అమరావతి ఇప్పుడెలా ఉంది, రాజధానికి శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లలో చేసిందేమిటి?

చంద్రబాబు, జగన్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు దాటిపోయింది. ఒక్క రాజధాని కాదు..ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించి నాలుగేళ్ళు గడిచింది.

అమరావతి నగరం శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్పిన తర్వాత ఏపీ హైకోర్టు అది చెల్లుబాటు కాదని తేల్చింది.

హైకోర్టు తీర్పునకు ముందే ప్రభుత్వం తాను చేసిన చట్టాలనే ఉపసంహరించుకుని రాజధాని మార్పుపై వెనుకడుగు వేసింది. ఆ తర్వాత పగడ్బందీ చట్టాలు రూపొందిస్తామని చెప్పినా అది జరగలేదు.

ఇంతకీ ఇన్నేళ్లలో అమరావతిలో ఏం జరిగింది... ఇప్పుడు పరిస్థితి ఏంటి?

అమరావతిలోని బుద్ధ విగ్రహం

ఆరంభం ఆర్భాటం..

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొన్ని నెలలకే అమరావతిని కొత్త రాజధానిగా నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో నగర నిర్మాణ పనులు మొదలయ్యాయి.

ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూముల్లో 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన తర్వాత పనులు ఊపందుకున్నాయి.

తొలుత తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ సిద్ధం చేశారు. 2017 నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేశారు. 2019 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి.

వాటితో పాటుగా శాశ్వత వసతి కోసం పలు భవనాలను నిర్మించేందుకు పనులు మొదలయ్యాయి. వాటిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు కూడా 90 శాతం పూర్తి చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్ ఉద్యోగుల వసతి నిర్మించిన క్వార్టర్స్ కూడా సగం వరకూ పూర్తయ్యాయి.

వాటితో పాటుగా సీడ్ యాక్సెస్ రోడ్డు కొంత పూర్తయ్యింది. కీలకమైన సెక్రటేరియేట్ టవర్స్ నిర్మాణ పనులు పునాది దశలో ఉన్నాయి. జడ్జీల క్వార్టర్స్ కూడా పనులు మొదలయ్యాయి.

కానీ అంతలోనే ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని విషయమై విధానపరమైన నిర్ణయాలు మారడంతో అమరావతి పరిస్థితి అయోమయంగా మారింది. అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాల మొండిగోడలు కొన్ని, పూర్తయ్యే దశలో ఆగిపోయాయి. వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారనే స్పష్టత కొరవడింది.

అమరావతి

ఫొటో సోర్స్, Getty Images

అక్కరకు రాని కోట్ల ఖర్చు

ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయా నిర్మాణల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని, నిర్మాణంలో ఉన్న మరికొన్ని భవనాలు శిథిలమవుతున్నాయి.

దాదాపుగా రూ. 9వేల కోట్ల రూపాయలు అమరావతిలో వెచ్చించారు. రోడ్లు అర్థాంతరంగానే ఉన్నాయి. భవనాలు అరకొరగానే నిలిచిపోయాయి. చివరకు ఆయా నిర్మాణాల కోసం తరలించిన మెటీరియల్ సైతం కొందరు అపహరించుకుపోతున్నా అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ కాలంలో ఏపీ హైకోర్టు కోసం నిర్మిస్తున్న రెండో భవనం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. త్వరలోనే ఆ భవనం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.

దాంతో పాటుగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన నమూనా ఆలయం పూర్తయ్యింది. భక్తులు దర్శనాలకు వస్తున్నారు. అవి మినహా ఎటువంటి పనులు ముదుకు సాగలేదు.

అదే సమయంలో అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఆందోళనలతో ఏళ్ల తరబడి ఈ సమస్య నానుతోంది. రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయం మారిన నాటి నుంచి 2019 డిసెంబర్ 17న మొదలయిన నిరసనల పర్వం వివిధ రూపాల్లో కొనసాగుతోంది.

ఏపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వివిధ కేసుల పరంపర కూడా నడుస్తోంది.

2022 మార్చి 3న ఏపీ హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెబుతూ అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది.

‘‘కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం పనులు ప్రారంభిస్తుందని ఆశించాం. కనీసం పెండింగు పనులకయినా శ్రీకారం చుడతారని అనుకున్నాం. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం సిద్ధపడుతుందని భావించాం. అయినా ప్రభుత్వం తన తీరు మార్చుకోలేదు’’ అని అమరావతి జేఏసీ నాయకుడు సుధాకర్ అన్నారు.

