‘జురాసిక్ పార్క్’లో లారీ ఎదురుగా కొమొడొ డ్రాగన్.. ఈ వైరల్ ఫొటో వెనుక కథేమిటి

ఫొటో సోర్స్, SAVE KOMODO NOW
ఇండోనేసియాలోని ఒక దీవిలో నిర్మిస్తున్న ‘జురాసిక్ పార్క్’లో ట్రక్‌కు ఎదురుగా వచ్చిన కొమొడొ డ్రాగన్ ఫోటో వైరల్‌గా మారింది. అయితే, ఫొటోలో పరిస్థితిని చూసిన పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికల్లో భాగంగా కొమొడొ నేషనల్ పార్కులో కొన్ని కోట్ల వ్యయంతో ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఇక్కడ డ్రాగన్లకు ఎటువంటి హాని జరగలేదని, వాటి భద్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఈ కొమొడొ డ్రాగన్లు ఇండోనేసియా దీవుల్లో ఉన్న కొన్ని దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్లుగా మనుగడలో ఉన్నాయని అంచనా.
వీటిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటకులు వస్తూ ఉంటారు.
వీటికి ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతం చుట్టుపక్కల కొన్ని తరాలుగా నివసిస్తున్న సుమారు 2000 మంది నివాసితులను అక్కడ నుంచి తొలగిస్తూ కొమొడొ దీవిని మూసివేయాలనే వివాదాస్పద నిర్ణయాన్ని గత ఏడాది ఉపసంహరించుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పర్యటకుల తాకిడి నుంచి ఈ డ్రాగన్ల ఆవాసాలను రక్షించే క్రమంలో.. దీవులను సందర్శించడానికి వచ్చే వారికి సుమారు 74,000 రూపాయల (1000 డాలర్లు) సభ్యత్వ పథకాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు భావించినట్లు తెలిపారు.
కానీ, అదే సమయంలో పొరుగునే ఉన్న రింక దీవుల్లో భారీ పర్యటక ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేశారు.
రింకా దీవుల్లోనూ కొమొడొలు పెద్ద సంఖ్యలో ఉంటాయి.
గత నెలలో కొంత మంది ఆర్కిటెక్టులు ఇన్‌స్టాగ్రామ్‌లో డైనోసార్ చలన చిత్రం 'ఫ్రాంచైజ్'లోని సంగీతంతో కూడిన వీడియోని పోస్టు చేస్తూ ఈ ప్రాజెక్టుకి జురాసిక్ పార్కు అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు.
ఈ వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది ఉద్యమకారులు షేర్ చేయడంతో అది పలువురి దృష్టిని ఆకర్షించింది.
ఈ ప్రాజెక్టు జూన్ 2021 కల్లా పూర్తి అవుతుందని భావిస్తున్నారు. ఇందులో పర్యటకులకు సమాచార కేంద్రం, ఒక జెట్టీని కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.

ఈ ఫోటో వివాదాస్పదంగా ఎందుకు మారింది?
గత వారాంతంలో రింక దీవుల్లో లారీకి ఎదురుగా వచ్చిన కొమొడో డ్రాగన్ చిత్రం ట్విటర్, ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయింది.
"కొమొడొలు లారీల శబ్దం వినడం, పొగ వాసన చూడటం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టుల వలన భవిష్యత్తులో ప్రభావం ఎలా ఉంటుందో? ఎవరైనా వీటి సంరక్షణ కోసం శ్రద్ధ తీసుకుంటున్నారా" అని ప్రశ్నిస్తూ ఈ చిత్రాన్ని సేవ్ కొమొడొ ఉద్యమకర్తల బృందం షేర్ చేసింది.
ఇక్కడ చేపట్టిన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఈ సరీసృపాల పైన, అక్కడి నివాసితులపైన ప్రభావం చూపిస్తుందని ‘సేవ్ కొమొడో’ గ్రూప్ సభ్యుడు గ్రెగ్ అఫియోమా బీబీసీతో అన్నారు.
"భారీ స్థాయిలో జరిగే ఇలాంటి కల్లోలం వలన ఈ ప్రాణుల పరస్పర సహచర్యాన్ని దెబ్బ తీస్తుందని, వాటి ఆవాసాల తీరును మార్చేస్తాయి" అని ఆయన అన్నారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోను పరిశీలించామని, కొమొడొ డ్రాగన్లకు ఈ నిర్మాణ పనుల వలన ఎటువంటి హాని జరగలేదని ప్రభుత్వ అధికారులు బీబీసీ ఇండోనేసియాకి చెప్పారు.
"కొమొడొ డ్రాగన్లేవీ దీనివల్ల నాశనం కావు" అని ఇండోనేసియా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలో నేచర్ కన్సర్వేషన్ అండ్ ఎకో సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ విరాట్నో చెప్పారు.
మంత్రిత్వ శాఖకు చెందిన ఒక బృందం ఆ దీవులకు వెళ్లి డ్రాగన్లను పరిరక్షించడానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలిస్తుందని తెలిపారు.
ఇండోనేసియాలో ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుతం 3000 కొమొడొలు ఉన్నాయి. ఇందులో సుమారు 1700 కొమొడొ దీవుల్లో ఉంటే 1000 డ్రాగన్లు రింక దీవుల్లో ఉంటాయి. ఈ డ్రాగన్లు 10 అడుగుల వరకు పెరుగుతాయి.
వీటికి పదునైన దంతాలు ఉంటాయి. కాటు వేసే స్వభావం వీటికి ఉంది. వీటి కాటు విషపూరితం.
ఈ జాతీయ పార్కును యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
అదనపు సమాచారం : ముహమ్మద్ ఇర్హం, బీబీసీ ఇండోనేసియా
ఇవి కూడా చదవండి:
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- దళిత సర్పంచ్‌కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- అజర్బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా
- పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








