ఇజ్రాయెల్-గాజా యుద్ధం: సహాయ సామగ్రి వాహనాలపై కాల్పులు, 100 మందికి పైగా మృతి... ఇది ఇజ్రాయెల్ సృష్టించిన నరమేధమన్న హమాస్

అల్ షిపా, అల్ అద్వాన్, ఆసుపత్రులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అల్ అద్వాన్ ఆసుపత్రికి వస్తున్న గాయపడిన వారు
    • రచయిత, పాల్ ఆడమ్స్, డేవిడ్ గ్రిట్టెన్,
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

గాజాలో సాయం కోసం వచ్చిన వారిపై జరిగిన దాడిలో కనీసం 112 మంది చనిపోయారు. 760 మంది గాయపడ్డారు.

గాజాలో ఆహారం తీసుకొచ్చిన లారీల వద్ద జనం భారీగా పోగయ్యారు. ఆ సమయంలో అక్కడ ఇజ్రాయెల్ ట్యాంకులు ఉన్నాయి.

ప్రజలను హెచ్చరించేందుకు వార్నింగ్ షాట్స్ కాల్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ నేరుగా ప్రజలపైకి కాల్పులు జరిపిందని కొంతమంది పాలస్తీనియన్లు అంటున్నారు.

చనిపోయిన వారిలో ఎక్కువ మంది లారీ డ్రైవర్లు లారీలను ముందుకు నడిపించడం వల్ల చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో చెప్పారు.

వందల మంది ప్రజలు లారీల మీద, లారీల చుట్టుపక్కల ఉన్నట్లు ఇజ్రాయెల్ తీసిన ఏరియల్ ఫుటేజ్ చూపిస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోల్లో మాత్రం ఖాళీగా ఉన్న లారీలు, గాడిద బళ్లలో మృతదేహాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ ఘటనలో 112 మంది చనిపోయారని, 760 మంది గాయపడ్డారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్ చేసిన ‘నరమేధం’ అని ఆరోపించింది.

ఈ సంఘటనపై చర్చించేందుకు భద్రతా మండలి అత్యవసరంగా రహస్య సమావేశం ఏర్పాటు చేసింది.

“ఆహారం కోసం వచ్చిన సామాన్య పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడం న్యాయం కాదు” అని ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుపుతున్న మధ్యవర్తులకు ఈ సంఘటన వల్ల ఇబ్బందులు పెరుగుతాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు.

ఈ సంఘటన చాలా ‘దారుణమని’ తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి తేవాలని వైద్య సేవలు అందిస్తున్న ఎంఎస్ఎఫ్ కోరింది.

గాజా, ఇజ్రాయెల్, పాలస్తీనా,యుద్ధం

ఫొటో సోర్స్, ISRAEL DEFENSE FORCES

ఫొటో క్యాప్షన్, సహాయ సామగ్రి లారీలను చుట్టు ముట్టిన వందల మంది పాలస్తీనీయన్లు

యుద్ధంలో 30 వేల మందికి పైగా మృతులు

అక్టోబర్ ఏడు తర్వాత ఇజ్రాయెల్ దాడి మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 30వేల మంది ప్రజలు చనిపోయారని, అందులో 21వేల మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ సంఘటన జరిగింది. యుద్ధం వల్ల 7వేల మంది ఆచూకీ తెలియడం లేదని, 70,450 మంది గాయపడ్డారని హమాస్ నాయకత్వంలోని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది.

గాజాలోని 23 లక్షల మంది జనాభాలో హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ ప్రకటించిన మరణాల సంఖ్య 1.3శాతానికి సమానం.

ఉత్తర గాజాలో పరిస్థితులు క్షామం దిశగా వెళుతున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. అక్కడ మూడు లక్షల మంది ప్రజలకు కొద్ది పాటి ఆహారం, తక్కువ మొత్తంలో నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

గాజాలోని నబుల్సీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇజ్రాయెల్ అనుమతించిన ’హ్యుమనిటేరియన్ కారిడార్’ గుండా 30 లారీలు ఈజిప్టు నుంచి సహాయ సామగ్రి తీసుకుని బయల్దేరాయి. లారీలు ఈ నబుల్సీ చేరుకోగానే అక్కడున్న వేల మంది ప్రజలు వాటిని చుట్టుముట్టారు. ట్రక్కుల్లోకి ఎక్కడం మొదలు పెట్టారు.

“కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ట్రక్కుల మీదకు ఎక్కుతున్న మిగతా వారిని క్రూరంగా తోసేశారు. ఇలా తోసేయడం వల్ల కొందరు చనిపోయారు. వారు ఇతరులకు అందాల్సిన సహాయ సామగ్రిని దోచుకున్నారు” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు. “ ఈ దురదృష్టకర సంఘటనలో పదుల సంఖ్యలో గాజా వాసులు చనిపోయారు. గాయపడ్డారు” అని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్ ట్యాంకుల గురించి చెబుతూ “గుంపును చెదరగొట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని కొన్ని వార్నింగ్ షాట్స్ కాల్చడం జరిగింది. ఒక్కసారిగా వేల మంది రావడంతో తాము అక్కడ నుంచి వెనక్కి వచ్చేశామని” ఆయన తెలిపారు.

“ సహాయ సామగ్రి ఉన్న లారీలపైకి మా దళాలు ఎలాంటి కాల్పులు జరపలేదు”. అని చెప్పారు. సహాయం అవసరమైన వారికి అందేందుకు వీలుగా ఆ లారీలను గమ్యస్థానానికి చేర్చేందుకే తాము ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది.

గాజాలో 30వేల మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు

ఆసుపత్రులకు వెల్లువలా క్షతగాత్రులు

“ఈ సంఘటన జరుగుతున్న సమయంలోనే కొంతమంది పౌరులు దగ్గర్లో ఉన్న చెక్ పాయింట్ దగ్గరకు వచ్చారు. వారు ఇజ్రాయెల్ సైనికులను బెదిరించారు. దీంతో మా సైనికులు పరిమిత స్థాయిలో వారిని హెచ్చరించేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు” అని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ప్రజలు గుంపులు గుంపులుగా లారీలపైకి దూసుకు రావడంతో.. డ్రైవర్లు కంగారు పడి లారీలను ముందుకు నడిపించారని, ఈ సమయంలోనే అనేక మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న వాదనను హమాస్ కొట్టి పారేస్తోంది. సైనికులు పౌరులపై నేరుగా కాల్పులు జరపినట్లు ఆధారాలు ఉన్నాయంటోంది. ఇజ్రాయెల్ సైన్యం ప్రజల తలపై కాల్చిందని దీంతో వాళ్లు వెంటనే చనిపోయారని ఆరోపించింది.

తీవ్రంగా గాయపడిన వారిని దగ్గర్లోని అల్ షిఫా ఆసుపత్రికి తీసుకువచ్చారు. గాయాలతో ఆసుపత్రికి వస్తున్నవారి సంఖ్య వందల్లో ఉండటంతో వారందరికీ చికిత్స అందించడం కష్టంగా మారిందంటున్నారు వైద్య సిబ్బంది.

ఒక బ్యాగు పిండి తెచ్చుకునేందుకు తాము నబుల్సీ వెళ్లామని, తమపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడంతో లారీ డ్రైవర్లు లారీలను వేగంగా నడిపారని, చాలా మంది లారీల కిందపడి చనిపోయారని తమేర్ షిన్బరి బీబీసీతో చెప్పారు. గాయపడిన తన స్నేహితుడిని ఆయన నేలపై ఈడ్చుకుంటూ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అల్ షిఫాతో పాటు కమల్ అద్వాన్, అల్ అవ్‌డా ఆసుపత్రుల్లో గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి తుపాకీ తూటాలు లేదా పదునైన వస్తువుల వల్ల కోసుకుపోయిన గాయాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు.

“ఇజ్రాయెల్ క్రూర నరమేధానికి ఇదొక నిదర్శనం” అన్నారు పాలస్తీనా అధారిటీ అధ్యక్షుడు మహముద్ అబ్బాస్.

తక్షణమే బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలని, బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ అధికార ప్రతినిధి కోరారు.

ఇజ్రాయెల్ మొదటి దశ భూతల దాడులు మొదలు పెట్టిన తర్వాత ఉత్తర గాజాలో పరిస్థితులు మరింత క్షీణించాయి. ఈ ప్రాంతానికి చాలా రోజులుగా మానీవయ సాయం అందడం లేదు.

గాజాస్ట్రిప్‌లో దాదాపు 5,76,000 మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి సహాయ కార్యక్రమ అధికారి ఒకరు చెప్పారు. రెండేళ్ల లోపు పిల్లల్లో ప్రతీ ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్లు చెప్పారు.

ఇటీవల ఉత్తర గాజాలోని ఆసుపత్రుల్లో పది మంది చిన్నారులు డీ హైడ్రేషన్, పోషకాహార లోపంతో మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇది కూాడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)