భారత్-థాయిలాండ్‌ దేశాల మధ్య బియ్యం ఎగుమతుల వివాదం ఏంటి?

భారత్, థాయ్ సంబంధాలు

ఫొటో సోర్స్, WTO

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వాణిజ్య సంస్థలో థాయ్‌లాండ్ రాయబారి పించానక్ వాన్‌కార్పన్ పిట్ ఫీల్డ్

ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశంలో థాయ్‌లాండ్ బియ్యం ఎగుమతులపై భారత్‌ను ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం ఇరుదేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారితీసింది.

ప్రపంచ వాణిజ్య సంస్థలో థాయ్‌లాండ్ రాయబారి పించానక్ వాన్‌కార్పన్ పిట్‌ఫీల్డ్ భారత ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలుచేసి, వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోందని ఆరోపించారు.

ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీంతోపాటు థాయ్‌లాండ్ ప్రతినిధులు పాల్గొనే కొన్ని సమావేశాలను భారత్ ప్రతినిధులు బహిష్కరించారు.

అయితే, థాయ్‌లాండ్ వ్యాఖ్యలను కొన్ని సంపన్న దేశాలు స్వాగతించాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

భారత్, థాయ్ సంబంధాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

అసలేమిటి వివాదం...

ప్రజల కోసం ఆహారాన్ని నిల్వ చేయడంపై పరిమితులున్నాయి. కానీ అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఈ పరిమితులను చాలా సార్లు పక్కనపెట్టాయి.

భారతదేదేశంలో పండే మొత్తం వరిలో 40 శాతాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి ఆహార భద్రత కోసం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మిగిలిన ఉత్పత్తిని మార్కెట్ రేటుకు విక్రయిస్తారు.

‘‘ప్రజా పంపణీ వ్యవస్థ కోసం భారత్ కనీస మద్దతు ధర చెల్లించి బియ్యాన్ని కొంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం నిల్వ పరిమితులను సడలిస్తుంది. అంటే దీనర్థం పీడీఎస్ కోసం ప్రభుత్వం ఎంత బియ్యాన్నైనా కొనుగోలు చేయవచ్చు’’అని సినీయర్ జర్నలిస్ట్, వ్యవసాయ నిపుణుడు హర్వీర్ సింగ్ చెప్పారు.

థాయ్‌లాండ్ చేసిన ఆరోపణలు నిజం కావని చెప్పారు. ‘‘రికార్డులు చూసుకున్నా ఇది నిజం కాదని తెలుస్తుంది. ప్రజా పంపిణీ కోసం కొనుగోలుచేసే బియ్యాన్ని ఎగుమతి చెయ్యమని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే థాయ్‌లాండ్ మాత్రం భారత్ చౌకధరలకు బియ్యాన్ని కొనుగోలుచేసి, ఎగుమతి చేయడం ద్వారా మార్కెట్‌ను అస్థిరపరుస్తోందని ఆరోపిస్తోంది. కానీ నిజం వేరుగా ఉంది’’ అని హర్వీర్ సింగ్ తెలిపారు.

భారత్, థాయ్ సంబంధాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

బియ్యం ఎగుమతులపై నిషేధం

దేశీయ విపణి అవసరాలను తీర్చడానికి వీలుగా క్రమంగా బియ్యం ఎగుమతులను భారత్ నియంత్రించింది. 2022లో దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరగడంతో మెల్లిగా ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది.

ముందు నూకలు, తరువాత తెల్లబియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అలాగే కొన్నిరకాల బియ్యం ఎగుమతులపై పన్ను పెంచింది.

దీంతోపాటు బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై పన్నులు పెంచడం ద్వారా దేశీయ మార్కెట్‌లో వాటి ధరలు నియంత్రణలో ఉండేలా చూసింది. తను నిల్వ చేయడానికి కొనుగోలుచేసిన రేటుకంటే ప్రభుత్వం బియ్యాన్ని చౌకగా విక్రయిస్తుంది.

భారత్ ఇలాంటి ఆంక్షలు పెట్టినప్పుడు, ధాయ్‌లాండ్ దానిని ఒక అవకాశంగా భావించింది. ఈ పరిస్థితి నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తామని అప్పటి థాయ్‌లాండ్ ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఏదేమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయి. భారతదేశం నుంచి ధాన్యం ఎగుమతులు 40 శాతం దాకా పెరిగాయి.

థాయ్‌లాండ్ కూడా బియ్యం ఎగుమతులలో ముందు వరుసలో ఉంది. అయితే భారత్ తన మార్కెట్‌ను ఆక్రమిస్తోందని థాయ్‌లాండ్ భావిస్తోంది.

ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశంలో థాయ్‌లాండ్ బియ్యం ఎగుమతుల విషయాన్ని లేవనెత్తడాన్ని హర్వీర్ సింగ్ వివరిస్తూ ‘‘ప్రపంచ వాణిజ్య సదస్సులో వ్యవసాయ మంత్రుల సమావేశం జరిగింది. దీనిని ఒక వేదికగా చేసుకుని బియ్యం ఎగుమతుల విషయాన్ని లేవనెత్తాలని థాయ్‌లాండ్ భావించి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. బియ్యం ఎగుమతుల విషయంలో థాయ్‌లాండ్ ద్వితీయస్థానంలో ఉంది. ఎగుమతుల విషయంలో భారత్ తనకు పోటీగా నిలుస్తోందని థాయ్‌లాండ్ భావిస్తోంది’’ అని చెప్పారు.

ఇటీవల కాలంలో భారత్ బియ్యం ఎగుమతులు పెరిగాయి. అయితే బియ్యం ఎగుమతులపై భారత్ పాక్షిక నిషేధం విధించడంపై పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి.

భారత్ సబ్సిడీతో కొన్ని బియ్యాన్ని ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేయాలని చూస్తోందనే విషయాన్ని ప్రపంచానికి చూపాలని అభివృద్ధి చెందిన దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా ఆహారధాన్యాల నిల్వలకు సంబంధించి నియమాలు సంపన్నదేశాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించారని విశ్లేషకులు నమ్ముతున్నారు. ఈ నిబంధనల కారణంగా భారత్ తను కొనుగోలు చేయాల్సిన పరిమితిని దాటి 10 శాతం ఎక్కువగా సబ్సిడీపైన పంట ఉత్పత్తులను కొనుగోలుచేసింది.

‘‘ఈ నిబంధనలు అంత కచ్చితంగా అమలు కాలేదు. భారత్ దాని నుంచి మినహాయింపు పొందింది. కొత్త నిబంధనలు రూపొందించేవరకూ పాత నిబంధనలను ఉల్లంఘించవచ్చని సభ్యదేశాలు అంగీకరించాయి. దశాబ్దానికి పైగా ఇలాంటి ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. సంస్కరణల అమలుకు సమయాన్ని నిశ్చయించుకున్నారు కానీ, అమలు చేయడంలేదు. పేద దేశాలకు ఏది అవసరమైన విషయమో దానిని సంపన్నదేశాలు పట్టించుకోవడం లేదని భారత్ భావిస్తోంది’’ అని హర్వీర్ సింగ్ వివరించారు.

భారత్, థాయ్ సంబంధాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు

ప్రపంచ బియ్యం ఎగుమతులలో భారత్ వాటా 42 శాతం. కొన్నిరకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ బియ్యం ఎగుమతులలో భారత్ వాటా 27 శాతం. 2024లో బాస్మతి బియ్యం ఎగుమతులలో తరుగుదల కనిపించే అవకాశం ఉంది.

భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్‌ కూడా తమ దేశంలో అధికదిగుబడుల కారణంగా పోటీ ధరలకు బియ్యాన్ని విక్రయిస్తోంది.

పొడవైన బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయడంలో భారత్, పాకిస్తాన్ ముందువరుసలో ఉంటాయి. ఈ బియ్యానికి ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యెమెన్, అమెరిక లాంటి దేశాలలో మంచి డిమాండ్ ఉంది.

బాస్మతి బియ్యం ఎగుమతుల ద్వారా భారత్ 2023లో 5.4 బిలియన్ డాలర్లు సంపాదించింది. అధిక ధరల కారణంగా 2023లో 21 శాతం అధికంగా ఆర్జించింది.

భారత్, థాయ్ సంబంధాలు

ఫొటో సోర్స్, @NOIWEALA

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సులో పాల్గొన్న భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్

భారత్ వాణిజ్య సంబంధాలకు దెబ్బ?

ధాన్యం నిల్వల పరిమితికి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని 13వ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల సమావేశంలో భారత్ డిమాండ్ చేసిన రోజే థాయ్‌లాండ్ భారత్ బియ్యం ఎగుమతుల విషయాన్ని ప్రస్తావించింది.

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకు ప్రజల కోసం ధాన్యం నిల్వ చేయడమంటే ‘‘ప్రభుత్వ సంస్థలు, లేదా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి, నిల్వచేసి, పంపిణీ చేయడం’’ .

