ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ టైటిల్‌కు న్యాయం చేశారా?

నితిన్, శ్రీలీల

ఫొటో సోర్స్, SreshthMoviesOfficial/YT

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

'రేసుగుర్రం' చూశారా?

'రేసుగుర్రం' చిత్రానికి ర‌చయిత‌గా ప‌ని చేసిన వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకొన్న ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రంతో పోలిక చూడాలిప్పుడు.

ఎందుకు ఈ రెండు చిత్రాలకూ పోలిక? అంటే, ఈ సినిమాలోనూ 'రేసుగుర్రం' లాంటి మ్యాజిక్ ఒక‌టి న‌మ్ముకొన్నాడు ద‌ర్శ‌కుడు.

మ‌రి.. ఆ మ్యాజిక్‌లో లాజిక్ ఉందా? `రేసుగుర్రం` ఫార్ములా ఇక్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యిందా? కాలేదా?

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్

ఫొటో సోర్స్, SreshthMoviesOfficial/YT

కథేంటి?

అభి (నితిన్‌)కి సినిమాలంటే పిచ్చి. కానీ, ఎక్క‌డా అవ‌కాశాలు రావు. చివ‌రికి జూనియ‌ర్ ఆర్టిస్టు వేషాల‌తో స‌రిపెట్టుకొంటాడు.

సినిమాల్లో ఛీత్కారాల‌కు తోడు.. ఇంట్లో వెట‌కారాలూ ఎక్కువ అవుతాయి. తండ్రి (రావు ర‌మేష్‌)తో నిమిషం కూడా ప‌డ‌దు.

ఈలోగా నిఖిత (శ్రీ‌లీల‌)తో ప‌రిచ‌యం అవుతుంది. నిఖిత‌ని ఓ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కిస్తాడు అభి. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు.

నిఖిత కంపెనీలో ఉద్యోగం సంపాదించి సీఈఓగా ఎదుగుతాడు అభి. ఇంట్లోనూ ఇబ్బందులూ దూరం అవుతాయి.

వ‌దిలేసిన సినిమా మ‌ళ్లీ అభిని వెదుక్కొంటూ వ‌స్తుంది.

ఓ వైపు సీఈఓగా కంఫ‌ర్ట్ జీవితం, మరోవైపు ఇష్ట‌మైన సినిమా..ఈ రెండింటిలో అభి దేన్ని ఎంచుకొన్నాడు..? అభి క‌థ‌కీ, నీరో (సుదేవ్ నాయ‌ర్‌) అనే వ్యక్తికి ఉన్న లింక్ ఏమిటి? అన్నదే మిగిలిన కథ.

నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ రివ్యూ

ఫొటో సోర్స్, SreshthMoviesOfficial/YT

ఫార్ములా వర్కవుటైందా?

ప్రేక్ష‌కుల్ని అలరిస్తే చాలు, ఇంకేం కోరుకోరు.

ఎంట‌ర్‌టైన్ చేసే ప‌ద్ధ‌తి బాగుంటే, క‌నీసం లాజిక్కులు అడ‌గ‌రు. కథ గురించి ప‌ట్టించుకోరు, ఎలివేష‌న్లు కోరుకోరు, జ‌స్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంతే.

అయితే, దీన్ని ‘టేకిట్ ఫ‌ర్ గ్రాంటెడ్’గా తీసుకొంటే మొద‌టికే మోసం వ‌స్తుంది. న‌వ్వించే ప్ర‌య‌త్నంలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫ‌లితం ఉండ‌దు. ఇందులో ద‌ర్శ‌కుడు న‌మ్ముకొన్న‌ది కేవ‌లం వినోదాన్ని మాత్ర‌మే.

ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్‌ చేస్తే చాలనుకొన్నాడు. ఆ దారిలో తన‌కు తానే లాజిక్కుల్ని మ‌ర్చిపోయాడు. క‌థ‌ని ఓ యాక్ష‌న్ బ్లాక్‌తో ప్రారంభించాడు ద‌ర్శ‌కుడు.

