సింగపూర్ పిల్లలు మ్యాథ్స్‌లో చాలా షార్ప్, ఎందుకంటే...

గణితం
    • రచయిత, ఇసారియా ప్రథోంగ్‌యెమ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

పీసా పరీక్షల-2022 గ్లోబల్ ర్యాంకింగ్‌ ఫలితాల్లో సింగపూర్ దేశం అగ్రస్థానంలో నిలిచింది.

పాఠశాల విద్యార్థుల స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో మ్యాథమేటిక్స్ (గణితం), రీడింగ్, సైన్స్ విభాగాల్లో సింగపూర్ టాప్ స్థానాన్ని దక్కించుకుంది.

మ్యాథమేటిక్స్ సబ్జెక్టులో సింగపూర్ పిల్లలకు ఎంతో ఘన చరిత్ర ఉంది.

'సింగపూర్ మ్యాథ్స్' బోధించే విధానమే వారి విజయానికి కారణమని చెబుతారు.

గణితం

సింగపూర్ మ్యాథ్స్ అంటే ఏంటి?

ప్రపంచ వ్యాప్తంగా 15 ఏళ్లలోపు పిల్లల విద్యా ప్రమాణాలను అంచనా వేసే ర్యాంకింగ్ వ్యవస్థ పీసా.

‘పీసా’ అంటే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ అని అర్థం. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది.

పీసా పరీక్షలోని మూడు ముఖ్య అంశాల్లో ఒకటి మ్యాథమేటిక్స్. మొత్తం 81 దేశాలు పాల్గొనే ఈ ప్రోగ్రామ్‌లో సగటున 472 పాయింట్లకు గానూ సింగపూర్‌కు చెందిన 15 ఏళ్ల పిల్లలు 575 పాయింట్లు స్కోర్ చేశారు.

ప్రజల్లో తార్కిక, విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించడంలో గణిత విద్య కీలక పాత్ర పోషిస్తుందని సింగపూర్ అధికారులు నమ్ముతారు.

అందుకే, సింగపూర్ పిల్లలకు చిన్నతనం నుంచే రీజనింగ్, కమ్యూనికేషన్, మోడలింగ్ వంటి గణిత ప్రక్రియలను ఎలా అభివృద్ధి చేయాలో నేర్పిస్తారు.

ఇక్కడ పిల్లలకు లెక్కలు నేర్పించేందుకు అనుసరించే విధానాన్ని ‘సింగపూర్ మ్యాథ్స్’ అని పిలుస్తారు.

1980లలో ప్రభుత్వ పాఠశాలల కోసం సింగపూర్ విద్యా మంత్రిత్వ శాఖ ఈ విధానాన్ని అభివృద్ధి చేసింది.

ఈ విధానంలో అంశాలను కంఠస్థం చేయడం కాకుండా చదువుతున్న అంశంపై లోతుగా అవగాహనను ఏర్పరచడంపై దృష్టి సారిస్తారు.

ఇటీవలి దశాబ్దాలలో ఈ పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో అనుసరిస్తున్నారు.

గణితం

సింగపూర్ మ్యాథ్స్ ఎలా పని చేస్తుంది?

సింగపూర్ మ్యాథ్స్ పద్ధతిలో రెండు ప్రధాన ఆలోచనలు ఉన్నాయి. ఒకటి సీపీఏ అంటే కాంక్రీట్, పిక్టోరియల్, అబ్‌స్ట్రాక్ట్ అప్రోచ్. రెండోది నోషన్ ఆఫ్ మాస్టరీ.

సీపీఏ విధానంలో భౌతిక, దృశ్య సాధనాలను ఉపయోగించి విద్యార్థులకు ప్లస్, మైనస్ భావనలు వంటి అబ్‌స్ట్రాక్ట్ టాపిక్స్ మీద అవగాహన కల్పిస్తారు.

సీపీఏ విధానం సింగపూర్‌ మ్యాథ్స్‌కు ప్రత్యేకమైనది కాదు. 1960లలో ఈ విధానాన్ని అమెరికా మానసిక శాస్త్రవేత్త జెరోమ్ బ్రూనర్ అభివృద్ధి చేశారు.

గణితం అనేది అమూర్త భావన కాబట్టి పిల్లలే కాకుండా పెద్దలు కూడా లెక్కలను కష్టమైన సబ్జెక్టుగా భావిస్తారు. ఈ భావన ఆధారంగా సీపీఏ విధానాన్ని రూపొందించారు.

సీపీఏ విధానం అమూర్త భావనలను వాస్తవిక పద్ధతుల ద్వారా నేర్పిస్తుంది. అలా క్రమంగా సంక్లిష్ట అంశాల దిశగా తీసుకెళ్తుంది.

సింగపూర్ మ్యాథ్స్ విధానంలో పిల్లలు ఎప్పుడూ వాస్తవికంగా నేర్చుకుంటారని బీబీసీతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏరియల్ లిండార్ఫ్ చెప్పారు.

