సుధామూర్తి: రాజ్యసభకు నామినేట్ అయిన ఈమె జీవితంలో విశేషాలే కాదు, వివాదాలూ ఉన్నాయి...

ఫొటో సోర్స్, ANI
ప్రముఖ రచయిత్రి, సామాజిక సేవకురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.
దేశంలో కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవలకు విశిష్టమైన కృషి చేసినందుకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను ఎగువ సభకు (రాజ్యసభ) నామినేట్ చేస్తారు.
సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. సామాజిక సేవ, విద్య, దాతృత్వం వంటి విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
రాజ్యసభకు ఆమె నామినేట్ కావడం నారీ శక్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా తనకు లభించిన పెద్ద కానుక ఇదని సుధామూర్తి అన్నారు. ఇప్పుడు దేశం కోసం పని చేసే కొత్త బాధ్యత వచ్చిందని తెలిపారు.
73 ఏళ్ల సుధా మూర్తిని గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో సత్కరించింది కేంద్రం.

ఫొటో సోర్స్, ANI
ప్రొఫెషనల్ కెరీర్
సుధామూర్తి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
టాటా ఇంజినీరింగ్, లోకోమోటివ్ కంపెనీ అంటే టెల్కో ద్వారా నియమితులైన మొదటి మహిళా ఇంజనీర్ ఆమె.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని ఆమె వివాహం చేసుకున్నారు. సుధామూర్తి కన్నడ, ఆంగ్ల భాషలలో రచనలు చేస్తుంటారు.
ఆమె పలు నవలలు, టెక్నికల్ బుక్స్, ట్రావెల్ స్టోరీలు రాశారు. పిల్లల కోసం ఆమె రాసిన సాహిత్యం ప్రజాదరణ పొందింది.
వెంచర్ క్యాపిటలిస్ట్ అక్షతా మూర్తికి తల్లి కూడా. అక్షతా మూర్తి ప్రస్తుత బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు.
సుధామూర్తి దాతృత్వంలో కూడా ప్రసిద్ధి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలలో సేవలందిస్తోంది.
ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి వరద ప్రభావిత ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నిర్మించారు. పెద్ద సంఖ్యలో పాఠశాలల్లో గ్రంథాలయాలను నిర్మించి వందలాది పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
సుధామూర్తి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా విద్య, పరిశోధనా కార్యకలాపాలలో చురుకుగా ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 'మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా'ను స్థాపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సాధారణ జీవితం
ఇన్ఫోసిస్‌ను స్థాపించేందుకు 1981లో తన భర్త నారాయణ మూర్తికి రూ. పదివేలు ఇచ్చానని సుధామూర్తి తరచూ చెబుతుండేవారు. నేడు నారాయణమూర్తి సంపద విలువ రూ.36,690 కోట్లు.
వేల కోట్లు సంపాదించినా మూర్తి దంపతులు సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు.
సుధామూర్తికి రూ. 775 కోట్ల ఆస్తి ఉంది. కానీ ఆమె జీవనశైలి చాలా సాధారణం. గత 30 ఏళ్లుగా తాను కొత్త చీరలేవీ కొనలేదని ఆమె ఒక సందర్భంలో పేర్కొన్నారు.
భారత మీడియా ఆమె ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇస్తుంటుంది. అనేక డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆమె ఇంటర్వ్యూలు కనిపిస్తాయి.
