వెదురుతో భవనాలను ఎందుకు నిర్మిస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంటి?

ఫొటో సోర్స్, ATELIER ONE
- రచయిత, సుజానే బైర్నీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండోనేషియాలో బాలీలోని ఒక పాఠశాల పైకప్పును ఒకదాని తర్వాత ఒకటిగా 19 మీటర్ల పొడవు గల వెదురు తోరణాలతో అలంకరించారు.
బాలీలోని అత్యంత ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు.
ఇబుకు ఆర్కిటెక్చర్ స్టూడియో ఈ నిర్మాణం రూపొందించింది. ఇందులో 12.4 టన్నుల డెండ్రోకాలమస్ ఆస్పర్ ఉంది.
దీనిని జెయింట్ వెదురు అని కూడా అంటారు. ఇది అత్యంత తేలికైన నిర్మాణం, ఏప్రిల్ 2021లో దీన్ని సిద్ధం చేశారు.
ఈ వెదురు నిర్మాణం మొదటి చూపులోనే చాలా మందిని ఆకర్షిస్తోంది, ఇది దాని బలాన్ని, మృదుత్వాన్ని చాటి చెబుతోంది.
ఈ వెదురు పర్యావరణానికి హాని కలిగించదు కాబట్టి, నిర్మాణ రంగంలో కార్బన్ వాడకాన్ని ఇది తగ్గించగలదు.
ఇంటర్నేషనల్ బాంబూ అండ్ రట్టన్ ఆర్గనైజేషన్ (INBAR), నెదర్లాండ్స్‌లోని డాఫ్ట్ టెక్నాలజీ యూనివర్సిటీల రిపోర్టు ప్రకారం ఒక వెదురు నర్సరీ, హెక్టారుకు 401 టన్నుల కార్బన్‌ను నిల్వ చేయగలదు.
ఇదే సమయంలో చైనీస్ దేవదారు చెట్ల నర్సరీ హెక్టారుకు 237 టన్నుల కార్బన్‌ను మాత్రమే నిల్వ చేస్తుంది.

ఫొటో సోర్స్, BAMBOOLOGICAL
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మొక్క
ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న మొక్క వెదురు. ఇవి రోజూ ఒక మీటర్ వరకు ఎత్తు పెరుగుతాయి.
అంతేకాదు ఈ వెదురు కత్తిరించినప్పటికీ మళ్లీ మొలకెత్తుతుంది, పెరగడం ప్రారంభమవుతుంది. ఇతర మొక్కల విషయంలో అలా ఎక్కువగా జరగదు.
ఆసియాలో నిర్మాణ రంగంలో వెదురు వినియోగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.
కానీ యూరప్, అమెరికాలో దీని ఉపయోగం మరోలా ఉంటుంది. ఆ దేశాల్లో వెదురును ఫ్లోరింగ్, కిచెన్ టాప్స్, చాపింగ్ బోర్డులుగా ఉపయోగిస్తారు. అక్కడ ఇల్లు లేదా భవన నిర్మాణంలో దీన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు.
ఈ ప్రాంతాల్లో వెదురు గురించి ఎక్కువగా తెలియకపోవడంతో దాని ఉపయోగం తక్కువుందని లండన్ స్ట్రక్చరల్ ఇంజినీర్స్ అటెలియర్ వన్‌కు చెందిన క్రిస్టోఫర్ మాథ్యూస్ తెలిపారు.

