దిల్లీ: వాయు కాలుష్యంతో దేశంలో ప్రతియేటా 20 లక్షలకు పైగా మరణాలు... గాలిని శుభ్రం చేయాలనే 40 ఏళ్ల ఆరాటంతో సుప్రీం కోర్టు పొరపాట్లు చేసిందా?

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో కాలుష్యం సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంలో సుప్రీంకోర్టు ఏళ్లుగా జోక్యం చేసుకుంటోంది
    • రచయిత, ఉమాంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌లో వాయు కాలుష్యం వల్ల ప్రతీ ఏడాది 20 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని బీఎంజే అనే రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు.

పారిశ్రామిక రంగాల్లో శిలాజ ఇంధనాల వినియోగం, ఇంధన ఉత్పత్తి, రవాణా వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 50 లక్షల మందికి పైగా మరణిస్తున్నట్లు ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది.

2019లో చేసిన ఒక అంచనా ప్రకారం, గాలి కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 83 లక్షల మంది చనిపోతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

ఈ మొత్తం మరణాల్లో 61 శాతం శిలాజ ఇంధనాలు వాడకం వల్ల నమోదవుతున్నట్లు చెప్పారు. పునరుత్పాదక ఇంధనాల వాడకం ద్వారా ఈ మరణాలను నివారించవచ్చు.

గాలి కాలుష్యం

ఫొటో సోర్స్, ANI

దిల్లీలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం

భారత్ రాజధాని దిల్లీలో కాలుష్యం తరచుగా గ్లోబల్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. కానీ, ఇది కొత్త సమస్య కాదు.

గత 40 ఏళ్లుగా భారత సుప్రీంకోర్టు ముందుకు ఈ సమస్య వస్తూనే ఉంది. దిల్లీ కాలుష్యంపై చురుగ్గా స్పందించే సుప్రీంకోర్టు, ఈ విషయంలో కొన్నిసార్లు దిల్లీలో జీవితాన్ని గణనీయంగా మార్చేసే ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

దిల్లీలోని గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారడంతో తక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాజాగా నవంబర్‌ ఆరంభంలో సుప్రీం కోర్టు పిలుపునిచ్చింది.

దిల్లీలో కాలుష్యం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యల గురించి కోర్టుకు దిల్లీ ప్రభుత్వం వివరించింది.

పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించడం, మోటారు వాహనాలను ప్రత్యామ్నాయ రోజుల్లో రహదారులపైకి అనుమతించడం వంటి చర్యల గురించి సుప్రీం కోర్టుకు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.

కాలుష్య నియంత్రణ విధానాలను రూపొందించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు, దిల్లీ ప్రభుత్వానికే వదిలేసింది.

కానీ, అధికారులు కోర్టు సూచనలను పట్టించుకోలేదని గతవారం సుప్రీం కోర్టు ఆరోపించింది.

వేగవంతమైన రైలు వ్యవస్థ కోసం నిధులు కేటాయించాలనే తమ సూచనల్ని అధికారులు పక్కబెట్టారంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వాహనాల సంఖ్యను తగ్గించడానికి, దిల్లీతో పొరుగు రాష్ట్రాలను హై స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా అనుసంధానించాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ కాలుష్యానికి సంబంధించి తీసుకున్న చర్యల పరంగా సుప్రీంకోర్టుకు ప్రశంసలు, విమర్శలు దక్కాయి

సుప్రీంకోర్టు నిర్ణయాలపై మిశ్రమ స్పందనలు

పంట వ్యర్థాల దహనాన్ని ఆపడంలో తగిన చర్యలు తీసుకోలేదంటూ పంజాబ్ ప్రభుత్వంపై కూడా సుప్రీం కోర్టు ఆరోపణలు చేసింది. ఈ సమస్య పరిష్కారంలో పంజాబ్ ప్రభుత్వ పేలవ నిర్వహణ కారణంగా అనవసరంగా రైతులు మాటలు పడుతున్నారని వ్యాఖ్యానించింది.

దిల్లీ గాలిని శుభ్రం చేసే సంస్కరణలకు సుప్రీం కోర్టు తరచుగా నాయకత్వం వహిస్తుంది. దిల్లీ రోడ్లపై ఏ రకమైన వాహనాలు తిరగాలి? పొగను వెదజల్లే వేలాది ఫ్యాక్టరీల తరలింపు, ఉద్గారాలను తగ్గించడానికి వ్యాపారాల సీలింగ్ వంటి నిబంధనల్ని తన ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంటుంది.

