ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనా ఖైదీలు: 'రేప్ చేస్తామని బెదిరించారు, మాపై కుక్కల్ని ఉసిగొల్పారు'

- రచయిత, లూసీ విలియమ్సన్
- హోదా, బీబీసీ న్యూస్
అక్టోబరు 7 నాటి హమాస్ దాడుల తర్వాత దారుణంగా చిత్రహింసలు పెట్టారని, సామూహిక శిక్షలు విధించారని ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలైన పాలస్తీనా ఖైదీలు వివరిస్తున్నారు.
తమను కర్రలతో కొట్టారని, క్రూరమైన కుక్కలను తమపైకి వదిలారని, తమ బట్టలు తీసేసుకున్నారని, ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారుకాదని పాలస్తీనా ఖైదీలు చెబుతున్నారు.
తనను రేప్ చేస్తారని బెదిరించినట్లు ఒక మహిళా ఖైదీ చెప్పారు. జైలు గదుల్లోకి పొగ వచ్చేలా రెండుసార్లు టియర్ గ్యాస్ షెల్స్‌ను పేల్చారని కూడా చెప్పారు.
ఆరుగురు ఖైదీలతో బీబీసీ మాట్లాడింది. విడుదలచేసే ముందు తమను దారుణంగా కొట్టారని వారు చెప్పారు.
కొంతమంది ఖైదీలపై మూత్రం పోశారని, మరికొందరికి బేడీలు వేసి కొట్టారని పాలస్తీనా ప్రిజనర్స్ సొసైటీ చెబుతోంది. గత ఏడు వారాల్లో ఆరుగురు పాలస్తీనా ఖైదీలు ఇజ్రాయెల్ జైళ్లలో మరణించారని వివరిస్తోంది.
అయితే, నిబంధనల ప్రకారమే ఈ ఖైదీలందరినీ చూసుకున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.
హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ విడుదల చేసిన పాలస్తీనా ఖైదీల్లో 18 ఏళ్ల మహమ్మద్ నజ్జల్ కూడా ఒకరు.
ఆగస్టు నుంచి నఫా జైలులో ఆయనను ఖైదు చేశారు. అయితే, అసలు తనను ఎందుకు అరెస్టు చేశారో తెలియదని మహమ్మద్ చెప్పారు.
వెస్ట్‌బ్యాంక్‌కు ఉత్తరాన జెనిన్ నగరానికి సమీపంలో కబాతియా గ్రామంలోని తమ ఇంటికి రావాలని మహమ్మద్ నన్ను ఆహ్వానించారు.

ఫొటో సోర్స్, REUTERS
హమాస్ దాడి తర్వాత మారిన ప్రవర్తన
కాస్త పాతబడినట్లు కనిపిస్తున్న ఇంటిపై డ్రాయింగ్ రూమ్ నుంచి డజన్ల కొద్దీ సిగరెట్ల పొగ బయటకు వస్తోంది. మహమ్మద్ బంధువు అక్కడికి వచ్చేవారికి పేపర్ కప్‌లలో కాఫీ అందిస్తున్నారు.
తమ కుటుంబ సభ్యుల మధ్యలో మహమ్మద్ కూర్చొని కనిపించారు. బాక్సర్ తరహాలో తన రెండు చేతులకూ కట్లు కట్టి ఉన్నాయి. రెండు బొటన వేళ్లు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి.
పది రోజుల క్రితం ఇజ్రాయెల్ జైలు గార్డులు ఒక మైక్రోఫోన్, స్పీకర్‌తో తమ దగ్గరకు వచ్చి, రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు.
‘‘మేం స్పందించకపోయే సరికి, మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు’’ అని ఆయన అన్నారు.
‘‘మమ్మల్ని వారు వరుసలో నిలబడమని చెప్పారు. ముందు యువకులను, వెనుక వృద్ధులను నిలబడమన్నారు. ఆ తర్వాత మొదట్నుంచి కొట్టడం మొదలుపెట్టారు. నేను తలకు దెబ్బలు తగలకుండా చేతులతో కప్పేసుకున్నాను. అయితే, నా చేతులు, కాళ్లపై వారు తీవ్రంగా కొట్టారు’’ అని ఆయన చెప్పారు.
రమల్లాలో పాలస్తీనా డాక్టర్ల నుంచి తీసుకొచ్చిన మెడికల్ రిపోర్టులు, ఎక్స్-రేలను మహమ్మద్ కుటుంబం నాకు చూపించింది. సోమవారం జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
ఈ రిపోర్టులను మేం బ్రిటిష్ డాక్టర్లకు చూపించాం. రెండు చేతుల్లోని ఎముకలు విరిగాయని వారు చెప్పారు. ఆ విషయం చెప్పిన తర్వాత మహమ్మద్ ఏమీ ఆశ్చర్యపోలేదు.
‘‘కొట్టినప్పుడు నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. కొంతసేపటి తర్వాత నా చేతిలో ఎముకలు విరిగాయని నాకు అర్థమైంది. కేవలం టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు మాత్రమే చేతులు ఉపయోగించేవాడిని’’ అని ఆయన అన్నారు.
ఆహారం తినడానికి, నీరు తాగడానికి మరో ఖైదీ సాయం చేసేవారని మహమ్మద్ చెప్పారు. డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లాలని గార్డులను తను అడగలేదని, ఎందుకంటే వారు మళ్లీ కొడతారేమనని భయంవేసిందని ఆయన అన్నారు.

