బోస్టన్ టీ పార్టీ: అమెరికా చరిత్రలో 250 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటన ఎలా కీలకమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎలిగా గ్లౌడ్
- హోదా, ది కన్వర్జేషన్
ఆ రోజు 1773 డిసెంబర్ 16 అర్థరాత్రి. సాయుధ దళాల గ్రూపు, వారిలో కొందరు మొహాక్ వారియర్స్ మాదిరి వస్త్రాలు ధరించి బోస్టన్‌లో గ్రిఫిన్ వార్ఫ్ దగ్గర ఓడరేవులో నిలిపి ఉంచిన మూడు నౌకలలో ఎక్కారు.
ఈ మూడు నౌకలలో 92 వేల పౌండ్ల విలువైన (41 వేల కేజీలకు పైగా) టీ డబ్బాలు 340 ఉన్నాయి. ఆ కాలంలో అమెరికా భూభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం టీనే.
సన్స్ ఆఫ్ లిబర్టీ పేరుతో పిలిచే స్వాతంత్య్ర ఉద్యమకారుల సాయంతో వారు ఆ నౌకలలో వెతికారు. ఆ తర్వాత నౌకలలో ఉన్న తేయాకును సముద్రంలో పారబోశారు.
బోస్టర్ హార్బర్‌లో తేయాకు సరుకును నీళ్లలో పడేయడంతో, తమకు ప్రస్తుత కరెన్సీతో పోలిస్తే కొన్ని లక్షల డాలర్లకు పైగా నష్టం వచ్చినట్లు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పట్లో చెప్పింది.
బ్రిటన్ పార్లమెంట్ 1773 మేలో ఆమోదించిన 1773 టీ చట్టానికి వ్యతిరేకంగా బోస్టన్ వాసులు ఈ పని చేశారు. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ తన గుత్తాధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు బ్రిటన్ పార్లమెంట్ అనుమతి ఇచ్చింది.
ఇంత పెద్ద ఎత్తున తేయాకును నీటిలో పారబోసిన ఆనాటి ఘటనకు బోస్టన్ టీ పార్టీ అన్న పేరు వచ్చింది. అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో బోస్టన్ టీ పార్టీని ప్రధానమైన ఘటనగా చెబుతుంటారు.
డిసెంబర్ 16 తర్వాత ఇరు వైపుల వారు అమెరికాలో తమ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నించారు. ఆ తర్వాత ఏడాదిలోనే గ్రేట్ బ్రిటన్‌కు, ప్రస్తుతమున్న అగ్రరాజ్యం అమెరికాకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
శక్తిమంతమైన బహుళ జాతీయ సంస్థ
అప్పట్లో బ్రిటన్‌లో అత్యంత శక్తిమంతమైన, సంపన్న సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీనికి సొంతంగా ఆర్మీ కూడా ఉండేది. రాజుకుండే రక్షణ దళాలతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా దీనికి సైన్యం ఉంది.
దక్షిణాసియాలో ఈ కంపెనీ పరిపాలనను సైనిక, నిరంకుశత్వంగా అభివర్ణించారు రాజకీయ ఆర్థిక వేత్త ఆడం స్మిత్.
బెంగాల్‌లో తీవ్రమైన కరువు, ఆ కంపెనీలోనే అంతర్గతంగా చోటుచేసుకున్న అవినీతితో.. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ సమయంలో దివాళా అంచుకు చేరుకుంది.
భారత్, అమెరికాలలో బ్రిటీష్ వారి సమస్యలను పరిష్కరించేందుకు నార్త్ సొల్యుషన్‌గా టీ యాక్ట్‌ను తీసుకొచ్చారు.
దీని ప్రకారం.. 1767లోని టౌన్‌షెండ్ రెవెన్యూ చట్టంలో టీపై విధించిన వలసదారుల పన్నును కొనసాగిస్తూనే.. తగ్గింపు ధరకు ఉత్తర అమెరికాలో 17 మిలియన్ పౌండ్ల విలువైన టీని విక్రయించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యం కల్పించారు.