అయితే, కోర్టు నిర్ణయాల సమర్థతను విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కార్యనిర్వాహక చర్యల్లో తరచుగా కోర్టు జోక్యం గురించి ఆరోపణలు చేశారు. సంస్కరణలు చేస్తున్నప్పటికీ, గత 40 ఏళ్లుగా దేశ రాజధానిలో కాలుష్యం మరింత అధ్వాన్నంగా మారిందని కొందరు విమర్శకులు ఎత్తి చూపారు.

భారత సుప్రీంకోర్టు ఏకకాలంలో విధాన కర్త (పాలసీ మేకర్), శాసన కర్త (లా మేకర్), పబ్లిక్ ఎడ్యుకేటర్, సూపర్ అడ్మినిస్ట్రేటర్ పాత్రల్ని నిర్వహిస్తుందని సీనియర్ లార్ శ్యామ్ దివాన్ ఇటీవలే రాశారు.

‘‘అమెరికాలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి అమెరికా కాంగ్రెస్, పర్యావరణ రక్షణ సమాఖ్య, సంచుల కొద్దీ డబ్బు ఉంది. మనకు మాత్రం సుప్రీంకోర్టు ఉంది’’ అని ఆయన రాశారు.

అయితే, పరస్పర సహకారంతో సమస్యల్ని పరిష్కరించే ఒక వేదిక, రక్షక వ్యవస్థలాగా కొందరు న్యాయస్థానాన్ని చూస్తారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాలి కాలుష్యం స్థాయిపై అవగాహన పెంచేందుకు దిల్లీలో ర్యాలీలు జరిగాయి

1984 నుంచి కొనసాగుతున్న వ్యవహారం

దిల్లీ కాలుష్యం సమస్య మొదట 1984లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.

దిల్లీలో వాహనాల కాలుష్యం పెరుగుదల, తాజ్‌మహల్ మీద కాలుష్య ప్రభావం, గంగా-యమున నదులు కలుషితం కావడం అనే మూడు ప్రధాన అంశాల మీద పర్యావరణ వేత్త ఎంసీ మెహతా 1984లో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటినుంచే దిల్లీ కాలుష్యం మీద సుప్రీంకోర్టు వాదనలు వినడం, విచారించడం మొదలైంది.

మెహతా దాఖలు చేసిన అభ్యర్థనలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే, కోర్టు వాటికి ఇంకా కొత్త సమస్యల్ని జోడిస్తూ వస్తోంది. వాహన కాలుష్యం పిటిషన్‌కు దిల్లీ పొగమంచు సమస్య పిటిషన్‌ను నిరుడు సుప్రీంకోర్టు జోడించింది.

కొన్నిసార్లు కోర్టు తీసుకున్న చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి.

డీజిల్‌తో నడిచే ప్రజా రవాణా వాహనాలన్నీ మూడేళ్లలోగా నేచురల్ గ్యాస్ లేదా సీఎన్‌జీకి మారిపోవాలంటూ 1998లో కోర్టు ఆదేశించింది. అప్పటికి డీజిల్ వాహనాల సంఖ్య సుమారు లక్ష వరకు ఉంటుంది.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దీపావళి తర్వాతి రోజున ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం బారిన పడిన నగరాల్లో దిల్లీ కూడా ఉంది

టుక్ టుక్ డ్రైవర్ల లైసెన్స్‌‌ల జారీ నిలిపివేత

ఇది ప్రభుత్వానికి నచ్చలేదు. కానీ, జరిమానాలు, కోర్టు ధిక్కారానికి సంబంధించిన భయాలతో ఈ ఉత్తర్వులను పాటించింది.

దిల్లీలో ఏ రకమైన వాహనాలు నడవాలి అనే చిన్న చిన్న అంశాలను కూడా కోర్టు ఆ ఉత్తర్వుల్లో చేర్చింది.

ఉదాహరణకు, పదేళ్లకు పైగా టుక్ టుక్‌ డ్రైవర్ల లైసెన్స్‌ల జారీని నిలిపేసింది.

కోర్టు తీసుకున్న చర్యలతో ఫలితాలు వచ్చాయి. కానీ ఇవి స్వల్పకాలమే ఉన్నాయి.

డీజిల్ నుంచి సీఎన్‌జీలకు మారడం వల్ల దిల్లీ గాలి శుభ్రపడిందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, దీనివల్ల నగరంలో ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో ఈ ఫలితాలు పెద్దగా ప్రయోజనకరంగా మారలేదని అధ్యయనాల్లో తేలింది.