ఆ త‌ర‌వాత‌.. జూనియ‌ర్ ఆర్టిస్టుగా హీరో త‌న‌ని తాను ప‌రిచ‌యం చేసుకోవ‌డంతో.. కాస్త ఫ‌న్‌, ఇంకాస్త ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.

సినిమా నేప‌థ్యం ఉంది కాబ‌ట్టి, సినిమాల్ని, వాటిని ఆధారంగా వ‌చ్చే స్పూఫ్ కామెడీని ద‌ర్శ‌కుడు బాగానే వాడుకొన్నాడు.

ఓ స‌న్నివేశం... 'గ‌బ్బ‌ర్ సింగ్‌'లోని అంత్యాక్ష‌రి ఎపిసోడ్‌ను గుర్తుకు తెస్తుంది. సినిమావాళ్ల‌పై వ‌చ్చే రూమ‌ర్ల‌ని, ఈ సీన్‌లో పాట‌ల స‌హాయంతో క్లారిఫై చేయ‌డంతో ఫ‌న్ పండింది.

న‌రేశ్ -ప‌విత్రాలోకేష్‌ల ల‌వ్ స్టోరీని ఈ సంద‌ర్భంగా గుర్తు చేయ‌డంతో థియేట‌ర్ల‌లో న‌వ్వులు విర‌బూస్తాయి. ఆఖ‌రికి 'కాంతారా'ని కూడా వ‌ద‌ల్లేదు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి తండ్రిగా రావు ర‌మేష్ ఫ‌స్ట్రేష‌న్ కూడా టైమ్ పాస్ వ్య‌వ‌హార‌మే. ఎవ‌రేం చెప్పినా హీరో దులుపుకుని పోవ‌డం, సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూడ‌డం, హీరోయిన్‌తో ల‌వ్ ట్రాక్ ఇలా ఫ‌స్టాఫ్ అంతా సాగిపోతుంటుంది.

క‌థ అంగుళం కూడా క‌ద‌ల‌క‌పోయినా, సినిమాలోని కాన్‌ఫ్లిక్ట్ మొద‌లు కాక‌పోయినా, ఫ‌న్ వ‌ల్ల ఆ లోటు క‌నిపించ‌కుండా పోయింది.

బిట్లు బిట్లుగా చూస్తే, ఫ‌న్ వ‌ర్క‌వుట్ అయినా, మొత్తంగా క‌థ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి 'ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం జ‌రిగింది?' అనేది అర్థం కాదు.

విశ్రాంతి కార్డుకు ముందు ప్రేక్ష‌కుల్ని యాక్ష‌న్ మోడ్‌లోకి దింపి, ఆ త‌ర‌వాత క‌థ‌ని కొత్త మ‌లుపు తిప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

రావు రమేశ్

ఫొటో సోర్స్, SreshthMoviesOfficial/YT

రీల్ లైఫ్ vs రియల్ లైఫ్

రీల్ లైఫ్‌లో హీరో అవ్వ‌లేని ఓ కుర్రాడు రియ‌ల్ లైఫ్‌లో హీరో అవ్వాల‌ని స్క్రిప్టు ప‌ట్టుకొని,- విల‌న్ అడ్డాలోకి అడుగు పెట్ట‌డంతో క‌థ మ‌రో మ‌లుపు తీసుకొంది. ఇది ట్విస్ట్ అని దర్శకుడు అనుకోవచ్చు కానీ, వర్కవుటవ్వలేదు.

అప్ప‌టి వ‌ర‌కు అత్యంత క్రూరంగా కనపించిన విల‌న్‌ కాస్తా, హీరో రాగానే ఎప్ప‌టిలా బ‌ఫూన్‌లా మారిపోతాడు.

