హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని ఖాతాలో మరో హిట్ పడిందా?

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
నాని సినిమాలంటే ప్రేక్షకులకు ఓ నమ్మకం. హిట్టూ, ఫ్లాపూ పక్కన పెడితే, ప్రతీసారీ ఓ కొత్త తరహా కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. తనని తాను కొత్తగా మలుచుకొని, ఓ కొత్త నానిని పరిచయం చేయాలనుకొంటాడు.
కొత్త దర్శకులతో ప్రయాణించేటప్పుడు మరింత నాణ్యమైన వినోదాన్ని అందిస్తుంటాడు. అందుకే నాని ప్రయాణం సాఫీగా సాగుతోంది.
ఈ ప్రయాణంలో మరోసారి నాని ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సినిమా...'హాయ్ నాన్న'. ప్రచార చిత్రాలు, పాటలూ, నాని మాటలూ చూస్తుంటే.. ఇదో ఎమోషనల్ రైడ్ అనే సంగతి అర్థమవుతోంది.
మరి... 'హాయ్ నాన్న' ఎలాంటి ఎమోషన్‌ని పండించింది..? నానిపై ప్రేక్షకులు పెట్టుకొన్న నమ్మకం ఈసారి ఏమైంది?
అనగనగా ఓ తండ్రీ - కూతురు. ఆరేళ్ల కూతురంటే తండ్రికి ప్రాణం. తన తల్లి ఎక్కడుందో తెలుసుకోవాలన్నది కూతురి ఆరాటం. తల్లి ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ.. ఏదోలా తప్పించుకొంటుంటాడు తండ్రి.
కానీ.. ఓసారి మాత్రం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కూతురికి జన్మనిచ్చిన తల్లెవరో, తమని వదిలేసి ఎందుకు వెళ్లిపోయిందో.. ఓ కథలా చెబుతాడు.
మరి ఆ కథలోని నిజానిజాలేంటి? ప్రేమించిన వ్యక్తినీ, కన్న కూతుర్నీ వదిలేసి ఆ తల్లి ఎందుకు వెళ్లిపోయింది? ఈ ముగ్గురూ కలిశారా, లేదా? అనేదే క్లుప్తంగా... 'హాయ్... నాన్న'.

ఫొటో సోర్స్, FACEBOOK
ఆ మూడు పాత్రల్నీ నమ్మాడా?
'హాయ్.. నాన్న' ట్రైలర్ చూసినవాళ్లకు ఈ కథేంటో చూచాయిగా అర్థమైపోతుంది. కథగా చెప్పుకోవాలంటే.. మూడు లైన్లు కూడా పట్టలేదు. ఇంత సింపుల్ కథని నాని ఎందుకు అంత బలంగా నమ్మాడు? అనే అనుమానం వేస్తుంది.
అయితే నాని నమ్మింది.. ఈ మూడు లైన్ల కథ కాదు. మూడు బలమైన పాత్రల్ని. నాని, మృణాల్, బేబీ కియారా ఖన్నా. ఈ మూడు పాత్రలూ, వాటి నేపథ్యాలూ, అందులోని ఎమోషన్ ఇదే నాని నమ్మకం.
ఇంత సింపుల్ కథలో కొన్ని ట్విస్టుల్ని, కావల్సినంత ఎమోషన్ నీ జోడించి రాసుకొన్నాడు దర్శకుడు.
తండ్రీ కూతుర్ల ఎమోషన్‌ని చూపిస్తూ.. కథలోని నిదానంగా తీసుకెళ్లాడు దర్శకుడు. మహి (కియారా ఖన్నా) ఆరోగ్య పరిస్థితిని తొలి సన్నివేశాల్లోనే అర్థమయ్యేలా చూపిస్తూ, ఆ పాత్ర పై కావల్సినంత సానుభూతి వచ్చేలా సన్నివేశాల్ని డిజైన్ చేసుకొన్నాడు.
యష్న (మృణాల్) పాత్ర కథలోకి రావడం, కూతురికి తన తల్లి గురించి తండ్రి విరాజ్ (నాని) కథగా చెప్పడం మొదలెట్టడంతో.. కథనంలో కాస్త వేగం వస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో లవ్ స్టోరీ చాలా రోటీన్‌గా సాగి ఇబ్బంది పెడుతుంది.
అక్కడ... ధనిక - పేదల ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీ చూపించాడు దర్శకుడు. ఈ కథలో దర్శకుడు నమ్ముకొంది లవ్ స్టోరీని కాదు కాబట్టి.. ఈ విషయంలో దర్శకుడ్ని క్షమించి వదిలేయొచ్చు. హోటల్‌లో బిల్ కట్టే సీన్ దగ్గర మాత్రం దర్శకుడు తన పనితనం చూపించాడు. అక్కడ రైటర్‌కీ మంచి మార్కులు పడతాయి. 'మీరు దూరాన్ని కిలో మీటర్లతో కొలుస్తారేమో.. నేను కాలంతో కొలుస్తాను' అని హీరో చెప్పడం బాగుంది.
హీరో క్యారెక్టర్ డల్ అయిపోతోందేమో అనుకొంటున్న తరుణంలో వచ్చే ఈ డైలాగ్ - హీరోయిన్‌కి హీరోపై ఉన్న ప్రేమని, నమ్మకాన్ని నిలబెట్టేలా చేశాయి. ఈ సన్నివేశంలో దర్శకుడి పనితనం బయటపడుతుంది.
ఇది మినహాయిస్తే.. ఫస్టాఫ్‌లో చాలా వరకూ సినిమా నిదానమే ప్రధానం అనే స్లోగన్ ని ఫాలో అవుతూ నడుస్తుంటుంది. ఇంట్రవెల్ లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్ వస్తుంది. అక్కడ 'ఓహో.. ఈ పాయింట్ నచ్చే నాని ఈ కథని ఓకే చేశాడు' అని ప్రేక్షకులకు ఓ నమ్మకం కలుగుతుంది.

