పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు

ఓ లాయర్ కథ

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC

ఫొటో క్యాప్షన్, అమిత్ చౌధరి

అది సెప్టెంబర్ 23, 2023. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా సెషన్స్ కోర్టులో వాతావరణం మిగిలిన రోజులతో పోల్చుకుంటే కొంత భిన్నంగా కనిపిస్తోంది.

ఒక కేసులో కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసులోని ఓ నిందితుడి మిగిలిన జీవితం ఈ తీర్పుపైనే ఆధారపడి ఉంది.

ఆ నిందితుడు అమిత్ చౌధరి. వయసు 30 ఏళ్ళు. హత్య కేసులో నిందితుడైన అమిత్ తన కేసు తానే వాదించుకున్నారు.

అమిత్‌పై మోపిన అభియోగాలన్నింటినీ కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

ఈ తీర్పు వెలువడిన తరువాత అమిత్ ఊపిరి పీల్చుకున్నట్టు కనిపించారు.

కానీ, ఈ తీర్పును ప్రాసిక్యూషన్ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. ఇకపై ఈ కేసు విచారణ హైకోర్టులో సాగుతుందని ప్రాసిక్యూషన్ తరపు లాయర్ తెలిపారు.

జిల్లా కోర్టు నుంచి ఊరట పొందడమనేది అంత తేలికైన పనికాదని అమిత్ చెప్పారు. హత్య కేసులో అరెస్టయి, జైల్లో రెండేళ్ళు గడిపిన తరువాత ఆయన బెయిల్ పొందారు.

జైలు నుంచి వచ్చిన తరువాత తన చదువును పూర్తి చేసి, లా పట్టా పొంది, లాయర్ అయ్యారు.

అక్టోబరు 12, 2011న ఓ పోలీసును హత్య చేశారంటూ ముజఫర్ నగర్‌ పోలీసుస్టేషన్‌లో 17 మందిపై ఓ ఫిర్యాదు నమోదైంది.

ఈ కేసులో అమిత్ చౌధరి అరెస్టయ్యారు. ‘‘నాకేం సంబంధం లేకపోయినా దాదాపు రెండు ఏళ్ళ నాలుగు నెలల 16 రోజులు జైల్లో గడిపాను’’ అని ఆయన చెప్పారు.

12 ఏళ్ళ తరువాత 2023 సెప్టెంబరులో ఈ కేసులో అమిత్ సహా 12 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించి, నీతూ అనే నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

కేసు విచారణలో ఉండగానే నలుగురు నిందితులు చనిపోయారు. చనిపోయినవారిలో ఇద్దరు ప్రధాన నిందితులు కూడా ఉన్నారు.

‘‘నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, నేను లా చదివాను. దేవుడు నాపై దయతలిచాడు. నా సీనియర్ అడ్వకేట్ జుల్కరణ్ సింగ్ ఈ కేసును ముందుండి నడిపించారు. పోలీసును చంపి, ఆయుధాలను లూటీ చేశారనే అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు తన తీర్పులో పేర్కొంది’’ అని అమిత్ వివరించారు.

‘‘సెప్టెంబరు 23, 2023న కోర్టు ఇచ్చిన తీర్పులో అమిత్ సహా 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది’’ అని న్యాయవాది జుల్కరణ్ సింగ్ బీబీసీకి చెప్పారు.

ఓ లాయర్ కథ

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC

అసలు కేసేంటి?

ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది కులదీప్ కుమార్ బీబీసీకి చెప్పారు. ‘‘ ఈ కేసు కొంత పాతది. అందుకే దీని గురించి ఎక్కువ చెప్పలేను. కానీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్ళేందుకు అంగీకరించింది.ఇకపై హైకోర్టులో దీనికి సంబంధించిన వాదోపవాదాలు సాగుతాయి’’ అని చెప్పారు.

2011, అక్టోబరు 12 న కృష్ణపాల్ ‌సింగ్ అనే పోలీసును షమ్లీ జిల్లా పోలీసు స్టేషన్ భవనంలో హత్య చేసి, ఆయుధాలను అపహరించారనే కేసు నమోదైంది.

‘‘నా సోదరి ఈ గ్రామంలోనే నివసిస్తుంటుంది. ఈ కేసులోని ప్రధాని నిందితుడు అయిన నీతు మా అక్కకు మరిది అవుతాడు. సంఘటన జరిగిన రోజు నేను ఆ గ్రామంలో నీతూతోనే ఉన్నాను. బహుశా అందుకే అనుకుంటూ ఈ కేసులో నా పేరు కూడా చేర్చారు’’ అని అమిత్ చెప్పారు.

‘‘దీని గురించి తెలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకే సంబంధం లేని, నాకేమీ తెలియని కేసులో నన్ను నిందితుడిగా చేర్చారు. నేను నీతూతో కలిసి ఏనాడూ ఏ పనీ చేయలేదు’’ అన్నారు అమిత్.

కేసు నమోదైన సమయంలో అమిత్ వయసు 18 సంవత్సరాలు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే షమ్లీని కొత్త జిల్లాగా ప్రకటించారు.

‘‘షమ్లీని జిల్లాగా ప్రకటించే సమయానికి సంఘటన జరిగిన ప్రాంతం ముజఫర్ నగర్ జిల్లా పరిధిలో ఉంది’’ అని అమిత్ తెలిపారు.

