మలేషియాలో చైనా కంపెనీ నిర్మించిన ఈ ‘ఘోస్ట్ సిటీ’ అంటే జనం ఎందుకు జడుసుకొంటున్నారు?

ఫారెస్ట్ సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 10 లక్షల మంది నివసించేందుకు వీలుగా నిర్మించిన ఫారెస్ట్ సిటీలో ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.
    • రచయిత, నిక్ మార్ష్
    • హోదా, ఆసియా బిజినెస్ కరస్పాండెంట్

‘కలల స్వర్గం’ అంటూ మలేషియాలో విలాస సౌకర్యాలతో నిర్మితమైన నగరం ఇప్పుడు ‘ఘోస్ట్ సిటీ’గా మారింది.

దక్షిణ మలేషియాలోని జోహోర్ నగరానికి సమీపంలో 100 బిలియన్ డాలర్లతో చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్ కంట్రీ గార్డెన్ సంస్థ మొదలుపెట్టిన ఈ గార్డెన్ సిటీలో 10 లక్షల మంది నివసించేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో వేలకొద్దీ అపార్ట్మెంట్‌లు నిర్మిస్తున్నారు.

చైనా 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)’ ప్రాజెక్టులో భాగంగా ‘కంట్రీ గార్డెన్’ చేపట్టిన ఈ 'ఫారెస్ట్ సిటీ' 2016లో రూపుదిద్దుకున్నా, ఇప్పటివరకు మొత్తం ప్రాజెక్టులో 15% మాత్రమే పూర్తయింది. కానీ, ప్రజాదరణ మాత్రం లేదు. 1% కన్నా తక్కువే వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ ప్రాజెక్టు ఎందుకని ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది?

ఫారెస్ట్ సిటీ

ఫొటో సోర్స్, FOREST GARDEN

ఫొటో క్యాప్షన్, ఫారెస్ట్ సిటీ నిర్మాణ నమూనాను ప్రతిపాదించిన కంట్రీ గార్డెన్

‘ఉండలేకపోయాను’

“మొత్తానికి అక్కడి నుంచి బయటపడ్డాను” అని నజ్మీ హనఫియా నవ్వుతూ చెప్పినా ఆయన ముఖంలో నిరాశ కనిపించింది.

ఏడాది క్రితం ‘ఫారెస్ట్ సీటి’కి తన నివాసాన్ని మార్చుకున్నారు 30 ఏళ్ల ఇంజినీర్ నజ్మీ. సముద్ర తీరాన నిర్మితమైన భవనంలో సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న నజ్మీ, తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

బీబీసీ ఆయనతోపాటు ఫారెస్ట్ సిటీకి వెళ్లింది.

“ఆరు నెలల తర్వాత ఇక ఉండలేనని అనిపించింది. ఆ ఘోస్ట్ టౌన్‌ను వదిలేసి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను” అన్నారు.

“నేను కట్టిన డిపాజిట్ గురించి ఆలోచించలేదు. నా డబ్బు గురించి ఆలోచించలేదు. ముందు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే చాలని అనుకున్నాను” అని చెప్పారు.

నజ్మీ మమ్మల్ని తాను నివసించిన అపార్ట్మెంట్‌కు తీసుకెళ్లారు.

ఆయన మాట్లాడుతూ "ఇక్కడ మీరు, మీ ఒంటరితనం.. అంతే. ఇంకేం ఉండదు" అన్నారు.

మలేషియాలో, అన్ని సౌకర్యాలు, అంటే, గోల్ఫ్ కోర్స్, వాటర్ పార్క్, బార్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, గృహ సముదాయాలు అన్ని ఒకే చోట ఉండేలా పర్యావరణహితంగా నగరాన్ని నిర్మించేందుకు కంట్రీ గార్డెన్ సంస్థ ముందుకు వచ్చింది.

2016లో కంట్రీ గార్డెన్ సంస్థ ఫారెస్ట్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించి, ఏడేళ్లు గడుస్తున్నా కూడా, అనుకున్న స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ఆదరణ లభించలేదు.

చైనాలో రియల్ ఎస్టేట్ రంగం మందగించిన నేపథ్యంలో 200 బిలియన్ డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోయిన కంట్రీ గార్డెన్ సంస్థ మాత్రం, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామనే ఆశావహ దృక్పథంతో ఉంది.