‘‘వేల కోట్లతో చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల పెట్టిన ఖర్చు కూడా వృధాగా పోతోందని కోర్టు కూడా అభిప్రాయపడింది. అయినప్పటికీ వివాదం సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లారు. రైతుల ఆందోళనలను పట్టించుకోలేదు. కనీసం కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఒక్క ఇటుక కూడా రాజధాని పనుల కోసం వేయలేదంటే ప్రభుత్వ తీరు అర్థమవుతోంది’’ అంటున్నారు.

హైకోర్టు తర్వాత సమస్య పరిష్కారమయినట్టేనని అంతా భావించామని, ఇప్పుడు కాలయాపన జరిగినా, సుప్రీంకోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పు ఇస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

జగన్

ఫొటో సోర్స్, APCMO

కౌలు చెల్లింపు వ్యవహారం కూడా కోర్టుకే..

రాజధాని కోసం భూములిచ్చిన రైతులంతా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని సీఆర్డీఏ నుంచి ఆదేశాలు వచ్చాయి. గత మార్చి 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని రైతులకు లేఖలు కూడా అందాయి. మూడు నెలల్లోగా రైతులకు ప్లాట్స్ అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలలకు అనుగుణంగా అదంతా జరుగుతోందని అప్పట్లో కొందరు భావించారు.

రైతుల నుంచి సీఆర్డీఏ ఆధ్వర్యంలో 34,385 ఎకరాలు సేకరించారు. వాటిలో 30,913 ఎకరాలు పట్టా భూములుగా సీఆర్డీఏ పేర్కొంది. 28,526 మంది రైతుల నుంచి ఈ భూములు తీసుకున్నారు. సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ ప్రకటనకు ముందు 10,050 మంది, ఆ తర్వాత 7,458 మంది భూములను అమ్మకాలు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా సీఆర్డీఏ నుంచి ఫ్లాట్లు పొందాల్సిన రైతుల సంఖ్య 11 వేలుగా అప్పట్లోనే వెల్లడించారు.

అయినప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటుగా చివరకు రైతులకు ఏటా చెల్లించాల్సిన కౌలు కూడా సకాలంలో చెల్లించకపోవడం ఏటేటా వివాదంగానే మారుతోంది. ప్రతీ ఏటా రైతులు కోర్టును ఆశ్రయించిన తర్వాతనే కౌలు దక్కుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ కుమార్ అన్నారు.

"అమరావతి అభివృద్ధి తర్వాత.. ముందు భూములిచ్చిన రైతులకు కౌలు కూడా దక్కడం లేదు. సీఆర్డీఏ చట్టం ప్రకారం భూములిచ్చిన రైతుకు ఎకరానికి రూ. 50వేలు చొప్పున పదేళ్ల పాటు అందించాలి. ఏటా అందులో 10 శాతం చొప్పున పెంచి అందాలి. కానీ దానిని కూడా కోర్టు చెబితే తప్ప రైతుల ఖాతాల్లో వేయడం లేదు. కూలీల పెన్షన్ల మొత్తం కూడా అంతే. ఇక రాజధాని నగర నిర్మాణం ఏం చేస్తారు. రైతులకే న్యాయం చేయని వాళ్లు, రాష్ట్రానికి ఏం చేస్తారు" అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారుతుందని, అప్పుడే అమరావతికి పూర్వ వైభవం వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మంత్రి బొత్స సత్యనారాయణ

ఫొటో సోర్స్, FB/BOTCHA SATYANARAYANA

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

అమరావతికి బడ్జెట్ కేటాయింపులెంత..

అమరావతి నగరాభివృద్ధి ఆరు నెలల్లో జరగాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది.

కానీ ప్రభుత్వం మాత్రం తీర్పు వెలువడిన ఏడు నెలలకు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదంటూ తీర్పు ఇవ్వాలని కోరింది. తుది తీర్పుకు ముందు స్టే ఆశించింది. కానీ అది జరగలేదు.

అయినప్పటికీ హైకోర్టు తీర్పు వెలువడి, సుప్రీంకోర్టును ఆశ్రయించే లోపు కూడా ఎటువంటి పనులు చేపట్టలేదు. అమరావతి నిర్మాణంలో మార్పులు లేవు.

తదుపరి బడ్జెట్‌లో సైతం అమరావతి అభివృద్ధికి అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించిన దాఖలాలు కనిపించడం లేదు.

2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో అమరావతికి రూ.1,329 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కానీ అందులో 800 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని పేర్కొంది.