'నువ్వు.. ఎంత ఎత్తుకు ఎదిగితే నాకు అంత కిక్‌' అంటూ హీరోకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైనా హీరో - విల‌న్ ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన పోరు జ‌రిగితేనే క‌థ‌లో మ‌జా వ‌స్తుంది. ఇక్క‌డ విల‌నే చేతులు ఎత్తేసి, హీరో అడ్డంకుల‌న్నీ తానే తొల‌గించేయ‌డంతో - అసలు పెప్ లేకుండా పోతుంది.

ఓ ఊరు, అక్క‌డో దుర్మార్గుడు, వాళ్ల‌ని ర‌క్షించ‌డానికి వచ్చిన హీరో అనేది చాలా పాత ప్యాట్ర‌న్‌.

దాన్ని ద‌ర్శ‌కుడు 'సినిమా - జూనియ‌ర్ ఆర్టిస్టు - స్క్రిప్టు' అనే మూడు లేయ‌ర్లు ప‌ట్టుకొని కొత్త‌ద‌నం అతికించే ప్ర‌య‌త్నం చేశాడు.

అయితే, ఈ ప్ర‌య‌త్నం అంత స‌జావుగా మాత్రం సాగ‌లేదు. ఊరు హీరో కోసం చూసే ఎదురు చూపుల్లో ఎమోష‌న్ క‌నిపించ‌లేదు. ఊరికేదో ఆప‌ద ఉంది, దాన్ని హీరో ఆపాలి.. అనే ఉత్కంఠ‌త తీసుకురాలేదు.

విల‌న్ వ‌ల్ల హీరోకి ఎలాంటి ముప్పు వ‌స్తుందో అనే భ‌యం లేదు. అలాంట‌ప్పుడు హీరో ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రేక్ష‌కుల బుర్ర‌కు ఎక్కదు. 'ఎక్స్ ట్రా'లో అదే జ‌రిగింది. ద్వితీయార్థంలో అక్క‌డ‌క్క‌డ కొన్ని కామెడీ సీన్లు బిట్స్ అండ్ పీసెస్‌గా వ‌స్తుంటాయి. అలాంటి చోట ప్రేక్ష‌కులు కాస్త రిలాక్స్ అవుతారు.

మిగిలిన‌దంతా.. వ్య‌ర్థ ప్ర‌యాసే.

'మ‌న క్లైమాక్స్ ఎప్పుడు పెట్టుకొందాం' అని హీరో, విల‌న్ సినిమా భాష‌లో మాట్లాడుకొంటుంటారు.

ప్రేక్ష‌కుల ఫీలింగ్ కూడా అదే. 'ఈ సినిమా క్లైమాక్స్ ఎప్పుడా' అని.

ప్రేక్ష‌కుడు సినిమా గ‌మ‌నం గురించి ఆలోచించ‌కుండా, ముగింపు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడంటే, ఆ సినిమా ప‌రిస్థితి ఏమిటో అర్థం చేసుకోవోచ్చు.

రాజశేఖర్

ఫొటో సోర్స్, SreshthMoviesOfficial/YT

రాజశేఖర్ రోల్ పండిందా?

హీరో రాజ‌శేఖ‌ర్ తొలిసారి ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా క‌నిపించిన సినిమా ఇది.

ఆ రూపంలో 'ఎక్స్ ట్రా'పై ఇంకాస్త ఫోక‌స్ పెరిగింది. ఇది వ‌ర‌కు ఇలాంటి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు అవ‌కాశాలు చాలా వ‌చ్చినా రాజ‌శేఖ‌ర్‌ చేయ‌లేదు.

ఏరి కోరి 'ఎక్స్ ట్రా' ఒప్పుకొన్నాడంటే ఈ పాత్ర‌లో ఏదో బ‌లం ఉంద‌నిపించింది. తీరా చూస్తే, ఆయ‌న పాత్ర‌లో ఎలాంటి ప్ర‌త్యేక‌త‌లూ క‌నిపించ‌లేదు. అస‌లు ఏముంద‌ని రాజ‌శేఖ‌ర్ ఈ పాత్ర చేశాడు? అనే డౌటు ప్రేక్ష‌కుల‌కు వ‌స్తుంది.