ఓ లాయర్ కథ

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC

12 ఏళ్ళ పోరాటం

అమిత్ భగ్పత్ జిల్లా క్రితాల్ గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి ఓ చిన్న రైతు. తల్లి గృహిణి.

‘‘2009లో ముజఫర్‌నగర్ కళాశాలలో ఇంటర్ పాసయ్యాను. తరువాత బారౌత్‌లో బీఏ చదువుతుండగా ఈ సంఘటన జరిగి, నేను జైలు పాలయ్యాను’’ అని గుర్తుచేసుకున్నారు అమిత్.

మార్చి 14, 2014న అమిత్ చౌదరికి బెయిల్ వచ్చింది.

‘‘జైలు నుంచి బయటకు వచ్చాక నేను చేసిన మొదటి పని నా చదువు పూర్తిచేయడమే. తరువాత మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి 2020లో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశాను. 2019లో మీరట్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నాను. కోర్టు అనుమతి తరువాత ముజఫర్ నగర్ కోర్టులో నా కేసు వాదించుకోవడం మొదలుపెట్టాను’’ అని ఆయన వివరించారు.

‘‘నాపైన హత్య కేసు నమోదయ్యాక మా బంధువులందరూ మాతో సంబంధాలు తెంచేసుకున్నారు’’ అని తెలిపారు అమిత్.

‘‘బెయిల్ వచ్చాక మా ఊరు వెళితే, ఊరివాళ్ళందరూ ఎన్నో ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఎగతాళి చేసేవారు. ఈ పరిస్థితుల్లో ఊరు వదిలివెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను’’ అంటారు అమిత్.

ఓ లాయర్ కథ

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC

ఫొటో క్యాప్షన్, గురు‌గావ్‌లోని వందన ఒబెరాయ్ వద్ద అమిత్ పనిచేశారు

కోర్టుకు నడిచి వెళ్లేవాణ్ని

‘‘గురుగావ్‌కు వెళ్ళి ఓ చిన్నగదిని అద్దెకు తీసుకున్నాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాను’’ అని చెప్పారు అమిత్.

గురుగావ్‌లో వందనా ఒబెరాయ్ అనే మహిళా న్యాయవాది వద్ద అమిత్ చేరారు. ఇక్కడ వచ్చే మొత్తంతో కనీసం కడుపునింపుకోవడం కూడా కష్టమైంది.

‘‘నేనుండే చోటు నుంచి కోర్టు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేది. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో రోజూ కోర్టుకు నడిచే వెళ్ళేవాడిని.

గురుగావ్ జిల్లా కోర్టులో పనిచేసే మమహిళా న్యాయవాది వందన ఒబెరాయ్‌, బీబీసీతో మాట్లాడారు.

‘‘2015లో అమిత్ నా దగ్గర పనిచేశారు. ఆ సమయంలో అతను డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలియదు. లేదంటే నేను కచ్చితంగా సాయపడి ఉండేదాన్ని’’ అని చెప్పారు.

ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన స్నేహితులు

అమిత్ చౌదరి, ఆయన స్నేహితులు

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC

చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు అమిత్ అదే క్యాంపస్‌లో ఉండేవారు. అమిత్ బంధువొకరు ఈ క్యాంపస్‌లోనే ఎమ్మెస్సీ చదివేవారు. ఈయన చెప్పిన మాటతో ప్రశాంత్ కుమార్ అనే జూనియర్ అమిత్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.

‘‘ప్రతి వాయిదాకు కోర్టుకు వెళ్ళే ముందు ప్రశాంత్, ఇతర స్నేహితులు నా జేబులో 500 రూపాయల నోటు పెడుతుండేవారు’’ అని అమిత్ గుర్తు చేసుకున్నారు.

‘‘అమిత్ చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకు నేనే సాక్ష్యం’ అని ప్రశాంత్ బీబీసీకి చెప్పారు.

‘‘ఓ సాటి విద్యార్థిగా నేను అమిత్‌కు పెద్దగా సాయపడలేకపోయాను. కానీ అతను నిర్దోషిగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని మరో స్నేహితుడు వివేక్ చెప్పారు.

అమిత్ వద్ద జూనియర్‌గా పనిచేస్తున్న ప్రియాంక తోమర్ మాట్లాడూ- ‘‘కోర్టు అమిత్‌ను నిర్దోషిగా విడుదల చేస్తే పార్టీ ఇస్తానని చెప్పా. ఇప్పుడా టైమ్ వచ్చింది’’ అన్నారు.

జైలుకు వెళ్ళడానికి ముందు అమిత్ చౌదరి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC

ఫొటో క్యాప్షన్, జైలుకు వెళ్ళడానికి ముందు అమిత్ చౌధరి

నాలా మరొకరు బాధ పడకూడదు: అమిత్ చౌధరి

అమిత్ తన గతాన్ని మరిచిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు.

‘‘ న్యాయవాదిగా నాలాంటివారికి గొంతుక అవ్వాలనుకుంటున్నాను. నేను అమాయకుడిని అయినప్పటికీ చట్టమనే సాలెగూడులో చిక్కుకున్నాను. నాలాగా ఇంకే అమాయకుడు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోకూడదు’’ అని అమిత్ చెప్పారు.

క్రిమినల్ జస్టిస్ పై పీహెచ్‌డీ చేయాలని అమిత్ చౌదరి భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)