హూతీ రెబెల్స్‌పై ఇరాన్‌కు అమెరికా పంపిన ‘ప్రైవేట్ మెసేజ్’లో ఏముంది?

హూతీ రెబెల్స్

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, ఇంటర్నేషనల్ ఎడిటర్, బీబీసీ

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారుల గురించి ఇరాన్‌కు ప్రైవేట్ మెసేజ్ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

హుతీ తిరుగుబాటుదారులపై అమెరికా రెండో దాడి చేసిన తర్వాత ఈ సందేశాన్ని ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

‘‘మేం వ్యక్తిగతంగా ఈ సందేశాన్ని వారికి చేరవేశాం. మా సన్నాహాల పట్ల ఆత్మవిశ్వాసంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.

ఇంతకుమించి వేరే వివరాలేమీ ఆయన చెప్పలేదు.

తన తాజా దాడిని ‘‘ఫాలో ఆన్ యాక్షన్’’ అని అమెరికా అభివర్ణించింది. రాడార్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి.

ఎర్ర సముద్రంలో హుతీ తిరుగుబాటుదారులు చేసిన దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ వెల్లడించింది.

అయితే, హుతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ ఆయుధాలను అందిస్తుందని అనుమానిస్తున్నారు. హుతీ రెబెల్స్‌కు ఇరాన్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తోందని, నౌకలపై దాడి చేయడంలో ఈ సమాచారం అత్యంత ముఖ్యమైనదని అమెరికా చెబుతోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా, బ్రిటన్ చర్య

శుక్రవారం తెల్లవారుజామున అమెరికా, బ్రిటన్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో హుతీ రెబెల్స్‌కు చెందిన 30 స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు ఆస్ట్రేలియా, కెనడా కూడా సహకరించాయి.

యెమెన్‌లోని హుతీ రెబెల్స్ రాడార్ సైట్‌ను లక్ష్యంగా చేసుకున్నామని శనివారం అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనికోసం టామ్‌హాక్ క్రూయిజ్ మిసైల్‌ను ఉపయోగించారు.

హుతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో నౌకలపై విరుచుకుపడుతున్న తీరు చూసిన తర్వాత తమ దేశం వద్ద సైనిక చర్య చేపట్టడం తప్ప మరో దారి లేదని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ చెప్పారు.

‘పరిమిత, నిర్దేశిత’ దాడి కోసం అమెరికా చేసిన అభ్యర్థనకు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అంగీకరించారని ఆయనను ఉటంకిస్తూ టెలీగ్రాఫ్ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

నౌకలపై దాడి చేసే తమ గ్రూపు సామర్థ్యాలపై తాజా దాడులు ఎలాంటి ప్రభావం చూపలేదని వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌తో హూతీ రెబెల్స్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

హూతీ రెబెల్స్

ఫొటో సోర్స్, MAXAR

ఫొటో క్యాప్షన్, అమెరికా, బ్రిటన్ దాడుల తర్వాత జరిగిన విధ్వంసాన్ని చూపుతున్న శాటిలైట్ ఫోటోలు

నౌకలపై రెబెల్స్ ఎందుకు దాడి చేస్తున్నారు?

యెమెన్ సాయుధ తిరుగుబాటు సమూహం హూతీ రెబెల్స్. వీరు యెమెన్‌కు చెందిన షియా ముస్లింలు. వీరిని ‘జైదీ’ ముస్లింలు అని పిలుస్తారు. యెమెన్‌లో అత్యధిక జనాభా నివసించే ప్రాంతాలు హూతీ రెబెల్స్ ఆధీనంలోనే ఉన్నాయి. సనాతో పాటు యెమెన్‌లోని ఉత్తర భాగాన్ని కూడా హూతీలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాలపై కూడా వారికి నియంత్రణ ఉంది.

హూతీ రెబెల్స్‌పై చేసిన తాజా దాడులు గాజాలో నడుస్తోన్న యుద్ధానికి చాలా భిన్నమైనవని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు అధికారికంగా చెబుతున్నాయి.

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు చేసిన దాడుల పరంగా చూస్తే తాము చేపడుతున్న చర్య ఒక సమతుల్య ప్రతిస్పందన, అవసరమైన చర్య అని పశ్చిమ దేశాలు అంటున్నాయి.

ఈ చర్యను యెమెన్‌తో పాటు ఇతర అరబ్ దేశాలు వేరేగా చూస్తున్నాయి.

గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌ తరఫున బ్రిటన్, అమెరికా దేశాలు తాజా చర్యకు పూనుకున్నాయని ఈ దేశాలు నమ్ముతున్నాయి. దీనికి కారణం హమాస్, గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ చర్య చేపట్టినట్లు హూతీ తిరుగుబాటుదారులు పిలుపునిచ్చారు.

నెతన్యాహు ఆదేశాలను పశ్చిమ దేశాలు అనుసరిస్తున్నాయని కూడా కొందరు అంటున్నారు.

హూతీ రెబెల్స్

ఫొటో సోర్స్, REUTERS

అమెరికా చర్య వల్ల కలిగే ఫలితం ఏంటి?

అమెరికా చేస్తోన్న వైమానిక దాడుల వల్ల హూతీ రెబెల్స్ మనోబలంపై ప్రభావం పడొచ్చు. కొంత కాలం పాటు వారు నౌకలపై దాడులను తగ్గించడం ఖాయం.

అయితే, ఈ వైమానిక దాడులు ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా, బ్రిటన్ దేశాలు యెమెన్‌లో మరో వివాదంలో చిక్కుకునే ప్రమాదం పెరుగుతుంది.

సముద్రమార్గం ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో 15 శాతం ఎర్ర సముద్రం నుంచే సాగుతుందని అమెరికా చెబుతోంది.

ఇందులో ధాన్యాలు 8 శాతం, సముద్రపు చమురు 12 శాతం, సహజ వాయువులు 8 శాతం ఈ మార్గం మీదుగానే రవాణా అవుతాయి.

హుతీ రెబెల్స్ ఇప్పటివరకు ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో 28 సార్లు నౌకలపై దాడులకు ప్రయత్నించారని అమెరికా అంటోంది.

అప్పటినుంచి అనేక ప్రధాన షిప్పింగ్ కంపెనీలు ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను నిలిపేశాయి. డిసెంబర్ మొదలు నుంచి బీమా ధర దాదాపు 10 శాతం పెరిగింది.

నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. దాదాపు 1200 మంది ఈ దాడిలో చనిపోయారు. ఆ తర్వాత నుంచి గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.

ఇజ్రాయెల్‌కు అమెరికా, బ్రిటన్‌లు మద్దతు ఇచ్చాయి.

హమాస్‌కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలో ఇజ్రాయెల్ చర్య కారణంగా ఇప్పటివరకు 23 వేలకు పైగా చనిపోయారు. వేలాది మంది ప్రజల మృతదేహాలు శిథిలాల కిందే చిక్కుకుపోయాయని కూడా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)