద్ లాంటి నగరంలో ఉండే ప్రజలు వేర్వేరు ప్రాంతాలకు నివాసాలు మార్చుకుంటారు. పల్లెల్లోకి వస్తే నూటికి 80-90 మంది అక్కడే ఉంటారు. కానీ పట్టణాల్లో అరవై మంది మాత్రమే ఉంటారు. వేరొక ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించకపోవడంతో జాబితాలో పేరున్నప్పటికీ, స్థానికంగా ఉండరు. ఆధార్‌తో ఓటరు ఐడీలను లింకు చేయాలి. అప్పుడు వచ్చే జాబితానే కచ్చితమైన ఓటరు జాబితా అని చెప్పవచ్చు’’ అని ఆయన చెప్పారు.
అలాగే పోలింగ్ రోజున కంపెనీలు, ఆఫీసులకు సెలవులు ఇస్తున్నారని, తర్వాత అందరూ ఓటు వేశారా, లేదా, అనేది ఆయా కంపెనీలు చూడాలని సుబ్బరంగయ్య చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవట్లేదు: పద్మనాభరెడ్డి
అర్బన్‌లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదవ్వడం, రూరల్‌లో ఎక్కువగా నమోదవ్వడం అనే ఆనవాయితీ ఎప్పుడూ కొనసాగేదే.
ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే పునరావృతం అయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల్లో కొన్నింటిలో 50 శాతం కూడా దాటలేదు.
అంటే కనీసం సగం మంది ఓటర్లు కూడా ఓటు వేయలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.
అర్బన్ నియోకవర్గాలు ఉన్న హైదరాబాద్ జిల్లాలో 47.88 శాతం పోలింగ్ శాతం ఉండగా.. రూరల్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.36 శాతం ఉంది.
ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజీని రూరల్, అర్బన్ అని రెండు వేర్వేరుగా చూడాలని చెబుతున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఛైర్మన్ ఎం.పద్మనాభరెడ్డి.
‘‘రూరల్ ప్రాంతాల్లో ఓటింగ్ దాదాపు 90 శాతం నమోదైంది. అదే అర్బన్ నియోజకవర్గాల్లో 40-50 శాతం మాత్రమే ఉండటంతో మొత్తం సగటుపై ప్రభావం చూపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఓటర్ల జాబితా సరిగ్గా రూపొందించకపోవడమే. రూరల్‌లో ఓటర్ల జాబితా స్థానికంగా ఉండే రెవెన్యూ సిబ్బంది తయారు చేస్తారు. అర్బన్‌లో మున్సిపల్ సిబ్బంది చేస్తారు. ఇక్కడ వాళ్లు అదనపు పనిభారంగా భావించి తప్పుల తడకగా రూపొందిస్తున్నారు. చనిపోయినవారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి. కానీ, అలా చేయడం లేదు. ఈ విషయంపై రెండు సార్లు మేం ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ పట్టించుకోవడం లేదు’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.
ఓటర్ల జాబితాలో తప్పులతోపాటు డబ్బున్న వాళ్లు ఓట్లు వేసేందుకు ముందుకు రావడం లేదని అనుకోవచ్చని పద్మనాభరెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్‌లలో ఎంత?
రాష్ట్రంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి ఉంది. ఇక్కడ 7,32,560 మంది ఓటర్లున్నారు. ఇక్కడ తాజా సమాచారం ప్రకారం చూస్తే 48.75 శాతం ఓటింగ్ శాతమే నమోదైంది. ఈ ఓటింగ్ శాతం తుది గణాంకాలు వచ్చేసరికి మార్పులు జరిగే అవకాశం ఉంది.
మరో పెద్ద నియోజకవర్గం కుత్బుల్లాపూర్. ఇక్కడ 6,99,239 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తాజా సమాచారం మేరకు 57.18 శాతం ఓటింగే నమోదైంది.
ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ తీరును ఓసారి పరిశీలిద్దాం.
ఈసారి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు.
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజురాబాద్‌తోపాటు గజ్వేల్ నుంచి బరిలోకి దిగారు.
ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఎక్కువగానే కనిపించింది.
గజ్వేల్‌లో 84.14 శాతం, కామారెడ్డిలో 75.58 శాతం, హుజూరాబాద్‌లో 83.19 శాతం, కొడంగల్‌లో 81.96 శాతం ఓటింగ్ నమోదైంది.
అలాగే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో 77 శాతం, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ పోటీ చేస్తున్న కరీంనగర్‌లో 63.23 శాతం పోలింగ్ నమోదైంది.
2018 ఎన్నికల్లో నమోదైన 73.7 శాతంతో పోలిస్తే ప్రస్తుతం నమోదైన ఓటింగ్ దాదాపు 2 శాతం తక్కువగా ఉంది.
గత ఎన్నికల్లో 46.9 శాతం ఓట్ షేర్‌తో బీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకుంది.
28.4 శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ 19 స్థానాలను తెచ్చుకుంది.
ఇప్పుడు ఓటింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభిస్తుందనేది కీలకంగా మారింది.
పోలింగ్ తర్వాత రేవంత్ రెడ్డి మీడిమాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 80కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ గెలుచుకునే స్థానాలు 25 దాటవన్నారు.
అదే సమయంలో బీఆర్ఎస్ 70కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్.
ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పగా, మరికొన్ని బీఆర్ఎస్ ముందంజలో ఉందని సూచించాయి.
ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3 ఆదివారం వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
- నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల పెళ్ళి రిజిస్ట్రేషన్
- LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్... ఈ పదాలకు అర్థం ఏంటి?
- పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- ఇలా పోపట్: 50 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నా, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ ఈమె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