రెండు చేతులూ విరిగిపోయాయి
అయితే, మహమ్మద్ చెప్పే వాదనతో ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ విభేదించింది. ఆయన జైలు నుంచి విడుదలయ్యే ముందు వైదులు అన్నీ పరిశీలించారని, ఎలాంటి వైద్యపరమైన సమస్యలూ ఆయనకు లేవని తెలిపింది.
జైలు నుంచి మహమ్మద్ విడుదలైన తర్వాత రెడ్ క్రాస్ బస్సు నుంచి మహమ్మద్ దిగుతున్నప్పుడు తీసిన కొన్ని దృశ్యాలను ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ విడుదల చేసింది.
ఆ ఫుటేజీలో మహమ్మద్ చేతికి కట్లులేవు. తనవైపుగా చూస్తున్న ప్రజల వైపు చేయి ఊపుతున్నట్లుగా ఆయన కనిపిస్తున్నారు. అయితే, అంతకుమించి ఆ దృశ్యాల్లో ఏమీ కనిపించడం లేదు.
అయితే, ఆ రెడ్ క్రాస్ బస్సులోనూ తనకు సహాయక సిబ్బంది చికిత్స అందించారని మహమ్మద్ చెప్పారు.
ఇంటికి వచ్చిన తర్వాత రమల్లాలో వైద్యులకు అతడిని చూపించారు. ఆ చేయిలోని గాయాలు నేరుగా తగ్గకపోతే ఒక ప్లేట్ వేయాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పినట్లు మహమ్మద్ కుటుంబం తెలిపింది.
అక్టోబరు 7నాటి దాడుల తర్వాత ఖైదీలతో ఇజ్రాయెల్ గార్డులు ప్రవర్తించే తీరు పూర్తిగా మారిందని మహమ్మద్ అన్నారు.
గార్డులు కాళ్లతో తన్నడం, లాఠీలతో కొట్టడం లాంటివి చేసేవారని, ఒక గార్డు అయితే, ముఖంపై కాలితో తన్నారని మహమ్మద్ చెప్పారు.

‘‘కుక్కలను వదిలారు’’
‘‘వారు ఆ తర్వాత కుక్కలను తీసుకువచ్చారు. వాటిని మాపైకి ఉసిగొల్పారు. ఆ తర్వాత మళ్లీ కొట్టారు’’ అని మహమ్మద్ చెప్పారు.
‘‘నేలపై వేసుకునే చాపలు, మా బట్టలు, దిండ్లు అన్నీ తీసుకుని వెళ్లిపోయారు. మేం తినే ఆహారాన్ని నేలపై పడేశారు. దీంతో అందరూ చాలా భయపడ్డారు’’ అని అన్నారు.
తన వీపు, భుజాలపై కనిపిస్తున్న కొన్ని మచ్చలను మాకు ఆయన చూపించారు. ఇవి తీవ్రంగా కొట్టడం వల్లే వచ్చాయని ఆయన చెప్పారు.
‘‘మాపైకి ఉసిగొల్పిన కుక్కలకు పదునైన పళ్లు ఉన్నాయి. కాళ్ల గోర్లతో అవి చేసిన గాయాలు, కరిచిన గుర్తులు నా శరీరం మొత్తం ఉన్నాయి’’ అని అన్నారు. నఫా జైలులో ఇలా ఎన్నిసార్లు కొట్టారో లెక్కేలేదని ఆయన చెప్పారు.
మేం మాట్లాడిన ఇతర పాలస్తీనా ఖైదీలు కూడా ఇలాంటి విషయాలనే చెప్పారు. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ గార్డుల ప్రవర్తన పూర్తిగా మారిందని అన్నారు.
హమాస్ దాడులకు పాలస్తీనా ఖైదీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తమకు అర్థమైందని కొందరు పాలస్తీనావాసులు చెప్పారు.
పాలస్తీనా ప్రిజనర్స్ సొసైటీ చీఫ్ అబ్దుల్లా అల్-జఘారీ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఖైదీలు తమను గార్డులు దారుణంగా కొట్టారని, చిత్రహింసలు పెట్టారని చెబుతున్నారు. బేడీలువేసి కొంతమందిపై మూత్రం పోశారని అంటున్నారు’’ అని అన్నారు.
ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ వివరణ కోరాం. అయితే, వీరందరినీ చట్టాలకు అనుగుణంగా అరెస్టు చేశామని, నిబంధనల ప్రకారమే చూసుకున్నామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు.
‘‘మీరు చెబుతున్న ఘటనలు జరిగినట్లు మా దగ్గర ఎలాంటి సమాచారమూ లేదు. పైగా ఇలాంటివి జరిగినప్పుడు ఖైదీలు పైఅధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వీటిపై సమగ్ర విచారణ జరుపుతారు’’ అని అన్నారు.

