హుతీ రెబల్స్: ఎర్ర సముద్రంలోని నౌకలను మిసైల్స్, డ్రోన్స్‌తో దొంగ దెబ్బ తీస్తున్న వీరు ఎవరు?

ఫొటో సోర్స్, REUTERS
ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్ వైపు వెళ్లే అన్ని నౌకలపైనా దాడులు చేస్తామని యెమెన్‌లోని చాలా ప్రాంతాలను నియంత్రిస్తున్న హుతీ రెబల్స్ హెచ్చరించారు.
గత నవంబరులో ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఒక పెద్ద పడవను హుతీలు హైజాక్ చేశారు. గత రెండు నెలలుగా రాకెట్లు, డ్రోన్లతో కొన్ని వాణిజ్య నౌకలపైనా వీరు దాడులు చేశారు.
ఇజ్రాయెల్ నౌకలపై హుతీలు ఎలా దాడులు చేస్తున్నారు?
అక్టోబరు 19న గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు మొదలుపెట్టినప్పుడు, ఇజ్రాయెల్ వైపుగా హుతీ రెబల్స్ కొన్ని క్షిపణులు, డ్రోనులను ప్రయోగించారు.
అయితే, వీటిలో కొన్నింటిని ఎర్ర సముద్రంలోని తమ యుద్ధ నౌకల సాయంతో అడ్డుకున్నామని అమెరికా తెలిపింది. మరికొన్ని ఎర్ర సముద్రంలో, ఇంకొన్ని ఈజిప్టు భూభాగంలో పడినట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, REUTERS
2023 నవంబరులో ఎర్ర సముద్ర ప్రాంతంలో ఒక ఇజ్రాయెల్ రవాణా నౌకను స్వాధీనం చేసుకున్నట్లు హుతీ రెబల్స్ చెప్పారు. ఆ నౌకను యెమెన్ తీరంలోని ఒక ప్రాంతానికి తరలించారు.
అయితే, ఆ నౌక తమదికాదని ఇజ్రాయెల్ చెప్పింది. దానిలో ప్రయాణికులెవరూ ఇజ్రాయెల్ పౌరులు కాదనీ వివరించింది. అయితే, ఆ నౌక ఒక ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందినదని వార్తలు వస్తున్నాయి.
డిసెంబరు 3 నుంచీ ఎర్ర సముద్రంలో కొన్ని వాణిజ్య నౌకలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో హుతీలు దాడులు చేశారు. తీరానికి సమీపంలోని తమ నియంత్రణలోని ప్రాంతాల నుంచి ఈ డ్రోన్లు, క్షిపణులను వారు ప్రయోగిస్తున్నారు.
వీటిలో కొన్ని క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నౌకలు అడ్డుకున్నాయి. అయితే, కొన్ని నౌకలు మాత్రం ఈ దాడులను తప్పించుకోలేకపోయాయి.
ఇప్పటికే తమ నౌకలను ఎర్ర సముద్రం వైపుగా పంపించడంలేదని ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ ‘మెడిటెరేనియన్ షిప్పింగ్ కంపెనీ’ వెల్లడించింది. మరోవైపు ఫ్రెంచ్ కంపెనీ సీఎంఏ సీజీఎం, డేనిష్ కంపెనీ మార్సెక్, జర్మనీ కంపెనీ హ్యాపగ్-లోయిడ్, దిగ్గజ చమురు సంస్థ బీపీ కూడా తమ నౌకలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపాయి.
పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ ఆపరేషన్ల కమాండ్ సెంట్‌కామ్ ఈ అంశంపై స్పందిస్తూ... ‘‘యెమెన్ నుంచి హుతీలు చేపడుతున్న ఈ దాడుల వెనుక ఉన్నది ఇరానే’’ అని పేర్కొంది.
హుతీ దాడుల నుంచి తమ నౌకలను కాపాడుకునేందుకు ప్రత్యేక ‘నావల్ టాస్క్ ఫోర్స్’ను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు అమెరికా తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
హుతీ రెబ్బల్స్ ఎవరు, వీరి లక్ష్యం ఏమిటి?
యెమెన్‌లోని షియా ముస్లిం తెగ జైదీలకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులనే ‘హుతీ రెబల్స్’గా పిలుస్తారు.
1990లలో నాటి యెమెన్ అధ్యక్షుడు అబ్దుల్లా సాలేహ్ ప్రభుత్వంలో అవినీతిపై పోరాడేందుకు వీరు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు.
ఈ ఉద్యమానికి వ్యవస్థాపకుడు హుస్సేన్ అల్ హుతీ పేరునే తమ గ్రూపుకు వీరు పెట్టుకున్నారు. వీరినే అన్సర్ అల్లా, ‘ద పార్టిసాన్స్ ఆఫ్ గాడ్’ అని కూడా పిలుచుకుంటారు.
2003లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇరాక్‌పై దాడి అనంతరం.. ‘‘గాడ్ ఈజ్ గ్రేట్. డెత్ టు ద యూఎస్. డెత్ టు ఇజ్రాయెల్. కర్స్ ద ‘జ్యూ’స్, విక్టరీ ఫర్ ఇస్లాం’ అనే నినాదాన్ని హుతీలు స్వీకరించారు.
ఇజ్రాయెల్, అమెరికా, మరికొన్ని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్ నేతృత్వంలో హమాస్, హిజ్బుల్లాల కూటమిలో తాము భాగమని హుతీలు ప్రకటించారు.
ఇజ్రాయెల్ వైపుగా వెళ్తున్న నౌకలపై హుతీలు చేస్తున్న దాడులకు పైన చెప్పుకున్నే అంశాలే కారణాలని యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో యెమెన్ వ్యవహారాల నిపుణుడు హషం అల్ అమీసీ చెప్పారు.