ఫారెస్ట్ సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫారెస్ట్ సిటీలో మూతబడిన మాల్స్

'ఉండాలంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది'

‘భూతల స్వర్గం’ అంటూ ఈ ప్రాజెక్టు గురించి కంట్రీ గార్డెన్ సంస్థ ప్రచారం చేస్తే, ఇప్పుడున్న వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.

విదేశాల్లో తమకంటూ మరో ఇల్లు ఉండాలని ఆశపడే చైనీయులకు ఇది చక్కని ఎంపిక అంటూ చైనా ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆ సంస్థ ప్రయత్నించింది.

అంతేకాక, ఫారెస్ట్ సిటీలో ప్రాపర్టీని సొంతం చేసుకుని, మలేషియన్లకు అద్దెకు ఇవ్వడం ద్వారా చైనీయులు పెట్టుబడిగా కూడా చూడొచ్చన్న సంకేతాలను ఇచ్చింది.

అయితే, జోహోర్‌కు ఈ నిర్మిత నగరం చాలా దూరంలో ఉండటంతో, స్థానికులు అంత సుముఖత చూపలేదు. అక్కడి వారు దీనిని ఘోస్ట్ సిటీగా పిలుస్తున్నారు.

“నిజం చెప్పాలంటే, ఇక్కడ ఉండాలంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది అన్నారు” నజ్మీ.

“ఈ ప్రదేశం గురించి నేను చాలా ఊహించుకున్నాను కానీ, అనుభవంలోకి వచ్చాక అర్థమైంది. ఇక్కడసలు ఏమీ లేదు” అన్నారు.

మేం అక్కడి ప్రదేశాలను పరిశీలించాం. అంతా నిర్మానుష్యంగా ఉంది. నిర్జన విడిది నగరంగా అనిపించింది. షాపింగ్ మాల్‌లో చాలా వరకు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడి ఉన్నాయి.

కంట్రీ గార్డెన్ షోరూం‌లో ఫారెస్ట్ సిటీ నమూనా ఉంది. మొత్తం ఫారెస్ట్ సిటీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఎలా ఉండనుందో చెప్పే నమూనా అది.

సేల్స్ విభాగం వద్ద ఉన్న ఇద్దరు ఉద్యోగులు నిరాశగా కనిపించారు. కాస్త దూరంలో ఉన్న బీచ్‌కు చేరుకునే దారిలో అక్కడక్కడా ఆల్కహాల్ బాటిళ్లు కనిపించాయి.

ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది.

అక్కడనున్న అపార్ట్మెంట్‌లలో కేవలం పది లేదా పన్నెండు ప్లాట్‌లలో మాత్రమే లైట్లు వెలిగాయి.

అక్కడే నివసిస్తున్న జోన్నే కౌర్ మాకు తారసపడ్డారు.

ఆమె మాట్లాడుతూ, “ఈ ప్రదేశం వింతగా అనిపిస్తోంది. చీకటి పడ్డాక కాదు, పగటి సమయంలోనే బయటకు రావాలంటేనే భయంగా అనిపిస్తోంది” అన్నారు.

జోన్నే కౌర్ కుటుంబం 28వ టవర్ బ్లాక్‌లో నివసిస్తోంది. ఆ ఫ్లోర్ మొత్తంలో జోన్నే కుటుంబం మాత్రమే ఉంది. వారూ త్వరలోనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు జోన్నే మాతో చెప్పారు.

“ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారిని తల్చుకుంటే బాధగా ఉంది .గూగుల్‌లో ఫారెస్ట్ సిటీ గురించి తెలుసుకున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది” అన్నారు.

‘ఫారెస్ట్ సిటీ’పై చైనా నుంచి సమాచారం సేకరించడం అంత సులభం కాదు.

ఫారెస్ట్ సిటీలో ప్రాపర్టీ కొన్న వారిని సంప్రదించేందుకు బీబీసీ పరోక్షంగా ప్రయత్నించింది. కానీ, స్పందించడానికి వారెవరూ ముందుకు రాలేదు.

అయితే, సోషల్ మీడియాలో అభివృద్ధిని శ్లాఘిస్తూ ఉన్న ఓ పోస్ట్‌కు లియోనింగ్ ప్రావిన్స్‌కు చెందిన కొనుగోలు దారుడొకరు కామంట్ చేయడాన్ని గుర్తించాం.

