యానిమల్ సినిమా రివ్యూ: అర్జున్ రెడ్డి కాదు, అంతకు మించి...

యానిమల్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, FACEBOOK/SANDEEP REDDY VANGA

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

తొలి సినిమాకే ఒక ప్రత్యేకమైన ముద్రను సంపాదించుకునే దర్శకులు అరుదు. అలాంటి అరుదైన దర్శకుడే సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సంచలనం సృష్టించాడు. అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ బాక్సాఫీసు విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌తో 'యానిమల్' సినిమా చేశాడు.

ట్రైలర్, టీజర్లతో సినిమాపై హైప్‌ క్రియేట్ చేసి.. రాజమౌళి, మహేష్ బాబు లాంటి స్టార్స్‌ను ప్రమోషన్స్‌లో భాగం చేసి మరింత బజ్ క్రియేట్ చేశాడు సందీప్.

దీంతో బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాకు గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ తెలుగు విడుదలైన ఈ సినిమాకు దక్కింది.

అర్జున్ రెడ్డి అబ్బాయి, అమ్మాయి ప్రేమకథ అయితే, యానిమల్‌ని మాత్రం తండ్రీ కొడుకుల ప్రేమకథగా మలిచాడు సందీప్ వంగా.

మరి ఈ తండ్రి, కొడుకుల ప్రేమకథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? సందీప్ మరో విజయాన్ని నమోదు చేశాడా?

బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) దేశంలోనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాల్లో కూడా విస్తరిస్తాడు. బల్బీర్ సింగ్ కొడుకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్).

విజయ్‌కు నాన్న అంటే పిచ్చి ప్రేమ. చిన్నప్పటి నుంచి ఎంతో ఆరాధిస్తాడు. అయితే, బల్బీర్ సింగ్ తన వ్యాపారాల్లో బిజీగా ఉంటూ కుమారుడికి కావాల్సిన సమయం ఇవ్వడు. పైగా చాలా విషయాల్లో అతడి మనసు అర్ధం చేసుకోడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.

విజయ్ తీరు నచ్చక తండ్రి అతడిని బోర్డింగ్ స్కూల్‌లో వేసేస్తాడు. తర్వాత అమెరికా పంపించేస్తాడు. తిరిగి వచ్చాక కూడా తండ్రీకొడుకుల మధ్య ఒక విషయంలో గొడవ జరుగుతుంది.

ఇక ఇంట్లో ఉండలేనని భార్య గీతాంజలి (రష్మిక)తో కలసి అమెరికా వెళ్ళిపోతాడు విజయ్. ఒకరోజు బల్బీర్ సింగ్‌పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ వార్త తెలుసుకున్న విజయ్ మళ్ళీ తండ్రిని చూడడానికి ఇండియా తిరిగి వస్తాడు.

తండ్రిని చంపాలనుకున్న వారిని తన చేతులతో గొంతు కోసి చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌ను చంపాలని కుట్ర చేసింది ఎవరు? తండ్రీకొడుకుల మధ్య మనస్పర్ధలు తొలిగాయా? చివరికి విజయ్ తన పగ తీర్చుకున్నాడా లేదా? అనేది మిగతా కథ.

యానిమల్ రివ్యూ

ఫొటో సోర్స్, TSeries/YouTube

కథ పాతదే... క్యారెక్టర్ కొత్త

యానిమల్ పైకి తండ్రీకొడుకుల కథలా కనిపిస్తుంది. నిజానికి ఇది మామూలు రివెంజ్ స్టొరీనే. ఇందులో సంఘర్షణ కూడా పాతదే. అయితే, యానిమల్‌కి ప్రత్యేకతను తీసుకొచ్చింది కథానాయకుడి పాత్రని మలిచిన తీరు.