ఫొటో సోర్స్, ATELIER ONE
వెదురు వాడటమే తెలియదు
నిర్మాణంలో వెదురును ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియకపోవడం అతిపెద్ద సవాళ్లలో ఒకటని బాలిలోని ఒక పాఠశాల ప్రాజెక్ట్‌లో పనిచేసిన మాథ్యూస్ అంటున్నారు.
అంటే వెదురును ఎలా మలచాలో ప్రజలకు తెలియదన్నమాట. అందుకే ప్రజలకు రుజువు చూపించాల్సి వచ్చిందని మాథ్యూస్ అంటున్నారు.
''ఇసుక బస్తాలతో లోడ్ చేసి, అది ఎంత బలంగా ఉందో ప్రజలకు తెలియజేశాం'' అని చెప్పారు మాథ్యూస్.
వెదురుకు డిమాండ్ పెరుగుతోందని ఆయన అంటున్నారు. మాథ్యూస్ కంపెనీ క్లయింట్లలో 30 శాతం మంది ఇప్పుడు ఈ వెదురు మెటీరియల్‌నే ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు ఆయన కంపెనీ వెదురుతో మరిన్ని నిర్మాణాలు చేయడం ప్రారంభించింది.
పూర్తిగా వెదురుతో చేసిన మెక్సికోలోని పాఠశాల ప్రాంగణాన్ని మాథ్యూస్ చూపించారు. కోస్టారికాలోని యోగా స్టూడియో, ఫిలిప్పీన్స్‌లోని వంతెన నిర్మాణాలను గుర్తుచేశారు.
"వెదురు వాడుతున్న దేశాలలో ఇది చాలా చౌకగా, సమృద్ధిగా లభిస్తోంది. ఇక్కడ పనిచేసేవారు కూడా అందులో నైపుణ్యం ఉన్నవారే. ప్రారంభంలో ఐరోపాలో ఇది ఖరీదుగా ఉండేది. కానీ వినియోగం పెరగడంతో, ధర తగ్గిపోయింది'' అని మాథ్యూస్ తెలిపారు.
బ్రిటన్‌లో వెదురు నిర్మాణాలను ప్రారంభించేందుకు తన కంపెనీ జరుపుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐరోపాలో వెదురు పెరుగుతుందా?
ఐరోపాలో వెదురును పండించగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చల్లని ఉత్తర ప్రాంతాలలో వెదురు అంతగా పెరగదు.
'బాంబూలాజిక్' కంపెనీ దీన్ని మార్చాలనుకుంటోంది. యూరప్‌లో వెదురును భారీ స్థాయిలో పెంచుతున్న తొలి కంపెనీ ఇదే.
బాంబూలాజిక్ కంపెనీ కన్సల్టెంట్ జాన్ డెటావెర్నియర్, పోర్చుగల్‌లో వెదురు తోటల నిర్వహణ చూస్తుంటారు. వెదురుకు చాలా సూర్యరశ్మి, తక్కువ నీరు అవసరమని ఆయన అంటున్నారు.
“దక్షిణ భాగంలో చాలా సూర్యకాంతి అందుతుంది. వెదురుకు భూమి కోతను నిరోధించే శక్తి ఉంది. పోర్చుగల్‌లో మేం వెదురు పండించే నేల అంత బాగుండదు. వెదురు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి మట్టిలోకి విడుదల చేస్తుంది కాబట్టి, అది నేలను మెరుగుపరుస్తుంది'' అని తెలిపారు జాన్.
యూరోపియన్ మార్కెట్ కోసం కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్న భాగస్వామ్య సంస్థలతో కలిసి తమ కంపెనీ పనిచేస్తోందని జాన్ చెప్పారు.
కానీ దీంట్లో ఉన్న అడ్డంకి ఏమిటంటే అటువంటి ఉత్పత్తులను ప్రామాణీకరించలేదు. ఉత్పత్తి ప్రమాణాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
“యూరప్‌లో మేం వెదురును ఒక మెటీరియల్‌గా పరిగణించి దానితో పనిచేయడం అలవాటు చేసుకోలేదు. ఆసియాలో దాని ఉపయోగంపై చాలా డేటా ఉంది. కానీ ఐరోపాలో లేదు'' అని జాన్ అన్నారు.

