ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి, దీనిపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
నల్లధనానికి అడ్డుకట్ట వేస్తూ, రాజకీయ పార్టీలకు అందే విరాళాలు పారదర్శకంగా ‘చట్టబద్దమైన డబ్బు’తో ఇచ్చేవిగా ఉండేలా చూసేందుకే ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టినట్టు మోదీ సర్కార్ పేర్కొంది.
2017లో పథకం ప్రవేశపెట్టిన దగ్గరి నుంచి వీటిపై చర్చలు, విమర్శలు మొదలయ్యాయి.
ఈ పథకం, 'అపారదర్శకతను చట్టబద్దం' చేసేలా ఈ పథకం ఉందని, విరాళాలు ఇచ్చే దాతల వివరాలను గోప్యంగా ఉంచడంపై అభ్యంతరం తెలుపుతూ ఆ సమయంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల (జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర)తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, గతేడాది అక్టోబర్ 31న తీర్పును రిజర్వ్ చేసింది.
2024 ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తీర్పు నిచ్చింది.
అంతేకాకుండా, బాండ్ల వివరాలను బహిర్గం చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్చి 12న ఎన్నికల కమిషన్‌కు వివరాలను పంపగా, మార్చి 14 రాత్రి 7:53 గంటలకు ఈసీఐ వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
అసలు ఇంతకీ ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి? ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటీషన్లు ఎందుకు దాఖలయ్యాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఎలక్టోరల్ బాండ్ అంటే?
దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓ విధంగా ఈ బాండ్లను ప్రామిసరీ నోట్లుగా కూడా భావించొచ్చు. దేశంలోని పౌరులు లేదా సంస్థలు వీటిని అధీకృత బ్యాంకు నుంచి కొనుగోలు చేసి, వారికి నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందజేస్తారు..
ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. 2018లో అమలులోకి వచ్చింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని జారీ చేయడం ద్వారా వచ్చిన నగదును సంబంధిత రాజకీయ పార్టీలకు అందజేస్తుంది.
కేవైసీ వివరాలు నమోదు చేసుకుని, బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నవారు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. దాతల వివరాలు ఈ బాండ్లపై ఉండవు.
రూ.1000 నుంచి మొదలుకొని రూ.10 వేలు, రూ.1 లక్ష, రూ. 10 లక్షలు, రూ.1 కోటి వరకు స్టేట్ బ్యాంకుకు సంబంధించిన నిర్ణీత బ్రాంచుల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ల కాలపరిమితి 15 రోజులు మాత్రమే.
రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ (ఆర్పీఏ) ప్రకారం నమోదైన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల నుంచి నిధులు పొందే అర్హత ఉంటుంది.
సాధారణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఇలా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
ఈ బాండ్లను ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో అందుబాటులో ఉంచుతారు. దీనితోపాటు లోక్‌సభ ఎన్నికల సమయంలో మరో 30 రోజులు అదనపు గడువును ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అభ్యంతరాలేంటి?
ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో ఎన్నికల బాండ్ల పథకంతో రాజకీయ పార్టీలకు నిధులు అందే ప్రక్రియ పారదర్శకంగా మారుతుందని భారత ప్రభుత్వం పేర్కొంది.
కానీ, ఆ బాండ్లను కొని, విరాళాలుగా అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచడం పట్ల అభ్యంతరాలు మొదలయ్యాయి.
పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచే విమర్శలు మొదలయ్యాయి. విరాళాలు అందించే వారి వివరాలు గోప్యంగా ఉండడం వలన నల్లధనానికి ఆస్కారం ఉందని, కార్పొరేట్ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బును గోప్యంగా విరాళంగా అందజేయడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శలు ఉన్నాయి.
ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి.
మొదటి పిటిషన్‌ను 2017లో రాజ్యాంగ సంస్కరణల రంగంలో ఉన్న ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్), కామన్ కాజ్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా దాఖలు చేస్తే, రెండో పిటీషన్‌ను 2018లో సీపీఐ(ఎం) దాఖలు చేసింది.
ఈ పథకం రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు, దేశీయ, విదేశీ సంస్థల నుంచి గోప్యతతో, భారీగా నిధుల ప్రవాహానికి గేట్లు తెరిచేలా ఉందని, దీని వలన భారీ స్థాయిలో ఎన్నికల అవినీతిని చట్టబద్ధం చేసినట్లు అవుతుందని పిటీషన్లలో పేర్కొన్నారు.
ఎన్నికల బాండ్లలో దాత వివరాలను గోప్యంగా ఉంచడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన పౌరుల హక్కును ఉల్లంఘిస్తుందని, ఈ హక్కు పరిధుల విషయమై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ పిటీషన్ వేశారు.
భారతదేశంలో సబ్సిడరీలు కలిగిన విదేశీ సంస్థలు కూడా విరాళాలు అందించేందుకు వీలుగా FCRA లో కూడా సవరణలు చేయడం పట్ల కూడా అభ్యంతరాలు ఉన్నాయి.
దీని వలన విదేశీ లాబీయిస్టులు తమ సొంత అజెండాతో, భారత రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటాయరది వారి వాదన.
