హూతీ రెబెల్స్: 'ఇజ్రాయెల్‌‌కు మద్దతుగానే అమెరికా, బ్రిటన్‌ల బాంబు దాడులు, వాళ్ళకు గట్టిగా బుద్ధి చెబుతాం'

హూతీలు

ఫొటో సోర్స్, MOHAMMED HUWAIS/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, యెమెన్ రాజధాని సనాతోపాటు పలు ప్రాంతాల్లో అమెరికా, బ్రిటన్ దళాలు బాంబు దాడులు చేశాయి.
    • రచయిత, బీబీసీ మానిటరింగ్
    • హోదా, న్యూస్ రిపోర్టింగ్& అనాలసిస్

అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన దళాలు యెమెన్‌పై దాడులు చేయడాన్ని హూతీ ఉద్యమ నేతలు తీవ్రంగా విమర్శించారు.

హూతీ ఆధ్వర్యంలోని అల్-మసిరాహ్ టీవీ ప్రసారం చేసిన కథనం ప్రకారం.. యెమెన్ రాజధాని సనాతోపాటు తీరప్రాంతంలోని అల్ హుదైదహ్, సాద తూర్పు ప్రాంతం, హజ్జా, దామర్, తియాజ్ ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి.

దిల్మీ ఎయిర్ బేస్‌తోపాటు తియాజ్, హుదైదా, హజ్జా విమానాశ్రాయాలపై కూడా వైమానిక దాడులు జరిగాయి.

శుక్రవారం ఉదయం అల్-మసిరాహ్ టీవీలో ప్రసారమైన వీడియోలో హూతీ రెబెల్స్ గ్రూప్ అధికార ప్రతినిధి యహ్య సారియా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఎక్స్ (ట్విట్టర్)లో కూడా పోస్ట్ చేశారు.

“యెమెన్ రాజధాని సనా మాత్రమే కాకుండా హుదైదహ్, తియాజ్, హజ్జా, సాద ప్రాంతాల్లో కూడా దాడులు చేశారు. మొత్తంగా 73 దాడులు జరిగాయి. ఐదుగురు సైనికులు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు.

ఈ నేరపూరిత దాడులకు అమెరికా, బ్రిటీష్ దేశాలే పూర్తి బాధ్యత వహించాలి. వీటికి బదులిస్తాం. తగిన రీతిలో సమాధానం చెప్తాం” అని పేర్కొన్నారు.

అల్-మసిరాహ్ టీవీ

ఫొటో సోర్స్, AL-MASIRAH TV

హూతీ రెబెల్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న న్యూస్ ఏజెన్సీ సబాహ్‌లో కూడా అమెరికా, బ్రిటన్‌ దేశాలు యెమన్ రాజధాని సనాపై బాండు దాడులకు పాల్పడ్డాయని కథనం ప్రచురించారు.

ట్విట్టర్ వేదికగా మరో హూతీ ఉద్యమ ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ సలాం గాజాకు మద్దతుగా యెమెన్ తీసుకుంటున్న చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో యెమన్‌పై జరిగిన దాడులు జరిగాయని అన్నారు.

ఈ ద్రోహపూరిత దాడుల వల్ల పాలస్తీనియన్లకు సాయం చేయడం ఆగిపోతుందని భావిస్తేంటే, వారు పొరబడినట్లే అన్నారు.

“ఈ దాడులను సమర్థించుకోవడానికి ఎలాంటి కారణమూ లేదు. అంతర్జాతీయ రవాణా నౌకలు, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో మావల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ, హూతీలకు ఇజ్రాయెల్ నౌకలే లక్ష్యం” అని రాశారు.

హూతీ రెబెల్స్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అల్-భుకైతీ దాడులను తీవ్రంగా ఖండిచారు.

“యుద్ధంలో యెమెన్‌దే గెలుపు “అని ఉదయం పోస్ట్ చేశారు.

“పాలస్తీనా సోదరులకు సాయం చేయడంలో విఫలమైన వారు మాత్రమే భయపడాలి” అని రాశారు.

“అమెరికా, బ్రిటన్‌ దేశాలు యెమన్‌పై దాడులు చేసి తప్పు చేశాయి. గతం నుంచి వారేమీ నేర్చుకోలేదని దీన్నిబట్టి చూస్తే తెలుస్తుంది” అన్నారు.

2015లో అమెరికా, బ్రిటన్‌ల మద్దతుగా సౌదీ అరేబియా నుంచి యెమెన్‌పై బాంబు దాడులకు పాల్పడి పొరపాటు చేశాయని గుర్తు చేశారు.

భుకైతీ మాట్లాడుతూ, “గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపడతాయని చెప్పడంలో నాకెలాంటి సందేహమూ లేదు. యెమెన్‌పై దాడి చేసి, చరిత్రలోనే అతిపెద్ద పొరపాటు చేశామని త్వరలోనే వీరు తెలుసుకుంటారు” అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ప్రస్తుత పరిస్థితుల్లో పాలస్తీనాకు మద్దతుగా నిలిచేది ఎవరో, వ్యతిరేకిస్తోంది ఎవరో స్పష్టమైందని భుకైతీ విడుదలచేసిన ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్‌లో ఈ ప్రకటన విడుదల చేశారు.