ఫొటో సోర్స్, T-Series Youtube
మహికి నిజం తెలిసిందా?
విశ్రాంతి ఘట్టం దగ్గర వచ్చే మలుపు బాగున్నా - సెకండాఫ్ లో ఏం జరగబోతోంది? క్లైమాక్స్ ఎటువైపు వెళ్లబోతోంది? అనే విషయాలపై అప్పటికే ప్రేక్షకుడికి ఓ స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది.
ప్రేక్షకుడి ఊహకూ, ఆలోచనలకు దగ్గరగానే సన్నివేశాలు నడుస్తుంటాయి. కాబట్టి ప్రేక్షకులకు థ్రిల్ అనిపించదు. మహికి తన తల్లెవరో నిజం తెలుస్తుందా, లేదా? తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? అనే పాయింట్ పైనే సెకండాఫ్ నడవాలి.
అంత చిన్న పాయింట్ తో ద్వితీయార్థాన్ని నడిపే సామర్థ్యం దర్శకుడికి లేకుండా పోయింది. అందుకే గోవా ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. అక్కడ శ్రుతిహాసన్ ని రంగంలోకి దింపి ఓ ఐటెమ్ సాంగ్ లాంటిది వేసుకొన్నారు. ఆ పాటతో కథకు ఎలాంటి ఉపయోగమూ లేదు. నాని, మృణాల్ మద్యం సేవించి.. మాట్లాడుకొనే సీన్ కూడా నాన్ సింక్ వ్యవహారంలా ఉంటుంది.
దర్శకుడు ఈ కథని ఓ కూతురి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలని చూశాడు కానీ.. నిజానికి ఇది ఓ తల్లి కథ అనిపిస్తుంది. బాధ్యత నెత్తిమీద వేసుకోవాల్సివచ్చినప్పుడు పారిపోయే.. ఓ అమ్మాయి పాత్రలా ఈ కథని మొదలెట్టి, అలానే నడిపించి ఉంటే బాగుండేది.
చివర్లో కూడా రెండు మూడు ట్విస్టులు అట్టిపెట్టుకొన్నాడు దర్శకుడు. కథ మరీ.. ఫ్లాట్ గా వెళ్లిపోయిందేమిటి? అనే భావన రాకుండా ఆ మలుపులు కాపాడాయి కానీ... కాస్త లోతుగా ఆలోచిస్తే.. అదంతా దర్శకుడు కావాలని తీసుకొన్న లిబర్టీనే అనిపిస్తుంది.
చివర్లో హీరోని కొట్టడానికి వచ్చిన గ్యాంగ్ అంతా డాక్టర్లుగా అవతారం ఎత్తి, కూతురికి వైద్యం చేయడం కూడా.. మరీ టూ మచ్‌గా అనిపించే వ్యవహారమే.

ఫొటో సోర్స్, T-Series Youtube
ఈ డోస్ సరిపోలేదు
మన పల్స్ రేటులానే, సినిమా కూడా. అప్ అండ్ డౌన్స్ ఉండాలి. ఎక్కడో ఓ చోట హై ఎమోషన్ చూపించాలి. 'హాయ్ నాన్న' కథలో అదేం లేదు. సినిమా అంతా చాలా ఫ్లాట్ గా నడుస్తుంటుంది. దర్శకుడు తాను కథ రాసుకొంటున్నప్పుడు ఏదైతే ఎమోషన్‌ని బలంగా నమ్మాడో.. దాన్ని తెరపై తీసుకురావడంలో, అదే ఎమోషన్ ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలోనూ కాస్తంత తడబడ్డాడేమో అనిపిస్తుంది.
నాని సినిమాల్లో ఎమోషన్ ఎంత ఉన్నా, తన క్యారెక్టర్‌లో ఫన్ ఉంటుంది. ముందు ఆ పాత్రని ప్రేమిస్తే... ఆ తరవాత ఈ పాత్ర తాలూకూ ఫీలింగ్స్‌ని ప్రేక్షకుడు ఓన్ చేసుకొంటాడు. ఈసారి విరాజ్ క్యారెక్టర్‌లో అదే మిస్సయ్యింది.
అందుకే తెరపై నాని అద్భుతంగా నటిస్తున్నా, కన్నీరు పెట్టుకొన్నా.. ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. పతాక సన్నివేశాల్లో మళ్లీ కాస్త సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. కథని ముగించిన తీరు కూడా ప్రేక్షకుల మనసులకు రిలీఫ్ ఇచ్చేదే. అయితే.. ఈ డోస్ మాత్రం సరిపోదు.

