ఇండోనేసియాలో భూకంపం... కూలిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు

మముజు ఆసుపత్రి భవనంలో కొన్ని భాగాలు కూలిపోయాయి
ఫొటో క్యాప్షన్, మముజు ఆసుపత్రి భవనంలో కొన్ని భాగాలు కూలిపోయాయి

ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 34మంది చనిపోయుంటారని అంచనా.

పాక్షికంగా కూలిపోయిన సులవేసి ఆసుపత్రి శిథిలాల మధ్య చిక్కుకుపోయిన వారికోసం రక్షక బృందాలు గాలిస్తున్నాయి.

శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. వేలమంది నిరాశ్రయులయ్యారు.

ఇండోనేసియాలో ఎక్కువగా భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. 2018లో సులవేసిలో వచ్చిన తీవ్ర భూకంపం కారణంగా 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

మముజు పట్టణంలో మిత్ర మనకర్ర ఆసుపత్రి భవనంలో కొన్ని భాగాలు కూలిపోవడంతో ఆరుగురు రోగులు, వారి కుటుంబ సభ్యులు శిథిలాల మధ్య చిక్కుకుపోయారని స్థానిక మీడియా తెలిపింది.

చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మముజు రక్షక బృందానికి చెందిన అరియంటో ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

నగరంలో కనీసం 26మంది చనిపోయుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, కూలిన భవనాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని రక్షక బృందం తెలిపింది.

మజేన్‌ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలో, భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మజేన్ నగరంలో ఎనిమిది మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని మొదట వచ్చిన రిపోర్ట్స్ తెలిపాయి.

శిథిలాలకింద అనేకమంది చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు
ఫొటో క్యాప్షన్, శిథిలాలకింద అనేకమంది చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు

శుక్రవారం తెల్లవారు జామున స్థానిక సమయం 1.00కు దాదాపు ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి.

అక్కడి ప్రభుత్వం సునామి హెచ్చరికలేమీ జారీ చేయలేదు. కానీ, అనేకమంది భయంతో తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని సమాచారం.

తీవ్రంగా దెబ్బ తిన్న వాటిల్లో కొన్ని ఇళ్లు, హోటళ్లు, గవర్నర్ ఆఫీస్, ఒక మాల్ ఉన్నాయని స్థానిక రిపోర్టులు చెబుతున్నాయి.

అయితే, తీవ్ర భూకంపానంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని, ఫలితంగా సునామీ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని అధికారులు హెచ్చరించారు.

ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఎందుకంటే ఆ దేశం భౌగోళికంగా 'రింగ్ ఆఫ్ ఫైర్' అనే గీత మీద ఉంది. ఈ గీత మీద తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవిస్తుంటాయి.

2004లో సుమత్రా దీవుల్లో భూకంప సంభవించి, సునామీకి కారణమైంది. హిందూ మహా సముద్రం తీర ప్రాంతంలో 2,26,000మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇండోనేషియాలోనే 1,20,000 కన్నా ఎక్కువమంది మరణించారు.

ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి
ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)