పన్నుల ఖర్చులను కలుపుకున్న తర్వాత కూడా ఇతరులతో పోలిస్తే ఈ కంపెనీ తేయాకును తక్కువకి అందించాలి.
బ్రిటీష్ రాజకీయవేత్తలకు టీ యాక్ట్ విజయంగా మారబోతుందని నార్త్ అమెరికా వలసదారులు భావించారు. ఈ చట్టం ద్వారా పన్నులను పెంచుకునేందుకు పార్లమెంట్‌కు అనుమతి ఉంటుంది.
బ్రిటన్ పార్లమెంట్‌లో వలసదారుల తరఫున ఎవరూ మాట్లాడేందుకు లేకపోవడంతో ఈ పన్నుల విధింపును అమెరికన్లు చట్టవిరుద్ధంగా భావించారు. ‘‘ప్రాతినిధ్యం లేకుండా ఎలాంటి పన్ను ఉండకూడదు’’ అనే నినాదంతో పోరాటం చేశారు.
1770 ప్రారంభంలో సన్స్ ఆఫ్ లిబర్టీతో సహా పలు గ్రూప్‌లు టీ చట్టం, పన్ను విధింపులపై పోరాడారు. బోస్టన్ టీ పార్టీ ఘటనకు కూడా ఈ నెట్‌వర్క్‌కు చెందిన బోస్టన్ బ్రాంచ్ వారే కారకులు.
బ్రిటన్ పార్లమెంట్ నిర్ణయంపై స్పందనగా జరిగిన బోస్టన్ టీ పార్టీ సంఘటన.. ఆ తర్వాత విప్లవ యుద్ధంలో ప్రధానమైనదిగా నిలిచింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రైవేట్ ఆస్తులపై దాడులు
ప్రైవేట్ ఆస్తులపై దాడులు చేయడాన్ని నిరసించిన బ్రిటన్ వాసులు బోస్టన్ పేట్రియాట్స్‌ల ఈ చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలే క్రమంగా అగ్రరాజ్యం అమెరికా ఏర్పాటయ్యేందుకు కారణమయ్యాయి.
జార్జ్ వాషింగ్టన్ జరిగిన విషయాన్ని తెలుసుకుని తేయాకును నాశనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చిన నష్టాలను భరించేందుకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ సిద్ధమని ప్రకటించారు.
అమెరికా దేశ వ్యవస్థాపకుల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకరు.
ఆస్తుల హక్కులపై అమెరికా ప్రాధాన్యతను తెలియజేస్తూ....బోస్టన్ పేట్రియాట్స్ ఈ నష్టాన్ని తమపై ఎందుకు వేసుకోరని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఉధృతమైన ఆందోళనలు
మసాచుసెట్స్‌లో ఈ చర్యలపై ఆందోళనలు ప్రమాదకర స్థాయికు చేరుకున్నాయి. కేవలం ఈ నగరంలోనే మాత్రమే కాక, ఇతర ప్రాంతాలకు కూడా ఆందోళనలు విస్తరించాయి.
తేయాకు చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతూ.. న్యూయార్క్, ఫిలాడెల్ఫియా ప్రాంతాల్లోని పేట్రియాట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ తేయాకును తమ భూభాగంపై దించేందుకు నౌకలకు అనుమతి ఇవ్వలేదు. బలవంతంగా ఈ టీని బ్రిటన్‌కు తిప్పి పంపించేవారు.
కొన్ని నౌకలలో టీని కిందకు దించనీయకుండా ఓడరేవుల్లోనే పాడైపోయేలా చేశారు.
నార్త్ కరోలినా ఎడెంటన్‌లో మహిళల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. తమ సొంత దేశాన్ని బానిసగా మార్చే చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తాము టీ తాగమని స్పష్టం చేశారు.
