ఆంధ్రప్రదేశ్: ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ అంగన్‌వాడీల సమ్మె.. ప్రభుత్వం ఏమంటోంది?

అంగన్‌వాడీల సమ్మె

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఇప్పటిదాకా ఏపీలో అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు దిగిన చరిత్ర లేదు.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు, హెల్పర్లు, మినీవర్కర్లు కలిపి లక్ష మంది దాకా మంగళవారం నుంచి ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.

ఇప్పటిదాకా ఏపీలో అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు దిగిన చరిత్ర లేదు. హరియాణా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అంగన్‌వాడీలు సమ్మె చేసి తమ డిమాండ్లు సాధించుకున్నారు. ఇప్పుడు ఆ స్ఫూర్తితోనే ఏపీలోనూ అంగన్‌వాడీలు సమ్మెబాట పట్టారు.

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు సహా ప్రతి పల్లెలో అంగన్‌‌వాడీ కేంద్రాలున్నాయి. గర్బిణులు, శిశువులు, కిశోర బాలికలకు పోషకాహారాన్ని పంపిణీ చేయడం అంగన్‌వాడీకేంద్రాల్లో పనిచేసే సిబ్బంది బాధ్యత.

చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యను కూడా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. అందుకోసం ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ఇద్దరు చొప్పున పనిచేస్తారు.

1975లో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వారంతా పనిచేస్తారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వేతనాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తాయి.

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కలిపి 55,605 ఉన్నాయి. వారందరికీ వేతనాలు పెంచుతామని వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇచ్చిన వేతనాల కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారు.

2021లో తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్మికుల వేతనాలు పెంచింది. అక్కడ ఒక్కో వర్కర్ కి రూ. 13 వేలు చొప్పున నెల వేతనం అందిస్తున్నారు.

ఏపీలో కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచింది. జగన్ ప్రభుత్వం వచ్చాక అంగన్‌వాడీలకు వెయ్యి రూపాయలు పెంచడంతో ప్రస్తుతం అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 11,500, మినీ వర్కర్‌కు రూ.9,500, హెల్పర్‌కు రూ. 7,500 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు.

జగన్ తమకు ఇచ్చిన హామీలన్నీ అమలుపరచి, కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టారు.

అంగన్‌వాడీల ధర్నా

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ధర్నాకు దిగిన అంగన్‌వాడీలు

చర్చలు విఫలం

ఏపీలో అంగన్‌వాడీ కార్మికులు సీఐటీయూ అనుబంధ సంఘంగా ఉన్నారు.

ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనకు పూనుకోగానే వేల మంది అంగన్‌వాడీలను అడ్డుకున్నారు.

తాజాగా సీఐటీయూతోపాటు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధంగా ఏర్పడిన అంగన్‌వాడీ సంఘాలన్నీ ఉమ్మడి నిర్ణయంతో సమ్మెకు పూనుకున్నాయి.

గత నెలలోనే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మెకు సిద్ధమయిన అంగన్‌వాడీ సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. దీంతో డిసెంబర్ 8 నుంచి సమ్మెను ప్రారంభిస్తామని ప్రకటించిన అంగన్‌వాడీలు తమ సమ్మెను 12వ తేదీకి వాయిదా వేశారు.

ఏపీ సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం చర్చలు జరిపింది.

సోమవారం సాయంత్రం ప్రభుత్వ అధికారులతో జరిగిన చర్చలు ఫలించలేదని అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం నుంచే సమ్మె చేస్తామని తెలిపాయి.

అంగన్‌వాడీలను ప్రభుత్వమే నియమిస్తోంది. కాబట్టి వారి సర్వీసులకు తగ్గట్టుగా డీఏ, ఇతర అలవెన్సులు కూడా వర్తింపజేయాలని సంఘాలు కోరుతున్నాయి పి.ఎఫ్, ఇఎస్ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అరవై ఏళ్లు దాటిన అంగన్‌వాడీలను రిటైర్ చేసి నామమాత్రపు మొత్తాన్ని మాత్రమే ఇస్తున్న విధానానికి ముగింపు పలికి గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతున్నారు. వేతనాలు పొందుతున్న అంగన్‌వాడీలుగ్రాట్యుటీ అర్హులని కోర్టులు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చెల్లిస్తున్న గ్రాట్యుటీ ఏపీలో కూడా ఇవ్వాలని, కనీస పెన్షన్ అదించాలని సమ్మె నోటీసులో కోరారు.