ఇది క్యారెక్టర్‌తో నడిచే చిత్రం. పాత్ర ప్రవర్తించే తీరుతోనే ఇందులో సన్నివేశాలు నడుస్తాయి. మనిషి ప్రవృత్తికి జంతు ప్రవృతికి తేడా ఉంటుంది. చాలా విషయాలపై మనిషి తన ఐక్యూతో స్పందిస్తాడు. కానీ, జంతువులకు ఐక్యూ వుండదు. వాటి సహజ ప్రవృత్తితో స్పందిస్తాయి.

యానిమల్‌లో హీరో పాత్రని కూడా జంతు ప్రవృత్తితో తీర్చిదిద్దాడు దర్శకుడు సందీప్ వంగా. ఒక ఉదాహరణ చెప్పాలంటే, చిన్నప్పుడు విజయ్ క్లాస్ రూమ్‌లో ఉంటాడు. ఇంతలో తన అక్క అక్కడికి వస్తుంది. అక్కని చూసిన విజయ్ క్లాస్ మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో క్లాస్ టీచర్ కామన్ సెన్స్, మేనర్స్ లేదా అని విజయ్‌ని కొడుతుంది.

ఈ సన్నివేశాన్ని లోతుగా పరీశిలిస్తే ఇందులో కథానాయకుడి పాత్ర ఎలాంటిదో అర్ధమౌతుంది.

ప్రేమను తెలియజేయడానికి కూడా మనిషి కొన్ని పద్దతులు పెట్టుకుంటాడు. అదే స్థానంలో ఓ ఆవు దూడ ఉంటే మరో దూడ దగ్గరికి వెళ్ళడానికి ఏ పద్ధతీ ఉండదు. ఇందులో కథానాయకుడి పాత్రని కూడా అలాంటి జంతు ప్రవృత్తితో నడిపాడు దర్శకుడు.

అందుకే ఇందులో చాలా సన్నివేశాలు సంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా సాగుతుంది. కథానాయకుడి మనస్తత్వం అర్ధం చేసుకుని ఈ కథని చూస్తే దర్శకుడు అంతర్లీనంగా చెప్పదలచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. ఒకవేళ ఆ పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోతే, ఇందులో చాలా సన్నివేశాలు అసలు అవసరమా అనిపిస్తాయి.

యానిమల్ ప్రయాణం ఎలా సాగింది ?

తండ్రీకొడుకుల అనుబంధం, ఆ పాత్రల మధ్య వున్న సంఘర్షణని చూపిస్తూ యానిమల్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు దర్శకుడు.

ప్రారంభంలో వచ్చిన ఆ రెండు సన్నివేశాలు ఆసక్తికరంగా తండ్రి కొడుకుల కథని చూడాలనిపించేలా చేయగలిగారు.

తర్వాత ప్రేమకథను కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ముగించారు. తన ప్రేమని చెప్పడానికి, ఒప్పించడానికి హీరో చెప్పే డైలాగులు, ఆదిమానవుల కథ గమ్మత్తుగానే ఉంటాయి.

బల్బీర్ సామ్రాజ్యానికి వారసుడు కావాల్సిన విజయ్, తండ్రితో గొడవపడి అమెరికా వెళ్ళిపోవడం, ఆ వెంటనే తండ్రిపై ఎటాక్ జరగడంతో మళ్ళీ ఇండియాలోకి అడుగుపెట్టడంతో అసలు కథ మొదలౌతుంది.

అయితే, అప్పటి వరకూ కథ ముందు నడవకపోయినా హీరో పాత్రని తీర్చిదిద్దిన తీరు అతని మాటలు, ఆలోచన ధోరణి వినోదాన్ని పంచుతాయి. ఎప్పుడైతే ప్రతీకార ప్రతిజ్ఞ తెరపైకి వచ్చిందో అక్కడి నుంచి యానిమల్‌లో యాక్షన్ సన్నివేశాలు ఊపందుకుంటాయి.

రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా

ఫొటో సోర్స్, TSeries/YouTube

సెకండ్ హాఫ్‌లో ‘వైద్యం’ అనవసరమా?

అప్పటివరకూ కథ పెద్దగా లేకపోయినా సన్నివేశాలు, క్యారెక్టరైజేషన్‌తో యానిమల్‌ను పరిగెత్తించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచి మళ్ళీ మొదటి గేర్‌ వేస్తాడు.