మరోవైపు కంపెనీలు తమ రాజకీయ విరాళాల వివరాలను బ్యాలెన్స్ షీట్‌లో పేర్కొనాల్సిన అవసరం లేకుండా కంపెనీల చట్టం 2013లో కూడా సవరణలు తీసుకురావడం పట్ల అభ్యంతరాలను తెలిపారు పిటిషనర్లు.
ఈ సవరణ వలన రాజకీయ నిధుల్లో అపారదర్శకత పెరగడంతోపాటు ఆ సంస్థలకు ప్రయోజనాలను చేకూర్చేలా సదరు రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటీషనర్లు అభ్యంతరాలను తెలిపారు.
ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని బడ్జెట్‌లో ఉంచారు. అయితే దీనిని మనీబిల్‌గా ప్రవేశపెట్టడం వలన, ఇందులో మార్పుల చేయడానికి రాజ్యసభకు వీలుపడదు.
దీనిపై కూడా అభ్యంతరాలు లేవనెత్తారు.
ప్రభుత్వానికి రాజ్యసభలో ఎక్కువ బలం లేనందున, మనీబిల్ కింద ప్రవేశపెడితే, సులభంగా ఆమోదం పొందవచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శలు ఉన్నాయి.
అయితే ఎన్నికల బాండ్ల పథకాన్ని మనీ బిల్ కింద అమోదించొచ్చా? అనే ప్రశ్నను సుప్రీం కోర్టు ప్రస్తుతం పరిగణలోకి తీసుకోలేదు.
ఎందుకంటే, గతంలోనే ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పథకాన్ని మనీబిల్‌గా ప్రవేశపెట్టడాన్ని సమర్థించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పార్టీకి ఎక్కువ నిధులు వచ్చాయి?
అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, ఇరవై నాలుగు ప్రాంతీయ పార్టీలు 2016-16 నుంచి 2021-22 మధ్య ఉన్న ఐదేళ్ల కాలంలో మొత్తంగా రూ.9,188 కోట్ల రూపాయలను ఈ బాండ్ల ద్వారా పొందాయి.
ఈ నిధుల్లో భారతీయ జనతా పార్టీకి రూ.5272 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. అంటే మొత్తం నిధుల్లో 58% ఈ ఒక్క పార్టీకే అందాయి.
ఇదే సమయానికి కాంగ్రెస్ పార్టీ రూ.952 కోట్లు, తృణముల్ కాంగ్రెస్ రూ.767 కోట్ల రూపాయలు విరాళాలుగా బాండ్ల రూపంలో పొందాయి.
2017-18, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో జాతీయ పార్టీలు పొందిన విరాళాలలో 743% పెరుగుదల ఉందని ఏడీఆర్ తెలిపింది. ఇదే కాలంలో జాతీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన విరాళాల్లో 48% పెరుగుదల కనిపించింది.
ఈ ఐదేళ్ల కాలాన్ని విశ్లేషించిన ఏడీఆర్, 2019-20 (లోక్ సభ ఎన్నికలు జరిగిన సమయం) కాలంలో రూ.3,439 కోట్ల రూపాయలు, 2021-22 (11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు) సంవత్సరంలో రూ.2,664 కోట్ల రూపాయల విరాళాలు అందాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల కమిషన్, ఆర్‌బీఐలు ఏమన్నాయి?
ఎన్నికల బాండ్లు రాజకీయ నిధులలో పారదర్శకతకు ముగింపు పలుకుతాయని, వాటి వినియోగంతో విదేశీ కార్పొరేట్ శక్తులు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి వీలు కల్పించినట్లు అవుతుందని 2019లో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎన్నికల కమిషన్ పేర్కొంది.
దీనితోపాటు పలు కీలక చట్టాల్లో చేసిన మార్పులను ఉపయోగించుకుని, కేవలం రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడం కోసమే ‘షెల్’ కంపెనీలను సృష్టించే ప్రమాదం ఉందని కూడా ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఏడీఆర్ పిటీషన్‌ను అనుసరించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఎన్నికల బాండ్ల నల్లధన ప్రవాహం, మనీ లాండరింగ్, క్రాస్ బార్డర్ ఫ్రాడ్‌లను విపరీతంగా పెంచేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఎన్నికల బాండ్లను ‘అపారదర్శక ఆర్థిక పరికరం’గా పేర్కొంది.
ప్రభుత్వం ఏం చెప్పింది?
ఎన్నికల బాండ్లతో రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో పారదర్శకతను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది.
ఈ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుందని, నల్లధనం చేతులు మారడానికి అవకాశం లేదని పలుమార్లు సుప్రీం కోర్టుకు కూడా తెలిపింది.
ఈ పథకం పన్ను నిబంధనలకు అనుగుణంగా ‘చట్టబద్ధమైన డబ్బు’కు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొంది.
అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన సమయంలో ఈ పథకంలోని అంశాలను ప్రజలు, పార్లమెంటరీ చర్చలకు వదిలివేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
- గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
- భారత్-దివ్యాస్త్ర: చైనా నగరాలను టార్గెట్ చేయగల ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?
- విమానంలో 153 మంది ప్రయాణికులు, నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు, తర్వాత ఏం జరిగిందంటే...
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