శ్రీ‌లీల తొలి స‌గంలో నాలుగు సీన్ల‌లో, ద్వితీయార్థంలో రెండు పాట‌ల‌లో క‌నిపించింది. అంత‌కు మించి చేసిందేం లేదు. రావు ర‌మేష్ కొన్ని చోట్ల న‌వ్వించినా, చాలా చోట్ల... త‌న హావ‌భావాలు ఇబ్బంది పెట్టేలా సాగాయి. మ‌రీ ‘ఓవ‌ర్ ద బోర్డ్’ న‌ట‌న అనిపించింది.

విల‌న్‌ని బఫూన్‌గా మార్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌న్ని రోజులూ ఆ పాత్ర పండ‌దు. ఈ సినిమాలోనూ అదే జ‌రిగింది. విల‌న్‌ని చూస్తే భ‌యం రావాల్సింది పోయి, విర‌క్తి, అస‌హ‌నం ప్రేక్ష‌కుల్లో క‌లుగుతుంటాయి.

టేలర్ మేడ్ క్యారెక్టర్..

ఇక నితిన్ గురించి చెప్పుకోవాలి. త‌న‌కు ఇది టేల‌ర్ మేడ్ పాత్ర‌.

'నితిన్ ని దృష్టిలో ఉంచుకొనే ఈ క‌థ రాశా' అని ద‌ర్శ‌కుడు చెప్పుకోవ‌డంలో త‌ప్పేం లేదు. కాక‌పోతే.. 'నా కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యారెక్ట‌ర్‌' అని నితిన్ చెప్ప‌డ‌మే అతిశ‌యోక్తి.

నితిన్ కామెడీ టైమింగ్ బాగుంది. త‌న కాస్ట్యూమ్స్ బాగున్నాయి. చాలా జోవియ‌ల్ గా త‌న పాత్ర చేసుకొంటూ వెళ్లిపోయాడు. నితిన్ ఈ క‌థ‌కు ప్ల‌స్ అయ్యాడు కానీ, నితిన్‌కి ఈ క‌థ‌, ఈ సినిమా ప్ల‌స్ కాలేదు. అదే, దుర‌దృష్టం.

నవ్యత ఉంది కానీ..

ద‌ర్శ‌కుడు ఈ సినిమా కోసం అనుకొన్న లైన్‌లో న‌వ్య‌త ఉంది. దాన్ని స్క్రీన్ ప్లేగా మ‌ల‌చి, సినిమాగా అందించ‌డంలో మాత్రం త‌డ‌బ‌డ్డాడు. త‌న అనుభ‌వం స‌రిపోలేదు. ఫ‌న్ కోసం రాసుకొన్న సీన్లు ఓకే అనిపిస్తాయి. క‌థ ని చెప్ప‌డానికి అల్లుకొన్న స‌న్నివేశాలు మాత్రం ర‌క్తి క‌ట్ట‌లేదు. పైగా లాజిక్‌కి ఆమ‌డ దూరంలో నిలిచాయి.

హారీశ్ జ‌య‌రాజ్ సంగీతంలో 'డేంజరు పిల్ల‌' పాట బాగుంది. మైస‌మ్మ పాట‌.. త‌మిళ ఫ్లేవ‌ర్‌లో సాగింది. కొన్ని మాట‌లు భ‌లే కుదిరాయి. 'మ‌హంతీ.. మొహంతీ..' లాంచి చిన్న చిన్న లైనర్లు బాగా పేలాయి.

మొత్తంగా చూస్తే, అక్క‌డక్క‌డా కొన్ని కామెడీ బిట్లు త‌ప్ప - ఈ సినిమా మొత్తం 'ఆర్డిన‌రీ'గానే సాగిపోయింది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)