ఆయన పోస్ట్‌ను ఉద్దేశిస్తూ, “ఇది తప్పుదోవ పట్టించేలా ఉంది. ఫారెస్ట్ సిటీ ఇప్పుడు ఘోస్ట్ సిటీగా మారింది. అక్కడ ప్రజలెవరూ లేరు. సరైన సదుపాయాలు లేవు. పట్టణానికి దూరంగా ఉంది. కారు లేకుండా ఎక్కడికీ వెళ్లడం కూడా సాధ్యం కాదు” అని కామెంట్ చేశారు.

మరికొన్ని కామెంట్లు రిఫండ్‌ను ఎలా పొందాలని ప్రశ్నిస్తూ పోస్ట్ చేసినవి.

మరో యూజర్ “ధర పతనమైంది. నాకు మాటలు రావడం లేదు” అని కామెంట్ చేశారు.

జోహోర్ నగరానికి చాలా దూరంలో నిర్మితమైన గార్డెన్ సిటీ

చైనాలో నిరాశాజనకంగా రియల్ ఎస్టేట్

చైనాలో రియల్ ఎస్టేట్ రంగం ఆశాజనకంగా లేదు.

డెవలపర్ సంస్ధలు ప్రాజెక్టుల కోసం విపరీతంగా అప్పులు తీసుకున్న నేపథ్యంలో మార్కెట్‌లో సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని గ్రహించిన చైనా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ “ఇళ్లు నివసించడానికే కానీ, ఊహలకు కాదు” అంటూ తాను నమ్మే సూత్రాన్నే అనుసరిస్తున్నారు.

ఫలితంగా తలపెట్టిన ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రధాన సంస్థల దగ్గర నిధులు లేని పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో చైనీయులకు విదేశీ ప్రాజెక్టులపై ఆసక్తి అనుకున్న స్థాయిలో లేక, దిగ్గజ సంస్థలు మొదలుపెట్టిన విదేశీ ప్రాజెక్టులపై ప్రభావం పడింది.

ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ‘ఎవర్‌గ్రాండే’పై ఈ వారం హాంకాంగ్‌ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. వాదనల తరువాత రుణదాతలకు అప్పులు తిరిగి చెల్లించే విషయంపై ప్రణాళికలను చెప్పేందుకు సంస్థకు ఆరు వారాల సమయం ఇచ్చింది న్యాయస్థానం.

ఇప్పుడు కంట్రీ గార్డెన్ సంస్థ కూడా 200 మిలియన్ డాలర్ల అప్పుల్లో ఉంది.

అయితే, గార్డెన్ సిటీ ప్రాజెక్టు విషయంలో నమ్మకంగా ఉంది.

మలేషియా, సింగపూర్‌ మధ్య నిర్మితమైన ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వద్దని చెప్తోంది.

కానీ, నిధులు లేకుండా ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రజలను ఆకర్షించడం అంత సులభం కాదు. “ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కష్టతరం” అన్నారు ఆర్ఈడీడీ ఇంటెలిజెన్స్ ఏషియా సంస్థకు చెందిన ఎవ్‌లైన్ దనుబ్రతా.

“డెవలపర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధుల్ని ప్రీ సేల్స్ ద్వారా సమీకరించడంపై ఆధారపడుతుంటారు. కానీ, కొనుగోలుదారు ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న నమ్మకం వచ్చాక కానీ, కొనుగోలుకు ముందుకు రారు” అన్నారు.

చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం విషయంలో ఫారెస్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది ఊహలు, వాస్తవానికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది.

ఈ పరిస్థితికి ఇతర అంశాలు కూడా కారణమై ఉండొచ్చు గానీ, జనావాసాలకు దూరంగా వేలకొద్దీ అపార్ట్మెంట్‌లు నిర్మించి, ప్రజలను అక్కడ నివసించేలా ఒప్పించడం సాధ్యం కాదని చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలిచింది.

ప్రస్తుతం చైనాలో వందలకొద్దీ ప్రాజెక్టుల భవితవ్యం చైనా ప్రభుత్వంపై ఆధారపడి ఉంది.

గత నెలలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థల తొలిదశ జాబితాలో కంట్రీ గార్డెన్ సంస్థను కూడా చేర్చారు.

అయితే, చైనా ప్రభుత్వం ఎంతమేరకు సాయం చేస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

“ఈసారి మరింత జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటి తప్పులు చేయను అన్నారు” నజ్మీ.

“ఇక్కడి నుంచి బయటపడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. నా జీవితం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపించింది” అన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)