విల్మింగ్టన్ పోర్టులోని మహిళలు తమ వంతుగా టౌన్ స్క్కేర్‌లో తేయాకును కాల్చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పార్లమెంట్‌లో నిరసనలు
తేయాకును ధ్వంసం చేశారనే వార్త లండన్‌కు చేరుకోగానే.. అమెరికాలో ఉన్న వారి పట్ల సానుభూతి కలిగిన బ్రిటీషర్లు కూడా వారిని ద్వేషించడం మొదలు పెట్టారు.
దీనికి స్పందనగా పార్లమెంట్ మూడు కఠినమైన చర్యలను తీసుకుంది. మసాచుసెట్స్ స్వతంత్ర ప్రభుత్వానికి పరిమితులు పెట్టింది. వలసదారుల కోర్టుల్లో జోక్యాన్ని పెంచుకుంది బ్రిటన్.
ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చిన నష్టాలను దానికి బాధ్యులైన వారు చెల్లించనంత వరకు బోస్టన్ ఓడరేవు ద్వారా జరిగే అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు చెప్పింది.
ఆనాడు తీసుకున్న శాసన నిర్ణయాలను నిర్బంధ చట్టాలుగా చరిత్రకారులు గుర్తుకు చేసుకుంటుంటారు. అమెరికన్లు వీటిని సహించరాని చట్టాలుగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ బ్రిటీష్ పార్లమెంట్ ఈ విషయంలో కాస్త సున్నితంగా వ్యవహరించి ఉంటే.. తేయాకుపై పన్ను కట్టే విషయంలో ఆందోళనల గురించి పునరాలోచించేవారు.
గ్రిఫిన్ వార్ఫ్ ఓడరేవులో తేయాకును సముద్రం పాలు చేసిన ఆందోళనకారులను కోర్టుకు తీసుకురావాలని నిర్ణయించారు.
పార్లమెంట్ వద్ద మరో అవకాశం లేదని లార్డ్ నార్త్ వాదించారు.
రాబోయే పరిణామాలను లెక్కలోకి తీసుకోని లార్డ్ నార్త్ 1774 ఏప్రిల్ 22న హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ‘‘మనం ఈ విషయంలో రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే కష్టం’’ అని అన్నారు.
ఆ తర్వాత ఏడాదికి ప్రభుత్వం బలవంతపు చర్యలకు దిగింది. డిసెంబర్ 16న జరిగిన పరిణామాల గురించి అమెరికన్లు ఏం ఆలోచించినా కూడా.. మసాచుసెట్స్‌పై తీసుకున్న చర్యలు వారిని తీవ్రంగా బాధించేలా చేశాయి.
ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారికి కూడా ఇదే రకమైన ప్రమాదం ఉండనుందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
ఒకవేళ బలవంతమైన చర్యలే బ్రిటన్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ అయితే.. సైనిక ప్రతిఘటన దిగాలని అమెరికన్లు భావించారు.
1776 జూలై 4న స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు.
వ్యాసకర్త ఎలిగా గ్లౌడ్ న్యూ హంప్‌షైర్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్.
ఇవి కూడా చదవండి:
- అమరావతి ఇప్పుడెలా ఉంది, రాజధానికి శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లలో చేసిందేమిటి?
- జాతులను కుదిపిన ప్రేమకథ: ‘మా అమ్మానాన్నల జాత్యంతర వివాహాన్ని అంతర్జాతీయ స్కాండల్ అన్నారు’
- స్వాతి, రామ్‌కుమార్: ఏడేళ్లు దాటినా వీడని మరణాల మిస్టరీ, వీరిద్దరి మృతికి కారణమేంటి?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ.. ప్రియురాలి ఇన్స్టాగ్రాం పోస్టు వైరల్
- స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు ఎందుకొస్తాయి, మన డేటా సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