థాయ్‌లాండ్ చేసిన ఆరోపణలు వ్యవసాయ సబ్సిడీలు, ధాన్యం నిల్వలకు సంబంధించిన సంక్లిష్టతను మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్టయిందని హర్వీర్ సింగ్ వివరించారు.

కోవిడ్ మహమ్మారి తరువాత అన్ని దేశాలకు ఆహార భద్రత ప్రధాన అంశంగా మారింది. ఆహార భద్రత అనేది జాతీయ భద్రతతో ముడిపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ చేసిన వ్యాఖ్యలు విశాల వాణిజ్య ప్రయోజనాలపై పడుతుంది.

‘‘తనకు అవకాశం రాగానే థాయ్‌లాండ్ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇది వ్యవసాయం, వాణిజ్యానికి సంబంధించిన చర్చను లేవనెత్తుతుంది’’ అని హర్వీర్ సింగ్ వివరించారు.

అబుదాబీలో జరిగిన సమావేశంలో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ‘‘ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని’’ తెలిపారు.

‘‘ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో, ప్రపంచ వాణిజ్యం సంస్థ ఎందుకు సరిగా పనిచేయలేకపోతోందో ప్రపంచం చూడాలనుకుంటోంది. దీనిపై ఏకాభిప్రాయానికి రావాలని భారత్ కోరుకుంటోంది. కానీ కొన్ని దేశాలు దానిని విచ్ఛిన్నం చేస్తున్నాయి’’ అని చెప్పారు.

ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా భారత్ తన రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని పీయూష్ గోయల్ చెప్పారు.

ఇక ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా ప్రతినిధి కేథరిన్ తై రిపోర్టర్లతో మాట్లాడుతూ వివాద పరిష్కార తీర్మానమనేది ఓ సంక్లిష్ట విషయమని అభివర్ణించారు. ఇందుకు అనువైన వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కానీ ఇందుకోసం చాలా చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు.

నిజానికి అమెరికా, యూరోపియన్ దేశాలు ఆహార నిల్వల అంశాన్ని వ్యవసాయంలో సమగ్ర సంస్కరణలు తేవడానికి ముడిపెట్టాయి. ఇందులో వ్యవసాయ సబ్సిడీల తగ్గింపు, దిగుమతి పన్నుల తగ్గింపు వంటి అంశాలు ఉన్నాయి.

ఇటీవల కాలంలో అనేక యూరోపియన్ దేశాలలో రైతులు ఆందోళనలకు దిగారు.

‘‘తమ దేశాలలోని పరిస్థితుల కారణంగా పశ్చిమదేశాలు, ప్రత్యేకించి యూరోపియన్ యూనియన్ ప్రస్తుతానికి సబ్సిడీల తగ్గింపు, దిగుమతి పన్నుల విషయంపై చర్చించడానికి సుముఖంగా లేవు. అందుకే ధాన్యం నిల్వల పరిమితి గురించిన చర్చ కూడా చోటుచేసుకోలేదు.

వివాదాల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాన్ని 2024 నాటికల్లా నెలకొల్పాలని 2022లో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశంలో సభ్యదేశాలు నిర్ణయించాయి.

భారత్, థాయ్ సంబంధాలు

ఫొటో సోర్స్, THANIALZEYOUDI

థాయ్‌లాండ్‌తో వ్యాపార సంబంధాలు

భారత్, థాయ్‌లాండ్ రెండు కూడా ఆగ్నేయ ఆసియా దేశాలే. ఈ రెండు దేశాలు కూడా అండమాన్ సముద్ర తీరాన్ని పంచుకుంటున్నాయి. వీటి మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. అలాగే మంచి వ్యాపార సంబంధాలూ ఉన్నాయి.

ఆబ్జర్వర్ ఆప్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ సమాచారం మేరకు భారత్, థాయ్‌లాండ్ మధ్య 2021లో 14.41 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. భారత్ 5.91 బిలియన్ డాలర్ల ఎగుమతులు థాయ్‌లాండ్‌కు చేయగా, థాయ్‌లాండ్ భారత్‌కు 8.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది.

భారత్ వజ్రాలు ఎగుమతి చేయగా, థాయ్‌లాండ్ ఎగుమతులలో సింహభాగం పామాయిల్‌దే.

నవంబర్ 2023లో భారత్ థాయ్‌లాండ్‌కు 335 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, థాయ్‌లాండ్ 806 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. అయితే నవంబర్ 2022తో పోల్చిచూస్తే భారత్ ఎగుమతులు 10.7 శాతం తగ్గగా, థాయ్‌లాండ్ ఎగుమతులు 13.3శాతం తగ్గాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)