ఆ ఇంటర్వ్యూలలో ఆమె తరచుగా ఇన్ఫోసిస్ ప్రారంభం, వివాహం, భర్తతో గడిపిన ప్రారంభ రోజులు, ఆమె సాధారణ జీవనశైలి గురించి మాట్లాడటం కనిపిస్తుంది.
ఆమె మహిళలకు సాధికారత కల్పించడం, పిల్లల పెంపకం గురించి ఇంటర్వ్యూలలో తరుచుగా మాట్లాడతారు.
తన సాధారణ జీవనశైలి గురించి సుధామూర్తి గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''లండన్‌కు వెళ్లినపుడు ఎయిర్ పోర్టులో ఒక ఇమ్మిగ్రేషన్ అధికారి తన చిరునామా 10 డౌనింగ్ స్ట్రీట్, ప్రధానమంత్రి నివాసం అని చెబితే నమ్మలేకపోయారు. నా వేషధారణ చూసి, ఆ అధికారి జోక్ చేస్తున్నారా? అనడిగారు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, MEHTA PUBLISHING HOUSE
వివాదాస్పద వ్యాఖ్యలు
అయితే సుధామూర్తి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు, భేటీలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమయ్యాయి.
ఒక ఇంటర్వ్యూలో, తాను పూర్తి శాకాహారి (ప్యూర్ వెజిటేరియన్) అని, గుడ్లు తినే అలవాటు కూడా లేదని సుధామూర్తి చెప్పారు. విదేశాలకు వెళ్లేటప్పుడు ఆహారం కూడా తనతో పాటు తీసుకెళ్తానన్నారు.
''మాంసాహారం, శాకాహారంలో ఒకే చెంచాలు వాడతారేమోనని నాకు భయం'' అని ఆమె అన్నారు.
''అందువల్ల ప్రయాణాల సమయంలో శాకాహార రెస్టారెంట్‌కే వెళ్తాను. లేదంటే బ్యాగ్ నిండా ఆహారం తీసుకెళ్తాను. చిన్నతనంలో అమ్మమ్మలు, నానమ్మలు ప్రయాణంలో ఆహారం తీసుకెళ్లడం చూసి ఆటపట్టించేదాన్ని. అక్కడ దొరికే ఆహారం తినేయొచ్చు కదా అని అడిగేదాన్ని. కానీ ఇప్పుడు నేను కూడా వాళ్లలాగే మారిపోయాను'' అని ఆమె అన్నారు.
ఆహార అలవాట్లపై సుధామూర్తి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేశారు.
తాను పూర్తి శాకాహారినని ఆమె చేసిన వ్యాఖ్యలు గుడ్డు తినేవారి నుంచి తమను తాము వేరుగా చూపించుకోవడమేనని కొందరు విమర్శించారు.
సమాజంలో పాతుకుపోయిన కులవ్యవస్థ ‘శాకాహారం స్వచ్ఛమని’ చెబుతోందని, సుధామూర్తి వ్యాఖ్యలు దీనిని గుర్తు చేస్తున్నాయని వారు ఆరోపించారు.
ఆమె వ్యాఖ్యలు తన ‘అగ్ర కుల’ బ్రాహ్మణ ఆలోచనలను సూచిస్తున్నాయని ఆరోపించారు.
మరో సమయంలో "నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను, నా కూతురు అక్షత తన భర్త (రిషి సునక్)ను ప్రధానమంత్రిని చేసింది" అని సుధామూర్తి చెప్పడం కూడా వైరల్ అయింది.

ఫొటో సోర్స్, RAJU SANADI
హిందుత్వ వాదితో భేటీ
2022లో శంభాజీ భిడేతో సుధామూర్తి భేటీ వివాదం రాజేసింది. ఎందుకంటే శంభాజీ భిడే హిందూ మితవాద నాయకుడు.
ఈ భేటీలో శంభాజీ భిడే పాదాలను సుధామూర్తి తాకినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇరువురి సమావేశం చర్చనీయాంశమైంది.
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. ఇటీవల భిడే ఒక మహిళా జర్నలిస్టుతో మాట్లాడటానికి నిరాకరించారు, ఆమె నుదిటిపై బొట్టు లేదని ఆయన వద్దన్నారు.
ఒక మహిళ భారతమాతతో సమానమని, ఆమె (బొట్టు లేకుండా) 'వితంతువు' లా కనిపించకూడదని జర్నలిస్టుతో చెప్పారు.
ఈ వ్యవహారంలో శంభాజీ భిడేకి మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
- అనంత్ అంబానీ: వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