ప్రజా రవాణా రంగంలో ఉపాధి పొందుతున్న లక్షలాది కార్మికుల జీవితాలపై కోర్టు ఉత్తర్వులు ప్రతికూల ప్రభావం చూపాయని ‘కోర్టింగ్ ద పీపుల్’ అనే పుస్తకంలో లాయర్ అనుజ్ భువానియా రాశారు.

టుక్ టుక్ డ్రైవర్లకు కోర్టులో తమ వాదనను వినిపించే అవకాశమే రాలేదని అనుజ్ పేర్కొన్నారు.

ఒకప్పుడు దేశంలో అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే వ్యవస్థను కొద్దిమంది లాయర్లు తమ చేతుల్లోకి తీసుకున్నారని అనుజ్ అన్నారు. పేద కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తూ సంస్కరణల కోసం ముందుకు వచ్చే లాయర్ల చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్లిందని ఆయన ఆరోపించారు.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

‘‘కోర్టు జోక్యం సరైనదే’’

కానీ, కొంతమంది న్యాయమూర్తులు కోర్టు జోక్యం అవసరమని, చాలాసార్లు అది విజయవంతమైందని నమ్ముతారు.

‘‘న్యాయవ్యవస్థ క్రియాశీలత అనివార్యమైనది’’ అని మాజీ చీఫ్ జస్టిస్ పీఎన్ భగవతి ఒకసారి అన్నారు.

ఆయన ఎన్నో దిల్లీ కాలుష్య కేసుల్ని విచారించారు. విధానపర నిర్ణయాల్లో కోర్టు పాత్రను విస్తరించడంలో భగవతి కీలకంగా వ్యవహరించారు.

కోర్టు నిర్ణయాలు అసౌకర్యం కలిగించినప్పటికీ, సీఎన్‌జీకి మారాలనే కోర్టు ఉత్తర్వులు విజయం సాధించాయి. ఈ విజయం పర్యావరణ ప్రయోజనం కోసం ఏ నిర్ణయాన్ని తీసుకునేందుకైనా జడ్జిలు సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని చూపుతుందని మరో మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్ అన్నారు.

నగరంలో గాలిని శుద్ధి చేయాలనే లక్ష్యంపై కోర్టు స్పష్టతతో ఉన్నప్పటికీ, దాని నిర్ణయాలు కొన్ని ప్రశ్నలకు దారితీస్తున్నాయని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గాలిని శుద్ధి చేసే యంత్రాల్లా పనిచేసే స్మోగ్ టవర్స్‌ను దిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని 2019లో కోర్టు ఆదేశించింది.

ఆ సమయంలో ఈ టవర్లు, గాలి కాలుష్యానికి కళ్లెం వేస్తాయని నిర్ధారించేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని చాలామంది నిపుణులు బీబీసీతో చెప్పారు.

గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో టవర్లు పనికి రాలేదని నాలుగేళ్ల తర్వాత దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది.

సుప్రీం కోర్టు పరిస్థితిని మరింత దిగజారేలా చేసిందనే అభిప్రాయం అందరికీ లేదు.

కోర్టు తీసుకున్న చర్యలు కొన్ని క్షేత్రస్థాయిలో అనుకూల ఫలితాలు చూపించాయని పర్యావరణ న్యాయవాది శిబానీ ఘోష్ అన్నారు.

కానీ, కొత్త చట్టాలు అమలు చేయడం, విధానాలను రూపొందించడం వంటి విషయాల్లో ప్రభుత్వాలే నాయకత్వం వహించేందుకు కోర్టు అనుమతించాలని ఆమె చెప్పారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న పర్యావరణ చట్టాలను అమలు చేయడంలో దిగువ కోర్టులు, ప్రత్యేక ట్రిబ్యూనళ్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని పర్యావరణ చట్టాల నిపుణులు రిత్విక్ దత్తా చెప్పారు.

అడవులు, వన్యప్రాణులు, నీరు, ధ్వని కాలుష్యానికి సంబంధించి భారత్‌లో డజనుకు పైగా ఇతర చట్టాలు గత 40 ఏళ్లుగా అమల్లో ఉన్నాయి.

‘‘దిల్లీలో కాలుష్య స్థాయిలు అతి ప్రమాదకరంగా మారినప్పుడు మాత్రమే సుప్రీం కోర్టు ఈ కేసుల్ని విచారిస్తోంది. ఒకసారి గాలి నాణ్యత కాస్త మెరుగు పడగానే, ఈ కేసులు మళ్లీ వెనక్కిపోతాయి’’ అని దత్తా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)