‘‘కూడికల కోసం వారు ఘనాలను (క్యూబ్స్) వాడుతుండొచ్చు. లేదా దృశ్యపరంగా ఏదైనా చేస్తుండొచ్చు. పువ్వుల చిత్రాలను ఒకచోట చేర్చుతూ లెక్కిస్తూ ఉండొచ్చు. నంబర్ల కంటే సులభంగా అర్థమయ్యే అంశాల ద్వారా వారు కూడికలు నేర్చుకుంటారు’’ అని ఆయన అన్నారు.

సీపీఏ విధానం ఇలాంటి వివిధ భౌతిక, దృశ్యరూప మాధ్యమాల ద్వారా గణితాన్ని సులభంగా అర్థం చేసుకునే వీలు కల్పిస్తుంది.

భౌతిక, దృశ్య మాధ్యమాల ద్వారా ఒక అంశాన్ని పిల్లలు చక్కగా అర్థం చేసుకున్న తర్వాతే సంక్లిష్టంగా ఉండే అబ్‌స్ట్రాక్ట్ స్థాయికి వెళ్తారు.

సింగపూర్ మ్యాథ్స్ విధానం కంఠస్థం చేయడం మీద ఆధారపడదు అని లిండార్ఫ్ అన్నారు.

గణితం

ఫొటో సోర్స్, Getty Images

నోషన్ ఆఫ్ మాస్టరీ

సింగపూర్ మ్యాథ్స్ విధానంలో మరో కీలక భావన నోషన్ ఆఫ్ మాస్టరీ.

అంటే తరగతి గదిలోని ఏ ఒక్క విద్యార్థి చదువులో వెనుకబడకుండా విద్యార్థులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లేలా చూడటం ఈ విధానంలోని ప్రధాన లక్ష్యం.

ఉదాహరణకు, కూడిక భావనను తరగతిలోని కొందరు పిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు. మిగతా పిల్లలకు కాస్త నెమ్మదిగా ఈ భావన అర్థం అవుతుంది.

ఇలాంటి సందర్భంలో త్వరగా నేర్చేసుకున్న విద్యార్థులకు తీసివేత వంటి మరో కొత్త భావనను నేర్పించరు.

తరగతిలోని మిగతా విద్యార్థులకు కూడికలు వచ్చేంతవరకు ఈ పిల్లలకు కూడికల్లోని కొత్త భావనలను పరిచయం చేస్తారు. అంటే మరింత లోతుగా నేర్పిస్తారు.

‘‘తరగతిలోని అందరికీ వచ్చేంతవరకు మిగతా వారిని ఆపాలనడం దీని ఉద్దేశం కాదు’’ అని డాక్టర్ లిండార్ఫ్ అన్నారు.

సింగపూర్ మ్యాథ్స్ విధానంలో విద్యార్థులు గణితాన్ని ముఖ్యమైనదిగా, తాము లెక్కలు చేయగలమని భావించేలా చేయడం చాలా ముఖ్యం.

‘‘ప్రతీ ఒక్కరూ గణితాన్ని చేయగలరు, ఒక స్థాయి వరకు అందరూ అందులో నైపుణ్యాన్ని సాధించగలరు అని చెప్పడమే దీని ఉద్దేశం’’ అని డాక్టర్ లిండార్ఫ్ అన్నారు.

‘‘కొంతమంది త్వరగా అర్థం చేసుకుంటారు. కొంతమంది లోతుగా అర్థం చేసుకుంటారు. కొంతమందికి మ్యాథ్స్ వస్తుంది, మరికొందరికి రాదు అనే మాటను మనం తరచూ వింటుంటాం. నిజానికి దీన్ని నేను ఒప్పుకోను. సింగపూర్ మ్యాథ్స్ విధానంలో కూడా ఈ ఆలోచన లేదు’’ అని లిండార్ఫ్ వివరించారు.

గణితం

వేరే చోటా ఈ విధానం పని చేస్తుందా?

అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, యూకేతో పాటు ఇతర చాలా దేశాల్లో ఇప్పటికే సింగపూర్ మ్యాథ్స్ విధానాన్ని అనుసరిస్తున్నారు.

సింగపూర్ మ్యాథ్స్ విధానం విజయవంతం కావడానికి సింగపూర్ సంస్కృతి, చరిత్రకు ఈ విధానానికి దగ్గరి సంబంధం ఉండటమే కారణమని లిండార్ఫ్ నమ్ముతారు.

‘‘ఈ పద్ధతిని ఇతర దేశాల్లో ప్రవేశపెట్టవచ్చని నేను అనుకోవట్లేదు. సింగపూర్‌కు ఒక ఆసక్తికర, ప్రత్యేక చరిత్ర ఉంది. ఇది చాలా చిన్న ప్రాంతం. సింగపూర్‌లో విద్యాపరమైన మార్పుకు, యూకే లేదా అమెరికాలో విద్యావిధానంలో మార్పుకు చాలా తేడా ఉంటుంది’’ అని లిండార్ఫ్ చెప్పారు.

మిగతా దేశాలతో పోలిస్తే సింగపూర్‌లోని టీచర్లకు మెరుగైన కెరీర్ అవకాశాలు, మద్దతు ఉందని ఆమె అన్నారు.

గణితం పట్ల పిల్లల వైఖరి కూడా సింగపూర్ మ్యాథ్స్ విజయానికి ఒక కారణం అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)