బుల్లెట్ల గాయాలతో ఇంటి పట్టున చికిత్స పొందుతాడు హీరో. ఈ క్రమంలో హార్ట్ సర్జరీ కోసం ప్రయత్నించడం, రుచి వాసన, వినికిడి కోల్పోవడం, తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు.. క్రేజీగా వుంటాయి తప్పితే.. ఆడియన్స్‌కు కావాల్సిన వినోదాన్ని పంచవు. హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత ఓ ఎఫైర్ ట్రాక్ తెరపైకి వస్తుంది. ఆ సన్నివేశాలని చాలా సాగదీశారు.

అనిల్ కపూర్

ఫొటో సోర్స్, TSeries/YouTube

నటీనటుల అభినయం...

రణ్‌బీర్‌ కపూర్‌ విలక్షణమైన నటుడు. అయితే, ఇప్పటివరకు ఆయన కొంచెం సున్నితమైన పాత్రలే చేశారు. ఇప్పటికీ, ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ వుంది.

యానిమల్ మాత్రం తనకి పూర్తిగా కొత్త పాత్ర. ఇంత క్రూరమైన పాత్ర గతంలో చేయలేదు. యాక్షన్ సన్నివేశాల్లో కొత్త రణ్‌బీర్‌ కనిపిస్తాడు. తనలో చాలా మాస్ ఉందని ఇందులో యాక్షన్ చూస్తే అర్ధమౌతుంది.

తండ్రి పాత్రలో చేసిన అనిల్ కపూర్ తన అనుభవం చూపించారు. ఆ పాత్రకు అనిల్ కపూర్ మంచి ఎంపిక.

రణ్‌బీర్ కపూర్

ఫొటో సోర్స్, TSeries/YouTube

ఈ వైల్డ్ సినిమాలో ఒక బలమైన స్త్రీ పాత్రను రాసుకున్నాడు దర్శకుడు. భర్త మనసు పూర్తిగా తెలిసిన భార్య గీతాంజలి పాత్రలో ఒదిగిపోయింది రష్మిక.

ఆ పాత్రలో తను చాలా హుందాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకుంది. బాబీ డియోల్ పాత్రలో హింస తప్పితే డ్రామా లేదు. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి.

నిర్మాణ విలువలు...

టెక్నికల్‌గా యానిమల్ ఉన్నత స్థాయిలో ఉంది. పాటలు బాగానే కుదిరాయి. అయితే, డబ్బింగ్ పాటలనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

అమిత్ రాయ్ కెమెరా పనితనం ఈ యాక్షన్ డ్రామాకు మరో ఆకర్షణ. విజువల్స్ కూడా గ్రాండ్‌గా వచ్చాయి. యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.

సుప్రీం సుందర్ డిజైన్ చేసిన యాక్షన్ కొత్తగా వుంది. యానిమల్‌ను స్వయంగా దర్శకుడు ఎడిట్ చేశారు. దాంతో, డైరెక్టర్‌కు తన సృష్టించిన సన్నివేశాలపై ప్రేమ కనిపించింది. కొన్నిచోట్ల ఉదారంగా వ్యవహరించారు.

ఇక, డైలాగ్స్‌ను సందీప్ చాలా పదునుగా రాసుకున్నాడు. కానీ, చాలా చోట్ల పొదుపు పాటించలేదు. మాటలు ఆగకుండా వినిపిస్తునే ఉంటాయి.

యానిమల్ కూడా అర్జున్ రెడ్డిలా ఒక తీవ్రమైన పాత్రే. అయితే, ఇందులో భావోద్వేగాల పట్టు చాలా చోట్ల కుదరలేదు. తండ్రి కోసమే ఇంత హింస చేస్తున్నాడనే భావన ప్రేక్షకుల్లో కలిగించడంపై దర్శకుడు ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది.

వీడియో క్యాప్షన్, యానిమల్ సినిమా ఎలా ఉందంటే..

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)