అమరావతి రైతుల పాదయాత్ర
ఫొటో క్యాప్షన్, అమరావతి 'రైతుల' పాదయాత్ర

కేంద్రం నుంచి నిధులు వచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా రైతుల కౌలు, కూలీల పెన్షన్లు, సీఆర్డీఏ నిర్వహణ వంటి వాటికే పరిమితయినట్టు కనిపిస్తోంది.

రూ. 529 కోట్లతో భూములిచ్చిన రైతులకు ఏటా చెల్లిస్తున్న కౌలు, కూలీలకు ఇచ్చే పెన్షన్ల చెల్లింపులు చేయాల్సి ఉంది. వాటితో పాటుగా అమరావతి పేరుతో తీసుకున్న అప్పులకు వడ్డీల చెల్లింపు ఉంటుంది. ఏపీ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు వాటికే పరిమితమవుతున్నాయి.

"ఈ ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. ఆరంభం నుంచి అలానే నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇప్పుడీ పరిస్థితి. అప్పట్లో పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికే అనేక భవనాలు, రోడ్లు అందుబాటులోకి వచ్చేవి. అమరావతి రూపు రేఖలు కనిపించేవి.

కొన్ని బిల్డింగులకు కేవలం కరెంటు, నీటి సదుపాయం అందిస్తే వినియోగంలోకి వస్తాయి. అందుకే వేల కోట్లు వెచ్చించిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది" అని అమరావతి జేఏసీ నాయకురాలు డాక్టర్ రాయపాటి శైలజ బీబీసీతో అన్నారు.

ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రైతులకు అప్పగించాలని ఆమె కోరారు. జేఏసీకి ఇస్తే తామే నగర నిర్మాణం చేపడుతామని ఆమె అంటున్నారు.

రుషికొండపై నిర్మాణాలు

ఇప్పటి వరకూ ఖర్చు చేసిందెంత?

అమరావతి నగరాభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించాయి. అవి దాదాపుగా రూ. 20 వేల కోట్లకు పైబడి ఉంటాయని అమరావతి జేఏసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

కేంద్రం కూడా ఇప్పటి వరకూ అమరావతి కోసం సుమారుగా రూ. 1500 కోట్లు విడుదల చేసింది.

"2021 నవంబర్ 23 నాటి లెక్కల ప్రకారం అమరావతి అభివృద్ధికి రూ. 8,572 కోట్లు ఖర్చు అయ్యింది. అందులో మౌలిక సదుపాయాల మీద చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు. మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కన్సల్టెన్సీ చార్జీలు, కౌలు చెల్లింపు, పెన్షన్ల కోసం ఖర్చయ్యాయి. ఆ నిధులు కూడా హడ్కో లోన్లు, అమరావతి బాండ్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వాటన్నింటికీ వడ్డీల చెల్లింపు భారం ఈ ప్రభుత్వం భరిస్తోంది" అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

భారీ మొత్తంలో వెచ్చించిన అమరావతి కారణంగా కొందరికే ప్రయోజనం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వికేంద్రీకరణ ప్రయత్నాలు చేసినట్టు వివరించారు.

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

ఫొటో క్యాప్షన్, ఏపీ హైకోర్టు

‘నిర్మాణంలో ఉన్న భవనాలను అందుబాటులోకి తేవాలి’

"రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించకూడదు. సమగ్రంగా ఆలోచించాలి. కనీసం నిర్మాణంలో ఉన్న భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. అయినా నిర్లక్ష్యం ఎందుకు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ లేకపోవడంతో వారికి క్వార్టర్స్ రెంట్ పేరుతో ప్రభుత్వం తరుపున నెలకు రూ. 40వేల వరకూ చెల్లిస్తున్నారు. అదంతా ప్రజాధనమే కదా." సీపీఎం నాయకుడు చిగురుపాటి బాబూరావు ప్రశ్నించారు.

"అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ సిద్ధం చేస్తే వారికి ఇస్తున్న నెలవారీ అద్దె భత్యం అవసరం ఉండదు. ఉన్నతాధికారులకు, సచివాలయ సిబ్బందికి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. భవనాలు అందుబాటులోకి తీసుకురావడానికి వీలున్నప్పటికీ శ్రద్ధ పెట్టకపోవడం సమంజసం కాదు. అమరావతిలో అందుబాటులో ఉన్న భవనాలను వినియోగించుకోవాలి" అని డిమాండ్ చేశారు.

అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉండగా నిలిచిపోయిన భవనాలను విషయంలో ప్రభుత్వం దృష్టి పెడితే అందుబాటులోకి వస్తాయనే అభిప్రాయం స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సీఆర్డీఏ పరిధిలోని భూములను ఈ వేలంలో అమ్మేందుకు ప్రయత్నాలు మరోసారి జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించినా కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)