ఇప్పటికీ సవాలే: ప్రొఫెసర్ భావనా శర్మ
జాన్ అభిప్రాయంతో డాక్టర్ భావనా శర్మ ఏకీభవించారు. సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ భావనా శర్మ.
వెదురు కోసం అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేసే టాస్క్‌ఫోర్స్‌లో శర్మ సభ్యురాలు కూడా.
“నిర్మాణ పనులలో వెదురును ఉపయోగించడం ఒక సవాలుగా ఉంది. ఇది ఇప్పటికీ సంప్రదాయేతర పదార్థం'' అని శర్మ అంటున్నారు.
“వెదురు గురించి మా పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఇది వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఆమ్‌స్టర్‌డామ్‌లో నిర్మిస్తే, అక్కడ భవనం ఎంత మన్నికగా ఉంటుంది? ఆ సీజన్‌లో వెదురు ఎలా పని చేస్తుంది? ఇండోనేషియాలో ఎలా పని చేస్తుంది? ఇలాంటి వాటిపై అవగాహనకు ప్రయత్నిస్తున్నాం'' అని చెప్పారు భావనా శర్మ.
ఈ పద్దతిలో వివిధ రకాల భవనాలను నిర్మించే దిశగా అడుగులు వేయవచ్చని ఆమె తెలిపారు.
గత వేసవిలో తొలిసారిగా వెదురుకు సంబంధించిన ప్రమాణాలను 'ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్' ప్రచురించిందని భావన చెప్పారు.
ఇది వెదురు ఇంజినీరింగ్, డిజైనింగ్ విభాగాల వ్యక్తులకు సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. ఏదైనా బిల్డింగ్ ప్రాజెక్ట్ కోసం వెదురును ఉపయోగించాలనుకునే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు.

ఫొటో సోర్స్, BAMCORE
అమెరికా: వెదురు భవనాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్న డీఆర్ హోర్టన్
కాలిఫోర్నియాకు చెందిన బామ్‌కోర్, స్థిరమైన నిర్మాణ సామగ్రిని తయారు చేసే కంపెనీ. దీనిని 2019లో స్థాపించారు.
ఈ కంపెనీ వెదురు, కలపతో ప్యానెల్స్ తయారు చేస్తుంది. వీటిని ఐదు అంతస్తుల వరకు భవనాలు నిర్మించడానికి వాడతారు. ఈ ప్యానెళ్లను యూకలిప్టస్, కలపతో కూడా తయారు చేస్తారు.
"మా కస్టమర్‌లు ఇల్లు కొనడానికి వచ్చిన వ్యక్తులు లేదా ఆర్కిటెక్ట్‌లూ కావొచ్చు" అని బామ్‌కోర్ చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ కేట్ చిల్టన్ అంటున్నారు.
వ్యాపారం పెరిగిన కొద్దీ డెవలపర్‌లను కస్టమర్‌లుగా చేర్చడం ప్రారంభించామని కేట్ తెలిపారు.
అమెరికాలో అతిపెద్ద గృహ నిర్మాణ సంస్థ డీఆర్ హోర్టన్ . ఈ కంపెనీ చాలా చోట్ల వెదురు భవనాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోంది.
వెదురులో 1,600 జాతులు ఉన్నాయి, బామ్‌కోర్ కంపెనీ అత్యంత ఇష్టమైన జాతి డెండ్రోక్లామస్ ఆస్పర్.
దీనిని జెయింట్ టింబర్ బాంబూ అని కూడా పిలుస్తారు, ఈ వెదురును దక్షిణ అమెరికా, ఆసియాల నుంచి బామ్‌కోర్ దిగుమతి చేసుకుంటుంది.
అంతేకాదు బామ్‌కోర్ కంపెనీ ఫ్లోరిడాలో వెదురు పెంచుతున్న వారితో మాట్లాడుతోంది. ఇక్కడ డెండ్రోక్లేస్ ఆస్పర్ నిర్మాణాల ట్రయల్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ... బందీల విడుదల ఎందాకా వచ్చింది?
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














