తెలంగాణ ఎన్నికల్లో 70.35 శాతం పోలింగ్: అత్యధికంగా ఏ జిల్లాల్లో ఓటింగ్ నమోదైందంటే?

తెలంగాణ వ్యాప్తంగా రాత్రి వరకు 70.35 శాతం పోలింగ్ నమోదైంది.
ఇప్పటివరకు ('ఓటర్ టర్నవుట్' యాప్ ప్రకారం) అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90 శాతం, మెదక్ జిల్లాలో 86.69 శాతం, జనగాంలో 85.74 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యల్పంగా హైదరాబాద్‌లో 42.9శాతం, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 56 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటింగ్ ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ స్టేషన్‌లోకి ఓటర్లను అనుమతించారు. దీంతో ఇపుడు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంది.
సాయంత్రం 5:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్: ఎన్నికల కమిషన్
నవంబర్ 30 వతేదీ సాయంత్రం 5:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నిబంధన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, మిజోరాం, రాజస్థాన్, నాగాలాండ్ (తాపీ) రాష్ట్రాలకు వర్తిస్తుందని పేర్కొంది.
ఓటేసిన రామ్ చరణ్, మహేశ్‌బాబు
సినీ నటులు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
అంతకుముందు మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటేశారు. ఓటేసినట్లు వేలిపై సిరా రంగును చూపుతూ మహేశ్ దంపతులు సోషల్ మీడియాలో ఫోటోను పంచుకున్నారు.
రాజశేఖర్, ఆయన భార్య జీవిత కూడా అదే పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓటు వేశారు.

ఫొటో సోర్స్, Twitter/Maheshbabu
వచ్చి ఓటేయండి: విజయ్ దేవరకొండ
సినీ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ "పోలింగ్ శాతం కొద్దిగా తక్కువగా ఉందని విన్నాను. ఓటు హక్కు ఉన్న యువతీ యువకులందరూ వచ్చి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నా. మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేయండి" అని అన్నారు.
51.89% పోలింగ్ నమోదు
మధ్యాహ్నం 3:00 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 51.89% పోలింగ్ నమోదైంది.
ఇప్పటివరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, మహబూబాబాద్‌లో 65.05 శాతం, ఆదిలాబాద్ 62.34 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 38.27 శాతం నమోదైంది.
హైదరాబాద్‌లో ఓటేసిన త్రిపుర గవర్నర్
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆయన భార్య రేణుకా హైదరాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు.

ఫొటో సోర్స్, ANI
రాష్ట్రవ్యాప్తంగా 36.68% పోలింగ్ నమోదు
మధ్యాహ్నం 1:00 సమయానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 36.68% పోలింగ్ నమోదైంది.
ఎన్నికల కమిషన్ రూపొందించిన 'ఓటర్ టర్నవుట్' యాప్‌లో పోలింగ్ శాతం 36.68% నమోదైనట్లుగా ఉంది.
ఇప్పటివరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి శోభతో కలిసి, మెదక్ జిల్లాలోని సిద్దిపేట పరిధిలో ఉన్న చింతమడక పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 20.64% పోలింగ్ శాతం నమోదు
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో 8.52% పోలింగ్ నమోదు కాగా, 11.00 గంటల వరకు 20.64% నమోదైనట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విటర్ వేదికగా తెలిపింది.
ఎన్నికల కమిషన్ రూపొందించిన 'ఓటర్ టర్నవుట్' యాప్‌లో ఈ ఓటింగ్ శాతం నమోదైనట్లుగా చెప్తూ, ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.

ఫొటో సోర్స్, ANI
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేయండి)
ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్
మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఆయన తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు.

ఓటు వేసేందుకు సొంతూళ్లకు ఓటర్లు..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు ఓటర్లు.
గురువారం హైదరాబాద్ రహదారులపై వాహనాలతో ట్రాఫిక్ కనిపిస్తోంది.
షాద్‌నగర్ వద్ద ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలతో రద్దీ కనిపించింది.


తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో 8.52% పోలింగ్ నమోదైంది.
ఎన్నికల కమిషన్ రూపొందించిన 'ఓటర్ టర్నవుట్' యాప్‌లో ఈ ఓటింగ్ శాతం నమోదైనట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, ANI
ఓటు వేసిన డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగజ్‌నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

ఓటు వేసేందుకు వచ్చిన చిరంజీవి
సినీనటులు చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆయనతోపాటు భార్య సురేఖ, కుమార్తె శ్రీజ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఫొటో సోర్స్, UGC
ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్ దంపతులు
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య ప్రణతితో కలసి వచ్చి ఓటు వేశారు.
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ అంబర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్ కాంప్లెక్స్, 105వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఫొటో సోర్స్, AlluArjun/Twitter
ఓటు వేసిన అల్లు అర్జున్
సినీనటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
అనంతరం ట్విటర్ వేదికగా తన ఫోటోను షేర్ చేస్తూ, "మీ ఓటు హక్కును వినియోగించుకోండి" అని రాశారు.
అత్యధిక ఓటింగ్ నమోదు కావాలని కోరుకుంటున్నా: ప్రధాని మోదీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
తెలంగాణ సోదర, సోదరీమణులు తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మరీముఖ్యంగా మొదటి సారి ఓటు వేయబోతున్న వారు, యువతీ యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ప్రక్రియకు ముందు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 2,290 మంది ఎన్నికల పోటీలో ఉన్నారు. మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 2,067 మంది పురుషులు కాగా, 222 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇద్దరు థర్డ్ జెండర్లు పోటీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, UGC
రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో 3,26,18,205 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,63,13,268 మంది పురుషులు కాగా, 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పీడబ్ల్యూడీ (దివ్యాంగులు) ఓటర్లు 5,06,921, థర్డ్ జెండర్లు 2,676 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 2,944 మంది నమోదు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
- పాకిస్తాన్ వాఖీ మహిళా గొర్రెల కాపరుల ప్రత్యేకత ఏంటి... వీరు ఎందుకు కనిపించకుండా పోతున్నారు?
- హిమాలయాల వద్ద సొరంగాల నిర్మాణం ప్రమాదకరమా... సిల్క్యారా చెపుతున్న పాఠమేంటి?
- టన్నెల్ ప్రమాదం: సొరంగంలో తన తోటి వారికి గబ్బర్ సింగ్ ఎలా ధైర్యం చెప్పారు, ఆయన గురించి ప్రధాని ఏమన్నారు
- తెలంగాణ ఎన్నికలు: పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎందరు, యువ ఓటర్ల సంఖ్య ఎంత... మీరు తెలుసుకోవాల్సిన 9 ఆసక్తికర అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