మహిళా ఖైదీకి రేప్ హెచ్చరిక
ఈ వారం మొదట్లో ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలైన వారిలో లామా ఖాతర్ కూడా ఒకరు. అక్టోబరులో తనను అరెస్టు చేసిన కొన్ని రోజులకే తనను రేప్ చేస్తానని ఒక ఇజ్రాయెల్ అధికారి బెదిరించినట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో పోస్టు చేశారు.
‘‘నా చేతికి బేడీలు వేశారు. కళ్లకు గంతలు కట్టారు. రేప్ చేస్తానని బెదిరించారు. వారు నన్ను తీవ్రంగా భయపెట్టాలని అనుకున్నారు’’ అని ఆ వీడియోలో ఆమె చెప్పారు.
ఆమె చెబుతున్న కొన్ని విషయాలతో ఆమె న్యాయవాదే విభేదిస్తున్నారని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ దర్యాప్తు చేపడుతోందని అన్నారు.
అయితే, తనతోపాటు చాలా మంది మహిళా ఖైదీలను రేప్ చేస్తామనని బెదిరించారని, తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని బీబీసీతో లామా ఖాతర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జైళ్లలో పాలస్తీనా ఖైదీల మృతి
అక్టోబరు 7నాటి హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్ జైళ్లలో మరణించిన పాలస్తీనా ఖైదీల సంఖ్య పెరిగిందని పాలస్తీనా ప్రిజనర్స్ సొసైటీ తెలిపింది. మొత్తంగా అప్పటి నుంచి ఆరుగురు జైళ్లలో మరణించారని వివరించింది.
ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు ఇజ్రాయెల్ అధికారులు నేరుగా సమాధానం ఇవ్వలేదు. కానీ, గత కొన్ని వారాల్లో నలుగురు ఖైదీలు మరణించారని, దీని వెనుక కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని అంగీకరించారు.
కబాతియా గ్రామానికి వస్తే, ఇక్కడ ఇప్పటికీ మహమ్మద్ నజ్జల్ తీవ్రమైన నొప్పితో రోజులు గడుపుతున్నారు. రాత్రిపూట నొప్పి మరీ ఎక్కువగా ఉంటోందని ఆయన చెబుతున్నారు.
జైలుకు వెళ్లేముందు, బయటకు వచ్చిన తర్వాత మహమ్మద్‌లో చాలా తేడా కనిపిస్తోందని ఆయన సోదరుడు ముతాజా అన్నారు.
‘‘మాకు తెలిసిన మహమ్మద్ ఇలా ఉండేవాడు కాదు. అతడు చాలా ధైర్యంగా ఉండేవాడు. ఇప్పుడు అతడు చాలా భయంలో జీవిస్తున్నాడు’’ అని ముతాజా చెప్పారు.
ఇక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని జెనిన్ సిటీలో గత రాత్రి ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని ముతాజా అన్నారు. ‘‘దాని గురించి తెలిసిన వెంటనే మేం చాలా భయపడ్డాం’’ అని చెప్పారు.
ఇజ్రాయెల్ జైళ్లలో ఎంతమంది పాలస్తీనా ఖైదీలు ఉన్నారు?
ఇజ్రాయెల్ జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలస్తీనా మానవ హక్కుల సంస్థ ఆద్దామీర్ సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ నియంత్రణలోని జైళ్లలో పాలస్తీనా ప్రజల సంఖ్య 7,000కు పెరిగింది. వీరిలో 80 మంది మహిళలు, 18 ఏళ్లలోపు పిల్లలు 200 మంది ఉన్నారని సంస్థ తెలిపింది.
అక్టోబరు 7నాటి హమాస్ దాడి తర్వాత, అరెస్టైన వారి సంఖ్య 3,000కుపైనే ఉంటుందని సంస్థ చెబుతోంది.
అయితే, నవంబరు 1 నాటికి తమ జైళ్లలోనున్న ఖైదీల సంఖ్య 2,070 అని ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థ హామోకెడ్ తెలిపింది. హమాస్ దాడికి ముందు ఈ సంఖ్య 1,319గా పేర్కొంది.
మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలోనున్న మైనర్ల సంఖ్య 146 వరకూ ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా వీరిని అదుపులోకి తీసుకున్నారని ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థ బెత్‌సెమెల్ తెలిపింది.
గత వారం కాల్పుల విరమరణపై హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. హమాస్ తమ దగ్గరున్న వారిలో 50 బందీలను విడిచిపెట్టేందుకు ప్రతిగా 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాలని కోరింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలైన వారిలో 40 శాతం మంది 18 ఏళ్లలోపు వయసువారే.
ఇవి కూడా చదవండి..
- నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల పెళ్ళి రిజిస్ట్రేషన్
- LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్... ఈ పదాలకు అర్థం ఏంటి?
- పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- ఇలా పోపట్: 50 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నా, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ ఈమె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