“గాజాలో కొనసాగుతోన్న మారణకాండని ఆపాలనే లక్ష్యంతో యెమెన్ పోరాటం చేస్తోంది. మరోవైపు మారణకాండకు పాల్పడుతున్న వారికి రక్షణ కల్పిస్తున్నాయి అమెరికా, బ్రిటన్ దేశాలు.

దీన్నిబట్టి చూస్తూ ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి రెండిట్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకునేందుకు వీలుంది. మారణహోమంలో బాధితులుగా మారుతున్న వారికి మద్దతుగా నిలుస్తారా? లేదా లేక మారణకాండకు పాల్పడుతున్న వారికి మద్దతిస్తారా? మీరు ఎవరి వైపు ఉన్నారు?” అని రాశారు.

హూతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నాయకులు మొహమ్మద్ అలీ అల్-హూతీ మాట్లాడుతూ అమెరికా, బ్రిటన్‌లు ఇజ్రాయెల్ టెర్రరిజాన్ని సంరక్షిస్తూ, గాజాలో దాడులు జరిగేందుకు ప్రోత్సాహం ఇస్తున్నాయని విమర్శించారు.

“రిపబ్లిక్ ఆఫ్ యెమెన్‌పై జరిపిన దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. బదులిస్తాం” అన్నారు.

యెమన్

ఫొటో సోర్స్, @M_N_ALBUKHAITI

హూతీ రెబెల్స్ ఎవరు, వీరి లక్ష్యం ఏమిటి?

యెమెన్‌లోని షియా ముస్లిం తెగ జైదీలకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులనే ‘హూతీ రెబెల్స్’గా పిలుస్తారు.

1990లలో నాటి యెమెన్ అధ్యక్షుడు అబ్దుల్లా సాలేహ్ ప్రభుత్వంలో అవినీతిపై పోరాడేందుకు వీరు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు.

ఈ ఉద్యమానికి వ్యవస్థాపకుడు హుస్సేన్ అల్ హూతీ పేరునే తమ గ్రూపుకు వీరు పెట్టుకున్నారు. వీరినే అన్సర్ అల్లా, ‘ద పార్టిసాన్స్ ఆఫ్ గాడ్’ అని కూడా పిలుచుకుంటారు.

2003లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇరాక్‌పై దాడి అనంతరం.. ‘‘గాడ్ ఈజ్ గ్రేట్. డెత్ టు ద యూఎస్. డెత్ టు ఇజ్రాయెల్. కర్స్ ద ‘జ్యూ’స్, విక్టరీ ఫర్ ఇస్లాం’ అనే నినాదాన్ని హూతీలు స్వీకరించారు.

ఇజ్రాయెల్, అమెరికా, మరికొన్ని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్ నేతృత్వంలో హమాస్, హిజ్బుల్లాల కూటమిలో తాము భాగమని హూతీలు ప్రకటించారు.

ఇజ్రాయెల్ వైపుగా వెళ్తున్న నౌకలపై హూతీలు చేస్తున్న దాడులకు పైన చెప్పుకున్నే అంశాలే కారణాలని యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో యెమెన్ వ్యవహారాల నిపుణుడు హషం అల్ అమీసీ చెప్పారు.

‘‘ఇప్పుడు వారు వలస పాలకులపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఇస్లాంతో విభేదించే దేశాలతో పోరాడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

హూతీ రెబెల్స్‌ ఎంత శక్తిమంతమైనవారు?

యెమెన్ అధికారిక ప్రభుత్వం పేరు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్. 2022 ఏప్రిల్‌లో మన్సూర్ హాదీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేటప్పుడు ఈ కౌన్సిల్‌కే అధికారాన్ని బదిలీ చేశారు. ప్రస్తుతం సౌదీ రాజధాని నుంచి ఇది పనిచేస్తోంది.

అయితే, యెమెన్‌లో ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రస్తుత హూతీల నియంత్రణలోని ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. వీరి దగ్గర నుంచి హూతీలు పన్నులు వసూలు చేస్తున్నారు. మరోవైపు కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు.

2010 నాటికి హూతీ గ్రూపులో 1,00,000 నుంచి 1,20,000 మంది సభ్యులు ఉన్నారని హూతీ ఉద్యమ వ్యవహారాల నిపుణుడు అహ్మద్ అల్-బాహ్రీ చెప్పినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక నివేదికలో పేర్కొంది.

మరోవైపు యెమెన్‌లో హూతీ రెబెల్స్ నియమించుకున్న దాదాపు 1500 మంది పిల్లలు 2020లో పోరాటంలో చనిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ఎర్ర సముద్ర తీరంలోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం హూతీ రెబెల్స్ నియంత్రణలో ఉన్నాయి. ఇక్కడి నుంచే వీరు నౌకలపై దాడులు చేస్తున్నారు.

సౌదీ అరేబియాతో చర్చలనూ ఈ దాడులు ప్రభావితం చేస్తున్నాయని అల్ అమేసీ చెప్పారు. ‘‘బాల్ అల్-మండబ్‌తోపాటు ఎర్ర సముద్రంలోని జల సంధులను తాము పూర్తిగా మూసివేయగలమని ఈ దాడులతో వారు నిరూపిస్తున్నారు. దీంతో తాము చెప్పే వాటికి ఒప్పుకోవాలనే సౌదీ అరేబియాపై ఒత్తిడి పెంచుతున్నారు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)