‘‘ఇప్పుడు వారు వలస పాలకులపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఇస్లాంతో విభేదించే దేశాలతో పోరాడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యెమెన్‌లో చాలా ప్రాంతాలు వీరి నియంత్రణలోకి ఎలా వచ్చాయి?
2014లో అలీ అబ్దుల్లా సాలేహ్ తరువాత వచ్చిన మన్సూర్ హాదీకి కూడా వ్యతిరేకంగా నిలబడటంతో హుతీల శక్తి సామర్థ్యాలు ఒక్కసారి పెరిగాయి.
తాము మొదట పోరాడిన సాలెహ్‌తో వీరు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆయనకు మళ్లీ అధికారం అప్పగించేలా చూడటమే లక్ష్యంగా వీరు ముందుకు వెళ్లారు.
2015 ప్రారంభంలో వీరు ఉత్తర యెమెన్‌లోని సాదా ప్రావిన్స్‌ను అధికారంలోకి తీసుకున్నారు. రాజధాని సనా కూడా వీరి అధికారంలోకి రావడంతో అధ్యక్షుడు హాదీ విదేశాలకు పరారయ్యారు.
యెమెన్ పొరుగు దేశమైన సౌదీ అరేబియా హాదీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంతోపాటు హుతీలకు కళ్లెం వేసేందుకు సైనికంగా జోక్యం చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్ కూడా సౌదీతో కలిశాయి.
అయితే, వీరి దాడులకు తట్టుకొని హుతీలు నిలబడటంతోపాటు యెమెన్‌లో చాలా ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
2017లో సౌదీతో చేతులు కలిపేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై అలీ అబ్దుల్లా సాలెహ్‌ను వీరు హత్య చేశారు.

ఫొటో సోర్స్, REUTERS
హుతీల వెనకున్నది ఎవరు?
లెబనాన్‌లో షియా సాయుధ గ్రూపు హిజ్బుల్లా తరహాలోనే హుతీ కూడా ఏర్పడింది.
2014 నుంచి హుతీలకు సైనిక శిక్షణను హిజ్బుల్లా అందిస్తోందని అమెరికాకు చెందిన కాంబేటింగ్ టెర్రరిజం సెంటర్ వెల్లడించింది.
ఇరాన్‌ను మిత్ర దేశంగా హుతీలు భావిస్తున్నారు. ఎందుకంటే వీరందరికీ ఉమ్మడి శత్రుదేశం సౌదీ అరేబియా.
హుతీలకు ఇరాన్ ఆయుధాలను సమకూరుస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి.
2017లో సౌదీ రాజధాని రియాధ్‌పై హుతీ రెబ్బల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ఇరానే ఇచ్చిందని అమెరికా, సౌదీ అరేబియా వెల్లడించాయి.
క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను కూడా హుతీలకు ఇరాన్ సరఫరా చేస్తోందని సౌదీ అరేబియా చెబుతోంది.
హుతీలు ఇప్పటివరకూ వేల సంఖ్యలో స్వల్ప శ్రేణి క్షిపణులను సౌదీ అరేబియా పైకి ప్రయోగించారు. మరోవైపు యూఏఈపైనా ఈ ఆయుధాలతో దాడులు చేశారు.
హుతీలకు ఆయుధాలకు సమకూరిస్తే, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘించినట్లే. అయితే, తాము ఆయుధాలను సరఫరా చేయడంలేదని ఇరాన్ చెబుతోంది.
హుతీ రెబల్స్ ఎంత శక్తిమంతమైనవారు?
యెమెన్ అధికారిక ప్రభుత్వం పేరు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్. 2022 ఏప్రిల్‌లో మన్సూర్ హాదీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేటప్పుడు ఈ కౌన్సిల్‌కే అధికారాన్ని బదిలీ చేశారు. ప్రస్తుతం సౌదీ రాజధాని నుంచి ఇది పనిచేస్తోంది.
అయితే, యెమెన్‌లో ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రస్తుత హుతీల నియంత్రణలోని ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. వీరి దగ్గర నుంచి హుతీలు పన్నులు వసూలు చేస్తున్నారు. మరోవైపు కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు.
2010 నాటికి హుతీ గ్రూపులో 1,00,000 నుంచి 1,20,000 మంది సభ్యులు ఉన్నారని హుతీ ఉద్యమ వ్యవహారాల నిపుణుడు అహ్మద్ అల్-బాహ్రీ చెప్పినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక నివేదికలో పేర్కొంది.
మరోవైపు యెమెన్‌లో హుతీ రెబల్స్ నియమించుకున్న దాదాపు 1500 మంది పిల్లలు 2020లో పోరాటంలో చనిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఎర్ర సముద్ర తీరంలోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం హుతీ రెబల్స్ నియంత్రణలో ఉన్నాయి. ఇక్కడి నుంచే వీరు నౌకలపై దాడులు చేస్తున్నారు.
సౌదీ అరేబియాతో చర్చలనూ ఈ దాడులు ప్రభావితం చేస్తున్నాయని అల్ అమేసీ చెప్పారు. ‘‘బాల్ అల్-మండబ్‌తోపాటు ఎర్ర సముద్రంలోని జల సంధులను తాము పూర్తిగా మూసివేయగలమని ఈ దాడులతో వారు నిరూపిస్తున్నారు. దీంతో తాము చెప్పే వాటికి ఒప్పుకోవాలనే సౌదీ అరేబియాపై ఒత్తిడి పెంచుతున్నారు’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