ఫొటో సోర్స్, T-Series Youtube
కాస్త హుషారు జోడిస్తే..
నాని.. నాన్నగా అవతారం ఎత్తిన మరో సినిమా ఇది. తను ఎమోషన్‌ని ఎంత బాగా పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో, విరాజ్ పాత్రలో.. అంతా ఎమోషనే. దాన్ని పర్‌ఫెక్ట్‌గా ప్రజెంట్ చేశాడు.
అయితే నాని పాత్రల్లో ఉండే చిలిపిదనం, చలాకీదనం ఈ సినిమాలో మాత్రం ఊహించకూడదు. బరువైన తండ్రి పాత్ర కాబట్టి, అంత గుంభనంగా నటించాడు అనుకొంటే, కనీసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అయినా - నాని పాత్రకు కాస్త హుషారు ఇంజెక్ట్ చేయొచ్చు కదా? అనిపిస్తుంది.
మృణాల్‌ది చాలా కీలకమైన పాత్ర. సీతారామం తరవాత తనపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో మరోసారి తనకు తగిన పాత్రే ఎంచుకొంది. తన కాస్ట్యూమ్స్ హుందాగా ఉన్నాయి. పాత్రలో కూడా భిన్న పార్శ్వాలను చూపించింది. అయితే ఈ క్యారెక్టర్‌ని రాసుకోవడంలో దర్శకుడు ఇంకాస్త క్లారిటీగా ఉండాల్సింది.
బేబీ కియారా గురించి కొన్నాళ్లు మాట్లాడుకొంటారు. ఈ చిన్నారి నటన అంత సహజంగా ఉంది. చూడగానే ఆ పాత్రపై జాలి, సానుభూతి కలుగాయంటే కారణం.. తన ముచ్చటైన నటనే. బరువైన సన్నివేశాల్ని కూడా ఇంత చిన్న వయసులో చాలా తేలిగ్గా చేసి పారేసింది.
జయరామ్ ది చిన్న పాత్రే అనుకొంటున్న తరుణంలో.. చివర్లో ఆ పాత్ర సైతం ఓ మలుపు రావడానికి కారణమైంది. ప్రియదర్శిది రెగ్యులర్ స్నేహితుడి పాత్రే. శ్రుతిహాసన్ కేవలం ఓ గీతానికి మాత్రమే పరిమితమైంది.
సమర్థవంతమైన నటీనటుల్ని ఎంచుకోవడంలో దర్శకుడికి ఉండే వెసులుబాటేంటంటే.. తాను రాసుకొన్న సన్నివేశాల్లో అంత దమ్ము లేకపోయినా.. నటీనటుల వల్ల నిలబడుతుంటాయి. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి.
ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న సంగీత దర్శకుడి పేరు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ చిత్రానికీ ఆయనే స్వరాలు అందిచారు. 'సమయమా' అనేది మంచి మెలోడీ. పబ్ సాంగ్ కూడా హుషారుగా సాగింది.
మిగిలిన పాటలు బిట్లు బిట్లుగా వస్తుంటాయి. నేపథ్య సంగీతంతో కథలోని మూడ్ ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. ఫొటోగ్రఫీ నీట్ గా ఉంది.
మాటల్లో గుర్తు పెట్టుకొని, మళ్లీ మాట్లాడుకొనేలా ఏం వినిపించలేదు. కానీ.. సందర్భానికి తగ్గట్టుగా సరిపోయాయి.
దర్శకుడు ఓ మామూలు ప్రేమకథని, తండ్రీ కూతర్ల ఎమోషనల్ టచ్ తో రాసుకొనే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయాణంలో కొన్ని చోట్ల మెస్మరైజ్ చేస్తాడు, ఇంకొన్నిచోట్ల బోర్ కొట్టిస్తాడు, చిన్న చిన్న మలుపులతో.. కాస్త ఆసక్తి రేకెత్తించాడు. ఇలా విభిన్న అనుభూతుల్ని అందించే చిత్రమిది.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు? కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ మిస్సయ్యారు?
- ఒంట్లోని రోగాల గురించి చిగుళ్లు ఏం చెబుతాయి?
- ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనా ఖైదీలు: 'రేప్ చేస్తామని బెదిరించారు, మాపై కుక్కల్ని ఉసిగొల్పారు'
- మలేషియాలో చైనా కంపెనీ నిర్మించిన ఈ ‘ఘోస్ట్ సిటీ’ అంటే జనం ఎందుకు జడుసుకొంటున్నారు?
- సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ: రాజ్‌పుత్ కర్ణీ సేన చీఫ్ హత్యతో రగులుతున్న రాజస్థాన్, ఆయన్ను చంపిందెవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