అంగన్‌వాడీ యూనియన్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించిందని అధికారులు చెబుతున్నారు.

"రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వర్కర్ కి రూ. 1లక్ష, హెల్పర్ కి రూ. 40వేలు చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యాం. గ్రాట్యుటీ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వారు అనుసరించిన విధానం పరిశీలిస్తామని కూడా తెలిపాం. సమ్మెని రెండు రోజుల పాటు వాయిదా వేయాలని కోరాం. క్యాబినెట్ భేటీ ఉన్నందున 14వ తేదీ తర్వాత చర్చలకు కూర్చుందామని చెప్పాం" అంటూ ప్రభుత్వం తరపున ప్రకటన విడుదల చేశారు.

పలు సమస్యల పరిష్కారానికి సిద్ధమయినప్పటికీ, వేతనాల విషయంలో క్యాబినెట్ భేటీ తర్వాత స్పష్టత వస్తుందని హామీ ఇచ్చినా సమ్మెకు దిగితే చట్ట ప్రకారం చర్యలుంటాయని వారు సోమవారం హెచ్చరించారు.

అంగన్‌వాడీలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శితో చర్చిస్తున్న అంగన్‌వాడీ ప్రతినిధులు

‘ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి అమ్మ ఒడి ఇవ్వలేదు’

గతంలో అంగన్‌వాడీ లకు పది వేలకు లోపు మాత్రమే వేతనం అందించడంతో వారు వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులుగా ఉండేవారు. కానీ ఇటీవల ప్రభుత్వ విధానాల్లో భాగంగా అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయి.

రూ. 11,500 చొప్పున వేతనం అందుకుంటున్న వారందరికీ అమ్మ ఒడి సహా ఇతర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడం లేదని అనంతపురం జిల్లా రాప్తాడుకి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త ఫకీరమ్మ అన్నారు.

"మాకు ఇచ్చే జీతాలే నామమాత్రం. అతి తక్కువ వేతనాలతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ సహాయం మాత్రం మాకు అందడం లేదు. మా బిడ్డ 8వ తరగతి చదువుతున్నా అమ్మ ఒడి అందించలేదు. అదేమిటంటే నాది ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయితే కనీస వేతనం, ఇతర బెనిఫిట్స్ అందించాలి కదా. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ సర్క్యులర్ ఇచ్చామని మాత్రమే ప్రకటించారు. అయినా అది ఆచరణలో లేదు" అంటూ ఆమె వాపోయారు.

తన తల్లికి గతంలో వచ్చే వితంతు పింఛను కూడా తొలగించారని ఆమె బీబీసీతో అన్నారు. అంగన్‌వాడీలందరికీ ఎటువంటి పరిమితులు విధించకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

 అంగన్‌వాడీలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

సానుకూలంగా స్పందించే వరకు సమ్మె: బేబీరాణి

గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ సెంటర్లో అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ’ పథకం అమలు కోసం సరుకుల ధరలు పెరుగుతున్నా అందుకు తగ్గట్లుగా నిధుల కేటాయింపు జరగడం లేదని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీ.బేబీరాణి అన్నారు.

"సెంటర్లలో ఖాళీలు ఏర్పడితే హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలన్న జీవో అమలు చేయడం లేదు. రాజకీయ నాయకులు, అధికారులే అడ్డుపడుతున్నారు. కుప్పం ప్రాజెక్టులో దాదాపు పది మంది హెల్పర్లకు ప్రమోషన్ అర్హత ఉన్నప్పటికీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. పార్వతీపురంలో ప్రమోషన్ ఇచ్చినా జాయిన్ చేసుకోకుండా రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం సహా అనేక జిల్లాల్లో ప్రమోషన్లు ఇవ్వడం లేదు. కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వర్కర్‌తో సమానంగా వేతనాలు, ప్రమోషన్లు, వేసవి సెలవులు ఇవ్వాలని, సూపర్‌వైజర్ పోస్టులకు అర్హత కల్పించాలని కోరుతున్నాం" అంటూ బేబీరాణి వివరించారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సమ్మె నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)